సమితిపై సంస్కరణల ఒత్తిడి | Sakshi Guest Column On UNO Security Council reforms | Sakshi
Sakshi News home page

సమితిపై సంస్కరణల ఒత్తిడి

Published Thu, May 23 2024 6:15 AM | Last Updated on Thu, May 23 2024 6:15 AM

Sakshi Guest Column On UNO Security Council reforms

అభిప్రాయం

భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి డిమాండ్‌ ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్‌ వేదికగా ప్రపంచ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఇంకో పక్క భారత్‌ సభ్య దేశంగా ఉన్న ఎల్‌–69 కూటమి భద్రతామండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతర సభ్యులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు అద్దం పడుతోంది..

అంతర్జాతీయ స్థాయిలో శాంతి సామరస్యాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ప్రాతినిధ్యం లేకపోవడం సమితి లక్ష్యసిద్ధిలో పెద్ద అడ్డంకి అని చెప్పక తప్పదు. ఈ అడ్డంకులను అధిగమించేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా అవి ఫలవంతం కావటం లేదు. సమితిలో సంస్కరణలు జరగాలని అధికశాతం దేశాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ వీటో పవర్‌ ఉన్న దేశాలు సమితి కృషికి పీటముడులు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్‌ వేదికగా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఎవరికీ పెద్దగా తెలియని, అస్పష్టమైన దౌత్య ప్రక్రియ ఆ చర్చలన్నవి. అయినప్పటికీ ఈ ఏడాది చివరిలోగా ఓ చరిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం కుదిరే దిశగా ఈ సమావేశం ముందడుగైతే వేసింది. 

భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు కూడా అద్దం పడుతోంది. ఉక్రెయిన్, గాజా పరిణామాలు... ఐరాస వ్యవస్థ ప్రభావం తగ్గిపోతూండటం, అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐరాసకు లేకపోవడం వంటివి మళ్లీ మళ్లీ చర్చకు వచ్చేలా చేస్తున్నాయి. భద్రతా మండలిలోని ఐదు దేశాలకూ వీటో అధికారాలు ఉండటం అన్నది రెండో ప్రపంచ యుద్ధ విజేతలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు అవుతోంది. ఇక ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలకు భాగస్వామ్యం లేదు. ఆ ప్రాంత దేశాల ప్రతినిధులు ఐరాసలో నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు అంతే. 

1950లో ప్రపంచ జనాభాలో సగం ఆసియాలోనే ఉండగా... ఇరవై శాతం ఆర్థిక లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నా భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం ఒక్క దేశానికి మాత్రమే దక్కింది. ఇది అన్యాయమే. అలాగని ఆశ్చర్యపోవడానికీ ఏమీ లేదు. కాగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం నిస్సందేహంగా చాలా మారి పోయింది. ప్రాతినిధ్యం విషయంలోనూ అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆసియా జనాభా ప్రపంచ జనాభాలో 60 శాతం. ఆర్థిక వ్యవస్థలో 40 శాతం భాగస్వామ్యం కూడా ఈ ఖండానిదే. ఐరాస సభ్యదేశాల్లో 25 శాతం ఇక్కడివే. కానీ... భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం 20 శాతమే. 

ఈ నేపథ్యంలోనే భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి ఉన్న డిమాండ్‌ను మనం గుర్తు చేసుకోవాలి. దాదాపుగా ఈ సమయంలోనే ఆర్థిక, సామాజిక కౌన్సిల్‌ సభ్యత్వాన్ని 18 నుంచి 27కు, ఆ తరువాత 54కు పెంచారు. 

2015లో కొన్ని నిర్దిష్ట సూచనలతో భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు జరిపేందుకు ఒక అంగీకారం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ అవి ముందుకు కదల్లేదు. చర్చల తీరుతెన్నులపై స్పష్టమైన ప్రణాళిక అన్నది లేకుండా పోవడం దీనికి కారణమైంది. ఈ ఏడాది జరిగిన శిఖరాగ్ర సమావేశం మాత్రమే ఈ ప్రక్రియ కాస్త ముందుకు కదిలేందుకు మార్గం చూపింది. 

కారణాలు అనేకం!
భద్రతా మండలి సంస్కరణలు స్తంభించిపోయేందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఇండియా, జర్మనీ, జపాన్‌ , బ్రెజిల్‌లతో కూడిన జి–4 కూటమి తమను (మరో ఇద్దరు ఆఫ్రికన్‌  ప్రతినిధులతో కలిపి) భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా తీసుకోవాలని డిమాండ్‌  చేస్తున్నాయి. భారత్, జి–4 దేశాలు వీటో అధికారం లేకుండానే భద్రతామండలిలో చేరేందుకు ఓకే అనవచ్చు. ఈ అంశంపై 15 ఏళ్ల తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేలా చూస్తారు. ఇంకో పక్క భారత్‌ కూడా సభ్య దేశంగా ఉన్న ఎల్‌–69 కూటమి భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతరులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. 

ఐరాస సభ్యదేశాల్లో అత్యధికులు భద్రతా మండలి శాశ్వత, ఇతర సభ్యుల సంఖ్యను పెంచేందుకు అంగీకారం తెలుపుతూండగా కాఫీ క్లబ్‌గా పేరుగాంచిన ‘యునైటెడ్‌ ఫర్‌ కన్సెన్సస్‌’ గ్రూపు ఆ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇటలీ, పాకిస్థాన్‌ , అర్జెంటీనా వంటి దేశాల నేతృత్వంలో పని చేస్తున్న ఈ గ్రూపు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. భారత్, జర్మనీ, బ్రెజిల్‌ వంటి స్థానిక శత్రువులది పైచేయి కాకుండా అన్నమాట. ఇదిలా ఉంటే భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు అమెరికా, యూకే, ఫ్రాన్‌ ్స, రష్యాలు మాత్రం శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  ఇంకో అడుగు ముందుకేసి భద్రతా మండలి సంస్కరణలకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటనైతే చేశారు కానీ ఆచరణలో మాత్రం ఆయన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంకో విషయం... ఆఫ్రికా గ్రూపులో ఏకాభిప్రాయం లేకపోవడంతో  భద్రతామండలి సభ్యదేశంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది సమితి నిర్ణయించుకోలేక పోతోంది. వివరంగా చర్చిస్తే భేదాభిప్రాయాలు వస్తాయని ఆఫ్రికా దేశాలు భయపడుతున్నాయి. 

అడ్డంకి ఉండనే ఉంది!
భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పెరిగేందుకు, ఇతర సభ్యుల చేరికకు ఉన్న అతిపెద్ద అడ్డంకి చైనా. భద్రతామండలి విస్తరణపై వ్యాఖ్య చేయని శాశ్వత సభ్య దేశం ఇదొక్కటే. ఆసియాకు మెరుగైన ప్రాతినిధ్యం లభించేందుకు ఆసియా దేశమే ఒకటి అడ్డుగా నిలవడం విచిత్రం.  ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే... అసలు రాజీ మార్గమన్నది ఏమాత్రం కనిపించకుండా పోతుంది. శాశ్వత సభ్యుల సంఖ్యను 11కు పెంచడం ఇందుకు ఒక మార్గం. ప్రస్తుత శాశ్వత సభ్యులు ఐదుగురితోపాటు జి–4 సభ్యులు, ఇద్దరు ఆఫ్రికా ప్రతినిధులు అన్నమాట. దీంతోపాటే ఇతర సభ్యుల సంఖ్యను కూడా తగుమాత్రంలో పెంచాల్సి ఉంటుంది. అలాగే పూర్తి వీటో అధికారం స్థానంలో కొంతమంది శాశ్వత సభ్యులకు అభ్యంతరం ద్వారా తీర్మానాన్ని అడ్డుకునే అధికారం కల్పించడం ఒక ఏర్పాటు అవుతుంది. ఇలాంటి ఏర్పాటు ప్రస్తుత శాశ్వత సభ్యులకూ అంగీకారయోగ్యం కావచ్చు. 

ఈ ఏర్పాటు ఒకటి రూపుదిద్దుకునేలోగా ఐరాస నిష్క్రియాపరత్వం పాటించడం కూడా ఐరాస ఏర్పాటు అసలు ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసేదే. యుద్ధనష్టాలు భవిష్యత్‌ తరాలకు సోకకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఐరాసాదే! అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికల అమలు, సామాజిక పురోగతి, మానవీయతలను కాపాడటం కూడా ఐరాస ఏర్పాటు ఉద్దేశాలలో కొన్ని అన్నది మరచిపోరాదు. 

ఈ లక్ష్యాలన్నీ ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా మారే ఆఫ్రికన్‌ గ్రూపు లేదా జి–20 వంటి వ్యవస్థలకూ వర్తిస్తాయి. గత ఏడాది భారత్‌ నేతృత్వంలో జరిగిన జి–20 సమావేశాల్లో చాలా అంశాలపై ఏకాభిప్రాయం సాధించగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఐరాస తన పూర్వ వైభవాన్ని మళ్లీ పొందాలంటే ప్రపంచం మొత్తానికి ఏకైక ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకానీ... ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ప్రపంచానికి ప్రతినిధిగా కాదు.

ధ్రువ జైశంకర్‌ 
వ్యాసకర్త ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్, ఓఆర్‌ఎఫ్‌ అమెరికా
(‘హిందూస్తాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement