UNO security council
-
సమితిపై సంస్కరణల ఒత్తిడి
భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి డిమాండ్ ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రపంచ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఇంకో పక్క భారత్ సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతామండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతర సభ్యులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు అద్దం పడుతోంది..అంతర్జాతీయ స్థాయిలో శాంతి సామరస్యాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ప్రాతినిధ్యం లేకపోవడం సమితి లక్ష్యసిద్ధిలో పెద్ద అడ్డంకి అని చెప్పక తప్పదు. ఈ అడ్డంకులను అధిగమించేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా అవి ఫలవంతం కావటం లేదు. సమితిలో సంస్కరణలు జరగాలని అధికశాతం దేశాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ వీటో పవర్ ఉన్న దేశాలు సమితి కృషికి పీటముడులు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఎవరికీ పెద్దగా తెలియని, అస్పష్టమైన దౌత్య ప్రక్రియ ఆ చర్చలన్నవి. అయినప్పటికీ ఈ ఏడాది చివరిలోగా ఓ చరిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం కుదిరే దిశగా ఈ సమావేశం ముందడుగైతే వేసింది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు కూడా అద్దం పడుతోంది. ఉక్రెయిన్, గాజా పరిణామాలు... ఐరాస వ్యవస్థ ప్రభావం తగ్గిపోతూండటం, అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐరాసకు లేకపోవడం వంటివి మళ్లీ మళ్లీ చర్చకు వచ్చేలా చేస్తున్నాయి. భద్రతా మండలిలోని ఐదు దేశాలకూ వీటో అధికారాలు ఉండటం అన్నది రెండో ప్రపంచ యుద్ధ విజేతలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు అవుతోంది. ఇక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు భాగస్వామ్యం లేదు. ఆ ప్రాంత దేశాల ప్రతినిధులు ఐరాసలో నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు అంతే. 1950లో ప్రపంచ జనాభాలో సగం ఆసియాలోనే ఉండగా... ఇరవై శాతం ఆర్థిక లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నా భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం ఒక్క దేశానికి మాత్రమే దక్కింది. ఇది అన్యాయమే. అలాగని ఆశ్చర్యపోవడానికీ ఏమీ లేదు. కాగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం నిస్సందేహంగా చాలా మారి పోయింది. ప్రాతినిధ్యం విషయంలోనూ అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆసియా జనాభా ప్రపంచ జనాభాలో 60 శాతం. ఆర్థిక వ్యవస్థలో 40 శాతం భాగస్వామ్యం కూడా ఈ ఖండానిదే. ఐరాస సభ్యదేశాల్లో 25 శాతం ఇక్కడివే. కానీ... భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం 20 శాతమే. ఈ నేపథ్యంలోనే భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి ఉన్న డిమాండ్‌ను మనం గుర్తు చేసుకోవాలి. దాదాపుగా ఈ సమయంలోనే ఆర్థిక, సామాజిక కౌన్సిల్ సభ్యత్వాన్ని 18 నుంచి 27కు, ఆ తరువాత 54కు పెంచారు. 2015లో కొన్ని నిర్దిష్ట సూచనలతో భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు జరిపేందుకు ఒక అంగీకారం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ అవి ముందుకు కదల్లేదు. చర్చల తీరుతెన్నులపై స్పష్టమైన ప్రణాళిక అన్నది లేకుండా పోవడం దీనికి కారణమైంది. ఈ ఏడాది జరిగిన శిఖరాగ్ర సమావేశం మాత్రమే ఈ ప్రక్రియ కాస్త ముందుకు కదిలేందుకు మార్గం చూపింది. కారణాలు అనేకం!భద్రతా మండలి సంస్కరణలు స్తంభించిపోయేందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఇండియా, జర్మనీ, జపాన్ , బ్రెజిల్‌లతో కూడిన జి–4 కూటమి తమను (మరో ఇద్దరు ఆఫ్రికన్ ప్రతినిధులతో కలిపి) భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్, జి–4 దేశాలు వీటో అధికారం లేకుండానే భద్రతామండలిలో చేరేందుకు ఓకే అనవచ్చు. ఈ అంశంపై 15 ఏళ్ల తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేలా చూస్తారు. ఇంకో పక్క భారత్ కూడా సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతరులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. ఐరాస సభ్యదేశాల్లో అత్యధికులు భద్రతా మండలి శాశ్వత, ఇతర సభ్యుల సంఖ్యను పెంచేందుకు అంగీకారం తెలుపుతూండగా కాఫీ క్లబ్‌గా పేరుగాంచిన ‘యునైటెడ్ ఫర్ కన్సెన్సస్’ గ్రూపు ఆ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇటలీ, పాకిస్థాన్ , అర్జెంటీనా వంటి దేశాల నేతృత్వంలో పని చేస్తున్న ఈ గ్రూపు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. భారత్, జర్మనీ, బ్రెజిల్ వంటి స్థానిక శత్రువులది పైచేయి కాకుండా అన్నమాట. ఇదిలా ఉంటే భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు అమెరికా, యూకే, ఫ్రాన్ ్స, రష్యాలు మాత్రం శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకో అడుగు ముందుకేసి భద్రతా మండలి సంస్కరణలకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటనైతే చేశారు కానీ ఆచరణలో మాత్రం ఆయన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంకో విషయం... ఆఫ్రికా గ్రూపులో ఏకాభిప్రాయం లేకపోవడంతో భద్రతామండలి సభ్యదేశంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది సమితి నిర్ణయించుకోలేక పోతోంది. వివరంగా చర్చిస్తే భేదాభిప్రాయాలు వస్తాయని ఆఫ్రికా దేశాలు భయపడుతున్నాయి. అడ్డంకి ఉండనే ఉంది!భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పెరిగేందుకు, ఇతర సభ్యుల చేరికకు ఉన్న అతిపెద్ద అడ్డంకి చైనా. భద్రతామండలి విస్తరణపై వ్యాఖ్య చేయని శాశ్వత సభ్య దేశం ఇదొక్కటే. ఆసియాకు మెరుగైన ప్రాతినిధ్యం లభించేందుకు ఆసియా దేశమే ఒకటి అడ్డుగా నిలవడం విచిత్రం. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే... అసలు రాజీ మార్గమన్నది ఏమాత్రం కనిపించకుండా పోతుంది. శాశ్వత సభ్యుల సంఖ్యను 11కు పెంచడం ఇందుకు ఒక మార్గం. ప్రస్తుత శాశ్వత సభ్యులు ఐదుగురితోపాటు జి–4 సభ్యులు, ఇద్దరు ఆఫ్రికా ప్రతినిధులు అన్నమాట. దీంతోపాటే ఇతర సభ్యుల సంఖ్యను కూడా తగుమాత్రంలో పెంచాల్సి ఉంటుంది. అలాగే పూర్తి వీటో అధికారం స్థానంలో కొంతమంది శాశ్వత సభ్యులకు అభ్యంతరం ద్వారా తీర్మానాన్ని అడ్డుకునే అధికారం కల్పించడం ఒక ఏర్పాటు అవుతుంది. ఇలాంటి ఏర్పాటు ప్రస్తుత శాశ్వత సభ్యులకూ అంగీకారయోగ్యం కావచ్చు. ఈ ఏర్పాటు ఒకటి రూపుదిద్దుకునేలోగా ఐరాస నిష్క్రియాపరత్వం పాటించడం కూడా ఐరాస ఏర్పాటు అసలు ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసేదే. యుద్ధనష్టాలు భవిష్యత్ తరాలకు సోకకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఐరాసాదే! అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికల అమలు, సామాజిక పురోగతి, మానవీయతలను కాపాడటం కూడా ఐరాస ఏర్పాటు ఉద్దేశాలలో కొన్ని అన్నది మరచిపోరాదు. ఈ లక్ష్యాలన్నీ ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా మారే ఆఫ్రికన్ గ్రూపు లేదా జి–20 వంటి వ్యవస్థలకూ వర్తిస్తాయి. గత ఏడాది భారత్ నేతృత్వంలో జరిగిన జి–20 సమావేశాల్లో చాలా అంశాలపై ఏకాభిప్రాయం సాధించగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఐరాస తన పూర్వ వైభవాన్ని మళ్లీ పొందాలంటే ప్రపంచం మొత్తానికి ఏకైక ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకానీ... ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ప్రపంచానికి ప్రతినిధిగా కాదు.ధ్రువ జైశంకర్ వ్యాసకర్త ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా(‘హిందూస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
నిర్ణయాధికారం లేకుండా ఇంకా ఎన్నాళ్లు ?
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి (యూఎన్) భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి దూరంగా ఇంకా ఎన్నాళ్లు ఉంచుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. సమితిలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని గట్టిగా నొక్కి చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచదేశాలు వ్యాక్సిన్ కోసం భారత్ వైపు చూస్తున్నాయని, అందరి అవసరాలు తీర్చే శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన సర్వప్రతినిధి సభలో ముందుగా రికార్డు చేసిన వీడియో ద్వారా మోదీ తన ప్రసంగాన్ని వినిపించారు. మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా యూఎన్‌లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. ‘‘ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాధికారం కోసం భారత్ ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలి ? ప్రపంచ జనాభాలో 18 శాతం కంటే ఎక్కువగా ఉన్న అతి పెద్ద దేశానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేస్తున్న దేశానికి భద్రతామండలిలో నిర్ణయాధికారాన్ని కల్పించరా ? ’’అని మోదీ నిలదీశారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా గండి కొడుతున్న విషయం తెలిసిందే. తాత్కాలిక సభ్య దేశంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భారత్ కొనసాగనుంది. ఇదే సమయంలో మోదీ ఈ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి పరిస్థితులు వేరు. ఈ నాటి ప్రపంచ దేశాల పరిస్థితులు వేరు. సమస్యలు, వాటికి పరిష్కారాలు అన్నీ వేర్వేరుగా ఉన్నాయి. చాలా దీర్ఘకాలంగా సంస్కరణల కోసం వేచి చూస్తున్నాం’’అని ప్రధాని చెప్పారు. మారాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మారకపోతే, ఆ తర్వాత మార్పు వచ్చినా అది బలహీనంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం గత 75 ఏళ్ల కాలంలో ప్రపంచ దేశాల్లో ఎన్నో ఉగ్రవాదుల దాడులు జరిగాయని, రక్తపుటేరులు ప్రవహించాయన్న ప్రధాని దానిని దీటుగా ఎదుర్కోవాలంటే యూఎన్‌లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం, ఆయుధాల సరఫరా, డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి వాటికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తన గళాన్ని గట్టిగా వినిపించాలని, శాంతి భద్రతలు, సయోధ్య అంశాలకు మద్దతు పలకాలన్నారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఇప్పటివరకు భారత్ 50 వరకు శాంతి మిషన్లను ప్రపంచం నలుమూలలకి పంపించిందని, జగతి సంక్షేమమే భారత్ ఆకాంక్ష అని మోదీ అన్నారు. కరోనాపై పోరాటంలో ఐరాస పాత్ర ఏది ? గత తొమ్మిది నెలల నుంచి ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూ ఉంటే, కలసికట్టుగా పోరాడేందుకు ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రయత్నాలేంటని మోదీ ప్రశ్నించారు. కరోనాపై యూఎన్ నుంచి గట్టి ప్రతిస్పందన కూడా కరువైందని అన్నారు. కరోనా కష్ట కాలంలో భారత్‌లో ఫార్మా రంగం అద్భుతమైన పనితీరుని ప్రదర్శించిందని, 150కి పైగా దేశాలకు వివిధ రకాలైన ఔషధాలను సరఫరా చేశామన్నారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో అతి పెద్ద దేశమైన భారత్ అందరి అవసరాలు తీర్చేలా కరోనా టీకా డోసుల్ని ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలను సంక్షోభం నుంచి బయటపడేయగలదని హామీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌పై భారత్ మూడో దశ ప్రయోగాల్లో ఉందని తెలిపారు. -
పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు
ఐక్యరాజ్యసమితి : కశ్మీర్ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో తెవనెత్తేందుకు చేసిన విఫల ప్రయత్నం బెడిసికొట్టింది. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశంమని ఐరాస స్పష్టం చేసింది. పాక్ కుయుక్తులపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనబెట్టి.. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుపర్చే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. ఓ అఫ్రికన్ దేశానికి సంబంధించి ఐక్యరాజ్య భద్రతా మండలి బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి హాజరైనా చైనా.. కశ్మీర్ అంశాన్ని కూడా చర్చించాలని ప్రతిపాదించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించలేదు. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. పాక్‌కు మద్దతుగా చైనా తప్ప మరే ఇతర దేశాలు అండగా లేకపోవడం గమనార్హం. పాకిస్తాన్ కుయుక్తులు ఐక్యరాజ్య సమితిలో చెల్లవని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్ధీన్ అన్నారు. పాక్ నిరాధార ఆరోపణలు చేస్తూ ఐరాసను తప్పదోవ పట్టిస్తుందన్న విషయం నేటితో తేలిపోయిందన్నారు. ఈ అనుభవంతో ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై పాక్ దృష్టి పెట్టాలని సూచించారు. -
మండలిలో భంగపాటు
‘భద్రతామండలిలో మనకోసం ఎవరూ పూల దండలు పట్టుకుని ఎదురుచూడటం లేదు. ఇది మరిచి ప్రవర్తిస్తే మనం పిచ్చివాళ్ల స్వర్గంలో ఉన్నట్టే’ అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ ప్రకటించిన నాలుగు రోజులకు మండలిలో ఆ దేశానికి భంగపాటు ఎదు రైంది.370 అధికరణను మన దేశం రద్దు చేయడంపై మొన్న శుక్రవారం మండలి రహస్య సమావేశం జరిగినప్పుడు చైనా తప్ప మరే దేశమూ పాకిస్తాన్ పక్షం నిలబడలేదు. 15మంది సభ్యులున్న మండలిలో మెజారిటీ సభ్యులు కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, అందులో ఐక్యరాజ్యసమితి జోక్యం అవసరం లేదని అభిప్రాయపడటం పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బే. జమ్మూ–కశ్మీర్లో ఉద్రిక్తత లను పెంచే చర్యలకు ఎవరూ పాల్పడరాదంటూ తీర్మానిద్దామని చైనా చేసిన సూచన కూడా వీగిపోయింది. రెండు గంటలపాటు సమావేశం జరిగాక బయటికొచ్చి ఇద్దరే మాట్లాడారు. వారిలో ఒకరు చైనా ప్రతినిధి. మరొకరు రష్యా ప్రతినిధి. చైనా ప్రతినిధి సహజంగానే పాకిస్తాన్ అనుకూల వైఖరితో మాట్లాడగా, రష్యా ప్రతినిధి భారత్‌ను సమర్థించారు. భద్రతామండలి చర్చించిన లేదా తీర్మానించిన అంశాలన్నీ చివరకు ఏమవుతున్నాయన్న సంగతలా ఉంచి, ఆ వేదికపై ఎలాగైనా కశ్మీర్ అంశం ప్రస్తావనకు రావాలన్న పాకిస్తాన్ కోరిక మాత్రం నెరవేరింది. మండలిలో పాకిస్తాన్‌కు లభించే మద్దతు అంతంతమాత్రమేనని తాను అనడానికి కారణ మేమిటో ఖురేషీ చెప్పారు. వందకోట్లకు మించి జనాభా ఉన్న భారత్‌లో అనేక దేశాలు పెట్టు బడులు పెట్టాయని, ఇస్లామిక్ దేశాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయని ఆయన వివరించారు. కానీ ఇదే మాట పాకిస్తాన్‌కు కూడా వర్తిస్తుంది. గిల్గిట్–బాల్టిస్తాన్లోని ట్రాన్స్ కారకోరంను ఆ దేశం చైనాకు అప్పగించకపోయి ఉంటే... చైనా నిర్మించతలపెట్టిన బృహత్తర ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)లో చేరడానికి సిద్ధపడకపోయి ఉంటే అది కూడా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచేది కాదు. ప్రపంచం ఇప్పుడు మారిందని ఖురేషీ చెప్పడంలోనూ అర్ధసత్యమే ఉంది. అప్పట్లో పాకిస్తాన్ చర్యలకు నలువైపులనుంచీ మద్దతు వచ్చిపడిందీ లేదు...ఇప్పుడు అది తగ్గిందీ లేదు. అయినా ప్రపంచ దేశాల తీరు గురించి ఇంత తెలిసిన పాకిస్తాన్ మన దేశంతో మొదటినుంచీ ఎందుకు గిల్లికజ్జాలకు దిగుతున్నదో అనూహ్యం. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పాకి స్తాన్ పరిస్థితిని ఈ స్థితికి చేర్చింది 80వ దశకంలో ఆ దేశాన్నేలిన సైనిక నియంత జియావుల్ హక్. పౌర ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని దురాక్రమించిన తనకు బలం చేకూరాలంటే మత తత్వాన్ని పెంచడమే మార్గమని ఆయన అనుకున్నాడు. ప్రతి స్థాయిలోనూ మత ఛాందసులకు చోటిచ్చి వారికి పలుకుబడి పెరిగేలా చేశాడు. అనంతరకాలంలో ఆ ఛాందసవాద ముఠాలు కొరక రాని కొయ్యలా తయారయ్యాయి. అక్కడి సమాజాన్ని శాసిస్తున్నాయి. వాటినుంచే ఉగ్రవాదాన్ని బతుకు తెరువుగా చేసుకున్నవారు పుట్టుకొచ్చారు. అటువంటివారిని సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపి అలజడులు సృష్టించడం, అధీన రేఖ వద్ద తరచు ఆ దేశ సైన్యం అకారణంగా కాల్పులకు దిగడం వగైరాలన్నీ దానికి కొనసాగింపు. ఇలాంటి దేశాన్ని నమ్ముకుని ఎవరూ పెట్టుబడులు పెట్టరు. వ్యాపారాలు చేయరు. భారత్ పెద్ద మార్కెట్ అనడానికి ముందు.. దాదాపు 20 కోట్లమంది జనాభాతో ఉన్న తమ దేశమూ చెప్పుకోదగ్గ మార్కెటేనని ఖురేషీ గుర్తించి ఉంటే బాగుండేది. జనాభా ఎంత ఉందని కాదు... దేశం ప్రశాంతంగా ఉంటే వ్యాపారులైనా, పారి శ్రామికవేత్తలైనా ఉత్సాహంగా ముందుకొస్తారు. యువతకు ఉపాధి దొరుకుతుంది. అసలు అదంతా జరిగితే మన దేశంతో పాకిస్తాన్‌కు పేచీ పెట్టుకునే అవసరం వచ్చేది కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ నానాటికీ క్షీణించడం, ఉపాధి కల్పనలో వెనకబాటు వగైరాలన్నీ పాకిస్తాన్‌ను కుంగ దీస్తున్నాయి. వాటినుంచి తమ ప్రజల దృష్టి మళ్లించడానికి పాకిస్తాన్ ఇలాంటి పేచీకోరు చర్యలకు దిగుతోంది. అయితే భద్రతామండలి చర్చ సందర్భంగా అటు చైనా తీరుతెన్నులపై, ఇటు రష్యా అడుగులేసిన తీరుపై మన దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మొదటినుంచీ చైనా పాకిస్తాన్ వైపే మొగ్గుచూపుతోంది. అది కొత్త పరిణామమేమీ కాదు. కానీ వచ్చే అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య మన దేశంలో శిఖరాగ్ర చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో...వచ్చే నెల ఇరు దేశాల ప్రతినిధులమధ్యా సరిహద్దు అంశంపై చర్చలు జరగాల్సి ఉండగా చైనా ఇంత దూకుడుగా పాకిస్తాన్ ప్రయోజనాల పరిరక్షణకు శ్రమించడం, భద్రతామండలిలో ఒక తీర్మానం చేయాలని పట్టుబట్టడం గమనించదగ్గవి. ఒకపక్క తాను వీగర్ ప్రావిన్స్‌లో నిత్యం మానవహక్కుల హననానికి పాల్పడుతూ, హాంకాంగ్‌లో అణచివేత చర్యలకు దిగుతూ కశ్మీర్ పౌరుల విషయంలో మాత్రం అది మొసలి కన్నీరు కారుస్తోంది. అటు రష్యా స్వరం కూడా స్వల్పంగా మారిన వైనం కనబడుతోంది. కశ్మీర్ సమస్య భారత్–పాక్‌ల ద్వైపాక్షిక అంశ మని, వారిద్దరే దాన్ని పరిష్కరించుకోవాలని అది ఇప్పటికీ చెబుతున్నా... అందుకు 1972నాటి సిమ్లా ఒప్పందం, 1998నాటి లాహోర్ డిక్లరేషన్లను ప్రాతిపదికలుగా తీసుకోవాలని అంటున్నా, కొత్తగా ‘ సంబంధిత ఐక్యరాజ్యసమితి తీర్మానాల’ ప్రస్తావనను వీటికి జత చేసింది. ఇది కొత్త పరి ణామం. అమెరికాతో మన దేశం సన్నిహితం కావడం విషయమై రష్యాకు చాన్నాళ్లనుంచి అసంతృప్తి ఉంది. కనుకనే ఈ రూపంలో దాన్ని వెళ్లగక్కింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో భద్రతా మండలిలో మనకు గట్టి మద్దతుదారుగా నిలిచి, మనకు వ్యతిరేకంగా వచ్చే తీర్మానాలను ఎప్పుడూ వీటో చేస్తూ వచ్చిన రష్యా ఇలా వ్యవహరించడం గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దౌత్య వ్యవహారాలు కత్తి మీది సాము వంటివి. ఆచితూచి అడుగులేయడం చాలా ముఖ్యం. -
భారత్‌కు రష్యా, పాకిస్తాన్‌కు చైనా మద్దతు
న్యూయార్క్ : కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రహస్య సమావేశం నిర్వహించింది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పట్ల భారత ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రష్యా భారత్‌కు పూర్తి మద్దతుగా నిలిచింది. కశ్మీర్ అంశంపై భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. ఈ అంశంపై యూన్ భద్రతా మండలిలో చర్చించొద్దని తేల్చిచెప్పింది. ఇక ఆర్టికల్ 370 రద్దుతో భారత్ కశ్మీర్‌పై అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతున్న పాకిస్తాన్ తొలుత అమెరికా తలుపు తట్టింది. కశ్మీర్ విషయం పూర్తిగా భారత్ అంతర్గతమని అమెరికా తేల్చిచెప్పడంతో.. చైనాకు సాగిలపడిన దాయాది దేశం ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశంపై పట్ల చర్చ పెట్టాలని కోరింది. దీంతో ఈ విషయంలో యూఎన్ భద్రతా మండలి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు సమావేశమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన ఫ్రాన్స్, యూకే కూడా కశ్మీర్ అంశం భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక అంశమని ఇప్పటికే చెప్పాయి. రహస్య సమావేశం అనగా మీడియాకు అనుమతి లేకపోవడమే. -
కశ్మీర్‌పై నాడు పాకిస్తాన్.. నేడు చైనా
న్యూయార్క్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. చైనా అభ్యర్థన మేరకు శుక్రవారం నాడు రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు భద్రతా మండలి తెలిపింది. కాగా ఓ అంశంపై రహస్య పద్దతిలో (గోప్యంగా) సమావేశాన్ని నిర్వహించడం 55 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఫిర్యాదుపై స్పందించిన యూఎన్ఎస్సీ 1965లో తొలిసారి ఇలా రహస్య సమావేశాన్ని నిర్వహించింది. తాజాగా చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్ విఫలమైనట్లయింది. కశ్మీర్ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదని యూఎన్ఎస్సీ పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పాకిస్తాన్, చైనా ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక బృందం నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు యూఎన్ఎస్సీ అధ్యక్షుడు జోనా రోనెకా తెలిపారు. మరోవైపు కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో తాను ప్రతినిధిగా వ్యవహరిస్తానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇదివరకే వ్యాఖ్యానించారు. దీనిపై చైనా మద్దతును కూడా ఆయన కోరారు. కాగా కశ్మీర్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై స్పందించాల్సిందిగా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్ అక్రమ చర్యలకు పాల్పడుతోందని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై ప్రత్యేక సమావేశం జరపాల్సిందిగా’ కోరుతున్నాం అని పాక్ యూఎన్ఓకి రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చైనా యూఎన్ఎస్సీ అధ్యక్షుడితో చర్చించిన క్రమంలో శుక్రవారం భేటీ జరుగనుంది. కాగా ఇటీవల చైనాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. అయితే ఈ రహస్య సమావేశం ద్వారా పాక్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నేడు ఐరాస రహస్య చర్చలు
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం ఉదయం గోప్యంగా నిర్వహించనున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్ విఫలమైనట్లయింది. భద్రతా మండలికి ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో చీఫ్‌గా ఉన్న పోలండ్ అంశంపై ఉదయం పది గంటలకు చర్చ నిర్వహించేలా లిస్టింగ్ చేసిందని వారు చెప్పారు. కశ్మీర్ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదన్నారు. -
భద్రతా మండలిలో భారత్‌కు పూర్తి మద్దతు: కామెరూన్
లండన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పష్టం చేశారు. మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. మేక్ ఇన్ ఇండియాకు బ్రిటన్ సహకరిస్తుందని కామెరూన్ అన్నారు. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిధులను అందిస్తామని తెలిపారు. ఇండోర్, పుణె నగరాలలో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలకు బ్రిటన్ సహాయం ఉంటుందన్నారు. స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ్భారత్లలో బ్రిటన్ భాగస్వామ్యం పంచుకుంటుందని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటీష్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ వివరించారు.