కూలీల పొట్ట కొడతారా? | jaggireddy mandapalli sand ramp | Sakshi
Sakshi News home page

కూలీల పొట్ట కొడతారా?

Published Mon, Feb 20 2017 11:40 PM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

కూలీల పొట్ట కొడతారా?

కూలీల పొట్ట కొడతారా?

తహసీల్దార్‌ తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసహనం
మందపల్లి ఇసుక ర్యాంపు నిలిపివేతపై ఆగ్రహం 
ర్యాంపు గేటు తాళం తొలగించిన జగ్గిరెడ్డి 
మందపల్లి(కొత్తపేట) : ఇసుక ర్యాంపుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 500 మంది జట్టు కూలీల కష్టార్జితాన్ని దోచుకుంటున్న దళారులకు కొమ్ముకాస్తారా? అందుకు ర్యాంపును మూసేసి కూలీల పొట్ట కొడతారా? అధికారులుగా మీరు తీసుకునే నిర్ణయం సరైనదా? అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తహసీల్దార్‌ ఎన్‌.శ్రీధర్‌ను ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును ఈ నెల 2న తెరిచారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇసుక ఎగుమతి, బాట నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని ఇసుక ఎగుమతి చేయాలని అధికారులు జట్టు సంఘాలకు సూచించారు. 12 జట్టు కూలీ సంఘాలకు చెందిన సుమారు 500 మంది కూలీలు ఇసుక ఎగుమతులు చేస్తున్నారు. ఇదిలా వుండగా బాట నిర్వహణ పేరుతో వసూలు చేస్తున్న సొమ్మును జట్టు మేస్త్రీ కూడా కాని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ర్యాంపును నిర్వహిస్తూ మిగిలిన సొమ్మును పంచకుండా తన గుప్పెట్లో పెట్టుకుని లెక్కలు చెప్పడం లేదని కూలీల ఆరోపణ. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తికి వ్యతిరేక వర్గాల కూలీలందరూ బాట నిర్వహణ బాధ్యత నెలలో 15 రోజులు తాము చేపడతామని అధికారులను కోరారు. దానిపై ఈ నెల 18 న తహసీల్దార్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఇసుక కమిటీ.. జట్టు సంఘాల మేస్త్రీలతో చర్చించారు. బాట నిర్వహణ సొమ్ము వీఆర్వో వసూలు చేసి అధికారుల జాయింట్‌ అకౌంట్‌లో జమ చేయగా బాటకు ఎంత ఖర్చు అవుతుందో అంత డ్రా చేసి ఇస్తామని శ్రీధర్‌ తెలిపారు. సోమవారం ర్యాంపు గేటు తెరవకపోవడంతో కూలీలు వీఆర్వోను ఆరా తీయగా జాయింట్‌ అకౌంట్‌ పని పూర్తి కాలేదని , అందువల్ల తహసీల్దార్‌ ర్యాంపు తెరవద్దన్నారని తెలిపారు. దాంతో జట్టు సంఘాల సభ్యులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన మందపల్లి ర్యాంపుకు చేరుకోగా మేస్త్రీలు కుంపట్ల వెంకన్న,వి లక్ష్మణస్వామి, నేరేడుమిల్లి మందేశ్వరరావు, బద్దా ఏసు, యార్లగడ్డ గణేష్, నక్కా సత్యనారాయణ తదితరులు ర్యాంపులో జరుగుతున్న తీరును, తహసీల్దార్‌ ప్రతిపాదనపై విముఖత, ర్యాంపు మూసివేత తదితర అంశాలను ఏకరువుపెట్టారు.జగ్గిరెడ్డి తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి అసహనం వ్యక్తం చేశారు. ఏ విషయమైనా చర్చించడానికి ర్యాంపు మూసేయాలా? కూలీలను ఖాళీగా కూర్చోపెట్టి కడుపు మాడ్చాలా? ఇది సరైన నిర్ణయం కాదు. వెంటనే గేటు తెరిపించండి అంటూ ఆదేశించారు. కొంత సేపటికి వీఆర్వో ర్యాంపునకు రాగా గేటు తాళం ఏది? అని ఆరా తీస్తే ఒకటి పోలీస్‌ వద్ద, మరొకటి జట్టు సంఘం మేస్త్రి కాని వ్యక్తి వద్ద వుందన్నారు. దాంతో పోలీసు అధికారులతో సంప్రదించి జగ్గిరెడ్డి తాళం తొలగించి గేటు తెరిచారు.
కూలీలంతా ఒక్కమాటపై నిలవాలి
కూలీలందరూ ఒక్క మాటపై నిలబడాలని జగ్గిరెడ్డి అన్నారు. లేకుంటే అధికారులకు లోకువ. దాన్ని ఆసరాగా తీసుకుని ఇలాగే పొట్ట కొడతారు అని అన్నారు. దళారులకు అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వసూలు చేసే మొత్తం మీకే దక్కాలని అన్నారు. అధికారులు దళారులకు సహకరించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీకు ఏకష్టమొచ్చినా అందుబాటులో వుంటానని జగ్గిరెడ్డి కూలీలకు భరోసా ఇచ్చారు. జగ్గిరెడ్డి వెంట రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్‌ ముత్యాల వీరభద్రరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సాదు చెంచయ్య, గ్రామ పార్టీ నాయకులు తోరాటి గణేష్,చింతం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నతాధికారుల  ఆదేశాల మేరకే..
ర్యాంపు మూసివేతపై తహసీల్దార్‌ శ్రీధర్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే  చర్యలు తీసుకుంటున్నామన్నారు.బాట నిర్వహణ సొమ్ము జాయింట్‌ అకౌంట్‌లో జమచేసి ఖర్చు చేయడం రాజమండ్రి డివిజన్‌లో అమలు జరుగుతుందని, ఆ విషయం చర్చించేందుకు ర్యాంపు మూసి చేసి మేస్త్రీలను రమ్మని కబురు పంపితే వారు రాలేదని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement