mandapalli
-
మందపల్లి.. మంచం పట్టింది
తూర్పుగోదావరి, మందపల్లి (కొత్తపేట): మండలంలోని మందపల్లి గ్రామంలో అనేక కుటుంబాల్లోని 80 మంది సీజనల్ వ్యాధులు, విషజ్వరాలతో మంచం పట్టారు. ఈ గ్రామంలో సుమారు నెలా 15 రోజుల నుంచే జ్వరాలు ప్రారంభమయ్యాయి. 20 రోజులుగా వాటి తీవ్రత పెరిగింది. గ్రామంలో ప్రతి వీధిలోనూ అనేక ఇళ్లలో జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. కొన్ని ఇళ్లల్లో ఒకరి తరువాత ఒకరికి జ్వరాలు రాగా.. మరికొన్ని ఇళ్లల్లో ఒకటి, రెండు రోజుల తేడాలో అందరూ ఒకేసారి మంచం పట్టారు. అనేక మందికి ప్లేట్లెట్స్ (రక్తకణాలు) తగ్గిపోవడంతో పలువురు, జ్వరాలు, నొప్పులతో మరికొందరు రాజమహేంద్రవరం, అమలాపురం ఆస్పత్రుల్లో చేరారు. మరికొందరు కొత్తపేట, రావులపాలెం ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక ఆర్ఎంపీలపై ఆధారపడిన కొందరు ఇళ్ల వద్దే ఫ్లూయిడ్స్ (సెలైన్స్) ఎక్కించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో బాధితులు ఎక్కువ మండలంలో మందపల్లి అతి చిన్న గ్రామం. కేవలం 675 సెంట్లు విస్తీర్ణం ఉన్న ఈ గ్రామంలో 1,470 మంది జనాభా. 350 గృహాలు కాగా 405 కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువగా శనేశ్వర ఆలయం వెనుక కాలనీల్లో, జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో జ్వరాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. గ్రామస్తుడు రావూరి సూర్యచంద్రరావు ఇంటికి వెళ్లగా ఇంటి వరండాలో ఆయన జ్వరంతో బాధపడుతూ సెలైన్ బ్యాడిల్ ఎక్కించుకుంటున్నారు. ఆస్పత్రి ఖర్చుభరించలేకపోవడంతో అతడికి కుటుంబ సభ్యులు సఫర్యలు చేస్తున్నారు. అతను 10 రోజుల క్రితం జ్వరం వస్తే స్థానిక ఆర్ఎంపీతో వైద్యం చేయించుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కొత్తపేటలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా రక్తపరీక్షలు చేసి ప్లేట్లెట్స్ 50 వేలకు పడిపోయాయంటూ సెలైన్స్, ఇంజక్షన్లు చేశారు. ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఇంటికి వచ్చి ఆర్ఎంపీతో వైద్యం చేయించుకుంటున్నాడు. ఆ ఇంట్లోనే అతని తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మద్దిరాల భూలక్ష్మి అనే మహిళ ప్లేట్లెట్స్ 15 వేలకు, కుమారుడు లోకేష్‌కు 30 వేలకు పడిపోగా రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది ఇంటికి వచ్చారు. రావూరి వీరేంద్ర, కుంపట్ల నేతికొండ, నక్కా కనకారావు, అతని భార్య జ్వరాలు, జాయింట్ పెయిన్స్‌తో బాధ పడుతున్నారు. కుంపట్ల కోటేశ్వరరావు, బొండాడ సత్తిబాబు తదితరులు జ్వరాలతో ఉన్నారు. వీరందరూ రెక్కాడితే గాని డొక్కాడని వారే. గ్రామ మాజీ ఉప సర్పంచి గందం తాతాజీకి ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. విషజ్వరాలు ప్రాణాంతకమని పలువురు వైద్యులు హెచ్చరించడంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకుంటున్నామని పలువురు వాపోయారు. ఒక్కక్కరికీ సుమారు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అయినట్టు పలువురు తెలిపారు. పట్టించుకోని వైద్యాధికారులు గ్రామంలో జ్వరాల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదని గ్రామంలో పలువురు ఆరోపించారు. గ్రామంలోని ఏఎన్ఎం రాజమహేంద్రవరంలో ఉంటారని, 2వ ఏఎన్ఎం గంటిలో ఉంటారని.. ఆమె అప్పుడప్పుడూ వస్తారని వారు తెలిపారు. పంచాయతీ అధికారులు కూడా ఈ పరిస్థితిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. పంచాయతీ కార్యాలయం వద్దే పారిశుద్ధ్యం క్షీణించింది. ‘స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ఛ గ్రామం’నినాదాల బోర్డులు ఉన్న చోటే పెంటకుప్పలు ఉన్నాయి. మందపల్లి గ్రామంతోపాటు కొత్తపేట శివారు గ్రామం ఏనుగులమహల్‌లో కూడా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నారు. -
కూలీల పొట్ట కొడతారా?
తహసీల్దార్ తీరుపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసహనం మందపల్లి ఇసుక ర్యాంపు నిలిపివేతపై ఆగ్రహం ర్యాంపు గేటు తాళం తొలగించిన జగ్గిరెడ్డి మందపల్లి(కొత్తపేట) : ఇసుక ర్యాంపుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 500 మంది జట్టు కూలీల కష్టార్జితాన్ని దోచుకుంటున్న దళారులకు కొమ్ముకాస్తారా? అందుకు ర్యాంపును మూసేసి కూలీల పొట్ట కొడతారా? అధికారులుగా మీరు తీసుకునే నిర్ణయం సరైనదా? అంటూ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తహసీల్దార్ ఎన్.శ్రీధర్‌ను ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపును ఈ నెల 2న తెరిచారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఇసుక ఎగుమతి, బాట నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుని ఇసుక ఎగుమతి చేయాలని అధికారులు జట్టు సంఘాలకు సూచించారు. 12 జట్టు కూలీ సంఘాలకు చెందిన సుమారు 500 మంది కూలీలు ఇసుక ఎగుమతులు చేస్తున్నారు. ఇదిలా వుండగా బాట నిర్వహణ పేరుతో వసూలు చేస్తున్న సొమ్మును జట్టు మేస్త్రీ కూడా కాని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ర్యాంపును నిర్వహిస్తూ మిగిలిన సొమ్మును పంచకుండా తన గుప్పెట్లో పెట్టుకుని లెక్కలు చెప్పడం లేదని కూలీల ఆరోపణ. ఆ నేపథ్యంలో ఆ వ్యక్తికి వ్యతిరేక వర్గాల కూలీలందరూ బాట నిర్వహణ బాధ్యత నెలలో 15 రోజులు తాము చేపడతామని అధికారులను కోరారు. దానిపై ఈ నెల 18 న తహసీల్దార్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఇసుక కమిటీ.. జట్టు సంఘాల మేస్త్రీలతో చర్చించారు. బాట నిర్వహణ సొమ్ము వీఆర్వో వసూలు చేసి అధికారుల జాయింట్ అకౌంట్లో జమ చేయగా బాటకు ఎంత ఖర్చు అవుతుందో అంత డ్రా చేసి ఇస్తామని శ్రీధర్ తెలిపారు. సోమవారం ర్యాంపు గేటు తెరవకపోవడంతో కూలీలు వీఆర్వోను ఆరా తీయగా జాయింట్ అకౌంట్ పని పూర్తి కాలేదని , అందువల్ల తహసీల్దార్ ర్యాంపు తెరవద్దన్నారని తెలిపారు. దాంతో జట్టు సంఘాల సభ్యులు ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన మందపల్లి ర్యాంపుకు చేరుకోగా మేస్త్రీలు కుంపట్ల వెంకన్న,వి లక్ష్మణస్వామి, నేరేడుమిల్లి మందేశ్వరరావు, బద్దా ఏసు, యార్లగడ్డ గణేష్, నక్కా సత్యనారాయణ తదితరులు ర్యాంపులో జరుగుతున్న తీరును, తహసీల్దార్ ప్రతిపాదనపై విముఖత, ర్యాంపు మూసివేత తదితర అంశాలను ఏకరువుపెట్టారు.జగ్గిరెడ్డి తహసీల్దార్‌కు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు. ఏ విషయమైనా చర్చించడానికి ర్యాంపు మూసేయాలా? కూలీలను ఖాళీగా కూర్చోపెట్టి కడుపు మాడ్చాలా? ఇది సరైన నిర్ణయం కాదు. వెంటనే గేటు తెరిపించండి అంటూ ఆదేశించారు. కొంత సేపటికి వీఆర్వో ర్యాంపునకు రాగా గేటు తాళం ఏది? అని ఆరా తీస్తే ఒకటి పోలీస్ వద్ద, మరొకటి జట్టు సంఘం మేస్త్రి కాని వ్యక్తి వద్ద వుందన్నారు. దాంతో పోలీసు అధికారులతో సంప్రదించి జగ్గిరెడ్డి తాళం తొలగించి గేటు తెరిచారు. కూలీలంతా ఒక్కమాటపై నిలవాలి కూలీలందరూ ఒక్క మాటపై నిలబడాలని జగ్గిరెడ్డి అన్నారు. లేకుంటే అధికారులకు లోకువ. దాన్ని ఆసరాగా తీసుకుని ఇలాగే పొట్ట కొడతారు అని అన్నారు. దళారులకు అవకాశం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వసూలు చేసే మొత్తం మీకే దక్కాలని అన్నారు. అధికారులు దళారులకు సహకరించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీకు ఏకష్టమొచ్చినా అందుబాటులో వుంటానని జగ్గిరెడ్డి కూలీలకు భరోసా ఇచ్చారు. జగ్గిరెడ్డి వెంట రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు సాదు చెంచయ్య, గ్రామ పార్టీ నాయకులు తోరాటి గణేష్,చింతం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ర్యాంపు మూసివేతపై తహసీల్దార్ శ్రీధర్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటున్నామన్నారు.బాట నిర్వహణ సొమ్ము జాయింట్ అకౌంట్లో జమచేసి ఖర్చు చేయడం రాజమండ్రి డివిజన్లో అమలు జరుగుతుందని, ఆ విషయం చర్చించేందుకు ర్యాంపు మూసి చేసి మేస్త్రీలను రమ్మని కబురు పంపితే వారు రాలేదని అన్నారు.