మందపల్లిలో జ్వరాల బారిన పడిన గ్రామస్తులు
తూర్పుగోదావరి, మందపల్లి (కొత్తపేట): మండలంలోని మందపల్లి గ్రామంలో అనేక కుటుంబాల్లోని 80 మంది సీజనల్ వ్యాధులు, విషజ్వరాలతో మంచం పట్టారు. ఈ గ్రామంలో సుమారు నెలా 15 రోజుల నుంచే జ్వరాలు ప్రారంభమయ్యాయి. 20 రోజులుగా వాటి తీవ్రత పెరిగింది. గ్రామంలో ప్రతి వీధిలోనూ అనేక ఇళ్లలో జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. కొన్ని ఇళ్లల్లో ఒకరి తరువాత ఒకరికి జ్వరాలు రాగా.. మరికొన్ని ఇళ్లల్లో ఒకటి, రెండు రోజుల తేడాలో అందరూ ఒకేసారి మంచం పట్టారు. అనేక మందికి ప్లేట్‌లెట్స్ (రక్తకణాలు) తగ్గిపోవడంతో పలువురు, జ్వరాలు, నొప్పులతో మరికొందరు రాజమహేంద్రవరం, అమలాపురం ఆస్పత్రుల్లో చేరారు. మరికొందరు కొత్తపేట, రావులపాలెం ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక ఆర్‌ఎంపీలపై ఆధారపడిన కొందరు ఇళ్ల వద్దే ఫ్లూయిడ్స్ (సెలైన్స్) ఎక్కించుకుంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో బాధితులు ఎక్కువ
మండలంలో మందపల్లి అతి చిన్న గ్రామం. కేవలం 675 సెంట్లు విస్తీర్ణం ఉన్న ఈ గ్రామంలో 1,470 మంది జనాభా. 350 గృహాలు కాగా 405 కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువగా శనేశ్వర ఆలయం వెనుక కాలనీల్లో, జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో జ్వరాలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. గ్రామస్తుడు రావూరి సూర్యచంద్రరావు ఇంటికి వెళ్లగా ఇంటి వరండాలో ఆయన జ్వరంతో బాధపడుతూ సెలైన్ బ్యాడిల్ ఎక్కించుకుంటున్నారు.
ఆస్పత్రి ఖర్చుభరించలేకపోవడంతో అతడికి కుటుంబ సభ్యులు సఫర్యలు చేస్తున్నారు. అతను 10 రోజుల క్రితం జ్వరం వస్తే స్థానిక ఆర్‌ఎంపీతో వైద్యం చేయించుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కొత్తపేటలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా రక్తపరీక్షలు చేసి ప్లేట్‌లెట్స్ 50 వేలకు పడిపోయాయంటూ సెలైన్స్, ఇంజక్షన్లు చేశారు. ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఇంటికి వచ్చి ఆర్‌ఎంపీతో వైద్యం చేయించుకుంటున్నాడు. ఆ ఇంట్లోనే అతని తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు జ్వరం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
మద్దిరాల భూలక్ష్మి అనే మహిళ ప్లేట్‌లెట్స్ 15 వేలకు, కుమారుడు లోకేష్‌కు 30 వేలకు పడిపోగా రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది ఇంటికి వచ్చారు. రావూరి వీరేంద్ర, కుంపట్ల నేతికొండ, నక్కా కనకారావు, అతని భార్య జ్వరాలు, జాయింట్ పెయిన్స్‌తో బాధ పడుతున్నారు. కుంపట్ల కోటేశ్వరరావు, బొండాడ సత్తిబాబు తదితరులు జ్వరాలతో ఉన్నారు. వీరందరూ రెక్కాడితే గాని డొక్కాడని వారే. గ్రామ మాజీ ఉప సర్పంచి గందం తాతాజీకి ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. విషజ్వరాలు ప్రాణాంతకమని పలువురు వైద్యులు హెచ్చరించడంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకుంటున్నామని పలువురు వాపోయారు. ఒక్కక్కరికీ సుమారు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అయినట్టు పలువురు తెలిపారు.
పట్టించుకోని వైద్యాధికారులు
గ్రామంలో జ్వరాల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదని గ్రామంలో పలువురు ఆరోపించారు. గ్రామంలోని ఏఎన్‌ఎం రాజమహేంద్రవరంలో ఉంటారని, 2వ ఏఎన్‌ఎం గంటిలో ఉంటారని.. ఆమె అప్పుడప్పుడూ వస్తారని వారు తెలిపారు. పంచాయతీ అధికారులు కూడా ఈ పరిస్థితిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. పంచాయతీ కార్యాలయం వద్దే పారిశుద్ధ్యం క్షీణించింది. ‘స్వచ్ఛభారత్ – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ఛ గ్రామం’నినాదాల బోర్డులు ఉన్న చోటే పెంటకుప్పలు ఉన్నాయి. మందపల్లి గ్రామంతోపాటు కొత్తపేట శివారు గ్రామం ఏనుగులమహల్‌లో కూడా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు విషజ్వరాలతో బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment