కాండ్రేగుల గ్రామం మెయిన్‌రోడ్డు
కాండ్రేగుల గ్రామాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. రెండోదఫాగా వచ్చిన ఈ జ్వరాలతో గ్రామంలో 40 మంది సతమతమవుతున్నారు. గ్రామంలో మరో డెంగీ కేసు నమోదయింది.
తూర్పుగోదావరి, కాండ్రేగుల (పెదపూడి): గ్రామాన్ని వైరల్ జ్వరాలు వీడకపోవడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు డెంగీ జ్వరాలు కూడా భయపెడుతున్నాయి. గ్రామానికి చెందిన పలువురు డెంగీ జ్వరాలకు చికిత్స పొందుతూ అప్పులపాలవుతున్నారు. గ్రామానికి చెందిన అప్పనపల్లి వీరేష్ అనే యువకుడు డెంగీ జ్వరంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి ప్లేట్‌లెట్స్ 15వేలుకు పడిపోగా వైద్యం చేయడంతో సుమారు 25వేలుకు చేరినట్టు వైద్యులు బుధవారం తెలిపారు. గ్రామంలో వారం రోజుల వ్యవధిలో సుమారు 40 మంది వరకు వైరల్ జ్వరాల బారినపడ్డారు. గ్రామంలో గత నెల 14న రెండు డెంగీ కేసులు నమోదు అయ్యాయి.
వారికి వైద్యం అందించగా వారి ఆరోగ్యం బాగుపడింది. గ్రామంలో వైరల్ జ్వరాలు వ్యాపించి తగ్గి మరల విజృంభించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో జ్వరాలు సోకిన చాలామంది కాకినాడ పరిసర ప్రాంతాలకు వెళ్లి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. వారిలో చాల మందికి ప్లేట్‌లెట్స్ కౌంట్ తక్కువగా ఉండటంతో డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నాయంటూ అత్యవసర వైద్యాలు చేయించుకుంటున్నారు. దీనికి చాలా ఖర్చవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ జ్వరాలు సోకిన వారిలో చాల మంది పేదలే. సంపర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు మాత్రం తగ్గడం లేదు. డెంగీ జ్వరాలతో 25 రోజులుగా తాము అల్లాడుతుంటే పూర్తి స్థాయిలో ఎందుకు నివారించలేకపోయారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ ్య నిర్వహణ సరిగా లేదని, గ్రామంలో పందులు పెంపకాన్ని అధికారులు పట్టించుకోవడంలేదంటూ విమర్శిస్తున్నారు.
ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుని వచ్చినవారు
పేపకాయల సూర్యనారాయణ, నర్ల సూరిబాబు, చిక్కాల ప్రసాద్, చిక్కాల వెంకన్న,పేపకాయల రాము, కొటిపల్లి ఉషారాణి ఇద్దరి కుమార్తెలు రమ్య,పండు కాకినాడలోని ఒక ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి రక్త పరీక్షలు చేయించుకున్నారు. వారి ప్లేట్‌లెట్స్ బాగా తగ్గిపోయాయంటూ వైద్యం చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.40 వేల నుంచి రూ. 50 వేలు ఖర్చు అయిందని బాధితులు చెబుతున్నారు. పేపకాయల గంగాధర్ ఇంట్లో అతని కుమారుడు అజయ్, కుమార్తె భాను, భార్యకు కూడా ఈ జ్వరాలు వ్యాపించాయి. వారు కూడా వైద్యం చేయించున్నారు.
ఆస్పత్రిలో చేరిన వారు
పేపకాయల వీరమణి రెండ్రోజుల క్రితం ఆస్పత్రిలో చేరింది. పేపకాయల సాయిమణి అనే చిన్నారి, నక్కా శేష అనే మహిళ బుధవారం మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లారు. కాగా యడ్ల చంద్రశేఖర్,పేపకాయల చంద్రరావు, గోపిశెట్టి వినయ్ తదితరులు ఇళ్ల వద్దనే వైద్యం చేయించు
కుంటున్నారు.
రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స
మా బంధువు పేపకాయల వీరమణి కాళ్లు చేతులు లాగడం,నీరసం, జ్వరంతో బా ధపడుతోంది. ఆమెను కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తే రక్త పరీక్షలు చేశారు. ప్లేట్‌లెట్స్ తక్కువ ఉన్నాయని వైద్యులు చెప్పారు. ఆమె అక్కడ వైద్యం చేయించుకుంటోంది.–పేపకాయల చక్రవాణి, కాండ్రేగుల
Comments
Please login to add a commentAdd a comment