ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రాజమహేంద్రవరం: కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ పెద్దలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. పెట్టుబడిలేని ఆదాయ వనరుగా ఇసుకను మార్చుకున్న ప్రభుత్వ పెద్దలు తమ స్థాయికి తగ్గట్లు ఇసుక దందా చేస్తున్నారు. ఉచిత ఇసుక, అక్రమాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని బీరాలు పలికే పాలకులే ఇసుక దందా చేస్తూ అనుచరులు, స్థానిక నేతలకు దారిచూపిస్తున్నారు. జిల్లాలో గోదావరి, కోనసీమలోని గోదావరి పాయలు, ఏలేరు కాలువ, తాండవ నదిలో అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్దల హస్తం ఉందని స్పష్టమవుతోంది. ఎవరైనా మండల స్థాయిలో రెవెన్యూ, పోలీసు అధికారులు లారీలను పట్టుకున్నా, జరిమానా వేసినా అధికారపార్టీ నేతలు హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ప్రభుత్వ పెద్దలే ఇసుక దందా చేస్తుంటే వారి అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు.
‘పెద్దల’ దందా ఇలా...
సీతానగరం మండలం కాటవరం పంపింగ్ స్కీము ఇసుక మేటల వల్ల నిర్వహణలో లేదు. దాన్ని పునరుద్ధరించేందుకు మూడేళ్ల కిత్రం ఇసుక ర్యాంపునుకు అనుమతి మంజూరు చేశారు. తిలక్ అనే వ్యక్తి మేట వేసిన ఇసుక తీయడానికి సరిహద్దులు గీసినా వాటిని వదలి పక్కన నాణ్యమైన ఇసుకను విశాఖకు తరలించుకుపోయారు. ఇలా రెండేళ్లలో దాదాపు రూ.50 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించుకుపోయినా పంపింగ్ స్కీము పునరుద్ధరణ జరగలేదు. ఈ ఏడాది రూటు మార్చిన ప్రభుత్వ పెద్దలు ఆదే వ్యక్తికి చెందిన కంపెనీకి పోలవరం ఎడమ కాలవ ఐదో ప్యాకేజీ పనుల కోసం ఇసుక తరలించేందుకంటూ ప్రత్యేకంగా అనుమతులు జారీ చేశారు. ఎంతమేర తవ్వకాలు ఎక్కడ జరగాలన్నది స్థానిక రెవెన్యూ అధికారులు సరిహద్దులు ఏర్పాటు చేశారు. అయినా వాటిని విస్మరించి ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీకి (ఎన్‌సీసీ) మయూరి, పీఎస్‌కేఎస్ కంపెనీల గత ఏడాది నవంబర్ నుంచి ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయి. నదిలోని ఇసుకను ట్రాక్టర్ల ద్వారా గట్టున పోసి అక్కడ నుంచి ఐదు యూనిట్లమేర లారీల్లో నింపి తరలించాయి. ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించుకుపోయాయి. తుని వద్ద పోలవరం ఎడమ కాలువ పనులకు కావాల్సిన ఇసుక నవంబర్ నాటికే అవసరానికి మించి ఉంది. కానీ ఆ పనుల పేరుతో పెద్దలు అధికారులతో తిలక్ అనే వ్యక్తికి అనుమతులు ఇప్పించారు. ఆ పనుల పేరుతో సదరు వ్యక్తి విశాఖకు ఇసుకను తరలిస్తున్నారు.
రూ.150 కోట్లు కొల్లగొట్టారు
రాష్ట్రంలోనే గోదావరి తీర ప్రాంతంలో సీతానగరం మండలంలో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. అందుకే ఇక్కడ ఇసుకకు భలే గిరాకి ఉంటోంది. యూనిట్ ఇసుక ర్యాంపులోనే రూ.రెండు వేలు పలుకుతోంది. ఒకటిన్నర క్యూబిక్ మీటర్ ఇసుక ఒక యూనిట్‌తో సమానం. ఇలా లెక్కన దాదాపు 1.50 లక్షల యూనిట్ల ఇసుక కాటవరం నుంచి తరలించుకుపోయారు. ర్యాంపులోనే ఈ ఇసుక విలువ యూనిట్ రెండు వేలు చొప్పున తరలించుకుపోయిన ఇసుక విలువ రూ.30 కోట్లు ఉంది. విశాఖలో డిమాండ్‌ను బట్టి రెట్టింపు ధర, రవాణా ఛార్జీలు కలిపి ఐదు యూనిట్ల ఇసుక లారీ రూ.40 వేల చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా దాదాపు రూ.150 కోట్లు సీతానగరం కాటవరం ర్యాంపు నుంచి పోలవరం ఎడమ కాలవు పనుల పేరుతో ఇసుక తరలించి జేబులు నింపుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధికి ఇందులో చిల్లరే వస్తుందని, అసలు అంతా పెద్దల కనుసన్నల్లో నడుస్తోందని ఆ పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాటవరంలోలా జిల్లాలో మరో ర్యాంపు నుంచి పోలవరం పనుల పేరుతో ఇసుక తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment