most influential people list
-
టైమ్ 100 అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్షా
న్యూఢిల్లీ: ‘పఠాన్’సినిమాతో మాంచి ఊపుమీదున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(57)కు ఓ అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజీన్ 2023 సంవత్సరానికి నిర్వహించిన ప్రభావశీల వ్యక్తుల జాబితా 100లో అత్యధిక ఓట్లతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ, ప్రిన్స్ హ్యారీ–మేఘన్ దంపతులు, ఆస్కార్ విజేత మిచెల్ యియోహ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు మించి ఆయనకు ఓట్లు పడ్డాయని టైమ్ మ్యాగజీన్ తెలిపింది. ఈ ఏడాది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అర్హులుగా ఎవరుండాలని అను కుంటున్నారన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పందించారని పేర్కొంది. మొత్తం 12 లక్షల ఓట్లలో ‘పఠాన్’స్టార్‌కు 4%పైగా ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఈ నెల 13న తమ ఎడిటర్స్ టాప్100 జాబితాపై అభిప్రాయాలను వెల్లడించాక అంతిమ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత లీడ్ రోల్లో షారుఖ్ నటించిన పఠాన్ సినిమా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్టయ్యింది. ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. టాప్ 100 రెండో స్థానంలో కఠిన ఇస్లామిక్ పాలన నుంచి స్వే చ్ఛ కావాలని ఉద్యమిస్తున్న ఇరాన్ మహిళలకు 3 శాతం ఓట్లు పోలయ్యాయి. టైమ్ 2022 జాబితాలోనూ హీరోస్ ఆఫ్ ది ఇయర్‌ను ఇరాన్ మహిళలే గెలుచుకోవడం గమనార్హం. ఆ తర్వాత బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు 1.9% ఓట్లతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనాకు చారిత్రక విజయం సాధించి పెట్టిన లియోనల్ మెస్సీ 1.8% ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ప్రముఖుల్లో ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటి విజేత యియోహ్, టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్, జుకర్‌బర్గ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ఉన్నారని టైమ్ మేగజీన్ తెలిపింది. -
హోడ ఖామోష్..: అఫ్గాన్ అగ్నితేజం
టైమ్ మ్యాగజైన్ ప్రభావశీలుర జాబితా (100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2022)లో చోటు సంపాదించిన వారిలో అఫ్గానిస్థాన్ అగ్నితేజం హోడ ఖామోష్ ఒకరు. ‘ఖామోష్’ అనేది పేరు కాదు. లక్షల గొంతుల రణనినాదం... ఇరాన్లో జన్మించింది హోడ ఖామోష్. తాను చిన్న వయసులో ఉన్నప్పుడే కుటుంబంతో పాటు అఫ్గానిస్థాన్‌కు వచ్చింది. ఆరోజుల్లో తనకు నిద్ర పట్టాలంటే అమ్మ తప్పనిసరిగా ఏదో ఒక కథ చెప్పాల్సిందే. అలా ఖామోష్ కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించింది. ఆ ప్రపంచంలో ఎన్నో కథలు చదివింది. ఎన్నో కవిత్వాలు విన్నది. తొలిరోజుల్లో తన కాల్పనిక ప్రపంచంలో వాస్తవాలతో సంబంధం లేని ఊహాకల్పిత సాహిత్యం మాత్రమే ఉండేది. ఆ తరువాత కాలంలో మాత్రం...తన ప్రపంచంలోకి వాస్తవికత నడిచి వచ్చింది. రాజులు, రాణులు, అందమైన కోటలు, అద్భుత దీపాల స్థానంలో... నిజమైన సమాజం దర్శనమిచ్చింది. మనుషులు ఎదుర్కొనే రకరకాల సమస్యలను గురించి లోతుగా తెలుసుకోగలిగింది. తన మనసులోని వేడివేడి భావాలను కవిత్వంగా రాసేది. ‘సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమాజం తరఫున పనిచేయడానికి ఇది మాత్రమే చాలదు’ అనుకొని జర్నలిస్ట్ కావాలనుకుంది. ఖామోష్ ఆలోచనను హర్షించిన వారు తక్కువ. భయపెట్టిన వారు ఎక్కువ. అయితే అవేమీ తన కలను అడ్డుకోలేకపోయాయి. జర్నలిజంలో శిక్షణ పొందిన ఖామోష్ ఆ తరువాత స్థానిక పత్రికలలో పనిచేసింది. స్త్రీల హక్కులు, ఉద్యమాలపై ప్రత్యేకకథనాలు రాసింది. లోకల్ రేడియో ఛానల్స్ ప్రెజెంటర్‌గా తన గొంతు వినిపించింది. ఇదంతా ఒక ఎత్తయితే పౌరహక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం మరో ఎత్తు. ఉద్యమంలో భాగంగా ఎందరో మహిళలకు అండగా నిలిచింది. దాడులను ఎదుర్కొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు మడమ తిప్పలేదు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన మళ్లీ మొదలైన తరువాత చాలామంది కలాలు అటకెక్కాయి. గొంతులు మాట మార్చుకున్నాయి. కానీ ఖామోష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అవే అక్షరాలు...అదే గొంతు! తాలిబన్ల పాలన మొదలై అప్పటికే అయిదు నెలల దాటింది. ఆ సమయంలో ‘స్త్రీలపై జరుగుతున్న అణచివేత’ అనే అంశంపై నార్వేలో మాట్లాడే అవకాశం లభించింది. ‘ఈ సమయంలో మాట్లాడితే ప్రాణాలకే ముప్పు’ అని చాలామంది హెచ్చరించినా ఆమె భయపడలేదు. ‘నేను తప్పు చేయడం లేదు. తప్పుల గురించి మాట్లాడబోతున్నాను’ అంటూ నార్వేకి వెళ్లింది ఖామోష్. నీళ్లు నమలకుండా నిజాలు మాట్లాడింది. ఆనాటి ఆమె ప్రసంగంలో కొన్ని మాటలు... ‘నా పేరు హోడ ఖామోష్. అఫ్గానిస్థాన్‌లోని వేలాది మంది మహిళలలో నేను ఒకరిని. నేను ఏ రాజకీయపార్టీకి సానుభూతిపరురాలిని కాదు. సభ్యురాలిని కాదు. పౌరహక్కుల ఉద్యమంలో పనిచేస్తున్నాను. తాలిబన్ల పాలనలో ఉన్నాను. భయంతో గుండె వేగంగా కొట్టుకునే చోట, బుల్లెట్ల చప్పుడు నిరంతరాయంగా వినిపించే చోట ఉన్నాను’ ‘కాబుల్ తాలిబన్ల వశం అయిన తరువాత రాజ్యం పోలీసు రాజ్యం అయింది. స్త్రీలపై వివక్షత పెరిగింది. మీరు ఉండాల్సింది విద్యాలయాల్లో కాదు ఇంట్లో...అంటూ అణచివేత మొదలైంది. ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పాపానికి ముర్తాజ సమది అనే ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. కాబుల్‌లో స్త్రీల నిరసన ప్రదర్శనకు సంబంధించిన వార్తలు రాసినందుకు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తమ హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న 70 మంది పౌరులను అరెస్ట్ చేశారు. వారిలో 40 మంది మహిళలను గుర్తుతెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురిచేశారు’ నార్వే సదస్సులో అఫ్గాన్ కన్నీటి చిత్రాన్ని కళ్లకు కట్టిన ఖామోష్ ‘ఇక అంతా అయిపోయింది’ అని నిరాశ పడడం లేదు. ‘స్త్రీలను గౌరవించే రోజులు, స్త్రీల హక్కులు రక్షించబడే రోజులు తప్పకుండా వస్తాయి’ అంటున్న ఖామోష్లో ‘ఆశ’ అనే జ్వాల ఉజ్వలంగా వెలుగుతూనే ఉంది. -
'టైమ్స్' లిస్టులో సత్య నాదెళ్ల
న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అత్యంత ప్రభావశీరుల జాబితాలో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీరుల పేర్లతో ప్రఖ్యాత 'టైమ్స్' మేగజీన్ రూపొందించిన ఈ జాబితాలో రూపొందించింది. ప్రపంచ నాయకులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర రంగాలకు చెందిన 127 మంది పేర్లను జాబితాలో చేర్చింది. వీరిలో 100 మంది పేర్లతో అత్యంత శక్తిమంతుల జాబితాను వచ్చే నెలలో విడుదల చేయనుంది. పాఠకుల ఓట్లు ఆధారంగా ఈ లిస్టు తయారుచేయనుంది. ప్రధాని మోదీ గతేడాది కూడా ఈ జాబితాలో ఉన్నారు. మహిళల టెన్నిస్ లో డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకు సాధించిన సానియా స్వదేశంలో క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచారని 'టైమ్స్' కొనియాడింది. 'క్వాంటికో' నటించడం ద్వారా ప్రియాంకా చోప్రా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించారని ప్రశంసించింది. సత్య నాదెళ్ల విండోస్ 10ను విజయవంతంగా ప్రవేశపెట్టారని, ఆయన సారథ్యంలో క్లౌడ్ టెక్నాలజీ బిజినెస్ ఊపంచుకుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టనున్న హొలోలెన్స్ వంటి సరికొత్త టెక్నాలజీ కోసం ఐటీ ఇండస్ట్రీ ఎనలిస్టులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టైమ్స్ వెల్లడించింది. ఆండ్రాయిడ్, యూట్యూబ్ తో విదేశాల్లో కోర్ బిజినెస్ ను సుందర్ పిచాయ్ పెంచారని కితాబిచ్చింది. గూగుల్ సహవ్యవస్థాపకుడు లారీ పేజ్, ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్, సింగర్ రిహన్న, జమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్, హ్యారీ పోర్టర్ రచయిత్రి జేకే రౌలింగ్, అంగ్ సాన్ సూకీ, ఏంజెలా మోర్కల్, వ్లాదిమిర్ పుతిన్, పోప్ ఫ్రాన్సిస్, భారత సంతతి నటుడు అజీజ్ అన్సారీ తదితరులు 'టైమ్స్' లిస్టులో ఉన్నారు.