టైమ్‌ 100 అగ్రస్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా | Film Star Shah Rukh Khan Wins the 2023 TIME100 Reader Poll | Sakshi
Sakshi News home page

టైమ్‌ 100 అగ్రస్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా

Published Sat, Apr 8 2023 5:02 AM | Last Updated on Sat, Apr 8 2023 5:02 AM

Film Star Shah Rukh Khan Wins the 2023 TIME100 Reader Poll - Sakshi

న్యూఢిల్లీ: ‘పఠాన్‌’సినిమాతో మాంచి ఊపుమీదున్న బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌(57)కు ఓ అరుదైన గౌరవం దక్కింది. టైమ్‌ మ్యాగజీన్‌ 2023 సంవత్సరానికి నిర్వహించిన ప్రభావశీల వ్యక్తుల జాబితా 100లో అత్యధిక ఓట్లతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియోనల్‌ మెస్సీ, ప్రిన్స్‌ హ్యారీ–మేఘన్‌ దంపతులు, ఆస్కార్‌ విజేత మిచెల్‌ యియోహ్, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌లకు మించి ఆయనకు ఓట్లు పడ్డాయని టైమ్‌ మ్యాగజీన్‌ తెలిపింది.

ఈ ఏడాది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అర్హులుగా ఎవరుండాలని అను కుంటున్నారన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పందించారని పేర్కొంది. మొత్తం 12 లక్షల ఓట్లలో ‘పఠాన్‌’స్టార్‌కు 4%పైగా ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఈ నెల 13న తమ ఎడిటర్స్‌ టాప్‌100 జాబితాపై అభిప్రాయాలను వెల్లడించాక అంతిమ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత లీడ్‌ రోల్‌లో షారుఖ్‌ నటించిన పఠాన్‌ సినిమా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్టయ్యింది. ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. టాప్‌ 100 రెండో స్థానంలో కఠిన ఇస్లామిక్‌ పాలన నుంచి స్వే చ్ఛ కావాలని ఉద్యమిస్తున్న ఇరాన్‌ మహిళలకు 3 శాతం ఓట్లు పోలయ్యాయి.

టైమ్‌ 2022 జాబితాలోనూ హీరోస్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను ఇరాన్‌ మహిళలే గెలుచుకోవడం గమనార్హం. ఆ తర్వాత బ్రిటన్‌ ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ దంపతులు 1.9% ఓట్లతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనాకు చారిత్రక విజయం సాధించి పెట్టిన లియోనల్‌ మెస్సీ 1.8% ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ప్రముఖుల్లో ఈ ఏడాది ఆస్కార్‌ ఉత్తమ నటి విజేత యియోహ్, టెన్నిస్‌ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్, జుకర్‌బర్గ్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డ సిల్వా ఉన్నారని టైమ్‌ మేగజీన్‌ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement