భారతీయ భాషా జర్నలిజానికి రాజా రామమోహన్ రాయ్ (మే 22, 1772–సెప్టెంబర్ 27,1833) ఆద్యుడని అంటారు నెహ్రూ. ఆధునిక యుగపు ప్రాధాన్యం గురించి ఆనాడే∙ఆలోచించగలిగిన ఏకైక వ్యక్తి రాయ్ అని రవీంద్రనాథ్ టాగూర్ శ్లాఘించారు. రాయ్ ఏకేశ్వరోపాసనను ప్రగాఢంగా నమ్మారు. మాతృభాష బెంగాల్‌తో పాటు, పర్షియన్, అరబిక్, సంస్కృతం, లాటిన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలను నేర్చారు. సతీసహగమనాన్ని వ్యతిరేకించడంతో రాయ్ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైనాడు. టిబెట్ వెళ్లి బౌద్ధాన్ని ఆచరించదలిచాడు. కానీ అక్కడ కూడా లామా ను ఆరాధించడం నచ్చలేదు.
బెంగాల్ సివిల్ సర్వీస్‌లో దివాన్‌గా 1815లో పదవీ విరమణ చేసిన రాయ్ సతీ సహగమనం నిషేధం, పత్రికా స్వేచ్ఛలే లక్ష్యంగా కృషి చేశారు. ఇందుకోసమే జర్నలిస్ట్ అయ్యారు. మొదట ‘సంబాద్ కౌముది (1821) అనే వార పత్రికను స్థాపించారు. దేశంలో సామాజిక, రాజకీయ అంశాలపై నిర్దిష్ట ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించిన తొలి పత్రిక ఇదే. దీనితో మతపరమైన చర్చలకు శ్రీకారం చుట్టారాయన. క్రైస్తవ మిషనరీలు నిర్వహించే ‘సమాచార దర్పణ్’ హిందూ మతాన్ని విమర్శించేది. వీటిని ఖండించడంలో సంబాద్ కౌముది కీలకంగా ఉండేది. తరువాత సతీ సహగమనం దురాచారం, మత సంస్కరణల ప్రచారానికి రాయ్ ‘మిరాతుల్ అక్బర్’ (పర్షియన్) వారపత్రికను ఆరంభించారు. ఇది సంప్రదాయ హిందూ సమాజాన్ని కలవర పెట్టింది.
భారతీయ సమాజాన్ని సంస్కరించేందుకు ఉద్దేశించిన రాతలే అయినా, అవి తమ ఉనికికి భంగం వాటిల్ల చేసేవిగా ఉన్నాయని ఈస్టిండియా కంపెనీ భావించింది. ఫలితమే 1823 నాటి ప్రెస్ లైసెన్సింగ్ చట్టం. దీని ప్రకారం పత్రిక ఏదైనా ప్రచురణకు గవర్నర్ జనరల్ అనుమతి అనివార్యం. అలాగే ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకునే అధికారం కూడా ఉండేది. అంటే సెన్సార్ షిప్. ఇందుకు నిరసనగా రాయ్ ‘మిరాతుల్ అక్బర్’ ప్రచురణను నిలిపివేశారు. ప్రెస్ రెగ్యులేషన్ చట్టం మీద సుప్రీం కోర్టుకు కూడా విన్నవించారాయన. కానీ ఆ కోర్టు ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది. రాయ్ లండన్‌లోని కింగ్ ఇన్ కౌన్సిల్‌కు విన్నవించారు. హిందూ వేదాంతం మీద దాడి చేయడమే కాకుండా, దానిని ఖండిస్తూ రాయ్ ఇచ్చిన వివరణలను ప్రచురించడానికి సమాచార దర్పణ్ నిరాకరించేది. దీనితో రాయ్ ‘బ్రాహ్మనికల్ మ్యాగజైన్’ను ఇంగ్లిష్, బెంగాలీ భాషలలో ఆరంభించారు.
సతీసహగమనం వంటి దురాచారాన్ని చూసి కదలి పోయిన రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. వదినగారి సహగమనాన్ని చూసి ఆయన చలించి పోయారు. ఒక్క 1818లోనే 544 మంది సజీవ దహనం చేశారు. ఈ అంశం మీద ఆయన పోరాటం విజయవంతమైంది. మొగల్ పాదుషా రెండవ అక్బర్ భరణం గురించి విన్నవించడానికి ఇంగ్లండ్ వెళ్లిన రాయ్ అక్కడే మరణిం చారు. భరతమాత గర్వించే ముద్దుబిడ్డ రాయ్.
డాక్టర్ సీవీ నరసింహారెడ్డి
మొబైల్ : 92465 48901