పౌర సంబంధాలే చుక్కాని
సందర్భం
ఒకనాడు నిరంతర కరువులు, ఆకలి చావులకు పేరుపొందిన మన దేశం ఈరోజు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే క్రమంలో ప్రజా సంబంధాల పాత్ర మరువలేనిది.
ప్రపంచ ప్రజా సంబంధాలకు భారతదేశమే పుట్టినిల్లు అని కమ్యూనికేషన్స్ నిపుణులు ఘోషించారు. 2,500 ఏళ్ళ కిందట, ఆధునిక అమెరికా రూపుదిద్దుకోని నాడు, అసలు కమ్యూనికేషన్ అనే మాటే పుట్టని నాడు, బౌద్ధాన్ని ప్రచారం చేయడానికి ఈ భావన పుట్టింది. బౌద్ధంలో అత్యంత ప్రధానమైన ప్రేమ, శాంతి, అహింసపై బుద్ధుని బోధనలను ప్రజలకు ప్రచారం చేయడం కోసం ఇది ఆవి ర్భవించింది. రాజ లాంఛనాలన్నింటినీ తృణప్రా యంగా త్యజించిన గౌతమబుద్ధుని కమ్యూనికేషన్ విధానాలు ఆయనను యావత్ ఆసియా ఖండానికే ప్రజా సంబంధాల కాంతిపుంజంగా, నేటి ప్రజా పౌర సంబంధాలకు ఆద్యునిగా నిలబెట్టాయి.
బ్రిటిష్ వారినుంచి స్వాతంత్య్రం సాధించేం దుకు జాతిపిత మహాత్మాగాంధీ ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు ప్రజా సంబంధాల కమ్యూనికేషన్ విధానాలను సంపూర్ణంగా వినియోగించారు. స్వాతంత్య్రాన్ని సాధించారు. స్వాతంత్య్రానంతరం ఆర్థిక పేదరికాన్ని రూపు మాపటంలో సమాచార దారిద్య్రాన్ని రూపుమాపడం ప్రధానమనే సూత్రాన్ని అమలు చేయాలని నెహ్రూ అభిప్రాయపడ్డారు.
1991 నూతన పారిశ్రామిక విధానం దరిమిలా అమల్లోకి వచ్చిన ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రజా సంబంధాల రంగంలో కూడా పెనుమార్పులు ప్రవేశపెట్టాయి. దాంతో మన ప్రజా సంబంధాలు కూడా గ్లోబల్ పబ్లిక్ రిలేషన్స్ స్థాయికి చేరాయి. మన దేశంలో ఈనాడు ప్రజా సంబంధాల రంగం సుమారు రూ.10 వేల కోట్లకు పడగలెత్తిన పరిశ్రమ. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఎన్జీవోల్లో కలిపి దాదాపుగా లక్షమంది ప్రజా సంబంధాల వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు. అంతేగాక వివిధ శాఖల్లో దాదాపు 30 లక్షల మంది పబ్లిక్ కమ్యూనికేటర్లు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. వీరే ప్రజారోగ్య రంగంలో వివిధ హోదాల్లో 9 లక్షల మంది ఆశా వర్కర్లుగా సమాచార సేవలందిస్తున్నారు.
ఇన్ని ఉన్నా మన దేశ ప్రజా సంబంధాల వృత్తి, నైపుణ్యపరంగా చూస్తే మన స్థాయి ఏమిటి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోను, పీఆర్ కంపెనీల్లోనూ నైపుణ్యం విషయంలో ప్రపంచంలో ఎవరికీ తీసిపోనివారు ఒకవైపు, అదే సమయంలో తగిన ప్రజా సంబంధాల విద్య, శిక్షణ లేనివారు ఇంకోవైపు. నిపుణులు, నైపుణ్యం కొరవడటం కలగలిసిన పీఆర్ వ్యవస్థ మనది. సంఖ్యాపరంగా భారీగా ఉన్నా, నైపుణ్యపరంగా వెనుకబడి ఉన్నాం. ఒక వ్యూహాత్మక మేనేజ్మెంట్ విభాగంగా పీఆర్ వృత్తి, నైపుణ్య సాధనతో మాత్రమే ముందుకు వెళ్లగలుగుతుంది.
అలాగే నిరంతర కరువులు, ఆకలి చావులకు పేరొందిన భారత్ ఈరోజు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందే క్రమంలో ప్రజా సంబంధాల పాత్ర మరువలేనిది. మన దేశం అంతర్జాతీయంగా బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక నిస్సందేహంగా ఈ రంగం పాత్ర ఉంది. కేవలం మీడియా సంబంధాలకే మనం పరిమితమవుతున్నాం. ప్రజా సంబంధాల నిపుణులకు వృత్తిపరమైన విద్య ఉండటం లేదు, శిక్షణా లేదు. పీఆర్ కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజలపై అవి చూపే ప్రభావాన్ని అంచనా వేసే వ్యవస్థ లేదు. ప్రజల నాడిని పసిగట్టే పనులు చేయడం లేదు. పైగా మనం పీఆర్‌ను తగిన విధంగా గుర్తించడం లేదు. మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్, జర్నలిజం, హెచ్ఆర్లకు ప్రత్యేకంగా ఉన్నట్లుగా పీఆర్‌కు ప్రత్యేకమైన గుర్తింపు లేదు.
21వ శతాబ్దపు అవసరాలను, అవకాశాలను గుర్తించి ప్రజా సంబంధాల రంగంలో సమూలమైన మార్పులను ప్రవేశపెట్టాలంటే ఇప్పటివరకు అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులను విడనాడాలి. కొత్త సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, గ్లోబల్ ఇంటర్నెట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న సాఫ్ట్వేర్ అభి వృద్ధి, వ్యక్తులకు–వ్యక్తులకు మధ్య, సంస్థలకు మధ్య, శీఘ్ర అనుసంధానంగా ఉన్న సోషల్ మీడి యాను ఉపయోగించుకోవాలి. ప్రజల అభిరుచులు, వారు ఆధారపడుతున్న సమాచార సాధనాలు మారిన నేటి యుగంలో, ఇప్పటివరకు వాడుతున్న ప్రెస్ రిలీజ్, ఆర్టికల్స్ తదితర పీఆర్ టూల్స్‌కు ప్రాధాన్యం తగ్గింది. పీఆర్ 2.0 మోడల్ పీఆర్ ప్రొఫెషన్ దృష్ట్యా, పాత విధానాలను పునర్వ్యవస్థీకరించాలి.
పీఆర్ 2.0 ఫ్రేజ్‌ను బ్రియాన్ సోలిస్ 1990ల్లోనే కనిపెట్టినా, దీన్ని ఇటీవలి కాలంలోనే అమల్లో పెడుతున్నారు. ఇది నూతనమైన ఇంటర్నెట్ విధానంతో ముడిపడింది. సంప్రదాయంగా ఉన్న పద్ధతికి పూర్తి భిన్నంగా సంస్థకు సంబంధించిన ప్రజలతో నేరుగా సంబంధాల్ని కొనసాగించే సరికొత్త పరికరాల విని యోగంతో కూడుకున్నది. అత్యంత సులభంగా, వేగంగా, ఎంతమందినైనా నిరంతరం చేరుతూ తనం తతానుగా సాగిపోయే సాఫ్ట్వేర్, డిజైన్‌వేర్ పీఆర్ 2.0. తమ కస్టమర్లు కాబోయేవారిని, బిజినెస్ పార్ట్నర్లుగా, ప్రమోటర్లుగా ఉండబోయే వారిని నిత్యం కలుసుకుంటూ ఉండేలా చేస్తుంది ఈ వ్యవస్థ.
పాత పద్ధతుల్లో గతంలో సాగిన సెంట్రలైజ్డ్ వెబ్‌సైట్స్‌ను విడనాడి అసాధారణమైన స్వేచ్ఛతో అందరినీ చేరేందుకు కావలసిన అపరిమితమైన శక్తినిచ్చే విధానమిది. దీనివల్ల వెబ్ 2.0 కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించింది. పీఆర్ 2.0 మోడల్లోనూ బ్లాగులు, ఈమెయిళ్లు, సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా సౌకర్యాలున్నాయి. వాటి సహా యంతో అన్నిరకాలైన స్టేక్ హోల్డర్లతో వ్యక్తిగతంగా, సమర్థవంతంగా సంబంధాలు నెరవేరవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో 2020 నాటికి వంద కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులుంటారు. కాబట్టి పీఆర్ 2.0కు మన దేశంలో ఉజ్వలమైన భవి ష్యత్తు ఉంది.
(ఏప్రిల్ 21న 31వ జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం సందర్భంగా)
డా. సీవీ నరసింహారెడ్డి
వ్యాసకర్త సమాచార–ప్రజాసంబంధాల శాఖ పూర్వ సంచాలకులు
మొబైల్: 92465 48901