సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు ప్రమాదకరం. ప్రతిపక్షాలు విధానపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అధికారం కోసం అమాయకులను రెచ్చగొట్టడం సమంజసం కాదు. అసమర్థుల ఆఖరి అస్త్రమే హింస. పుంగనూరు, అంగళ్లు ఘటనలను నివారించాల్సిన చంద్రబాబు.. ఆయనే కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించడం హేయమైన చర్య. రాజ్యాధికారాన్ని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి బహిష్కరించాలి.
తనపై పోలీసులు కేసు నమోదు చేస్తే స్పందించిన చంద్రబాబు.. దాడుల్లో గాయపడిన పోలీసులకు సంఘీభావం తెలియజేయకపోవడం ఆయన నీచత్వానికి పరాకాష్ట. అదేవిధంగా కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ ఏకపక్షంగా వార్తలు రాస్తూ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయి. అల్లరిమూకల దాడిలో కన్ను పోగొట్టుకున్న కానిస్టేబుల్, గాయపడిన 30 మంది పోలీసుల గురించి ఒక్కమాట కూడా రాయకపోవడం సిగ్గుచేటు.
ఇదేమి జర్నలిజం..’ అని వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్‌లో హింసా రాజకీయాలు–కట్టడి–మీడియా పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు హింసా రాజకీయాలపై ప్రజలకు వాస్తవాలను తెలిపేలా ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..
అనిశ్చితిని పెంచే కుట్ర
ఎన్నికలు సమీపిస్తుండటంతో హింసా ధోరణిని పెంచి ప్రజల్లో అనిశ్చితిని సృష్టిస్తున్నారు. దానిని తిరిగి పాలకపక్షంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హింసను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని ఒక వర్గం మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో కార్యకర్తలు చావులకు సిద్ధపడి రావాలని పిలుపునివ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. లోకేశ్ సైతం ఎక్కువ కేసులు ఉన్నవారికి పదవులు కట్టబెడతామని చెప్పడం హింసా రాజకీయానికి నిదర్శనం కాదా!. ప్రజలు ఇవన్నీ గుర్తించాలి. హింసను ప్రోత్సహించేవారికి బుద్ధి చెప్పాలి. – మేడపాటి వెంకట్, ఏపీ ఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు
రూట్ మ్యాప్‌ను ఎందుకు మార్చారు?
చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తన పర్యటన రూట్ మ్యాప్‌ను పుంగనూరు ఊరిలోకి మార్పు చేసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, అప్పుడు తమ కార్యకర్తలు చనిపోతే సానుభూతి పొందవచ్చని పథకం రచించారు. సభకు వచ్చేటప్పుడు వ్యాన్లలో రాడ్లు, తుపాకులు తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. కానీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. – చెన్నంశెట్టి చక్రపాణి, మాజీ పోలీసుల అధికారి
దిగజారిన ప్రతిపక్షాలు
నాలుగేళ్లుగా ప్రభుత్వంపై దాడి జరుగుతూనే ఉంది. ప్రతిపక్షాలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. బాధితులను పట్టించుకోకుండా దాడులకు పురిగొల్పిన వారిని కొన్ని పత్రికలు, చానళ్లు వెనకేసుకురావడం క్రూరమైన చర్య. మేనిఫెస్టోను అమలు చేయని ప్రభుత్వాలను రీకాల్ చేయాలి. అప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు నిలవలేరు. – చలాది పూర్ణచంద్రరావు, ఏపీ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు
పవన్.. బలిదానాలు ఎందుకు?
ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇది నచ్చకనే చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేశ్.. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆత్మబలిదానాలకు సిద్ధం కావాలని జనసేన కార్యకర్తలకు చెబుతున్నారు. ఎవరి ఆత్మను ఎవరు బలి తీసుకుంటారు. ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకులుగా ప్రజల మేలుకోరే సూచనలను చేశారా?. – సునీత, మూరుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు
చంద్రబాబుపై సివిల్ వార్ తప్పదు
హింసను ప్రేరేపిస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబుపై పోలీసులే తిరగబడే రోజు వస్తుంది. ఇకపై సివిల్ వార్ ప్రారంభమవుతుంది. అప్పుడు బయటకు రావాలంటేనే బాబు భయపడక తప్పదు. చంద్రబాబు తనను ప్రశ్నించిన వ్యక్తి రక్తం చూస్తాడు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది.
– మాదిగాని గురునాథం, ఎస్‌డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రతిపక్షాల తీవ్రవాద రాజకీయం
ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిస్థితులు కనిపించలేదు. అధికారం కోసం అర్రులు చాస్తూ.. హింసాత్మక ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాలు తీవ్రవాద రాజకీయాలు చేస్తున్నాయి. పుంగనూరులో పోలీసులపై దాడి గురించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఇందులో ఆరు సెక్షన్ల ప్రకారం చంద్రబాబు నేరాలకు పాల్పడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అరాచక తీవ్రవాద రాజకీయాలను మొగ్గలోనే తుంచాలి. –వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
బాబు, పవన్ చీడపురుగులు
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు పెంచాలని సీఎం జగన్ చూస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం జనం చావులను కోరుకుంటున్నాయి. చంద్రబాబు చేసే ప్రతి పనిలోనూ హింస దాగుంటుంది. కార్యకర్తలు చనిపోతే వారి శవాలపై నుంచి వచ్చి అధికారం పొందాలని ప్లాన్ వేశారు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ గుంటూరు కన్వినర్
రక్తపాతాన్ని కోరుకుంటున్న బాబు
చంద్రబాబు ఓ ఘోరీ, ఓ గజినీ మహ్మద్ మాదిరిగా రక్తపాతాన్ని కోరుకుంటున్నారు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నారు. విధి నిర్వహణలో మహిళా సీఐ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొడితే వీరంగం చేసిన వికృత రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్.. ఇంతమంది పోలీసులకు గాయాలైతే ఎందుకు నోరు మెదపడంలేదు. అధికారాన్ని ప్రజల మనసుల ద్వారా గెలుచుకోవాలి. – విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు
కన్నుపోయిన కానిస్టేబుల్‌పైసానుభూతి చూపరా..?
రాష్ట్రంలో హింసా రాజకీయం పేట్రేగుతోంది. దీనిపై మేధావులు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు ప్రజలను అప్రమత్తం చేయాలి. అసలు హింసకు పాల్పడినవారెవరో, బాధితులెవరో అందరికీ తెలిసినా కొన్ని పత్రికలు, చానళ్లు పోలీసులదే తప్పని వక్రీకరించి వార్తలు రాయడం, ప్రసారం చేయడం సిగ్గుచేటు. కన్ను కోల్పోయిన కానిస్టేబుల్‌పై కనీస సానుభూతి చూపని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పుంగనూరు, అంగళ్లులో పోలీసులు దెబ్బలు తిని ప్రజల ప్రాణాలు కాపాడారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment