వ్యాలీ పులికి.. పులిట్జర్‌! | Kashmiri photojournalist Sanna Irshad Mattoo wins Pulitzer Prize | Sakshi
Sakshi News home page

వ్యాలీ పులికి.. పులిట్జర్‌!

Published Wed, May 11 2022 12:32 AM | Last Updated on Wed, May 11 2022 12:32 AM

Kashmiri photojournalist Sanna Irshad Mattoo wins Pulitzer Prize - Sakshi

కశ్మీర్‌ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ  ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్‌ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్‌ మట్టూ.   తాజాగా ప్రకటించిన పులిట్జర్‌ అవార్డుల లిస్టులో ఫీచర్‌ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్‌ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్‌ అబిది, సనా ఇర్షాద్‌ మట్టూ, అమిత్‌ దావేలను ఈ అవార్డు వరించింది.

శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసింది. చదువయ్యాక కశ్మీర్‌ మీద డాక్యుమెంటరీలు, విజువల్‌ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్‌లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది.

సనా ఆర్టికల్స్‌ బావుండడంతో.. ఆల్‌జజీరా, ద నేషన్, టైమ్‌ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్‌ టుడే, సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు, కర్వాన్‌ మ్యాగజీన్‌ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది.

క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్‌ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్‌ సోషల్‌ జస్టి్టస్‌ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది.  

కాలేజీ రోజుల నుంచే..
యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్‌లో స్పెషలైజేషన్‌ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్‌ టౌన్‌’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్‌ డిగ్గర్‌’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్‌ సమయంలో కశ్మీర్‌ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్‌లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్‌ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్‌ ఫీచర్‌ విభాగంలో పులిట్జర్‌ అవార్డును తెచ్చిపెట్టాయి.
 
జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్‌ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్‌. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్‌ అవార్డుగా పరిగణిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement