Post Graduation
-
విద్యావంతులకు పెద్దపీట
సాక్షి, అమరావతి: 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విద్యావంతులకు పెద్దపీట వేశారు. వీరిలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ఇంజినీర్లు, సివిల్ సర్వెంటు, జర్నలిస్టు ఇలా అన్ని రకాల విద్యావంతులకు జాబితాలో సీఎం జగన్ చోటు కల్పించారు. ఈ జాబితాలో మొత్తం 200 మందికి గాను 77 శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు. 175 శాసనసభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 131 మంది గ్రాడ్యుయేషన్, ఆపై చదవులు చదివినవారు ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 47 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేసిన వారున్నారు. 13 మంది డాక్టర్లు, 11 మంది లాయర్లు, 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు(ఎ.మహ్మద్ ఇంతియాజ్, ఆదిమూలపు సురేష్), ఒకరు డిఫెన్స్‌లో చేసినవారు (వాసుపల్లి గణేష్‌కుమార్), ఒక జర్నలిస్టు(కురసాల కన్నబాబు) ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం డిగ్రీ, ఆపై చదివినవారే.. 25 లోక్‌సభ స్థానాలకు వైఎస్సార్సీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 22 మంది (88 శాతం) డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు ఉన్నారు. ఇందులో 11 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, ఇద్దరు డాక్టరేట్ చేసిన వారు ఉన్నారు. లోక్‌సభ అభ్యర్థుల్లో సింహాద్రి చంద్రశేఖరరావు, గూడురి శ్రీనివాసులు, మద్దుల గురుమూర్తి, పి.అనిల్‌కుమార్ యాదవ్‌లు డాక్టర్లు కాగా.. నలుగురు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్(వి.విజయసాయిరెడ్డి), ఒక మెడికల్ ప్రాక్టిషనర్ ఉన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశం ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న పలువురికి వైఎస్సార్సీపీ టికెట్లు కేటాయించింది. మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్యకర్తల్లో 13 మందికి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి అవకాశం కల్పించింది. కర్నూలు మేయర్ బీవై రామయ్యకు కర్నూలు ఎంపీగా, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడుకి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ పిరియ విజయకు ఇచ్ఛాపురం నుంచి అవకాశం కల్పించారు. సాధారణ కార్యకర్తలు లక్కప్ప, వీరాంజనేయులుకు మడకశిర, శింగనమల నుంచి పోటీకి అవకాశం కల్పించారు. పార్టిలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసిన గూడూరి ఉమాబాలకు నరసాపురం ఎంపీ సీటు కేటాయించారు. కడప జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. జెడ్పీటీసీ సర్నల తిరుపతిరావుకు మైలవరం టికెట్ కేటాయించారు. వైఎస్సార్సీపీ నేత బలసాని కిరణ్‌కుమార్ ప్రత్తిపాడు నుంచి, గృహిణి మురుగుడు లావణ్య మంగళగిరి నుంచి పోటీç³డుతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నుంచి, నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ నెల్లూరు నుంచి, జెడ్పీటీసీ బూసినే విరూపాక్ష ఆలూరు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
పీజీ ఇంకా ఈజీ
సాక్షి, హైదరాబాద్: పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) విద్యను మరింత సరళీకరించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. నాణ్యత ప్రమాణాలను మెరుగుపర్చడం దీని ఉద్దేశంగా పేర్కొంది. సరికొత్త పీజీ డిగ్రీ విధానంపై యూజీసీ ఇటీవల ముసాయిదా ప్రతిని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలకూ పంపింది. సలహాలు, సూచనలు, అభ్యంతరాల ప్రక్రియ వచ్చే నెల రెండో వారంతో ముగుస్తుంది. జనవరి ఆఖరి వారం లేదా ఫిబ్రవరిలో కొత్త పీజీ డిగ్రీ విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తోంది. డిగ్రీస్థాయి నుంచే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సును అందించేలా ఇందులో ప్రతిపాదనలు పెట్టింది. మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం తేలికగా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులను చేసే వీలు కల్పించాలని యోచిస్తోంది. అయితే, ఈ పీజీ చేసే ముందు డిగ్రీలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఏడాదిలోనే పూర్తి ఇక మీదట కేవలం ఒక ఏడాదిలోనే పీజీ కోర్సులు పూర్తి చేసే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ఇది రెండేళ్ల కాలపరిమితితో ఉంది. అయితే, నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు చేసిన వారే దీనికి అర్హులుగా యూజీసీ చెబుతోంది. వాస్తవానికి జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)–2020 అమలులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల కాలపరిమితి గల డిగ్రీ (ఆనర్స్) కోర్సులకు ప్రాధాన్యత పెరిగింది. క్రెడిట్ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. ప్రాథమిక విద్య మొదలు పీజీ వరకూ క్రెడిట్ విధానం అమలు చేయబోతున్నారు. ఏకీకృత విద్యా విధానం అమలు చేయడం, స్కోర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం ఎన్ఈపీలో భాగం. దీనివల్ల విదేశాలకు వెళ్లినా ఆన్లైన్ ద్వారా విద్యార్థి స్థాయిని లెక్కగట్టే వీలుంది. టెన్త్ వరకు ఒక గ్రేడ్, ప్లస్ టూకు మరో గ్రేడ్, డిగ్రీ, పోస్టు–గ్రాడ్యుయేషన్‌కు ఇంకో గ్రేడ్ ఇస్తారు. దీన్నిబట్టి స్కిల్, అన్ స్కిల్ విభజన చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మూడేళ్ల డిగ్రీతోపాటు పీజీ కూడా చేసే సమీకృత విధానం అందుబాటులోకి తెస్తారు. అంటే నాలుగేళ్లు డిగ్రీ చేసిన విద్యార్థి ఏడాది పీజీ చేస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనూ అవకాశం ఏడాది పీజీ కోర్సులను ఆన్లైన్ ద్వారా కూడా చేసే వెసులుబాటు కొత్త విధానంలో తీసుకురాబోతున్నారు. నాలుగేళ్ల డిగ్రీలో అవసరమైన సాంకేతిక అంశాలను చేరుస్తారు. ముఖ్యంగా అన్ని గ్రూపుల్లో కంప్యూటర్ అనుసంధాన సిలబస్‌ను ప్రవేశ పెట్టాలన్నది యూజీసీ ఆలోచన. డిగ్రీలో అవసరమైన పారిశ్రామిక భాగస్వామ్య ఇంటర్న్‌షిప్ ఉంటుంది. విద్యార్థి ఈ దశలోనూ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందుతారు. ఈ కారణంగా పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ వర్క్ కొంత తగ్గుతుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా పీజీ చేసినా విద్యార్థిలో నాణ్యత తగ్గే అవకాశం లేదని యూజీసీ విశ్లే షిస్తోంది. ఆన్లైన్ విధానం అందుబాటులోకి తేవడం వల్ల ఇతర దేశాల్లో పీజీ కోర్సులను చేసే వీలుందని యూజీసీ వర్గాలు అంటున్నాయి. పీజీ విద్యలో ఇది గుణాత్మక మార్పు తెస్తుందని చెబుతున్నాయి. -
25 ఏళ్లు..23 అటెంప్ట్‌లు..చివరికి సాధించాడు
భోపాల్: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడిప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్‌కరణ్ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం 25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్‌లో పీజీ సాధించి కల నెరవేర్చుకున్నాడు. నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ మ్యాథ్స్‌లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. ‘నాకు ఇంఘ్లీష్ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు. ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్ -
విదేశీ విద్యార్థీ ‘వెల్కమ్’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను ఆకర్షించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే నూతన విద్యా విధానాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలు ఉండే ఉన్నత విద్యా సంస్థలకు అత్యధిక నిధులు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు వాటి సీట్లలో 25 శాతం సమానమైన సంఖ్యలో సూపర్ న్యూమరరీ విధానంలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో ఈ సీట్లను విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ప్రవేశాలను సులభతరం చేయొచ్చని, దేశ సంస్కృతి, ఉన్నత సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లవచ్చని యూజీసీ పేర్కొంది. విదేశీ మారకద్రవ్యం కూడా సమకూరి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశాలు ఇలా ఉన్నత విద్యా సంస్థల్లో యూజీ, పీజీలో విదేశీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు, ప్రవేశాలకు యూజీసీ విధివిధానాలను ప్రకటించింది అంతర్జాతీయ విద్యార్థులకు దేశీయ విద్యార్థులకు నిర్దేశించిన అర్హతలతో సమానమైన అర్హతలు తప్పనిసరి. ప్రవేశాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. విద్యా సంస్థల్లోని సీట్లలో 25 శాతానికి సమాన సంఖ్యలో విదేశీ విద్యార్థులకు సూపర్ న్యూమరరీ సీట్లు. ఈ సీట్లకు యూజీసీ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం పొందాలి. వాటి మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి ప్రొఫెషనల్, సాంకేతిక విద్యా కోర్సుల సీట్లకు కూడా సంబంధిత నియంత్రణ సంస్థల నిబంధనలు పాటించాలి. పీహెచ్డీ ప్రోగ్రాముల సీట్లు యూజీసీ, నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ విద్యార్థులకు ప్రవేశాల్లో వీసా, విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భారత విదేశాంగ శాఖ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ విద్యాసంస్థలు తమ ఇన్‌టేక్ సీట్లకన్నా ఎక్కువ శాతంలో సీట్లను వారికి కేటాయించవచ్చు. ఈ సూపర్ న్యూమరరీ సీట్లలో ప్రవేశాలు నేరుగా నిర్వహించాలి. ఈ సూపర్ న్యూమరరీ సీట్లలో విదేశీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించాలి. సీట్లు మిగిలిపోయినా ఇతరులకు ఇవ్వకూడదు. -
ఉన్నత విద్యలో ‘షేరింగ్’
సాక్షి, అమరావతి: సెంట్రల్ వర్సిటీలు సహా దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లోని వనరులను సద్వినియోగం చేయడం, సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలు కూడా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టింది. వివిధ సదుపాయాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన ఇతర అంశాల్లో విద్యా సంస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి తెరతీసింది. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి వీలుగా టెక్నాలజీని, ఇతర వనరులను ఆయా సంస్థలు ఉమ్మడిగా వినియోగించుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది. సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలిచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు పరిశోధన కోర్సుల్లోనూ దీన్ని అమలుచేయాలని సూచించింది. వనరులు లేని విద్యాసంస్థలు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరంలేకుండా దగ్గర్లోని విద్యా సంస్థల వనరులను వినియోగిస్తూ తమ విద్యార్థులను ఆయా సంస్థలు తీర్చిదిద్దడానికి ఈ విధానంతో వీలుపడుతుంది. రెట్టింపు ఫలితాలు ఈ విధానంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయని యూజీసీ భావిస్తోంది. అకడమిక్ అంశాలు సహా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాలను సమగ్రంగా అమలుచేయాలంటే అదనపు సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు అదనపు పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా.. ఇప్పటికే ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించడంవల్ల రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఉన్నత విద్యాసంస్థలు పరస్పర సహకారంతో విద్యాపరమైన మౌలిక వనరులను పంచుకోవడం వల్ల విద్యార్థులకు సమానమైన విద్య అందుతుంది. ప్రస్తుతం ల్యాబ్‌లు, లైబ్రరీలు, ఇతర వనరులున్న సంస్థల్లో చదివే వారికి ఆ వనరుల ద్వారా ఉత్తమ బోధన లభిస్తుంది. కానీ, అలాంటివిలేని సంస్థల విద్యార్థులకు ఉన్నత బోధన దూరమవుతోంది. వనరులను పంచుకునేలా ఆయా సంస్థల మధ్య జరిగేఒప్పందాలతో విద్యార్థులందరికీ మేలు చేకూరుతుంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్–గ్రాడ్యుయేట్, పీహెచ్డీ కోర్సులన్నిటికీ ఈ విధానాన్ని అమలుచేయాలని యూజీసీ సూచించింది. ఆయా విద్యాసంస్థలన్నీ తమ సంస్థలోని తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర వనరుల సమాచారాన్ని సమీపంలోని ఇతర ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ తెలిసేలా వెబ్సైట్ ద్వారా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. వీటిని వినియోగించుకోవాలనుకునే ఇతర ఉన్నత విద్యా సంస్థల నుంచి నిర్దిష్ట వనరులకు సాధారణ కనీస ఛార్జీలు నిర్ణయించి వసూలుచేయవచ్చని సూచించింది. ఆ కనీస ఛార్జీల వివరాలూ అందుబాటులో ఉంచాలని పేర్కొంది. సంస్థల మధ్య ఒప్పందాలు ఇక ఉన్నత విద్యా సంస్థల్లోని వనరులను పరస్పర భాగస్వామ్యంతో వినియోగించుకునేందుకు వీలుగా ఆయా సంస్థలు ఎంఓయూ కుదుర్చుకోవాలని యూజీసీ పేర్కొంది. ఏ సమయంలో ఏ సంస్థ విద్యార్థులు వనరులు వినియోగించుకోవాలో సమగ్ర టైమ్‌టేబుల్‌ను రూపొందించి ఆ ప్రకారం కార్యక్రమాలకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వనరులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సంస్థలు చర్యలు చేపట్టాలని, ఏ ఒక్క తరగతి ఖాళీగా ఉండకుండా చూసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ విధానంతో విద్యార్థులకు మేలు.. తరగతి గదులు, మౌలిక సదుపాయాలు పంచుకోవడం ద్వారా విద్యార్థులకు మేలు చేకూరుతుంది. క్రీడా మైదానాలు, స్టేడియం, సమావేశ మందిరాలను కూడా అవసరాలను అనుసరించి పంచుకోవచ్చు. సైన్సేతర అంశాలకు సంబంధించిన వనరుల విషయంలో కూడా సంస్థలు పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న అన్ని సదుపాయాలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. పరికరాలు దెబ్బతినే విషయంలోనూ వాటిని తిరిగి ఏర్పాటుచేయడంపైనా ఒప్పందంలో పేర్కొనాలి. అకడమిక్ అంశాలకు సంబంధించి ఆన్లైన్ లెక్చర్లు, వీడియోలు, లెర్నింగ్ మెటీరియల్‌లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లలోనూ ఇచ్చిపుచ్చుకోవచ్చు. విద్యార్థుల నమోదు ప్రక్రియ మొత్తం ముందుగా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్తిచేయాలి. ఉపాధ్యాయుల శిక్షణ, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు. ఖర్చులపై ముందుగానే ప్రణాళిక వనరులను పంచుకోవడానికి ముందు వ్యయ విశ్లేషణ, ఖర్చును నిర్ణయించే పద్ధతులపై ప్రణాళిక రూపొందించుకోవాలి. లాభనష్టాలకు తావులేని రీతిలో వనరుల వినియోగంపై ఛార్జీలు వసూలుచేయాలి. ప్రయోగాల వినియోగం ఆధారంగా, నిర్వహణ వ్యయం ప్రకారం పరికరాలు ఛార్జీలు నిర్ణయించాలి. ఉన్నత విద్యాసంస్థల మధ్యే కాకుండా కాలేజీలు, పరిశ్రమల మధ్య కూడా ఒప్పందాలు చేసుకోవాలని యూజీసీ సూచించింది. -
పీజీఈసెట్‌లో 91.48% ఉత్తీర్ణత
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్ 2022)లో 91.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 2 నుంచి 5 వరకు జరిగిన ఈ పరీక్షలకు 12,592 మంది విద్యార్థులు హాజరుకాగా, 11,520 మంది అర్హత సాధించారు. అందులో 6,440 మంది అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్, రిజిస్ట్రార్, పీజీఈసెట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ పరీక్ష ద్వారా 115 కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పీజీఈసెట్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత 93 శాతంగా నమోదు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 89.62 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఫార్మసీలో అధికం పీజీఈసెట్‌కు హాజరైన వారిలో ఫార్మసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 12,592 మంది హాజరుకాగా, అందులో 5,452మంది కేవలం ఫార్మసీ విద్యార్థులే ఉన్నారు. వారిలో 5,186 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,027మంది పరీక్షకు హాజరుకాగా, 1,782 మంది అర్హత సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1,279 మంది హాజరుకాగా,1,211 మంది ఉత్తీర్ణత సాధించారు. -
వ్యాలీ పులికి.. పులిట్జర్!
కశ్మీర్ అందాలను చూసి తనివితీరా ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అంతటి అందమైన లోయలో పుట్టిన ఓ చిన్నారికి తను చూసిన ప్రతిదృశ్యాన్నీ ఫొటో తీయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నేడు ఆమెకు ఎంతో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్‌ను తెచ్చిపెట్టింది. ఆ చిన్నారి మరెవరో కాదు 28 ఏళ్ల సనా ఇర్షాద్ మట్టూ. తాజాగా ప్రకటించిన పులిట్జర్ అవార్డుల లిస్టులో ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగంలో డానిష్‌తోపాటు రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఆద్నన్ అబిది, సనా ఇర్షాద్ మట్టూ, అమిత్ దావేలను ఈ అవార్డు వరించింది. శ్రీనగర్‌కు చెందిన సనాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఏం జరిగినా వాటిని కెమెరాలో బంధించాలనుకునేది. ఆ ఆసక్తితోనే జర్నలిజంను కెరీర్‌గా ఎంచుకుంది. కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. చదువయ్యాక కశ్మీర్ మీద డాక్యుమెంటరీలు, విజువల్ స్టోరీలు తీయడం మొదలుపెట్టింది. కశ్మీర్లో చోటుచేసుకుంటోన్న అనేకరకాల పరిస్థితులపై స్పందిస్తూ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా దాదాపు మూడేళ్లపాటు పనిచేసింది. సనా ఆర్టికల్స్ బావుండడంతో.. ఆల్జజీరా, ద నేషన్, టైమ్ టీఆర్టీ వరల్డ్, పాకిస్థాన్ టుడే, సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు, కర్వాన్ మ్యాగజీన్ వంటి జాతీయ అంతర్జాతీయ మీడియా పబ్లికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీంతోపాటు ఆమె వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఫొటోజర్నలిస్టుగా కూడా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ఆల్‌జజీరాకు స్టోరీలు అందించేది. క్యాలిఫోర్ని యా కేంద్రంగా పనిచేసే జుమా ప్రె ఏజెన్సీలో ‘కశ్మీరీ వాలా’.. స్థానిక వార్తలను ఇచ్చేది. సనా తీసిన అనేక ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లలోకూడా ప్రదర్శింపబడ్డాయి. ప్రస్తుతం రాయిటర్స్‌లో పనిచేస్తోన్న సనా 2021లో మ్యాగ్నమ్ ఫౌండేషన్‌లో ‘ఫొటోగ్రఫీ అండ్ సోషల్ జస్టి్టస్ ఫెలోస్‌లో ఫొటో జర్నలిస్టుగా పనిచేస్తోంది. ఆడపిల్ల అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా ఫొటోలు తీస్తూ, క్లిష్ట పరిస్థితులను దాటుకుంటూ ఆడపులిలా దూసుకుపోతూ మంచి ఫొటోజర్నలిస్టుగా ఎదిగింది. కాలేజీ రోజుల నుంచే.. యూనివర్సిటీలో ఉండగా సనా ఏవీ ప్రొడక్షన్లో స్పెషలైజేషన్ చేసింది. పీజీ ప్రాజెక్టులో భాగంగా ‘ద లేక్ టౌన్’ పేరిట డాక్యుమెంటరీ తీసింది. దీన్ని 2018 ముంబై అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దీనికి కశ్మీర్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది. ‘ఏ గ్రేవ్ డిగ్గర్’ అనే మరో ట్రామా డాక్యుమెంటరీకి కూడా సనాకు మంచి పేరు వచ్చింది. కోవిడ్ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని మారుమూల ప్రాంతంలో వ్యాక్సిన్లు ఇస్తోన్న ఫొటోలను తీసేందుకు ఆరుగంటల పాటు ట్రెక్కింగ్ చేసి మరీ ఆక్కడకు చేరుకుని ఫొటోలు తీసి పంపింది. ఇలా ఎంతో డెడికేషన్‌తో తీసిన ఫొటోలు ఆమెకు ఫొటోజర్నలిస్ట్ ఫీచర్ విభాగంలో పులిట్జర్ అవార్డును తెచ్చిపెట్టాయి. జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్‌లలో ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబరిచిన వారికి ఇచ్చే పులిట్జర్ అవార్డు దక్కించుకుంది సనా ఇర్షాద్. ఈ అవార్డుని జర్నలిజంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. -
జిప్మర్లో హిందీ రగడ
సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ (జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చి)లో పాలనా వ్యవహారాలన్నీ హిందీలోనే జరగాలన్న ఆదేశాలు కలకలం రేపుతున్నాయి. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ హిందీ, సంస్కృత భాషలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిప్మర్ ఇచ్చిన హిందీ ఉత్తర్వులపై తమిళాభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని డీఎంకే ఎంపీ కనిమొళి హెచ్చరించారు. పుదుచ్చేరిలో బీజేపీ– ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. -
22 నుంచి 26 వరకు ఏపీ పీజీసెట్
వైవీయూ: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ పీజీసెట్–2021కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి 26 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ పీజీసెట్ కన్వీనర్ ఆచార్య వై.నజీర్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 43,632 సీట్లకు పీజీసెట్ నిర్వహిస్తున్నామన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 42,082 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కేంద్రాలు, ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్‌లో సైతం పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 20 ప్రాంతాల్లో 53 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని కోరారు. -
పీజీ స్కాలర్లకు నెలకు రూ.12,400 స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుతున్న విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుభవార్త తెలిపింది. ఏఐసీటీఈ అనుమతితో నడిచే ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో పీజీ చదివేవారిలో అర్హులైన వారికి నెలకు రూ.12400 చొప్పున స్కాలర్షిప్ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈమేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఏఐసీటీఈ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. విద్యార్థులు ‘పీజీఎస్సీహెచ్ఓఎల్ఏఆర్ఎస్హెచ్ఐపీ.ఏఐసీటీఈఐఎన్డీఐఏ.ఓఆర్జీ’లో ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాలని పేర్కొంది. అభ్యర్థులు డిసెంబర్ 31లోగా ఈ పోర్టల్ ద్వారా లాగిన్ ఐడీని క్రియేట్ చేసుకుని వచ్చే జనవరి 15 లోపల దరఖాస్తును సమర్పించాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,400 చొప్పున ‘ఏఐసీటీఈ పీజీస్కాలర్‌షిప్’ కింద వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంది. ఈ స్కాలర్షిప్కు ఎంపికైన వారు వారానికి 8 నుంచి 10 గంటలు వారి విద్యాసంస్థ సూచించిన మేరకు టీచింగ్, రీసెర్చి ప్రక్రియల్లో పాల్గొనాలి. అభ్యర్థుల నెలవారీ పెర్ఫార్మెన్స్ను పరిగణనలోకి తీసుకుని ఏఐసీటీఈ, విద్యాసంస్థ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మంచి పురోగతిలో ఉంటేనే ఉపకార వేతనం కొనసాగిస్తారు. దరఖాస్తుదారులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్), గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్టు (జీపాట్), కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీడ్)లలో నిర్ణీత స్కోరు సాధించి ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, మాస్టర్ ఆఫ్ ఫార్మసీ, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు పొంది ఉండాలి. ఆయా విద్యాసంస్థలలోని ఇన్‌టేక్‌ను అనుసరించి స్కాలర్‌షిప్‌ల సంఖ్యను ఏఐసీటీఈ నిర్ణయిస్తుంది. వీటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద పదిశాతం మందికి పీజీ స్కాలర్షిప్లను ఇస్తుంది. 24 నెలలు కొనసాగే ఈ ఉపకార వేతనానికి డ్యూయెల్ డిగ్రీ చదువుతున్నవారు కూడా అర్హులే. ఇతర వివరాలకు ఏఐసీటీఈ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. 2 వేలమంది విద్యార్థులకు ‘స్వనాద్’ కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ‘స్వనాధ్’ పేరుతో ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామని ఏఐసీటీఈ తెలిపింది. ఏఐసీటీఈ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ, డిప్లమో చదివే వారిలో అర్హులైన 2 వేలమందికి ఏడాదికి రూ.50 వేల చొప్పున నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాలేజీ ఫీజు, కంప్యూటర్, పుస్తకాలు, అవసరమైన పరికరాలు, మెటీరియల్ కోసం ఇచ్చే ఈ ఉపకార వేతనాల్లో వెయ్యి డిగ్రీ విద్యార్థులకు, వెయ్యి డిప్లమో విద్యార్థులకు కేటాయించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన వారు, సాయుధ బలగాలు, పారామిలటరీలో పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలు దరఖాస్తు చేయడానికి అర్హులు. వారి కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8 లక్షలకు మించరాదు. విద్యార్థులు ప్రభుత్వం నుంచి ఇతర సహాయం పొందుతున్నవారై ఉండరాదు. ఏఐసీటీఈ అనుమతి ఉన్న కాలేజీల్లో ప్రస్తుతం మొదటి సంవత్సరం డిగ్రీ, డిప్లమో చదువుతున్నవారై ఉండాలి. అభ్యర్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (ఎన్ఎస్పీ) ద్వారా నవంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. డిగ్రీ విద్యార్థులను ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా, డిప్లమో విద్యార్థులను టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. -
పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్) : కాకతీయ యూనివర్సిటీలోని అన్ని విభాగాల పీజీ విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు బోధించాలని రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం సూచించారు. కేయూలోని విభాగాధిపతులతో ఆయన ఆన్లైన్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈనెల 1వ తేదీ నుంచే ఆన్లైన్ పాఠాల బోధన ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఇకనైనా త్వరగా విద్యాబోధన చేపట్టేందుకు విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు సిద్ధం చేయాలని తెలిపారు. ఆ వెంటనే జూమ్ యాప్ లేదా గూగుల్ మీట్ ద్వారా తరగతులు నిర్వహించాలని, అవసరం మేరకు ఎంపిక చేసిన పార్ట్ టైం లెక్చరర్ల జాబితా అందిస్తే ఉత్తర్వులు ఇవ్వనున్నామని వెల్లడించారు. మేం సిద్ధమే కానీ... పలువురు విభాగాధిపతులు మాట్లాడుతూ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తాము సుముఖంగానే ఉన్నా విభాగా ల్లో కొందరు అధ్యాపకులు సంతకాలు చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ కోవిడ్ దృష్ట్యా ఇళ్లకు వెళ్లి ఉంటే అక్కడి నుంచే పాఠాలు బోధించేలా విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులతో కూడా తరచుగా మాట్లాడాలని తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ల విద్యార్థులు ప్రమోట్ కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులను మూడో సెమిస్టర్‌కు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులను ఐదో సెమిస్టర్‌కు ప్రమో ట్ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో యూజీసీ నిబంధనల మేరకు కేయూ డీన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘ఉన్నత’ పరీక్షలకే మొగ్గు
సాక్షి, అమరావతి : ఉన్నత విద్యాకోర్సులైన యూజీ, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు సెప్టెంబర్‌లోగా పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు చర్యలు చేపడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు, ఇతర అంశాల దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, కేంద్ర మానవ వనరులశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం ఆయా వర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తోంది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌లోగా పరీక్షలు నిర్వహించేలా వర్సిటీలకు సూచిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ►ఏపీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు 54 ఉండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 30 ఉన్నాయి. వీటి పరిధిలో 3,285 కాలేజీలు యూజీ, పీజీ సహా వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ► ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, అనంతపురం, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, నాగార్జున వర్సిటీల పరిధిలో ఎక్కువగా అఫ్లియేటెడ్ కాలేజీలున్నాయి. ► ఆంధ్రా వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు 600 వరకు ఉన్నారు. పరీక్షల నిర్వహణలో వీరిని కూడా పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. నేడు గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్.. యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల నిర్వహణ, బోధనాభ్యసన ప్రక్రియలు, విద్యార్థుల పరిస్థితిపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం వీసీలు, ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఎగ్జామ్స్ పరీక్షల నిర్వహణపై యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. విద్యార్థులు యూనివర్సిటీ పరిధి దాటి బయటి ప్రాంతాల్లో ఉంటే వారికి అక్కడ అందుబాటులో ఉన్న కాలేజీలో పరీక్షలు నిర్వహించాలని సూచించాం. ఇందుకు అనుగుణంగా ప్రతి వర్సిటీ తన పరిధిలోని విద్యార్థులు ఎక్కడ ఉన్నారో సమాచారం సిద్ధం చేసుకోవాలి. జేఎన్టీయూల సాంకేతిక సహకారంతో ఇతర ప్రాంతాలకు ప్రశ్నపత్రాలు పంపి పరీక్షలు నిర్వహించాలని సూచించాం. –ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి ఛైర్మన్) పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సూచనల మేరకు సెప్టెంబర్‌లో యూజీ, పీజీ ఫైనలియర్ పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అఫ్లియేటెడ్ కాలేజీల్లో గతంలో పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్యను 50 శాతానికి తగ్గించి సవరించిన షెడ్యూల్ విడుదల చేస్తాం. సహేతుక కారణాలతో పరీక్షలు రాయలేని వారికి తరువాత ప్రత్యేకంగా నిర్వహిస్తాం. ఫైనలియర్ కాకుండా మిగతా ఏడాది విద్యార్థులను పై తరగతుల్లోకి ప్రమోట్ చేసి ఉన్నత విద్యామండలి సూచనల మేరకు నవంబర్‌లో పరీక్షలు పెడతాం. - పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఆంధ్రా వర్సిటీ ఉపకులపతి, విశాఖ -
పీజీ చేరికల్లో ఆమెదే హవా
ఉస్మానియా యూనివర్సిటీ: ఫలానా ఫలితాల్లో అమ్మాయిలే టాప్ అనేది అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చదువుకునేవారిలోనూ వారిదే పైచేయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువట. పీజీలో 65 శాతం మంది అమ్మాయిలే అడ్మిషన్లు తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని అధికారులే వెల్లడిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పురుషుల సంఖ్యను దాటిపోయింది. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్‌డీలో కూడా దూసుకుపోతున్నారు. డిగ్రీ, పీజీలతో పాటు ఇంజనీరింగ్, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, దూరవిద్య కేంద్రం కోర్సుల్లో పురుషులకు సమానంగా అమ్మాయిలు చదువుతున్నారని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.కిషన్ తెలిపారు. ఓయూ పరిధిలో మొత్తం 728 కాలేజీల్లో మహిళలకు ప్రత్యేకంగా 110 కాలేజీలున్నాయి. మిగతా కాలేజీలన్ని కో–ఎడ్యుకేషన్లే. ఒక్క కోఠి మహిళా కాలేజీలోనే 4,500 మంది అమ్మాయిలు చదువుతున్నట్లు అధికారులు వివరించారు. క్యాంపస్‌లో పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్‌తో పాటు మరో ఐదు హాస్టళ్లు, మహిళా కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు రెండు హాస్టల్స్‌ను ఏర్పాటు చేశారు. మహిళా వర్సిటీ అవసరం ►ప్రతి ఏటా ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరుగుతోంది. కానీ వారికి ప్రత్యేకమైన వర్సిటీ ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం పద్మావతి మహిళా వర్సిటీ ఏపీకి వెళ్లగా కోఠి మహిళా కాలేజీలో వర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఇంత వరకు దాని ఊసే లేదు. పెరుగుతున్న మహిళల సంఖ్యకు అనుగుణంగా వివిధ కోర్సుల్లో సీట్లు పెరగనందున వందలాది మంది విద్యార్థినులు ఇంటికి పరిమితమవుతున్నారు. ►ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరగడానికి కారణాలు.. ►నేటి తరం తల్లిదండ్రుల ఆలోచనలో మార్పుతో పాటు భద్రత పెరగడం, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదల, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడం. ►ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా ఉపకార వేతనాలు, హాస్టల్ వసతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాల పెరుగుదల. చదువుతో ఉద్యోగంతో పాటు జీవన విధానంలో మార్పు వస్తుందని మహిళలు భావించడం. ►తల్లిదండ్రులు అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా సమానంగా చదివిస్తున్నారు. వీరిలో ఆర్థిక స్తోమత బాగా ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్, ఇంజనీరు తదితర వృత్తి విద్యా కోర్సులను చదివిస్తుండగా.. మధ్య తరగతి, సామాన్య కుటుంబాల వారు పిల్లలను డిగ్రీ, పీజీ కోర్సులను చదివిస్తున్నారు. ►గతంలో పురుషులు మాత్రమే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు పొందేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఆస్థాయి ఉద్యోగాలు అందుకుని రాణిస్తున్నారు. -
రాష్ట్రమంతా పీజీకి ఒకే ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యు యేషన్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీజీఈటీ) నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైస్ చాన్స్లర్ల (వీసీలు) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం లోని 6 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు వేర్వేరుగా పీజీ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల్లో ప్రవేశాలకు కేయూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా..తెలంగాణ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఉస్మానియా వర్సిటీయే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో విద్యార్థులకు ఆర్థిక భారంతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. పైగా రెండు యూనివర్సిటీలపైనా నిర్వహణ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఒకే పీజీ ఎంట్రెన్స్ నిర్వహించాలన్న ఆలోచనన ఎప్పటినుంచో ఉన్నత విద్యామండలి మదిలో ఉంది. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి అన్ని వర్సిటీల వీసీల ఆమోదముద్ర పడింది. రానున్న విద్యా సంవత్సరంలో (2019–20) ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఒకే పరీక్షను నిర్వహించే బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశపరీక్షకు చైర్మన్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రంను నియమించారు. కమిటీలో మిగతా వర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణను నియమించారు. ఎంట్రెన్స్ టెస్టు కన్వీనర్‌ను నియమించే బాధ్యతను ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రంకు అప్పగించారు. -
ఫీజు పెంపు జీవోపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ఎయిడెడ్ వైద్య కళాశాలల్లోని సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీజులు పెంచుతూ జారీ అయిన జీవో 78 అమలును 2 వారాలు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫార్సుల్లేకుండా ఫీజులు పెంచడం చెల్లదంటూ వైద్య విద్యార్థి అనిల్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 14న వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన జీవో 78 ప్రకారం ప్రైవేట్ అన్ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో ఫీజును రూ.25 లక్షలకు పెంచడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. జీవో జారీ విషయం గోప్యంగా ఉంచారని, చెప్పాపెట్టకుండా ఫీజును భారీగా పెంచేశారని, ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీకి సంబంధం లేకుండా చట్ట వ్యతిరేకంగా ఫీజు పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఆరోపణలపై వివరణలతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. -
ఇక పీజీ ఇంగ్లిష్ కష్టమేనా?
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో 20 క్రెడిట్స్‌తో ఇంగ్లిష్ సబ్జెక్టును చదువుకుని ఎక్కడైనా పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసుకునేలా ఇప్పటివరకు ఉన్న అవకాశం ఇకపై దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో (సీబీసీఎస్) డిగ్రీలో ఇంగ్లిష్‌లో ఇప్పటివరకు 20 క్రెడిట్స్ ఉండగా, వాటిని ఇపుడు 18 క్రెడిట్స్‌కు తగ్గించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అదే జరిగితే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో పీజీ ఇంగ్లిష్ చదివే అవకాశమే లేకుండా పోతోందన్న ఆందోళన యూనివర్సిటీల ఇంగ్లిష్ విభాగాల నుంచి వ్యక్తం అవుతోంది. మన రాష్ట్రంలోనూ ఏదేని భాషలో పీజీ చేయాలంటే కచ్చితంగా డిగ్రీలో 20 క్రెడిట్స్‌తో ఆ సబ్జెక్టు చదివి ఉండాల్సిందే. డిగ్రీలో ఇంగ్లిష్‌కు క్రెడిట్స్ తగ్గిస్తున్నందున.. మన రాష్ట్రంలో పీజీ ఇంగ్లిష్‌లో ప్రవేశాలకు ఉండాల్సిన క్రెడిట్స్‌ను తగ్గించే అవకాశం ఉన్నా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం దూరం కానుందని ఇంగ్లిష్ విభాగం ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.మరోవైపు ఇంగ్లిష్‌లో ఉన్న గ్రామర్, ప్రోజ్, పొయెట్రీ విభాగాలు కాకుండా జెండర్ సెన్సిటైజేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రవేశ పెట్టి ఇంగ్లిష్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఫైనల్ ఇయర్లో ఆప్షనేది? డిగ్రీ ఫైనల్ ఇయర్లో విద్యార్థులకు ఆప్షనల్స్ లేకుం డా చేస్తున్నారని, విద్యార్థి తనకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకునే వీలు లేకుండా చేస్తున్నారని ప్రొఫెసర్లు మొత్తుకుంటున్నారు. ఇప్పటివరకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో విద్యార్థి రెండు ఆప్షనల్స్‌ను (ఎలెక్టివ్) ఎంచుకునే అవకాశం ఉంది. అయితే దానిని తొలగించి ఒకటే ఆప్షనల్‌ను చదువుకునేలా చేస్తున్నారని, ఇది సీబీసీఎస్ స్పిరిట్‌కే విరుద్ధమని పేర్కొంటున్నారు. మరోవైపు సీబీసీఎస్‌లో కోర్ సబ్జెక్టులకు 60 శాతం క్రెడిట్స్, ఎలక్టివ్‌కు 40 శాతం క్రెడిట్స్ ఉండాలి.అప్పుడే ఆ కోర్సుకు జాతీయ స్థాయిలో ఈక్వలెన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లిష్‌కు క్రెడిట్స్‌కు తగ్గిస్తుండటంతో కోర్ సబ్జెక్టులకు 60 శాతం క్రెడిట్ లేకుండాపోయే పరిస్థితి నెలకొందని, దానివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. అలాగే ప్రస్తు తం ఇండియన్ మోడ్రన్ లాంగ్వేజ్/అదర్ లాంగ్వేజ్ అని ఉండగా, అదర్ లాంగ్వేజ్‌ను తొలగించేలా ప్రతిపాదించారని, దానివల్ల సంస్కృతం, ఉర్దూ, అరబిక్ వంటి క్లాసికల్ లాంగ్వేజెస్‌ను విద్యార్థులు చదివే అవకాశం లేకుండా పోతుందని పేర్కొన్నారు. రెండేళ్లకే సమీక్ష.. డిగ్రీలో ఏ కోర్సు అయినా జాతీయ స్థాయిలో ఒకేలా ఉండేందుకు, విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీసీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రెండేళ్ల కిందట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులుచేసి రాష్ట్రంలో డిగ్రీలో సీబీసీఎస్‌ను అమల్లోకి తెచ్చారు. అయితే ఒక్క బ్యాచ్ కూడా పూర్తి కాకముందే అందులో మార్పులు తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు చేయనున్న మార్పులతో రూపొందించిన డ్రాఫ్ట్ ను వర్సిటీలకు పంపించింది. సమావేశాలు నిర్వహించిన అభిప్రాయాలను సేకరించింది. అయితే వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం చేయనున్న మార్పులపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది. -
దెయ్యం పట్టింది
కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! పద్దెనిమిదేళ్ల వయసున్న భార్య, ఇరవై ఏళ్ల వయసున్న భర్త మధ్య మొదలయ్యే గొడవ.. మధ్య యుగాల్లో ఫ్రాన్సు, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన నూరేళ్ల యుద్ధంలా.. అలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందేమో అన్నంత అర్థరహితంగా కనిపిస్తుంది. ఆ వయసులో అమ్మాయి రోషంగా ఉంటుంది. అబ్బాయి మూర్ఖంగా ఉంటాడు. కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! అమ్మాయి, అబ్బాయి బిలో ట్వంటీ ట్వీంటీవన్. అబ్బాయికైతే పెళ్లయినట్లే లేదు. బ్యాచిలర్‌గా ఎలా ఉన్నాడో మ్యారీడ్గా కూడా అలానే ఉన్నాడు. భార్యని ఫీల్ అవడం, భార్య అని ఫీల్ అవడం ఇంకా మొదలవలేదు. అమ్మాయి హ్యాపీగా ఉంది. పెళ్లితో కొత్తగా వచ్చిన హ్యాపీనెస్ కాదది.అమ్మాయిల్లో సహజంగానే తొణికిసలాడే సంతోషం. పెళ్లికి ముందెలా ఉందో, పెళ్లి తర్వాతా ఆమె అలానే ఉంది. తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకొకరి పని చేస్తోంది. ఆ ఇంకొకరు తన భర్త అని, భర్త కాబట్టి భర్త పని కూడా తనదే అనుకునీ ఆమేం చెయ్యడం లేదు. ఇంట్లో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నప్పుడు అలవాటైన పనులు, అలవాటుగా చేసే పనులు ఉంటాయి కదా.. అలా చేస్తోంది.పెద్దవాళ్ల బాధ్యతను తీర్చడానికా అన్నట్లు వీళ్లు భార్యాభర్తలయ్యారే కానీ, భార్యాభర్తలుగా మాత్రం లేరు. ఆమె ఇంకా చదువుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్. అతడు ఇంకా ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇంటికెవరైనా గెస్టులు వచ్చి చూస్తే.. పూర్తిగా ఇది పెద్దవాళ్ల తొందరపాటు వల్ల జరిగిన పెళ్లి అని వాళ్లకు ఏ మూలో అర్థమైపోతుంది. ఈ వయసులో జరిగే పెళ్లిళ్లు సాధారణంగా.. జరిగిన పెళ్లిళ్లు అయి ఉండవు. చేసుకున్న పెళ్లిళ్లు అయి ఉంటాయి. చేసుకున్న పెళ్లిలో దంపతుల మధ్య పెద్దలు ఉండరు. ప్రేమ ఉంటుంది. ఈ జంట మధ్య ప్రేమ లేదు. పెద్దలు ఉన్నారు. వీళ్లున్న ఇంట్లో ప్రస్తుతం పెద్దలెవరూ లేరు. ప్రేమా లేదు. వీళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే వీళ్లకు తెలీకుండా మరో ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉన్నారు! ఆ ఇద్దరూ ఇంకో జంట. ఇంచుమించు అదే వయసున్న జంట. కొన్ని నెలల క్రితమే ఆ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన జంట. పెళ్లి చేసుకున్నా వదిలిపెట్టకుండా ఇద్దర్నీ వేరు చేద్దామని ఆ ఇద్దరి తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేశారు. కలిసి చనిపోతే ఇక తమనెవరూ వేరు చేయలేరని ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. శరీరాలు వేర్వేరుగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాయి. ఆత్మలు మాత్రం ఒకటిగా ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. అది ఆ ఇంటాయనకూ తెలీదు. ఈ కొత్త జంటకు తెలిసే అవకాశం లేదు. ఎప్పట్లా ఇద్దరి మధ్యా యుద్ధం మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో మర్చిపోయారు. యుద్ధమే జీవిత పరమార్థంగా కత్తులు, కటార్లు విసురుకుంటున్నారు. అమ్మాయి వంటింట్లో గిన్నెలు ఎత్తి పడేసింది. అబ్బాయి గోడను కాలితో ఒక్క తన్ను తన్నాడు.‘‘నువ్విలాంటి మనిషివని అనుకోలేదు. మీ తాత నీ పెళ్లి చూసి చచ్చిపోవాలని అశపడుతున్నాడని, మీవాళ్లు మావాళ్లను ఒప్పించి నన్ను నీకిచ్చిపెళ్లి చేశారు. ఖర్మ. ఆయన చావు నా పెళ్లికొచ్చింది’’ అని నుదురు కొట్టుకుంది అమ్మాయి.‘‘మాటలు జాగ్రత్తగా రానియ్’’ అని కళ్లెర్ర చేశాడు. ‘‘జాగ్రత్తా!! ఏదీ మళ్లీ అనూ’’ అని ముందుకొచ్చింది అమ్మాయి. అబ్బాయి ఉగ్రుడయ్యాడు. ‘‘నీది కాదు, నాదీ ఖర్మ. నీలాంటి దాన్ని చేసుకున్నందుకు! అబ్బాయి నచ్చాడని మీవాళ్లొచ్చి అడిగితే ‘అమ్మాయి బాగుందిరా.. చేసుకో’ అని మావాళ్లు నన్నుబలవంత పెట్టారు. నాకేం తెలుసు బుద్ధి కూడా ముఖంలాగే ఉంటుందనుకున్నాను’’ అన్నాడు. అమ్మాయికి కాస్త జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చేత అతడు తననేం అన్నదీ గ్రహించింది. ‘‘ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తాను. నువ్వు అన్‌ఫిట్ అని మావాళ్లకు చెప్పేస్తాను’’ అని ఫోన్ తీసుకుంది. ‘అన్‌ఫిట్’ అనే మాటకు అబ్బాయి ఒణికిపోయాడు.‘‘దెయ్యంలా దాపురించావు నా బతుక్కి’’ అని పెద్దగా అరిచేశాడు. ఆ అరుపుకి.. అమ్మాయేం బెదరలేదు కానీ, అప్పటివరకు వాళ్లిద్దర్నీ గెడ్డం కింది చెయ్యి ఆన్చుకుని చూస్తూ ఉన్న ఆ రెండు ఆత్మలు ఉలిక్కిపడి.. ‘దెయ్యంలా’ అనే మాటకు నొచ్చుకున్నాయి. ఆ నొచ్చుకోవడం అక్కడితో ఆగలేదు. ‘‘ఏంటలా ఊగిపోతున్నారు! దెయ్యం పట్టినట్లుగా..’’ అన్నారు.. సడెన్‌గా ఊరినుంచి దిగిన మామగారు.. కూతుర్నీ, అల్లుణ్ణీ ఆ వార్ సీన్లో చూసి! ఆ మాటకు ఇంకా నొచ్చుకున్నాయి ఆ రెండు ఆత్మలు. మామగారి పక్కనే అత్తగారూ ఉన్నారు. వాళ్లు తలుపుకొట్టి రానవసరం లేకుండానే తలుపు తెరిచి కొట్లాడుకుంటున్నారు అమ్మాయీ.. అబ్బాయీ.‘‘దెయ్యం నాకు కాదు. మీ కూతురికి పట్టింది’’అన్నాడు అబ్బాయి ఉక్రోషంగా. ‘‘నాకు కాదు.. నీకే దెయ్యం పట్టింది’ అంది అమ్మాయి. ‘‘ఇద్దరీకి పట్టింది. ఇక ఊర్కోండి’’ అన్నారు అమ్మాయి తల్లిదండ్రులు.ఆ క్షణమే అనుకున్నాయి ఆ రెండు ఆత్మలూ.. నిజంగా దెయ్యం పడితే ఎలా ఉంటుందో చూపించాలని. చూపించాయి కూడా. ఆ రాత్రికే! ‘‘అబ్బాయికి సున్నుండలు ఇష్టమని తెచ్చామమ్మా. నీకిష్టమైన నువ్వుండలు కూడా. అసలు అందుకోసమే వచ్చాం’’.. తెల్లారే తిరిగి ఊరెళుతూ చెప్పారు పెద్దవాళ్లిద్దరూ. వాళ్లలా వెళ్లిపోగానే భార్యను మీదకు లాక్కుని బలంగా హత్తుకున్నాడు అబ్బాయి. ‘‘నిజంగానే రాత్రి నీకేదో దెయ్యం పట్టింది’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ముందు నీకు పట్టాకే నాకు పట్టింది’’ అంది అమ్మాయి అతడి ముక్కు మీద తన చూపుడు వేలితో మృదువుగా రాస్తూ. ఆత్మలు రెండూ ఈ దృశ్యాన్ని చూసి రెండు కన్నీటి బొట్లు రాల్చాయి. ఆ బొట్లు ఈ ఇద్దరి చెంపల మీదుగా జారాయి. ప్రేమ కరిగిందా? కాదు. ప్రేమకు దెయ్యం పట్టింది. -
ఐఐఎంలో పీజీ ఫీజు రూ.22 లక్షలు
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం–ఏ)లో పోస్టుగ్రాడ్యుయేషన్ ఫీజు పెరిగింది. 2018–20 బ్యాచ్‌కు గాను రూ.21లక్షల నుంచి రూ.22 లక్షలకు పెంచుతున్నట్లు ఐఐఎం డైరెక్టర్ డీసౌజా తెలిపారు. శనివారం ఐఐఎం బోర్డు సభ్యులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతేడాది రూ.19.5 లక్షలున్న ఫీజును 21 లక్షలకు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజును ఏడాదికి 5 శాతం చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు. పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఫర్ ఎగ్జిక్యూటివ్స్ ఫీజులో 5శాతం పెరుగుదల ఉంటుందన్నారు. -
25 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్ : న్యాయ విద్య డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించనున్న లాసెట్–2018 నోటిఫికేషన్‌ను ఈ నెల 22న విడుదల చేయాలని సెట్ కమిటీ నిర్ణయించింది. సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దరఖాస్తులను ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని నిర్ణ యించింది. రిజిస్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.500, ఇతరులకు రూ.800గా ఖరారు చేసింది. పీజీ లాసెట్ ప్రవేశాల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. దీనికి రిజి స్ట్రేషన్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1000గా నిర్ణయించింది. -
కెరీర్ కౌన్సెలింగ్..
పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పెట్రోలియం స్పెషలైజేషన్‌తో అందుబా టులో ఉన్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి? – రామ్ కుమార్, హైదరాబాద్. ♦ సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం.. ఎంఎస్సీ (పెట్రోలియం టెక్నాలజీ) కోర్సును అందిస్తోంది. ఈ కోర్సు కాల వ్యవధి రెండేళ్లు. బీఎస్సీ పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. ♦ వివరాలకు: www.unipune.ac.in ♦ రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–రాయ్‌బరేలీ, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తుంది. ♦ అర్హత: పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) నాలుగేళ్ల వ్యవధితో బీటెక్/బీఈ. తగిన గేట్ స్కోర్ కూడా ఉండాలి. ♦ వివరాలకు: www.rgipt.ac.in ♦ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)–డెహ్రాడూన్, ఎంటెక్ (పెట్రోలియం ఇంజనీరింగ్) కోర్సును అందిస్తోంది. ♦ అర్హత: హయ్యర్ అండ్ సెకండరీ లెవెల్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. 60 శాతం మార్కులతో పెట్రోలియం ఇంజనీరింగ్/అప్లైడ్ పెట్రోలియం ఇంజనీరింగ్/గ్యాస్ ఇంజనీరింగ్/పెట్రోలియం రిఫైనింగ్/పెట్రోకెమికల్ ఇంజనీరింగ్/జియోసైన్సెస్లో బీటెక్/బీఈ. తగిన గేట్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ♦ వివరాలకు: www.upes.ac.in -
సెంచరీకి చేరువైనా చెదరని సంకల్పం
సాక్షి, పాట్నా : ఉద్యోగం కోసమో, జీవితంలో స్థిరపడేందుకే ఎలాగోలా చదివేస్తే ఓ పనైపోతుందని భావించే యువతకు ఈ తాత స్టోరీ కనువిప్పు కలిగిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్న ఆయన స్వప్నం ఫలించేందుకు వయసునూ ఖాతరు చేయని ఆయన సంకల్పం అందరిలో స్ఫూర్తిని రగిలిస్తోంది. 98 సంవత్సరాల రాజ్ కుమార్ వైశ్య 1938లో ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. మళ్లీ అదే సబ్జెక్ట్‌లో 79 ఏళ్ల తర్వాత నలంద ఓపెన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన వైశ్య తాజాగా ఎంఏ (ఎకనమిక్స్)లో సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. 1940లో ఆయన ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాన్నివింటున్నానని, ఇది ఇప్పటికీ నినాదంగానే మిగిలిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తాను వార్తాపత్రికల్లో వ్యాసం రాస్తానని, మురికివాడల్లో పేదరికాన్నిప్రతిబింబించే ఫోటోలను తీసేందుకు తన కుమారుడిని కెమెరా ఇవ్వాలని కోరానని చెప్పారు.ఇక పీజీ పరీక్షల్లో తన విజయానికి తన కోడలు భారతి కారణమని రాజ్‌కుమార్ వైశ్య చెబుతున్నారు. పాట్నా కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేసిన భారతి పదవీవిరమణ చేశారు.తండ్రి ఎంఏ పట్టా పొందడంపై వైశ్య కుమారుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఇవి తమకు ఆనంద క్షణాలని వ్యాఖ్యానించారు. మరోవైపు తమ విశ్వవిద్యాలయ చరిత్రలో ఇది మరపురాని రోజని వర్సిటీ వీసీ ఎస్పీ సిన్హా వ్యాఖ్యానించారు. -
పీజీ తెలుగు ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ
కర్నూలు సిటీ: రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో ఎంఏ తెలుగుపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ప్రవేశ పరీక్షపై ఉచితంగా శిక్షణ ఇస్తామని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.ఎన్ రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల28వ తేదీ నుంచి తెలుగు అధ్యాపకులు కె.రామలింగారెడ్డి, డా.ఎన్.బి లోకరాజు శిక్షణ ఇస్తారన్నారు. స్థానిక డాక్టర్స్ కాలనీ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో తరగతులుంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్‌చే ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఈనెల 27వ తేదీలోగా కాలేజీలో అందజేయాలని సూచించారు. -
28 వరకు విద్యానిధి దరఖాస్తు గడువు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న అభ్యర్థులు మహాత్మ జ్యోతిబా పూలే (ఎంజేపీ) ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల లోపు https://telanganaepass. cgg.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంది. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించొద్దని, వయసు జులై 1 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా టోఫెల్/ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ/ జీమ్యాట్‌లో అర్హత సాధిస్తే సరిపోతుందని వివరించింది. -
నాణ్యత డొల్ల!
♦ నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తున్న బృందాలు ♦ తనిఖీల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ♦ పలు కాలేజీల్లో అధ్యాపకులూ లేని వైనం ♦ రంగంలోకి అదనంగా మరిన్ని బృందాలు ♦ ఈనెల 15న ప్రభుత్వానికి నివేదిక ♦ జిల్లాలో 420 బీటెక్, బీఫార్మసీ కాలేజీలున్నాయి. ఇప్పటికి 80 కాలేజీలను తనిఖీ చేశారు. చాలావరకు కళాశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాసంస్థలను నడపడంలేదని తేలింది. ♦ కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రెండు, మూడు కాలేజీలకు ఒక అధ్యాపక బృందం పనిచేస్తున్నట్లు బయటపడింది. ♦ ప్రైవేటు విద్యాసంస్థలపై రాష్ర్ట ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ నియమావళి మేరకు నాణ్యతాప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో 1,168 కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియెట్ మొదలు ఇంజనీరింగ్, మెడికల్, పోస్టుగ్రాడ్యుయేషన్ కాలేజీలున్నాయి. కాలేజీల్లో యాజమాన్యాలు నాణ్యతాప్రమాణాలు పాటించడంలేదని, బోధన సిబ్బంది సరిగ్గా ఉండడంలేదని, కనీసం విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉండడంలేదని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. అంతేకాకుండా వేలకు వేలు ఫీజులు వెచ్చించి.. కాలేజీల్లో చేరితే అక్కడ ల్యాబరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఉండడంలేద ని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యం లోనే ప్రైవేటు కళాశాలలపై దాడులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ శాఖ దాడులు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా లో తొలి విడతగా ఇంజనీరింగ్, బీ -ఫార్మసీ కాలేజీలను ఎన్ఫోర్స్మెంట్ తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించిం ది. ఇందులో విద్యాసంస్థల డొల్లతనం బయటపడింది. నిబంధనలు గాలికి.. జిల్లావ్యాప్తంగా 420 బీటెక్, బీఫార్మసీ కాలేజీలుండగా వీటిలో గురువారం నాటికీ 80 కాలేజీలను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో చాలావరకు కళాశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలకనుగుణంగా విద్యాసంస్థలను నిర్వహించ డంలేదని తేలింది. 60మంది విద్యార్థులకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉండాలనే నిబంధన ఉన్నా పాటించడంలేదని స్పష్టమైంది. కొన్ని కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో రెండు, మూడు కాలేజీలకు ఒక అధ్యాపక ృందం పనిచేస్తున్నట్లు బయటపడింది. నిపుణులైన అధ్యాపకులుండాలనే యూజీసీ నియమావళిని కూడా బేఖాతరు చేస్తున్నట్లు తేలింది. అప్పుడప్పుడే పీజీ పూర్తిచేసిన విద్యార్థులు లెక్చరర్లుగా పనిచేస్తున్నట్లు వెలుగులో కి వచ్చింది. పలు విద్యాసంస్థల్లో మౌలిక వసతులు ముఖ్యంగా తరగతి గదులు, భవనాలు కూడా లేవని తని ఖీల్లో గుర్తించారు. మరోవైపు విద్యాసంస్థలపై దాడులను తీవ్రతరం చేసేం దుకు మరిన్ని టీమ్‌లను విజిలెన్స్ శాఖ రంగంలోకి దించింది. జూన్ 15 తేదీ నాటికీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో తనిఖీ లను ముమ్మరం చేయాలని నిర్ణయిం చింది. దీంతో అదనంగా మరో పది ృందాలను దాడులకు మోహరించింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికీ విద్యాసంస్థలను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఐదు కళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ నో
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని 5 మెడికల్ కళాశాలల్లో 2016-17 సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల సీట్ల పెంపు ప్రతిపాదనలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( ఎంసీఐ) తిరస్కరించింది. జాబితాలో తెలంగాణ నుంచి ఉస్మానియా(హైదరాబాద్), కాకతీయ(వరంగల్), మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఘనపూర్, రంగారెడ్డి), ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(తిరుపతి), రంగరాయ మెడికల్ కళాశాల(కాకినాడ)లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో బోధన సిబ్బంది, సౌకర్యాలు తదితర వాటిపై తాను నియమించిన కౌన్సిల్ సభ్యులు అందించిన నివేదిక ఆధారంగా సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి నిరాకరించింది. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, రంగరాయ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో ఎంఎస్(జనరల్ సర్జరీ), ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంఎస్(ఆర్థోపెడిక్స్), మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ కళాశాలలో ఎంఎస్(ఓబీజీ-అబ్స్ట్రెటిక్ అండ్ గైనకాలజీ), ఎండీ(పీడియాట్రిక్స్) కోర్సుల్లో సీట్ల పెంపునకు ఎంసీఐకి ప్రతిపాదనలు అందాయి. సీట్ల పెంపును కోరుతూ ఆయా విద్యాసంస్థలు తమ కళాశాలల్లో అందిస్తున్న బోధన, సౌకర్యాల కల్పనపై నివేదికలను పరిశీలించిన ఎంసీఐ వీటిపై తనిఖీకి కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు ఆ కళాశాలల్లో తనిఖీ చేసి తగినంత మంది బోధన సిబ్బంది, సౌకర్యాలు లేవని తేలింది. సాంకేతిక లోపాలూ ఉన్నట్లు సభ్యులు గమనించారు. ఈ మేరకు ఎంసీఐకి పూర్తి వివరాలతో నివేదిక పంపారు. వీటిని పరిశీలించి సీట్ల పెంపును ఎంసీఐ నిరాకరించింది. పూర్తి వివరాలను శనివారం కమిటీ వెల్లడించింది. కారణాలీవీ... * శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో సాంకేతికపరమైన లోపాలతో పాటు అసలు ఈ సంస్థలో నిర్వహిస్తు న్న అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుకు ఇంకా గుర్తింపు లభించలేదని, యూజీ కోర్సుకు గుర్తింపు లభించేవరకూ పీజీ కోర్సు కోసం దరఖాస్తు చేసే అర్హత లేదని ఎంసీఐ స్పష్టం చేసింది. * కాకతీయ మెడికల్ కళాశాలలో తనిఖీ నిర్వహించినరోజు బెడ్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని, ప్రధాన వార్డ్ బయట వరండాలో బెడ్లు వేశారని, బోధనా సిబ్బంది తక్కువగా ఉన్నారని, లైబ్రరీ సౌకర్యాలు సరిపోవని కమిటీ గుర్తించింది. * మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో 2015లో జరిగిన మేజర్, మైనర్ ఆపరేషన్లపై కళాశాల అందించిన గణాంకాలు సరిగా లేవని, తనిఖీ జరిగిన రోజు బెడ్ ఆక్యుపెన్సీ, స్పెషాలిటీ క్లినిక్‌లో హాజరు తక్కువగా ఉందని కమిటీ గమనించింది. పీడియాట్రిక్స్ వార్డ్‌లో ఉదయం కేవలం 24 మంది పేషెంట్లు ఉండగా, సాయంత్రానికి 65 మంది ఉన్నట్లు గుర్తించింది. ఒకేసారి పేషెంట్ల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరగడం సాధ్యం కాదని, పైగా కొత్తగా చేరిన పేషెంట్లను పరిశీలిస్తే వారికీ ఏ విధమైన వైద్య సమస్యలు లేనివారిలా ఉన్నారని కమిటీ నిర్ధారించింది. * ఉస్మానియా, రంగరాయ మెడికల్ కళాశాలల్లో ఫాకల్టీ సంఖ్య తక్కువ, ఇతర లోపాల కారణంగా సీట్ల పెంపుప్రతిపాదనలను తిప్పిపంపాలని ఎంసీఐ నిర్ణయించింది. -
లేజీ వద్దు పీజీ ముద్దు
డిగ్రీ వరకు ఆటపాటలతో గడిపేసే విద్యార్థి పీజీలో మాత్రం ఏదో ఒక స్థాయిని, అర్హతను అందుకుంటాడు. గ్రాడ్యుయేషన్ వరకు లక్ష్యం అంటే ఏమిటో తెలియని కుర్రాడికి పీజీ ఓ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. దేశంలో ఎంతో మంది నాయకులకు, వ్యాపారవేత్తలకు వర్సిటీలే జీవితాన్ని బోధించాయి. యూనివర్సిటీలే బతుకు నేర్పించాయి. అందుకే డిగ్రీతో సరిపెట్టాలనుకునే విద్యార్థులకు అధ్యాపకులు, ఆచార్యులు పీజీ దారి చూపిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ అంటే కేవలం చదువు మాత్రమే కాదని, ఇది మనల్ని మనం మార్చుకునే వేదికని సూచిస్తున్నారు. జిల్లా విద్యార్థులకు మంచి మంచి యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. అందులో చేరేందుకు అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆలస్యం మాత్రం వద్దని అంటున్నారు. - ఎచ్చెర్ల * పీజీ చేయడం మేలంటున్న నిపుణులు * అందుబాటులో ఉత్తమ వర్సిటీలు * చదువుకునేందుకు బోలెడు అవకాశాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిగ్రీనే పెద్ద చదువైపోయింది. కొద్దిమంది వర్సిటీల్లో చేరి ఉన్నత స్థానాలకు వెళ్తున్నా ... ఇంకా చాలా మంది విద్యార్థులు డిగ్రీ అయిపోగానే డిఫెన్స్ వైపు, ఉద్యోగాల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే మరో రెండేళ్లు యూనివర్సిటీలో గడిపితే ఆ విద్యార్థి స్థాయి మారిపోతుందని, ఉన్నత ఉద్యోగాలూ వెతుక్కుంటూ వస్తాయని అధ్యాపకులు సూచిస్తున్నారు. ‘నాకు ఇంగ్లిష్ రాదు, నేను పెరిగింది పల్లెటూరిలో. నా యాస కూడా బాగోదు’ అనుకున్న విద్యార్థులే వర్సిటీలో చేరాక బంగారు పతకాలు సాధించిన సందర్భాలు బోలెడు. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్లే కాదు... కాలేజీలో గడిపిన రోజులు కూడా ఎన్నో విషయాలు వివరిస్తాయి. ఎన్నో సదుపాయాలు... వర్సిటీలో ఉండే విద్యార్థులకు గ్రంథాలయం రాత్రి 12 వరకు వరకు అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల పుస్తకాలు కళ్ల ముందరే ఉంటాయి. ఇంటర్నెట్ సమాచారానికీ లోటు ఉండదు. తాను చదువుతున్న పీజీ సబ్జెక్టులో నైపుణ్యం సాధిస్తే నెట్, స్లెట్ వంటి పరీక్షలు రాయవచ్చు. జూనియర్, సీనియర్ అధ్యాపకులుగా ఎంపిక కావచ్చు. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి ఎంపికలకు కూడా అర్హత లభిస్తుంది. ఎంఫిల్, డాక్టరేట్ వంటివి చేయవచ్చు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలకు అనువుగా చదవవచ్చు, ఉద్యోగాలు సాధించవచ్చు, వ్యక్తిగత క్రమశిక్షణ, ఉన్న వసతులు సద్వినియోగం చేసుకునే విద్యార్థులు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత నివ్వాలి విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. డిగ్రీ తర్వాత ఉన్నత విద్య అందుబాటులో ఉన్నా వర్సిటీల్లో చేరేందుకు ప్రాధాన్యమివ్వడం లేదు. విద్యార్థులు నిష్ణాతులుగా మారేందుకు ఉన్నత విద్య అవసరం. మెరుగైన భవిష్యత్ సైతం సాధ్యమవుతుంది. మరో పక్క పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను సైతం ప్రస్తుతం వర్సిటీల్లో ప్రోత్సహిస్తున్నాం. - ప్రొఫెసర్ గుంట తులసీరావు, రిజిస్ట్రార్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ. మంచి తరుణం మించిన రాదు... వర్సిటీలో అడుగు పెట్టేందుకు ఇదే మంచి సమయం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆంధ్రాయానివర్సిఈల ప్రవేశాలకు సంయుక్తంగా ఆసెట్- 2016 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు అన్లైన్లో ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలి. మే ఐదు నుంచి పరీక్షలు ఉంటాయి. వెబ్ కౌన్సిలింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది. డిగ్రీతో విద్య ఆపేయటం మంచిది కాదు ప్రస్తుతం డిగ్రీతో విద్యార్థులు చదవు ఆపేస్తున్నా రు. డిగ్రీనే అన్ని ఉద్యోగాలకు గరిష్ట అర్హత అన్న కోణం నుంచి బయటకు రావాలి. ఉన్నత విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉన్నత విద్యలో పరిశోధనలు, సదస్సులు, వర్క్ షాపులు నుంచి ఎంతో నేర్చు కోవచ్చు, ఉన్నత విద్య యువత ప్రతిష్టను సైతం సమాజంలో పెంచుతుంది. - పి.జయరాం, ప్రిన్సిపాల్ సన్ డిగ్రీ కాళాశాల, బీఆర్‌ఏయా పాలక మండలి సభ్యులు. కోర్సులే కోర్సులు ఏపీలో నంబర్ వన్ యూనివర్సిటీ ఆంధ్రా యూనివర్సిటీ, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 150 వరకు పీజీ కోర్సులు ఉన్నాయి. బీఆర్ఏయూలో పరిమితి కోర్సులు ఉన్నా స్థానికంగా ఉంటూ విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. వసతులు మాత్రం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. వర్సిటీలో పీజీ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎడ్, లైబ్రరీ సైన్స్, గణితం, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్ ఎంకాం, బయోటెక్నాలజీ, సోషల్ వర్క్, జియోటెక్, తెలుగు కోర్సులు ఉన్నాయి. అయితే రెండు యూనివర్సిటీల్లో న్యాయ విద్య చదవాలంటే విద్యార్థులు లాసెట్ రాయాల్సి ఉంటుంది. బీఎడ్ చదవాలంటే ఎడ్ సెట్ రాయాలి, ఎంబీఏ, ఎంసీఏ చదవాలంటే ఐసెట్ రాయాలి. విద్యార్థులు తమకు అనువైన కోర్సులు చదివేందుకు ఎంచు కోవాలి. వర్సిటీల్లో సీనియర్లను సంప్రదిస్తే గత కొన్నేళ్లగా అడ్మిషన్లు తక్కువగా ఉండే కోర్సులు సూచిస్తారు. దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికే ఆసెట్‌కు దరఖాస్తు చేసుకున్నా, సెట్ పరీక్ష విధానంపై నిపుణుల సూచనలు తీసుకుంటున్నా. డిగ్రీలో నేను రాసుకున్న నోట్సు సైతం నాకు ఉపయోగ పడుతుంది. ఆసెట్లో మంచి ర్యాంకు లక్ష్యం. - లోలుగు విజయ లక్ష్మి, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థి. విషయ పరిజ్ఞానం పెంచుకుంటా విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కృషిచేస్తాను. ఉన్నత విద్యతోనే సంపూర్ణ విషయ పరిజ్ఞానం సాధ్యం. సబ్జెక్టులో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాప్టు స్కిల్స్, బాషాపైపుణ్యం వంటి అంశాలపై ఉన్నత విద్యలో చేరాక ప్రత్యేక దృష్టి పెడతా. - ఎంవీఆర్జీ పల్లవి, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని. మానవ వనరులకు వేదిక.. ఉన్నత విద్య అనేది సమాజంలో ఉత్తమ మానవ వనరులును తీర్చిదిద్దుతుంది. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత నివ్వాలి. ఆంధ్రాయూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ యూనివర్సిటీలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సైతం గ్రంథాలయాలు, వసతి గృహాల్లో శ్రమించి చదివేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సాధారణ విద్యార్థులు సైతం నిష్ణాతులుగా మారే అవకాశం లభిస్తుంది. - డాక్టర్ కె.బూబూరావు, శ్రీకాకుళం పురుషుల కళాశాల ప్రిన్సిపాల్, పాలకమండలి సభ్యులు, బీఆర్‌ఏయూ. పీజీ లక్ష్యం పీజీలో చేరటం నాలక్ష్యం. ఇప్పటికే దరఖాస్తు సైతం చేసుకు న్నా. ప్రిపరేషన్ ప్రారంభించా. పాత ఆసెట్ ప్రశ్న పత్రాలు, వచ్చే ప్రశ్నలు సిబలస్, డిగ్రీలో ప్రధాన పాఠ్యాంశాలు చదువుతున్నా. పీజీలో చేరాక జీవితంలో సాధించాల్సినవి నిర్దేశిస్తా. - పొట్నూరు సాయిసుధ, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని పరిశోధనలకు ప్రాధాన్యం నాకు పరిశోధనాత్మక విద్య అంటే ఇష్టం. అందుకే పీజీలో చేరుతా. ఇంక్యుబేషన్ విద్యకు ప్రాధాన్యత ఇస్తాను. మా అధ్యాపకులు నుంచి సైతం చాలా విషయాలు గ్రహించాను. కొత్త ఆవిష్కరణలతోనే మంచి భవిష్యత్తు సాధ్యం. - నల్లనగూళ్ల లక్ష్మీ సాయి ప్రసన్న, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని. ఉన్నత విద్యతో విషయ పరిజ్ఞానం డిగ్రీతో చదువు నిలిపి వేస్తే సంపూర్ణ విషయ పరిజ్ఙానం సాధ్యం కాదు. ఉన్నత విద్యలో చేరేక, సబ్జెక్టుపై పట్టు వస్తుంది. మరో పక్క పోటీ పరీక్షల సాధనకు అనువైన వసతులు ఉంటాయి. - వావిలపల్లి జ్యోత్స్న, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని. -
పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ఉద్యోగాలు..
నరసరావుపేట వెస్ట్: డిగ్రీ విద్యార్ధులు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేస్తే మానసిక వికాసంతో పాటు ఉద్యోగాలు తప్పక పొందవచ్చని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ ఉపకులపతి ఏ.రాజేంద్రప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం ఇక్కడి శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ ( ఎస్ఎస్ఎన్) కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన పీజీ అడ్మిషన్ అవేర్నెస్ ప్రొగ్రామ్-2016లో ఆయన పాల్గొని మాట్లాడారు. పీజీ చదివిన విద్యార్ధులకు మంచి అవకశాలు లభిస్తాయని వెల్లడించారు. విశ్వవిద్యాలయ డైరెక్టర్ కేఆర్ఎస్.సాంబశివరావు, పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ఏ.రామిరెడ్డి, డిస్టెంట్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొఫెసర్ రామ్‌కుమార్ రత్నం తదితరులు విద్యార్ధుల సందేహాలు తీర్చారు. -
పీజీ.. క్రేజీ
* పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు పునర్వైభవం * ఓయూ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ * గతేడాది కంటే 25 వేలు అధికం సాక్షి,హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల విషయంలో గత వైభవం పునరావృతం అవుతోంది. పీజీ కోర్సులపై విద్యార్థుల్లో ఏటేటా క్రేజ్ పెరుగుతోంది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) నిర్వహిస్తున్న పీజీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండడమే ఇందుకు నిదర్శనం. ప్రతి ఏటా అందుతున్న దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. పదేళ్ల క్రితం వరకు విద్యార్థుల మొదటి ప్రాధాన్యత ఇంజినీరింగ్ విద్యదే. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. లక్షల మంది విద్యార్థులు బీటెక్ డిగ్రీల కోసం ఎంసెట్ రాయడానికి కుస్తీలు పడ్డారు. ఈ ప్రభావం డిగ్రీ, పీజీ కోర్సులపై పడింది. ఫలితంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. ఇంజనీరింగ్‌తో ఉపాధి లేదని... ఒకప్పుడు బీటెక్ చేయడానికి క్యూ కట్టిన యువత మార్కెట్లో ఇంజనీరింగ్ విద్యకు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేకపోవడం, సాఫ్ట్వేర్, ఐటీ బూమ్ నీటి బుడగలా మారడంతో మళ్లీ పీజీ కోర్సులపై దృష్టి సారించింది. సంప్రదాయ పీజీ కోర్సులతో ఇంజనీరింగ్ కంటే మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతాయని విద్యార్థులు భావిస్తుండడం వల్లే మళ్లీ పీజీ కోర్సులకు దరఖాస్తులు పెరుగుతున్నాయని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. డిగ్రీ, పీజీ వంటి సంప్రదాయ కోర్సులు చే సి కొంచెం కష్టపడితే సర్కారు కొలువులో సెటిలవ్వొచ్చని నేటి యువత భావిస్తోంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్స్ లక్ష్యంగా ఉన్న విద్యార్థులు మరో ఆలోచన లే కుండా సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులనే ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది తీవ్ర పోటీ.. గత మూడేళ్లుగా ఓయూ సెట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అనూహ్యంగా 25 శాతం పెరిగింది. ఓయూ సెట్లో అర్హత సాధిస్తే మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు వర్సిటీలతోపాటు ఓయూ పరిధిలోని కళాశాలల్లో పీజీ చేసుకోవచ్చు. మొత్తం 52 కోర్సుల్లో ప్రవేశాల్లో చేరేందుకు ఓయూ సెట్ అవకాశం కల్పిస్తోంది. ఇందులో 39 పీజీ ప్రోగ్రాంలు, 10 డిప్లోమా, 3 ఇంటిగ్రేట్ పీజీ ప్రోగ్రాంలు ఉన్నాయి. 2015-16 విద్యా సంవత్సరానికి 1.05 లక్షల ద రఖాస్తులు అందాయి. గతేడాది ఈ సంఖ్య 79,644 లే. అంటే ఒక్క ఏడాదికే దరఖాస్తుల సంఖ్య 25 వేలకు పెరిగింది. ఈ విద్యా సంవత్సరానికి అత్యధికంగా ఎంకాంకు 13 వేలకుపైగా, గణితానికి 9,400, కెమిస్ట్రీకి 7,700, పొలిటికల్ సైన్స్‌కు 6,300 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం వరకు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఓయూ అడ్మినిస్ట్రేటివ్ డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్. గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. -
బ్రిటన్‌లో సరస్వతీ పుత్రికల శకం!
బ్రిటన్‌లో చదువు విషయంలో అమ్మాయిలు దూసుకుపోతున్నారు. అబ్బాయిలతో పోటీ పడటం కాదు.. అబ్బాయిలను ఓడించి, అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. అక్కడి యూనివర్సిటీల్లోని విద్యార్థినీ విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే... ప్రస్తుతం అక్కడ సరస్వతీ పుత్రికల శకం నడుస్తోందని చెప్పవచ్చు. ప్రత్యేకించి పై చదువుల విషయంలో అమ్మాయిల హవా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ల కోసం యూనివర్సిటీల్లో స్థానం సీట్లు సంపాదిస్తున్న వాళ్లలో, ఆ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్లలో అమ్మాయిల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం లెక్కల ప్రకారం చూస్తే.. బ్రిటన్‌లోని టాప్ రేటెడ్ యూనివర్సిటీల్లో మొత్తం 4,12,170 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వీరిలో 2,32,250 మంది అమ్మాయిలు ఉండగా, అబ్బాయిల సంఖ్య 1,79, 920 మంది మాత్రమే. తేడా దాదాపు 50 వేల మందిపైనే! ఈ ఏడాదికే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రతియేటా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్న వాళ్లలో అమ్మాయిల సంఖ్య 50 నుంచి 60 వేలు ఎక్కువగా ఉంటోంది. దీంతో క్లాసురూముల్లో అబ్బాయిలు మైనారిటీలు అయిపోయారు. అమ్మాయిలు మెజారిటీలు అయిపోయారు. మహిళా సాధికారతలో ఇది మరో ముందడుగు అనే అభిప్రాయం వినిపిస్తోందిప్పుడు. అమ్మాయిల్లో చదువు మీద పెరిగిన ఆసక్తికి.. వారి పట్టుదలకు ఇది నిదర్శనమని అంటున్నారు స్థానిక విద్యావేత్తలు, మహిళా హక్కుల ఉద్యమకారిణులు. నిజంగా ఇది మంచి పరిణామం కదా! -
డిగ్రీ తర్వాత.. పయనమెటు?
అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి సంప్రదాయ గ్రూప్‌లతో డిగ్రీ పూర్తిచేసిన వారు ఆయా డిగ్రీలలోని గ్రూప్ సబ్జెక్టులు లేదా అనుబంధ సబ్జెక్టులలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు. ప్రస్తుతం పీజీలో సంప్రదాయ సబ్జెక్టులతో పాటు జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా వినూత్న స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఎంఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హ్యూమన్ జెనెటిక్స్, ఎంఎస్సీ కోస్టల్ ఆక్వాకల్చర్ అండ్ మెరైన్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫిజికల్ ఓషనోగ్రఫీ వంటి కోర్సులను చెప్పుకోవచ్చు. ఇంకా సెన్సైస్ అభ్యర్థులకు.. కెమిస్ట్రీ (ఇన్ఆర్గానిక్/ఆర్గానిక్/ఫిజికల్ ఆర్గానిక్/ఫార్మాస్యూటికల్/ ఫార్మకోఇన్ఫర్మాటిక్స్), అప్లైడ్ మ్యాథమెటిక్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, అప్లైడ్ న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, బయోఫిజిక్స్, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, నానోసైన్స్ తదితరాలు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ అభ్యర్థులు ఎంఏలో సంప్రదాయ ఆప్షన్లతో పాటు ఆంత్రోపాలజీ, డెవలప్మెంట్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఆర్కియాలజీ, సోషియాలజీ, సోషల్‌వర్క్, సైకాలజీ వంటి సబ్జెక్ట్‌లను ఎంపిక చేసుకోవచ్చు.ఎంకామ్‌లో.. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫైనాన్స్ అండ్ కంట్రోల్, కార్పొరేట్ సెక్రటరీషిప్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వంటివి ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలు, జేఎన్‌యూ-న్యూఢిల్లీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు అన్ని రకాల ఆప్షన్స్‌తో పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ సైన్స్ అభ్యర్థులు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ చేసే అవకాశాన్ని కొన్ని కోర్సులు కల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలుగా వ్యవహరిస్తారు. ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్- బెంగళూరు బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్.. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ (ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్) కోర్సును ఇగ్నో సహకారంతో నిర్వహిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీకే పరిమితం కాకుండా విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారిస్తే కెరీర్లో ఉన్నతంగా స్థిరపడవచ్చు. ఈ క్రమంలో పీజీ తర్వాత యూజీసీ-నెట్, సీఎస్ఐఆర్-నెట్ ద్వారా పీహెచ్డీ చేయొచ్చు. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో చేరడానికి పరిగణించే అర్హతల్లో నెట్/జేఆర్ఎఫ్ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు. సోషల్ సెన్సైస్ అభ్యర్థులకు కేవలం నెట్ ద్వారానే కాకుండా పరిశోధన కోర్సుల్లో చేరే అవకాశాన్ని కొన్ని ప్రముఖ ఇన్స్టిట్యూట్లు కల్పిస్తున్నాయి. అవి.. టిస్, సీఎస్డీఎస్, తదితరాలు. అభ్యర్థులు పంపించిన ప్రాజెక్ట్ ప్రతిపాదనల ఆధారంగా ఆయా ఇన్స్టిట్యూట్లు ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్మెంట్ దిశగా అడుగులు డిగ్రీ తర్వాత మేనేజ్మెంట్ కెరీర్ వైపు దృష్టి సారించాలనుకుంటే ఎంబీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్ లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్, మ్యాట్, సీమ్యాట్, ఎక్స్‌ఏటీ వంటి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. టెక్నికల్ వైపు ఆసక్తి ఉంటే ఎంసీఏ కోర్సును ఎంచుకోవచ్చు. ఇందుకోసం కూడా ఐసెట్ (ఇంటర్మీడియెట్ వరకు మ్యాథమెటిక్స్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఎంసీఏకు అర్హులు) పరీక్ష రాయాలి. అత్యధిక మంది ఎంపిక టీచింగ్ సంప్రదాయ డిగ్రీ కోర్సుల తర్వాత అత్యధిక మంది విద్యార్థులు టీచింగ్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో డిగ్రీ తర్వాత బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) రాయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. అటువంటి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎల్పీసెట్) రాయాలి. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలోని పలు ఇన్స్టిట్యూట్లు ఈ విభాగంలో బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. లా కోర్సులు న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే లా కోర్సులను ఎంచుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో లాసెట్ (లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు హాజరు కావచ్చు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్), ఏఐఎల్ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్), లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ఇండియా(ఎల్‌శాట్) తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావచ్చు. జర్నలిజం భారతదేశంలో మీడియాలోకి విదేశీ పెట్టుబడులను కేంద్రం అనుమతిస్తుండడంతో ఈ రంగంలోకి అనేక సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీంతో మీడియా రంగంలో అవకాశాలు కోకొల్లలు అని చెప్పొచ్చు. మీడియా మాస్ కమ్యూనికేషన్ అంటే ఒక్క ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాదు... ఇంకా సినిమాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, రేడియోలు, పరిశ్రమలు, సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ విభాగం, ఎడిటింగ్, స్క్రిప్ట్‌రైటింగ్, మ్యాగజైన్స్, వెబ్ జర్నలిజం.. ఇలా అన్నీ వస్తాయి. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన సాధనాలు పత్రికలు, టీవీలు. అందుకే గత ఐదేళ్లలో భారతదేశంలో టీవీ, పత్రికా రంగాలు గణనీయంగా వృద్ధి చెందాయి. దేశంలో జర్నలిజంలో శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పేరుతో రెండేళ్ల కోర్సు నిర్వహిస్తున్నాయి. మీడియాలో పోటీ నెలకొనడంతో నిష్ణాతులైన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా అనేక పత్రికలు, ఛానళ్లు సొంతంగా జర్నలిజంలో శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికి సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో నియామకాలకు ఖాళీలను బట్టి నోటిఫికేషన్లు విడుదల చేసి అభ్యర్థులను భర్తీ చేసుకుంటాయి. కొత్త కెరీర్లు డిగ్రీ విద్యార్థులు ప్రస్తుతం ఆవిర్భవించిన నూతన కెరీర్ వేదికల వైపు దృష్టి సారించడం ద్వారా మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. అటువంటి వాటిలో కొన్ని.. ఫ్యాషన్ డిజైనింగ్, రిటైల్ మార్కెటింగ్, ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, ఫార్మా, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆఫర్ చేసే ఫైనాన్షియల్ కోర్సులు, కార్పొరేట్ కమ్యూనికేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్, బీపీఓ, కెపీఓ, మెడికల్ ట్రాన్స్కిప్షన్. వీటికి సంబంధించి ఆయా విభాగాల్లో ఉండే పీజీ లేదా పీజీ డిప్లొమా, స్వల్ప కాలిక వ్యవధితో ఉండే డిప్లొమా కోర్సులను ఎంచుకోవచ్చు. తద్వారా మెరుగైన కెరీర్ దిశగా అడుగులు వేయవచ్చు. అందుకు అనుగుణంగా స్కిల్స్ మెరుగుపర్చుకోవడం తప్పనిసరి. బాసటగా విదేశీ భాషలు ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక రంగంతోపాటు వివిధ రంగాల్లో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ భాషల్లో నిష్ణాతులైన అభ్యర్థుల అవసరం పెరుగుతుంది. ముఖ్యంగా నాన్-ఇంగ్లిష్ స్పీకింగ్ దేశాల భాష తెలిసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ఫ్రెంచ్, జర్మనీ, రష్యన్, చైనీస్ భాషలకు బాగా డిమాండ్ ఉంది. ఉస్మానియా, ఇఫ్లూ, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న సంబంధిత కోర్సులను అధ్యయనం చేయడం ద్వారా ట్రాన్స్‌లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్, టీచింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ఉద్యోగమే లక్ష్యమైతే ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి సంబంధించి యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారుు. ఈ పరీక్షల్లో రాణించేందుకు అకెడమిక్స్ చదువుతూనే పోటీ పరీక్షల కోసం సిద్ధంకావాలి. ప్రతి రోజూ తాజా సమాచారాన్ని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఆయా పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ఇంటర్నెట్, పత్రికలు వంటి మాధ్యమాల ద్వారా సంబంధిత పరీక్షల సమాచారాన్ని క్షుణ్నంగా అవగాహన చేసుకోవాలి. గత విజేతలు, నిపుణులు సూచించిన ప్రామాణిక మెటీరియల్‌తో సన్నద్ధతను సాగించాలి. అవసరమైతే కోచింగ్ కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు అనుభవానికే ప్రాధాన్యమివ్వాలి. ఫలానా ఉద్యోగమే’ కావాలని వేచిచూసి.. సమయం వృథా చేసుకోకుండా.. అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవాలి. అనుభవం సంపాదించాలి. తద్వారా ఆ రంగంలో ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలి. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూనే సంబంధిత రంగంలో ఉన్నత విద్య అవకాశాలను అన్వేషించాలి. ప్రోత్సాహకాలు ప్రస్తుతం సైన్స్ విభాగంలో పీహెచ్డీ చేసిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దాంతో సంబంధిత విభాగాలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రాథమిక దశ నుంచే విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పలు రకాల స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను అందజేస్తుంది. అవి.. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై-www.kvpy.org.in), ఇన్స్పైర్ స్కాలర్షిప్స్/ఫెలోషిప్స్ (www.inspire-dst.gov.in), యూజీసీ కూడా దాదాపు 13 రకాల ఫెలోషిప్స్/ స్కాలర్షిప్స్ (ఠీఠీఠీ.ఠజఛి.్చఛి.జీ)ను, స్వర్ణజయంతి ఫెలోషిప్స్, మహిళల కోసం ఉమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ కింద ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తుంది. కేవలం బ్యాచిలర్ డిగ్రీకే పరిమితం కాకుండా, పీజీ/పీహెచ్డీ వంటి ఎన్నో ఉన్నత కోర్సులను చదవడానికి, పరిశోధనల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఈ స్కాలర్షిప్స్ ఉపయోగపడతాయి. దీన్ని బట్టి సైన్స్ స్ట్రీమ్‌కు ఎంత ప్రాధాన్యత లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో సైన్స్ కోర్సులను చదివితే అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు డిమాండ్ ప్రస్తుతం జాబ్ ఓరియెంటెడ్ డిగ్రీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే బ్యాచిలర్ స్థాయిలో వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. బీఎస్సీతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాల్లో రెండు, మూడు వారాల పాటు శిక్షణ ఇస్తున్నాం. ఆర్ట్స్ చదివే విద్యార్థులు కూడా కంప్యూటర్స్‌పై అవగాహన, డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్ వంటి అంశాలను నేర్చుకుంటున్నారు. బీఎస్సీలో న్యూట్రిషిన్, ఫుడ్ టెక్నాలజీ వంటి కాంబినేషన్లు ఉండటం వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఉద్యోగావకాశాలుంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి కోర్సులు పూర్తిచేసిన వారు ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఉన్నత విద్య దిశగా వెళ్లాలంటే పీజీ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం వల్ల కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. సొంత ప్రాజెక్టులతో అయితే స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు. - ప్రొఫెసర్ బి.టి.సీత, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ (మహిళలు), హైదరాబాద్. -
నేను ఏ బ్రాంచిలో చేరాలి?
ఎంసెట్ ర్యాంకులు రానే వచ్చాయి! ఇక భావి కెరీర్‌కు దారిచూపే ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్లోసెట్ కావాలి? స్నేహితుల మాటలు.. తల్లిదండ్రులు, బంధువుల సూచనలు.. వీటన్నింటినీ శోధించి, చివరిగా తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భవితను బంగారుమయం చేసే ఓ మంచి నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలపై ఫోకస్.. ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు: ఉన్నత విద్య: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్య ఉన్నతంగా ఉంటేనే అత్యున్నత అవకాశాలు చేజిక్కుతాయి. పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాకే, కెరీర్లోకి అడుగుపెట్టాలనుకుంటే దానికోసం ఉన్న అవకాశాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే కొన్ని సబ్జెక్టుల్లో పీజీ పూర్తిచేసేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు బ్యాచిలర్ స్థాయిలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరితే మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కోర్ స్పెషలైజేషన్ల్లోనే కాకుండా రోబోటిక్స్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ వంటి ఇతర స్పెషలైజేషన్లలోనూ పీజీ చేసేందుకు అవకాశముంటుంది. అదే బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో చేరితే తర్వాత పీజీ చేసేందుకు అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఉద్యోగావకాశాలు: ఏ బ్రాంచ్‌లో చేరినా, చివరికి మంచి ఉద్యోగం లభించడమే లక్ష్యం. అందువల్ల బ్రాంచ్ ఎంపికలో ఉద్యోగావకాశాలు అనేది కీలక అంశమని చెప్పొచ్చు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి బ్రాంచ్‌లు అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించేవిగా ఉన్నాయి. చాలామంది వీటికి తొలి ప్రాధాన్యం ఇస్తుండటానికి ఇదే కారణం. దీనర్థం ఉద్యోగావకాశాల పరంగా చూస్తే మిగిలిన బ్రాంచ్‌లు తక్కువని కాదు. ప్రస్తుతం ఏ బ్రాంచ్ తీసుకున్నా ఉద్యోగావకాశాలకు కొదవలేదు. కాకపోతే విద్యార్థి ఆయా నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. ప్రతిభ, సరైన నైపుణ్యాలు లేకుంటే.. ఆయా బ్రాంచ్‌కు సంబంధించి జాబ్ మార్కెట్లో ఎన్ని అవకాశాలు ఉన్నా లాభం లేదు! వేతనాలు: సాధారణంగా వేతనం అనేది వ్యక్తిగత ప్రతిభపై తప్ప ఇంజనీరింగ్ బ్రాంచ్‌పై ఆధారపడదని చెప్పొచ్చు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మాత్రమే అత్యధిక వేతనాలు అందుతున్నాయనే భావన ఉంది. ఇది వాస్తవం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ అత్యధిక వేతనాలు అందవు, కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ప్రొడక్షన్ తదితర ఇంజనీర్లకు కూడా ఆకర్షణీయ పే ప్యాకేజీలు అందుతున్నాయి. ఏ బ్రాంచ్ వారైనప్పటికీ వ్యక్తిగత ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే మంచి వేతనాలు అందుతాయని కచ్చితంగా చెప్పొచ్చు. తల్లిదండ్రుల ఒత్తిడి: తల్లిదండ్రులు ఉద్యోగావకాశాలు, వేతనాలు బాగుండే బ్రాంచ్‌ల్లో చేరాలంటూ తమ పిల్లలపై ఒత్తిడి తేకూడదు. పిల్లల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా ఫలానా బ్రాంచ్‌లోనే చేరాలంటూ పట్టుపట్టకూడదు. అభిరుచి: బ్రాంచ్ ఎంపికలో అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశం విద్యార్థి అభిరుచి. కానీ, దీన్ని చాలా మంది తల్లిదండ్రులు, విద్యార్థులు విస్మరిస్తుంటారు. ఇప్పుడు ఎంపిక చేసుకున్న బ్రాంచ్‌లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తిచేశాక, జీవితాంతం సంబంధిత రంగంతో అనుబంధం ఉంటుంది. ఇంతటి కీలకమైన బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థులు తమ అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆసక్తిని గౌరవించి, ప్రోత్సహించాలి. ఆసక్తి లేని రంగంలో ఎవరూ రాణించలేరన్న వాస్తవాన్ని గుర్తించాలి. ఇష్టమైన రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్ని తేలిగ్గా చేరుకోగలరు. శోధించి, నిర్ణయించు ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు.. సంబంధిత బ్రాంచ్ తాలూకు ప్రస్తుత ధోరణి ఎలా ఉందో ఇంటర్నెట్ సహాయంతో తెలుసుకోవాలి. బ్రాంచ్‌ల సబ్జెక్టులు; దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు వంటి వాటిపై అవగాహన పెంపొందించుకొని తుది నిర్ణయం తీసుకోవాలి. అభిరుచికి, వ్యక్తిగత సామర్థ్యానికి దగ్గరగా ఉన్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఏ బ్రాంచ్‌కు సరైనవారు? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: మీరు కంప్యూటర్‌పై (సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్) ఆసక్తి కనబరుస్తున్నారా? పజిల్స్‌ను వీలైనంత త్వరగా సాధించడం మీకిష్టమా? మీకు మ్యాథమెటికల్, అనలిటికల్/ లాజిక్ నైపుణ్యాలున్నాయా? మీకు మంచి ప్రజ్ఞా సూచి (ఐక్యూ) ఉందా? పై ప్రశ్నల్లో ఎక్కువ వాటికి మీ సమాధానం అవును అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌కు మీరు సరిపోతారు. ఈ బ్రాంచ్‌లో రాణించేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో అవే నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచి విద్యార్థులకూ అవసరం. సిలబస్‌లో రెండు బ్రాంచ్‌ల మధ్య స్వల్ప తేడా ఉంటుంది. ప్లేస్‌మెంట్స్, ఉద్యోగావకాశాలు, వేతనాల విషయంలో రెండింటికీ మధ్య పెద్ద తేడా ఉండదు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీరెప్పుడైనా కాలిక్యులేటర్‌ను తెరిచి, దాని పనితీరు గురించి తెలుసుకోవాలనుకున్నారా? కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్లు, ఐసీలపై ఆసక్తి కనబరుస్తున్నారా? విడి పరికరాలు కొని, సొంతంగా పర్సనల్ కంప్యూటర్ను తయారు చేయాలనుందా? మీ ఇంట్లోని ఎలక్ట్రికల్ ఉపకరణాల పనితీరును తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఎలక్ట్రికల్ మోటార్/టర్బైన్/జనరేటర్ వాస్తవంగా ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? పర్సనల్ రోబోట్ గురించి తెలుసుకోవాలనుందా? పై ప్రశ్నలకు మీ సమాధానం ‘‘అవును’’ అయితే.. ఈఈఈ బ్రాంచ్‌లో మీరు చేరొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో పట్టున్న వారు ఈ కోర్సులో వెంటనే చేరిపోవచ్చు. మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ మీ బైకును రిపేర్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డారా? బైకులు, కార్లను డిజైన్ చేయడంపట్ల మీకు ఆసక్తి ఉందా? మీకు ఫిజిక్స్ అంటే ఇష్టమా? మీకు డ్రాయింగ్ నైపుణ్యాలున్నాయా? మీ ఇంజనీరింగ్ నైపుణ్యాలను సామాన్య మానవుడి బాగు కోసం ఉపయోగించాలనుకుంటున్నారా? పై ప్రశ్నలకు మీ సమాధానం ‘అవును’ అయితే.. ఇక ఈ బ్రాంచ్ మీకు సరిపోతుంది. శ్రమించే తత్వం ఉన్నవారికి ఈ బ్రాంచ్ అనుకూలం. చాలా కళాశాలల్లో మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు రెండూ వేర్వేరుగా ఉంటాయి. వీటి సిలబస్ మాత్రం దాదాపు ఒకటే. సివిల్ ఇంజనీరింగ్ భవన నిర్మాణాలపట్ల మీకు ఆసక్తి ఉందా? మీ ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారా? ఒక భారీ భవనాన్ని చూసిన తర్వాత అసలు ఈ నిర్మాణాన్ని ఎలా పూర్తిచేశారని ఎప్పుడైనా ఆలోచించారా? సమాజంలోని సమస్యలు, ప్రజల డిమాండ్లను పరిష్కరించడంలో మీకు ఆసక్తి ఉందా? పై ప్రశ్నలకు మీ సమాధానం ‘‘అవును’’ అయితే.. ఈ బ్రాంచ్ మీకు సరిపోతుంది. సమాజ సమస్యల పరిష్కారంలో చొరవ చూపడంతోపాటు మానవ జీవితం సౌకర్యవంతంగా సాగిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తుండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల పట్ల మీకు ఆసక్తి ఉందా? మీ ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పనిచేసే విధానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు కంప్యూటర్ సీపీయూలో వాస్తవంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మైక్రోప్రాసెసర్స్/కమ్యూనికేషన్స్ పట్ల మీకు ఆసక్తి ఉందా? పై ప్రశ్నలకు మీ సమాధానం ‘‘అవును’’ అయితే.. ఈ బ్రాంచ్ మీ కోసమే. సీఎస్ఈ, ఈఈఈలోని కొన్ని సబ్జెకులు ఇందులోనూ ఉంటాయి. ఈ బ్రాంచ్‌లో చేరాలంటే.. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో గట్టి పట్టు ఉండాలి. ఇక ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌ల మధ్య కొద్ది తేడానే ఉంటుంది. సరైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవడం ఎంత ప్రధానమో, సరైన కాలేజీని ఎంపిక చేసుకోవడమూ అంతే ముఖ్యం. అందుబాటులో ఉన్న కళాశాలలు, వాటి గుర్తింపు స్థితిగతులు, మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, ప్లేస్‌మెంట్స్ తదితరాలను విశ్లేషించుకొని కాలేజీని ఎంపిక చేసుకోవాలి. దీనికోసం కళాశాల వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలి. పూర్వవిద్యార్థుల నుంచి సమాచారం తీసుకోవాలి. ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునే ముందు విద్యార్థి.. సంబంధిత రంగంలో పనిచేస్తున్న వారిని సంప్రదించాలి. వారి జీవన సరళిని, కెరీర్ అవకాశాలను అధ్యయనం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ బ్రాంచ్ ఎంపికపట్ల తుది నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది. మీ చేతికున్న ఐదు వేళ్లలో ఏ వేలు మంచిదనే దానికి సమాధానం చెప్పడం ఎంత కష్టమో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో ఏది మంచిది? అనే దానికి సమాధానం చెప్పడం కూడా అంతే కష్టం! ప్రతి బ్రాంచ్‌కూ తనకే సొంతమైన కొన్ని సానుకూలతలుంటాయి. ప్రస్తుత సమాజాభివృద్ధికి అన్ని బ్రాంచ్‌ల ఇంజనీర్లూ అవసరమే. అందువల్ల గందరగోళానికి గురికాకుండా వ్యక్తిగత అభిరుచులు, సామర్థ్యం, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకొని, పట్టుదలతో శ్రమిస్తే మీరు ఉత్తమ ఇంజనీర్‌గా నిలవడం తథ్యం! వ్యక్తిగత సామర్థ్యం, ఆసక్తి ఆధారం విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత ఏమిటి? అనే ప్రశ్న వేసుకొని సరైన ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. కేవలం తల్లిదండ్రులు, స్నేహితుల సూచనలపైనే పూర్తిగా ఆధారపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. విదేశాల్లో ఉద్యోగావకాశాలతో పోల్చితే భారత దేశ జాబ్ మార్కెట్ భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల వచ్చే నాలుగైదేళ్లలో ఇక్కడ జాబ్ మార్కెట్ ఏయే రంగాల్లో బాగుంటుంది. ఉన్నత చదువులు చదివేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక స్థితిగతులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. విద్యార్థులు బ్రాంచి ఎంపికలో ఉద్యోగానికే తొలి ప్రాధాన్యం ఇస్తారు. అయితే అదే సమయంలో పరిశోధన, సృజనాత్మక రంగం దిశగా కూడా వెళ్లొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిపై ఆసక్తి ఉన్నవారు రీసెర్చ్‌కు అవకాశమున్న బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి. అన్నింటికీ మించి విద్యార్థులు.. తమ సామర్థ్యం, ఇష్టాయిష్టాల ఆధారంగా బ్రాంచ్‌ను ఎంపిక చేసుకుంటే ఎంచుకున్న లక్ష్యాన్ని తేలిగ్గా చేరగలరు! - సీహెచ్ శోభన్‌బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐఐటీ హైదరాబాద్.