‘ఉన్నత’ పరీక్షలకే మొగ్గు  | Universities in State Taking Steps To Conduct Exams For UG And PG Final Year | Sakshi
Sakshi News home page

‘ఉన్నత’ పరీక్షలకే మొగ్గు 

Published Fri, Jul 17 2020 3:57 AM | Last Updated on Fri, Jul 17 2020 4:32 AM

Universities in State Taking Steps To Conduct Exams For UG And PG Final Year - Sakshi

సాక్షి, అమరావతి : ఉన్నత విద్యాకోర్సులైన యూజీ, పీజీ ఫైనలియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌లోగా పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు చర్యలు చేపడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు, ఇతర అంశాల దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, కేంద్ర మానవ వనరులశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం ఆయా వర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తోంది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్‌లోగా పరీక్షలు నిర్వహించేలా వర్సిటీలకు సూచిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.  

ఏపీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్‌ వర్సిటీలు 54 ఉండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 30 ఉన్నాయి. వీటి పరిధిలో 3,285 కాలేజీలు యూజీ, పీజీ సహా వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయి. 
► ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ కాకినాడ, అనంతపురం, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, నాగార్జున వర్సిటీల పరిధిలో ఎక్కువగా అఫ్లియేటెడ్‌ కాలేజీలున్నాయి.  
► ఆంధ్రా వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు 600 వరకు ఉన్నారు. పరీక్షల నిర్వహణలో వీరిని కూడా పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.  

నేడు గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌..  
యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల నిర్వహణ, బోధనాభ్యసన ప్రక్రియలు, విద్యార్థుల పరిస్థితిపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శుక్రవారం వీసీలు, ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు.  

ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఎగ్జామ్స్‌
పరీక్షల నిర్వహణపై యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. విద్యార్థులు యూనివర్సిటీ పరిధి దాటి బయటి ప్రాంతాల్లో ఉంటే వారికి అక్కడ అందుబాటులో ఉన్న కాలేజీలో పరీక్షలు నిర్వహించాలని సూచించాం. ఇందుకు అనుగుణంగా ప్రతి వర్సిటీ తన పరిధిలోని విద్యార్థులు ఎక్కడ ఉన్నారో సమాచారం సిద్ధం చేసుకోవాలి. జేఎన్‌టీయూల సాంకేతిక సహకారంతో ఇతర ప్రాంతాలకు ప్రశ్నపత్రాలు పంపి పరీక్షలు నిర్వహించాలని సూచించాం. 
–ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌)

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సూచనల మేరకు సెప్టెంబర్‌లో యూజీ, పీజీ ఫైనలియర్‌ పరీక్షల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అఫ్లియేటెడ్‌ కాలేజీల్లో గతంలో పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్యను 50 శాతానికి తగ్గించి సవరించిన షెడ్యూల్‌ విడుదల చేస్తాం. సహేతుక కారణాలతో పరీక్షలు రాయలేని వారికి తరువాత ప్రత్యేకంగా నిర్వహిస్తాం. ఫైనలియర్‌ కాకుండా మిగతా ఏడాది విద్యార్థులను పై తరగతుల్లోకి ప్రమోట్‌ చేసి ఉన్నత విద్యామండలి సూచనల మేరకు నవంబర్‌లో పరీక్షలు పెడతాం.    
 - పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఆంధ్రా వర్సిటీ ఉపకులపతి, విశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement