ఫలితాలు విడుదల చేస్తున్న లింబాద్రి
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్ 2022)లో 91.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 2 నుంచి 5 వరకు జరిగిన ఈ పరీక్షలకు 12,592 మంది విద్యార్థులు హాజరుకాగా, 11,520 మంది అర్హత సాధించారు. అందులో 6,440 మంది అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు.
శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్, రిజిస్ట్రార్, పీజీఈసెట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ పరీక్ష ద్వారా 115 కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పీజీఈసెట్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత 93 శాతంగా నమోదు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 89.62 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు.
ఫార్మసీలో అధికం
పీజీఈసెట్‌కు హాజరైన వారిలో ఫార్మసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 12,592 మంది హాజరుకాగా, అందులో 5,452మంది కేవలం ఫార్మసీ విద్యార్థులే ఉన్నారు. వారిలో 5,186 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,027మంది పరీక్షకు హాజరుకాగా, 1,782 మంది అర్హత సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1,279 మంది హాజరుకాగా,1,211 మంది ఉత్తీర్ణత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment