ఇక పీజీ ఇంగ్లిష్‌ కష్టమేనా? | Education department about post graduation | Sakshi
Sakshi News home page

ఇక పీజీ ఇంగ్లిష్‌ కష్టమేనా?

Published Fri, Jun 22 2018 2:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Education department about post graduation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీలో 20 క్రెడిట్స్‌తో ఇంగ్లిష్‌ సబ్జెక్టును చదువుకుని ఎక్కడైనా పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ) చేసుకునేలా ఇప్పటివరకు ఉన్న అవకాశం ఇకపై దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టంలో (సీబీసీఎస్‌) డిగ్రీలో ఇంగ్లిష్‌లో ఇప్పటివరకు 20 క్రెడిట్స్‌ ఉండగా, వాటిని ఇపుడు 18 క్రెడిట్స్‌కు తగ్గించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అదే జరిగితే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో పీజీ ఇంగ్లిష్‌ చదివే అవకాశమే లేకుండా పోతోందన్న ఆందోళన యూనివర్సిటీల ఇంగ్లిష్‌ విభాగాల నుంచి వ్యక్తం అవుతోంది.

మన రాష్ట్రంలోనూ ఏదేని భాషలో పీజీ చేయాలంటే కచ్చితంగా డిగ్రీలో 20 క్రెడిట్స్‌తో ఆ సబ్జెక్టు చదివి ఉండాల్సిందే. డిగ్రీలో ఇంగ్లిష్‌కు క్రెడిట్స్‌ తగ్గిస్తున్నందున.. మన రాష్ట్రంలో పీజీ ఇంగ్లిష్‌లో ప్రవేశాలకు ఉండాల్సిన క్రెడిట్స్‌ను తగ్గించే అవకాశం ఉన్నా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం దూరం కానుందని ఇంగ్లిష్‌ విభాగం ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.మరోవైపు ఇంగ్లిష్‌లో ఉన్న గ్రామర్, ప్రోజ్, పొయెట్రీ విభాగాలు కాకుండా జెండర్‌ సెన్సిటైజేషన్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను ప్రవేశ పెట్టి ఇంగ్లిష్‌ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గిస్తున్నారని విమర్శిస్తున్నారు.

ఫైనల్‌ ఇయర్‌లో ఆప్షనేది?
డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో విద్యార్థులకు ఆప్షనల్స్‌ లేకుం డా చేస్తున్నారని, విద్యార్థి తనకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకునే వీలు లేకుండా చేస్తున్నారని ప్రొఫెసర్లు మొత్తుకుంటున్నారు. ఇప్పటివరకు డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో విద్యార్థి రెండు ఆప్షనల్స్‌ను (ఎలెక్టివ్‌) ఎంచుకునే అవకాశం ఉంది. అయితే దానిని తొలగించి ఒకటే ఆప్షనల్‌ను చదువుకునేలా చేస్తున్నారని, ఇది సీబీసీఎస్‌ స్పిరిట్‌కే విరుద్ధమని పేర్కొంటున్నారు.

మరోవైపు సీబీసీఎస్‌లో కోర్‌ సబ్జెక్టులకు 60 శాతం క్రెడిట్స్, ఎలక్టివ్‌కు 40 శాతం క్రెడిట్స్‌ ఉండాలి.అప్పుడే ఆ కోర్సుకు జాతీయ స్థాయిలో ఈక్వలెన్స్‌ ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లిష్‌కు క్రెడిట్స్‌కు తగ్గిస్తుండటంతో కోర్‌ సబ్జెక్టులకు 60 శాతం క్రెడిట్‌ లేకుండాపోయే పరిస్థితి నెలకొందని, దానివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. అలాగే ప్రస్తు తం ఇండియన్‌ మోడ్రన్‌ లాంగ్వేజ్‌/అదర్‌ లాంగ్వేజ్‌ అని ఉండగా, అదర్‌ లాంగ్వేజ్‌ను తొలగించేలా ప్రతిపాదించారని, దానివల్ల సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌ వంటి క్లాసికల్‌ లాంగ్వేజెస్‌ను విద్యార్థులు చదివే అవకాశం లేకుండా పోతుందని పేర్కొన్నారు.


రెండేళ్లకే సమీక్ష..
డిగ్రీలో ఏ కోర్సు అయినా జాతీయ స్థాయిలో ఒకేలా ఉండేందుకు, విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీసీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రెండేళ్ల కిందట యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులుచేసి రాష్ట్రంలో డిగ్రీలో సీబీసీఎస్‌ను అమల్లోకి తెచ్చారు.

అయితే ఒక్క బ్యాచ్‌ కూడా పూర్తి కాకముందే అందులో మార్పులు తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు చేయనున్న మార్పులతో రూపొందించిన డ్రాఫ్ట్‌ ను వర్సిటీలకు పంపించింది. సమావేశాలు నిర్వహించిన అభిప్రాయాలను సేకరించింది. అయితే వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం చేయనున్న మార్పులపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement