Cbcs
-
పాత సిలబసే..!
రాష్ట్రంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)కు అనుగుణంగా డిగ్రీలో సిలబస్‌ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి వాయిదా వేసుకుంది. ఇటీవల మండలి చైర్మన్, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల సమావేశంలో సిలబస్‌పై ఒక నిర్ణయానికి వచ్చారు. డిగ్రీ సిలబస్, సీబీసీఎస్ క్రెడిట్స్ విధానంలో మార్పులపై చర్చించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వచ్చే విద్యాసంవత్సరం (2019–2020) డిగ్రీ సిలబస్‌ను సమూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తుందనే ఉద్దేశంతో పాత సెలబస్‌నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఫలితంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు కూడా పాతసిలబస్నే అనుçసరించి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్): డిగ్రీ తరగతులు ప్రారంభమైన మొదట్లో సెలబస్ మారుతుందని మల్లాగుల్లాలు పడిన అధాపకులు.. పాత సిలబస్‌లోని ప్రాథమిక అంశాలను మాత్రమే బోధిస్తూ కొద్ది రోజులు కాలంగడిపా రు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి తాజాగా తీసుకున్న నిర్ణయంతో పాత సిలబస్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. పాఠ్యాంశాల బోధనలో వేగం పెంచారు. డిగ్రీ కోర్సుల్లో చాయిస్ బేస్ట్ క్రెడిట్ సిస్టం అమలులోకి వచ్చాక ఆరునెలల్లో ఒక సెమిస్టర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిగ్రీ తరగతులు జూలైలో ప్రారంభం కాగా జనవరిలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మొదట్లో సెలబస్‌పై స్పష్టత లేక దాదాపు పదిహేను, ఇరవై రోజులు గత సెలబస్లోని ప్రాథమికాంశాలు మెల్లిమెల్లిగా బోధిస్తూ వచ్చారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు కూడా సిలబస్ ఇదేనో..? కాదో..? అనుకుని తరగతులపై పెద్దగా దృష్టిసారించలేదు. మారుతుందనే ఆలోచనతో ఇటూ అధ్యాపకులూ మనసు పెట్టకుండా సమయం వృథా చేశారు. తీరా ఉన్నత విద్యామండలి పాత సెలబస్‌నే అనుసరించాలనే నిర్ణయానికి రావడంతో సెలబస్, పాఠ్యాంశాలపై స్పష్టత ఏర్పడింది. దీనితో వివిధ కళాశాలల్లో సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో వేగం పెంచినట్లు సమాచారం. నాలుగు నెలల్లోనే బోధన...! డిగ్రీలో సెమిస్టర్ విధానం అమలైన నాటినుండి దాదా పు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలు అన్ని లెక్కకడితే రెం డు నెలల సమయం పరీక్షలు రాయడానికే కేటాయించాల్సి వస్తుంది. దీంతో నాలుగు నెలల్లోనే అనుకున్న సిలబస్ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 20రోజుల పైగానే సిలబస్‌పై స్పష్టత లేకుండానే బోధన సాగింది. అంటే మెజారిటీ సెలబస్ దాదాపుగా 90 నుంచి 100 రోజుల్లోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. సిలబస్ మారుతుందనే ఉద్దేశంతో మెల్లిగా బోధిస్తూ వచ్చిన అద్యాపకులు.. ఇప్పుడు మిగిలిన రోజులకు పాఠ్యప్రణాళిక రూపొందించుకుని వేగంగా లక్ష్యాన్ని గడువులోపు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంత చేసినా కొన్ని కళాశాలల్లో సెమిస్టర్ ఆఖరులో కొన్నిసబ్జెక్టులకు ప్రత్యేకంగా అదనపు తరగతులు, సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతూనే ఉంది. సిలబస్ ప్రకారం కొన్ని కోర్సుల సెలబస్ ఇచ్చిన గడువులో పూర్తవుతుంది కానీ మరికొన్ని సబ్జెక్టులు ఇందులో ముఖ్యంగా ఒకటి, రెండు కంప్యూటర్స్‌కు సంబంధించిన సెలబస్‌కు ఆరు నెలల సమయం సరిపోదని విద్యావేత్తలు భావిస్తున్నారు. ప్రవేశాలిలా... శాతవాహన యూనివర్సిటీలో మొత్తం బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో కలుపుకుని 45,471 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈ విద్యాసంవత్సరానికి 20,350 సీట్లు భర్తీ కాగా 44.75 శాతం నమోదైంది. 25,121 సీట్లు ఖాళీగానే మిగిలాయి. ఇందులో ఎక్కువ శాతం విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం వైపు మొగ్గుచూపినట్లు ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.యూనివర్సిటీ పరిధిలో 81 శాతం ఇంగ్లిష్ మీడియం సీట్లుండగా దాదాపుగా 19 శాతం వరకు తెలుగు మీడియంలో సీట్లున్నాయి. కానీ 49 శాతం ఇంగ్లిష్ మీడియం సీట్లు భర్తీకాగా.. కేవలం 27 శాతమే తెలుగు మీడియం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్లో ఇంగ్లిష్‌మీడియం చదువుకున్న వారితో పాటు చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు కూడా డిగ్రీలో ఇంగ్లిష్ మీడియంను ఎంచుకున్నారు. కానీ తరగతి గదిలో బోధనను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంటర్ నుండి డిగ్రీలోనే మీడియం మార్పు చేసుకున్నారు కాబట్టి తరగతి గదిలో తెలుగులో, ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలు బోధించాలని అధ్యాపకులను యాజమాన్యాలు సూచిస్తున్నాయి. కష్టమైనా సరే ఇంగ్లిష్మీడియంలోనే చదువాలని విద్యార్థులు నిర్ణయించుకుంటున్నారని అర్థమవుతోంది. రానున్న రోజుల్లో తెలుగు మీడియం చదివే అభ్యర్థులు కరవువుతారనే భావన విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. డిగ్రీ సెలబస్ మార్పు అంశంపై వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డిని సంప్రదించగా.. పాత సెలబస్‌నే అనుసరించాలని సూచించారు. -
ఇక పీజీ ఇంగ్లిష్ కష్టమేనా?
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో 20 క్రెడిట్స్‌తో ఇంగ్లిష్ సబ్జెక్టును చదువుకుని ఎక్కడైనా పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చేసుకునేలా ఇప్పటివరకు ఉన్న అవకాశం ఇకపై దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో (సీబీసీఎస్) డిగ్రీలో ఇంగ్లిష్‌లో ఇప్పటివరకు 20 క్రెడిట్స్ ఉండగా, వాటిని ఇపుడు 18 క్రెడిట్స్‌కు తగ్గించేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అదే జరిగితే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో పీజీ ఇంగ్లిష్ చదివే అవకాశమే లేకుండా పోతోందన్న ఆందోళన యూనివర్సిటీల ఇంగ్లిష్ విభాగాల నుంచి వ్యక్తం అవుతోంది. మన రాష్ట్రంలోనూ ఏదేని భాషలో పీజీ చేయాలంటే కచ్చితంగా డిగ్రీలో 20 క్రెడిట్స్‌తో ఆ సబ్జెక్టు చదివి ఉండాల్సిందే. డిగ్రీలో ఇంగ్లిష్‌కు క్రెడిట్స్ తగ్గిస్తున్నందున.. మన రాష్ట్రంలో పీజీ ఇంగ్లిష్‌లో ప్రవేశాలకు ఉండాల్సిన క్రెడిట్స్‌ను తగ్గించే అవకాశం ఉన్నా.. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు మాత్రం ఆ అవకాశం దూరం కానుందని ఇంగ్లిష్ విభాగం ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.మరోవైపు ఇంగ్లిష్‌లో ఉన్న గ్రామర్, ప్రోజ్, పొయెట్రీ విభాగాలు కాకుండా జెండర్ సెన్సిటైజేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రవేశ పెట్టి ఇంగ్లిష్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఫైనల్ ఇయర్లో ఆప్షనేది? డిగ్రీ ఫైనల్ ఇయర్లో విద్యార్థులకు ఆప్షనల్స్ లేకుం డా చేస్తున్నారని, విద్యార్థి తనకు ఇష్టమైన సబ్జెక్టును చదువుకునే వీలు లేకుండా చేస్తున్నారని ప్రొఫెసర్లు మొత్తుకుంటున్నారు. ఇప్పటివరకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో విద్యార్థి రెండు ఆప్షనల్స్‌ను (ఎలెక్టివ్) ఎంచుకునే అవకాశం ఉంది. అయితే దానిని తొలగించి ఒకటే ఆప్షనల్‌ను చదువుకునేలా చేస్తున్నారని, ఇది సీబీసీఎస్ స్పిరిట్‌కే విరుద్ధమని పేర్కొంటున్నారు. మరోవైపు సీబీసీఎస్‌లో కోర్ సబ్జెక్టులకు 60 శాతం క్రెడిట్స్, ఎలక్టివ్‌కు 40 శాతం క్రెడిట్స్ ఉండాలి.అప్పుడే ఆ కోర్సుకు జాతీయ స్థాయిలో ఈక్వలెన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లిష్‌కు క్రెడిట్స్‌కు తగ్గిస్తుండటంతో కోర్ సబ్జెక్టులకు 60 శాతం క్రెడిట్ లేకుండాపోయే పరిస్థితి నెలకొందని, దానివల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. అలాగే ప్రస్తు తం ఇండియన్ మోడ్రన్ లాంగ్వేజ్/అదర్ లాంగ్వేజ్ అని ఉండగా, అదర్ లాంగ్వేజ్‌ను తొలగించేలా ప్రతిపాదించారని, దానివల్ల సంస్కృతం, ఉర్దూ, అరబిక్ వంటి క్లాసికల్ లాంగ్వేజెస్‌ను విద్యార్థులు చదివే అవకాశం లేకుండా పోతుందని పేర్కొన్నారు. రెండేళ్లకే సమీక్ష.. డిగ్రీలో ఏ కోర్సు అయినా జాతీయ స్థాయిలో ఒకేలా ఉండేందుకు, విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీసీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రెండేళ్ల కిందట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులుచేసి రాష్ట్రంలో డిగ్రీలో సీబీసీఎస్‌ను అమల్లోకి తెచ్చారు. అయితే ఒక్క బ్యాచ్ కూడా పూర్తి కాకముందే అందులో మార్పులు తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు చేయనున్న మార్పులతో రూపొందించిన డ్రాఫ్ట్ ను వర్సిటీలకు పంపించింది. సమావేశాలు నిర్వహించిన అభిప్రాయాలను సేకరించింది. అయితే వివిధ యూనివర్సిటీల్లో ప్రస్తుతం చేయనున్న మార్పులపై వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది. -
దూరవిద్యలో.. సీబీసీఎస్!
అమలు దిశగా అడుగులేస్తున్న వర్సిటీలు దూరవిద్య (డిస్టెన్స్ ఎడ్యుకేషన్).. ఎంతో మందికి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తూ.. కెరీర్ పరంగా భరోసా కల్పిస్తున్న విధానం. వివిధ కారణాల వల్ల మధ్యలో చదువుమానే సిన వారికి, అదే విధంగా ఉద్యోగం చేస్తున్న వారు అదనపు విద్యా అర్హతలను అందుకునేందుకు దూరవిద్య అద్భుత మార్గంగా నిలుస్తోంది. ఈ విధానంలో మూస ధోరణికి స్వస్తి పలికి.. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్), సెమిస్టర్ వైజ్ గ్రేడింగ్, క్రెడిట్స్.. ఇలా వివిధ కొత్త పద్ధతుల అమలు దిశగా యూనివర్సిటీలు అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో సీబీసీఎస్ విధానంపై విశ్లేషణ.. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్).. అంటే కోర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకున్న విద్యార్థులు.. తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్టులను చదివే అవకాశం కల్పించడం. దీని ప్రధాన లక్ష్యం విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ నైపుణ్యాలు అందించడమే. రెగ్యులర్ కోర్సులకు సంబంధించి సెంట్రల్, మరికొన్ని ఇతర యూనివర్సిటీల్లో సీబీసీఎస్ విధానం రెండేళ్ల కిందటి నుంచే అమలవుతోంది. ఇప్పుడు ఈ విధానాన్ని దూరవిద్యలోనూ అనుసరించాలని యూజీసీ పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీలు అడుగులు వేస్తున్నాయి. అదనంగా ఎలక్టివ్ సబ్జెక్టులు దూరవిద్యా విధానంలో డిగ్రీ కోర్సుల్లో చేరే అభ్యర్థులు ఎంపిక చేసుకున్న గ్రూప్ సబ్జెక్టులను మాత్రమే సదరు కోర్సు వ్యవధి ఆసాంతం చదవాల్సి వచ్చేది. అయితే సీబీసీఎస్ విధానంలో అభ్యర్థులు తమ గ్రూప్ సబ్జెక్టులతో పాటు అందుబాటులో ఉన్న ఇతర సబ్జెక్టుల్లో ఆసక్తి మేరకు సబ్జెక్టును ఎంపిక చేసుకొని, అధ్యయనం చేయొచ్చు. ఉదాహరణకు బీఏ గ్రూప్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థి సైన్స్ సంబంధిత సబ్జెక్టును ఎలక్టివ్‌గా తీసుకోవచ్చు. మార్కుల స్థానంలో క్రెడిట్స్ దూరవిద్యా విధానంలో సీబీసీఎస్ అమలు పరంగా మరో ముఖ్యమైన పరిణామం.. ఇప్పటి వరకు ఆయా సబ్జెక్టులకు మూల్యాంకనం పరంగా మార్కులు కేటాయించే విధానానికి స్వస్తి పలికి.. క్రెడిట్స్ విధానాన్ని ఆవిష్కరించడం. ఈ క్రెడిట్స్‌ను ఒక సబ్జెక్టుకు కేటాయించిన గరిష్ట లెక్చర్ గంటలు, అభ్యర్థులు హాజరైన గంటల ఆధారంగా గణిస్తారు. సెమిస్టర్ విధానం ప్రస్తుతం మూల్యాంకనం పరంగా వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీబీసీఎస్ విధానంలో ఇక నుంచి ఓపెన్ డిగ్రీ కోర్సుల్లోనూ సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు. సెమిస్టర్‌కు సంబంధించి సబ్జెక్టుల జాబితాను అభ్యర్థులకు తెలియజేస్తారు. అభ్యర్థులు ఆ సబ్జెక్టుల జాబితాలో తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టును ఎలక్టివ్‌గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి సెమిస్టర్‌లోనూ అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రధాన గ్రూప్ సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇలా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సుకు సంబంధించి సెమిస్టర్ విధానంలో కేటాయించే క్రెడిట్స్ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఇవి 125 నుంచి 160 క్రెడిట్స్ వరకు ఉంటాయి. ఈ క్రెడిట్స్ సంఖ్య ఆయా యూనివర్సిటీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. లాంగ్వేజ్ కోర్సులు తప్పనిసరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో నచ్చిన సబ్జెక్టులను ఎలక్టివ్స్‌గా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నప్పటికీ.. లాంగ్వేజ్ కోర్సులను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన విధంగా నిబంధనలు రూపొందించారు. ఈ క్రమంలో లాంగ్వేజ్ స్పెసిఫిక్ కోర్సుల పేరుతో ఇంగ్లిష్, హిందీలతోపాటు అభ్యర్థుల మాతృభాషకు సంబంధిన కోర్సులను అందుబాటులో ఉంచుతున్నారు. ఏఈసీసీ కూడా తప్పనిసరి డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. సీబీసీఎస్ విధానంలో అభ్యర్థులు తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన మరో అంశం.. ఎబిలిటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్ కంపల్సరీ కోర్సులు (ఏఈసీసీ). ఈ క్రమంలో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో జండర్ సెన్సిటైజేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మూడో ఏడాది డీఎస్ఈ కోర్సులు సీబీసీఎస్ విధానంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ప్రధానంగా ప్రయోజనం చేకూర్చే సమయం మూడో సంవత్సరం. ఈ సమయంలో అభ్యర్థులు డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలక్టివ్ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి యూనివర్సిటీల విధానంపై ఆధారపడి ఉంటాయి. నిర్దేశ వెయిటేజీ మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో సీబీసీఎస్ విధానంలో తప్పనిసరిగా చదవాల్సిన కోర్సులకు 75 శాతం వెయిటేజీ; అభ్యర్థులు నచ్చినవిధంగా ఎంపిక చేసుకున్న ఆప్షనల్స్‌కు 25 శాతం వెయిటేజీ ఇచ్చే విధంగా యూనివర్సిటీలు అడుగులు వేస్తున్నాయి. ఇక.. పొందాల్సిన క్రెడిట్స్ పరంగా మొత్తం 160 క్రెడిట్స్‌లో తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టులకు 118 క్రెడిట్స్, ఆప్షనల్ సబ్జెక్టులకు 42 క్రెడిట్స్ కేటాయిస్తున్నాయి. ఉత్తీర్ణతలో గ్రేడింగ్ విధానం సీబీసీఎస్ ప్రకారం.. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో అత్యంత ప్రధానమైన మరో మార్పు.. డిగ్రీ ప్రోగ్రామ్ పూర్తయ్యాక.. గ్రేడింగ్ విధానం ద్వారా అభ్యర్థుల ప్రతిభను గుర్తించడం. ఇప్పటి వరకు నిర్దిష్టంగా పొందిన మార్కులనే పేర్కొనడం జరిగేది. అయితే ఇకపై గ్రేడింగ్‌లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు పొందిన మార్కుల శ్రేణి ఆధారంగా గ్రేడ్ పాయింట్లు ఇవ్వనున్నారు. అమలుపై అనుమానాలు దూరవిద్యా విధానంలో సీబీసీఎస్ విధానాన్ని యూనివర్సిటీలు సమర్థంగా అమలు చేసే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో రెగ్యులర్ కోర్సుల్లో 2015 నుంచే సీబీసీఎస్‌ను అమలు చేయాలని యూజీసీ స్పష్టం చేసింది. కానీ, ఇప్పటికీ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో ఇది సమర్థంగా అమలు కావడం లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే టీచర్, స్టూడెంట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ తక్కువగా ఉండే డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో సీబీసీఎస్ అమలు కొంచెం క్లిష్టమైన వ్యవహారమే అని ఏపీలోని ప్రముఖ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. బోధనలోనూ వినూత్నం సీబీసీఎస్ విధానాన్ని అమలు చేసే క్రమంలో బోధనలోనూ వినూత్న విధానాలను అమలు చేస్తారు. ఆన్లైన్ లెర్నింగ్ మెటీరియల్‌ను విస్తృతంగా అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. వీడియో లెక్చర్స్, స్వయంప్రభ ద్వారా టెలివిజన్ లెక్చర్స్, ఆడియో–వీడియో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం తదితర చర్యలు చేపట్టాలని సూచించింది. దూరవిద్యా విధానంలో సీబీసీఎస్ అమలు చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా తమకు నచ్చిన కోర్సులను చదివే విధానంతోపాటు.. skill enhancement, ability enhancement, personality development కోర్సులను కూడా చదివే అవకాశం ఉండటంతో దూరవిద్యా విధానంలో చదివిన విద్యార్థులకు సైతం ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి. – విద్యారంగ నిపుణుల అభిప్రాయం. -
ఉపాధే లక్ష్యంగా వర్సిటీ విద్య
► ఉన్నత విద్యాశాఖ కసరత్తు ► సీబీసీఎస్ అమలయ్యేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీలతో ఉపాధి అవకాశాలు కరువవడంతో యూనివర్సిటీలు నిర్వహిస్తున్న కోర్సుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్రంలోని యూనివర్సిటీలను సమాయత్తం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంను (సీబీసీఎస్) ప్రవేశ పెట్టిన ఉన్నత విద్యాశాఖ ఇకపై దాన్ని పక్కాగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోనుంది. అలాగే సంప్రదాయ కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను పూర్తిగా మార్చడంతోపాటు సీబీసీఎస్‌ను కచ్చితంగా అమలు చేసేలా యూనివర్సిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. సంప్రదాయ డిగ్రీలు చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేసింది. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫైర్ సర్వీసెస్, కంప్యూటర్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, డాటా ఎంట్రీ తదితర సబ్జెక్టులను కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది. ప్రమాణాలు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా.. దేశంలో 20 విద్యా సంస్థలను వరల్డ్ క్లాస్ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో.. ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల పోటీని తట్టుకొని రాష్ట్ర యూనివర్సిటీలు నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం తెలిపారు. అన్నింటిని ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దకపోయినా, ఆ స్థాయి లక్ష్యాలతో వర్సిటీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎం.ఫిల్, పీహెచ్డీ ప్రవేశాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక మైనింగ్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే ప్రారంభం నుంచే తీర్చిదిద్దుతున్నుట్లు తెలిపారు. తీరు మార్చుకుంటే ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ వంటి వర్సిటీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తగూడెం వర్సిటీ కొత్తగూడెం మైనింగ్ యూనివర్సిటీ ప్రపంచస్థాయి విద్యాసంస్థగా మార్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఐదు ప్రభుత్వ రంగ సంస్థలను, మూడు ఐఐటీల నిఫుణులను భాగస్వాములను చేసి, కోర్సుల డిజైన్, అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తమ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది. ఎన్ఎండీసీ, సింగరేణి, కోల్ ఇండియా, జెన్కో, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను భాగస్వాములను చేయడంతోపాటు వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను డిజైన్ చేస్తోంది. అలాగే కాన్పూర్, ఖరగ్‌పూర్, ధన్‌బాద్ మైనింగ్ వర్సిటీ ప్రొఫెసర్లకు భాగస్వామ్యం కల్పించింది. నియామకాలు కూడా జాతీయ స్థాయిలో చేపట్టే విధానాన్ని రూపొందిస్తోంది. -
సీబీసీఎస్ అమలుపై అభ్యంతరాలు!
మార్పులు అవసరమంటున్న విశ్వవిద్యాలయాలు యూజీసీ మార్గదర్శకాల కంటే రాష్ట్ర కోర్సుల్లోనే ఎక్కువ చాయిస్ రెండు భాషల విధానం కొనసాగించాల్సిందే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డి గ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుకు సిద్ధమేనని, అయితే యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన మోడల్ సిలబస్‌పై అభ్యంతరాలున్నాయని తెలంగాణలోని విశ్వవిద్యాలయాల డీన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీబీసీఎస్ అమలుపై వివిధ విశ్వ విద్యాలయాల డీన్స్‌తో ఉన్నత విద్యామండలి శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీబీసీఎస్ అమలుపై విసృ్తతంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ నిర్ణయాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి శనివారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు పంపించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే.. పాఠ్య ప్రణాళికను నిర్ణయించడంలో వర్సిటీలకున్న స్వేచ్ఛను కొనసాగించాలని కోరారు.అభ్యసన లక్ష్యాలు, అభ్యసన ఫలితాలను యూజీసీ నిర్దేశించవచ్చని, డిగ్రీ కోర్సులకు మొత్తం క్రెడిట్స్ సంఖ్యను యూజీసీ నిర్ణయించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి సిలబస్‌ను నిర్ణయించిన యూజీసీ, 20 శాతం మాత్రమే సిల బస్‌ను మార్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదన్నారు. మొత్తం కోర్సులో ప్రధాన సబ్జెక్టులు కనీసం 60 శాతం ఉండాలని, మిగతా దాంట్లో యూజీసీ పేర్కొన్నట్లు కాకుండా ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వర్సిటీలు రూపొందించే ఎలక్టివ్ సబ్జెక్టులు, ఫౌండేషన్ కోర్సులు ఉండాలని పేర్నొన్నారు. తెలంగాణలోని డిగ్రీ పాఠ్య ప్రణాళిక.. తదుపరి కోర్సులు చదవడానికి ఎక్కువ అనుకూలంగా ఉందని, యూజీసీ ప్రకటించిన మోడల్ పాఠ్య ప్రణాళిక కంటే రాష్ట్ర పాఠ్య ప్రణాళికలోనే ఎక్కువ చాయిస్ ఉందని అభిప్రాయపడ్డారు. ఫౌండేషన్ కోర్సు కింద మొత్తం ఐదు సబ్జెక్టుల్లో పీజీకి అవకాశం ఉందని వివరించారు. సీబీసీఎస్ విధానంలో ఇచ్చే క్రెడిట్స్‌కు ఇది సమానంగా ఉందని స్పష్టం చేశారు. యూజీసీ ప్రతిపాదించిన సీబీసీఎస్‌ను (మాడ్యులర్ మోడల్) సవరించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన క్రెడిట్స్‌ను సాధారణీకరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో డిగ్రీలోని ఇంగ్లిష్, తెలుగు వంటి ప్రథమ ద్వితీయ భాషలను కొనసాగించాలని అభిప్రాయ పడ్డారు. హిందీ లేదా ఇంగ్లిష్ మాత్రమే చదువుకోవాలని పేర్కొనడం సరైంది కాదన్న వాదన వ్యక్తమైంది. మరోవైపు భాషను కోర్సు మొత్తంలో ఒకే పేపరుగా పెట్టడం కాకుండా రె ండు పేపర్లుగా పెట్టి ఒక్కో దానికి 12 క్రెడిట్స్ చొప్పున 24 క్రెడిట్స్ కేటాయించాలని పేర్కొన్నారు. యూజీసీ 2014 నవంబర్‌లో ఇచ్చిన మోడల్ పాఠ్య ప్రణాళికకు ప్రస్తుతం ఇచ్చిన మార్గదర్శకాలకు మధ్య వైరుధ్యం ఉందన్నారు. రెండు విరుద్ధంగా ఉన్నాయన్నారు. యూజీసీ 2014లో ప్రకటించిన మార్గదర్శకాలే రాష్ట్రం లో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానానికి మెరుగులు దిద్దేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. నెట్‌లాంటి పరీక్షల కోసం యూజీసీ సూచించిన కోర్సులకు సంబంధించిన విభాగాలకు (స్ట్రీమ్) అనుగుణంగా సబ్జెక్టుల విభజన జరగాలని పేర్కొన్నారు. వారానికి (పని దినాల్లో) గరిష్ట బోధన సమయాన్ని నిర్ణయించాల్సి ఉందన్నారు. -
సీబీసీఎస్‌తో విద్యార్థులకు మేలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సీబీసీఎస్) ద్వారా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసుకునే సమయానికి జాబ్ రెడీ స్కిల్స్ సొంతం చేసుకుంటారని చెబుతున్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.దేవ్‌రాజ్.మద్రాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ కోసం అడుగుపెట్టి అదే యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ స్థాయికి ఎదిగి ప్రస్తుతం యూజీసీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ హెచ్. దేవ్‌రాజ్‌తో గెస్ట్‌కాలం.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకీ పరిశ్రమల అవసరాలు మారిపోతున్నాయి. పోటీ వాతావరణానికి తగ్గట్లు విభిన్న నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం కంపెనీలకు ఏర్పడుతోంది. అందుకే విద్యా వ్యవస్థలో నిరంతరం మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. తాజాగా శ్రీకారం చుట్టిన ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఈ తరహా అవసరాలను తీరుస్తుంది. సీబీసీఎస్‌తో ఆశావహ దృక్పథం సీబీసీఎస్ విధానంలో విద్యార్థులు ఇష్టం లేకున్నా భారంగా ఒక కోర్సు చదవాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఒత్తిడి లేదా మార్కెట్ డిమాండ్ పరంగా ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో అడుగుపెట్టిన విద్యార్థులు తమ ఆసక్తి మేరకు ఇతర కోర్సులు నేర్చుకునే విధంగా సీబీసీఎస్ అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల కోర్తో పాటు వ్యక్తిగత ఆసక్తి కూడా నెరవేరుతుంది. ఇది విద్యార్థులను మానసికంగా ఆశావాహ దృక్పథం వైపు నడిపిస్తుంది. రాష్ట్రస్థాయిలోనూ సాధ్యమే సిలబస్ అంశాలు వేర్వేరుగా ఉండే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో సీబీసీఎస్ సాధ్యమే నా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఇది కచ్చితంగా సాధ్యమే. సీబీసీఎస్ ఫ్రేం వర్క్‌ను, మార్గదర్శకాలను యూజీసీ పేర్కొంది. అయితే కోర్సులు, కరిక్యులం రూపకల్పన విషయంలో యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు స్వేచ్ఛ ఉన్నందువల్ల సంస్థ సభ్యులు కోర్సులో ఉండాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోవచ్చు. యూజీసీ కూడా అన్ని యూనివర్సిటీల్లో కొంతమేర ఉమ్మడి సిలబస్ రూపకల్పనపై యోచిస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. బ్రాండ్ ఈక్విటీ ప్రధానం సీబీసీఎస్ విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కోరింగ్, నాన్ స్కోరింగ్ సబ్జెక్టులలో గ్రేడింగ్‌పై ఈ అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు రిలేటివ్ గ్రేడింగ్, నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాం. వీటి విధి విధానాల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కొన్ని యూనివర్సిటీలు ఉద్దేశపూర్వకంగా ఎక్కువ గ్రేడింగ్స్ ఇస్తే పరిస్థితి ఏంటనేది మరో అనుమానం. అయితే, సదరు యూనివర్సిటీకి ఇప్పటికే ఉన్న గుర్తింపు ఆధారంగా అవి అందించే సర్టిఫికెట్లు, గ్రేడ్లకు పరిగణన ఉంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ బ్రాండ్ ఈక్విటీ ప్రధాన కొలబద్దగా మారుతుంది. ఒకవేళ ఇన్స్టిట్యూట్లు గ్రేడ్లు జారీ చేసినా భవిష్యత్తులో అక్కడ చదువుకున్న విద్యార్థుల పనీతీరు ఆధారంగా వాటి గురించి తెలిసిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు కూడా నాణ్యమైన విద్యను అందిస్తాయని భావిస్తున్నాం. ప్రస్తుతం అమలవుతున్న ఇంటర్నల్స్ విధానంలో పొందే మార్కులను గ్రేడింగ్స్‌లో కలపొద్దని నిర్దేశించాం. వృత్తి విద్య విస్తరణకు కృషి నేడు పరిశ్రమలకు ఎదురువుతున్న మరో ప్రధాన సమస్య.. వృత్తి విద్య నిపుణుల కొరత. రూసా స్కీం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ కోర్సులను అందించాలని యూజీసీ నిర్ణయించింది. ఆయా కళాశాలల గుర్తింపును పరిగణనలోకి తీసుకొని ఒకేషనల్ డిగ్రీ కోర్సులు ప్రారంభించే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకు నిధులు అందించనుంది. వీటి సద్వినియోగానికి, నిరంతర పర్యవేక్షణకు కమిటీని నియమిస్తాం. ఫ్యాకల్టీ కొరత నిజమే కానీ.. యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ కొరత కారణంగా విద్యార్థుల్లో నాణ్యత తగ్గడం వాస్తవమే. ఈ సమస్యపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఫ్యాకల్టీ నియామకాలను చేపట్టాలి. మరోవైపు విద్యార్థులు కూడా అధ్యాపక వృత్తిపై ఆసక్తి పెంచుకోవాలి. ఇప్పుడు చాలామంది కెరీర్ సెటిల్మెంట్కు ఎంఎన్సీ జాబ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. రీసెర్చ, అధ్యాపక వృత్తి పట్ల ఆసక్తి చూపడంలేదు. రీసెర్చ్ చేసే విద్యార్థులకు యూజీసీ అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా భారీగా పెరిగాయి. దీన్ని గుర్తిస్తే విద్యార్థులకు ఒకే సమయంలో ఆర్థిక తోడ్పాటుతోపాటు అకడెమిక్ ఎక్సలెన్స్‌కు అవకాశం లభిస్తుంది. కొత్తదనాన్ని ఆస్వాదించాలి విద్యార్థులు నిరంతరం కొత్తదనం ఆస్వాదించేలా మానసిక దృక్పథం మార్చుకోవాలి. బోధన విధి విధానాల పరంగా ఏమైనా మార్పులు జరిగితే అందులో ఉండే సానుకూల అంశాలవైపు మొగ్గు చూపాలి. విద్యార్థులు వ్యక్తిగతంగా సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. అప్పుడే ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా ఇమిడిపోగల సంసిద్ధత లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా 2015-16 విద్యా సంవత్సరంలో అడుగుపెట్టే విద్యార్థులకు నా సలహా.. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను సానుకూలంగా మలచుకుంటే కోర్సు పూర్తయ్యే నాటికి మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌లు అలవడతాయి!!