దూరవిద్యలో.. సీబీసీఎస్‌! | Distance education | Sakshi
Sakshi News home page

దూరవిద్యలో.. సీబీసీఎస్‌!

Published Sun, Aug 20 2017 11:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

దూరవిద్యలో.. సీబీసీఎస్‌!

దూరవిద్యలో.. సీబీసీఎస్‌!

అమలు దిశగా అడుగులేస్తున్న వర్సిటీలు
దూరవిద్య (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌).. ఎంతో మందికి ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తూ.. కెరీర్‌ పరంగా భరోసా కల్పిస్తున్న విధానం. వివిధ కారణాల వల్ల మధ్యలో చదువుమానే సిన వారికి, అదే విధంగా ఉద్యోగం చేస్తున్న వారు అదనపు విద్యా అర్హతలను అందుకునేందుకు దూరవిద్య అద్భుత మార్గంగా నిలుస్తోంది. ఈ విధానంలో మూస ధోరణికి స్వస్తి పలికి.. ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌),
సెమిస్టర్‌ వైజ్‌ గ్రేడింగ్, క్రెడిట్స్‌.. ఇలా వివిధ కొత్త పద్ధతుల అమలు దిశగా యూనివర్సిటీలు అడుగులేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో సీబీసీఎస్‌ విధానంపై విశ్లేషణ..

ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌).. అంటే కోర్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకున్న విద్యార్థులు.. తమకు ఆసక్తి ఉన్న ఇతర సబ్జెక్టులను చదివే అవకాశం కల్పించడం. దీని ప్రధాన లక్ష్యం విద్యార్థులకు ఇంటర్‌ డిసిప్లినరీ నైపుణ్యాలు అందించడమే. రెగ్యులర్‌ కోర్సులకు సంబంధించి సెంట్రల్, మరికొన్ని ఇతర యూనివర్సిటీల్లో సీబీసీఎస్‌ విధానం రెండేళ్ల కిందటి నుంచే అమలవుతోంది. ఇప్పుడు ఈ విధానాన్ని దూరవిద్యలోనూ అనుసరించాలని యూజీసీ పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీలు అడుగులు వేస్తున్నాయి.

అదనంగా ఎలక్టివ్‌ సబ్జెక్టులు
దూరవిద్యా విధానంలో డిగ్రీ కోర్సుల్లో చేరే అభ్యర్థులు ఎంపిక చేసుకున్న గ్రూప్‌ సబ్జెక్టులను మాత్రమే సదరు కోర్సు వ్యవధి ఆసాంతం చదవాల్సి వచ్చేది. అయితే సీబీసీఎస్‌ విధానంలో అభ్యర్థులు తమ గ్రూప్‌ సబ్జెక్టులతో పాటు అందుబాటులో ఉన్న ఇతర సబ్జెక్టుల్లో ఆసక్తి మేరకు సబ్జెక్టును ఎంపిక చేసుకొని, అధ్యయనం చేయొచ్చు. ఉదాహరణకు బీఏ గ్రూప్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థి సైన్స్‌ సంబంధిత సబ్జెక్టును ఎలక్టివ్‌గా తీసుకోవచ్చు.

మార్కుల స్థానంలో క్రెడిట్స్‌
దూరవిద్యా విధానంలో సీబీసీఎస్‌ అమలు పరంగా మరో ముఖ్యమైన పరిణామం.. ఇప్పటి వరకు ఆయా సబ్జెక్టులకు మూల్యాంకనం పరంగా మార్కులు కేటాయించే విధానానికి స్వస్తి పలికి.. క్రెడిట్స్‌ విధానాన్ని ఆవిష్కరించడం. ఈ క్రెడిట్స్‌ను ఒక సబ్జెక్టుకు కేటాయించిన గరిష్ట లెక్చర్‌ గంటలు, అభ్యర్థులు హాజరైన గంటల ఆధారంగా గణిస్తారు.

సెమిస్టర్‌ విధానం
ప్రస్తుతం మూల్యాంకనం పరంగా వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీబీసీఎస్‌ విధానంలో ఇక నుంచి ఓపెన్‌ డిగ్రీ కోర్సుల్లోనూ సెమిస్టర్‌ విధానం అమలు చేయనున్నారు. సెమిస్టర్‌కు సంబంధించి సబ్జెక్టుల జాబితాను అభ్యర్థులకు తెలియజేస్తారు. అభ్యర్థులు ఆ సబ్జెక్టుల జాబితాలో తమకు ఆసక్తి ఉన్న సబ్జెక్టును ఎలక్టివ్‌గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి సెమిస్టర్‌లోనూ అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రధాన గ్రూప్‌ సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇలా మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుకు సంబంధించి సెమిస్టర్‌ విధానంలో కేటాయించే క్రెడిట్స్‌ సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఇవి 125 నుంచి 160 క్రెడిట్స్‌ వరకు ఉంటాయి. ఈ క్రెడిట్స్‌ సంఖ్య ఆయా యూనివర్సిటీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

లాంగ్వేజ్‌ కోర్సులు తప్పనిసరి
డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో నచ్చిన సబ్జెక్టులను ఎలక్టివ్స్‌గా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నప్పటికీ.. లాంగ్వేజ్‌ కోర్సులను తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన విధంగా నిబంధనలు రూపొందించారు. ఈ క్రమంలో లాంగ్వేజ్‌ స్పెసిఫిక్‌ కోర్సుల పేరుతో ఇంగ్లిష్, హిందీలతోపాటు అభ్యర్థుల మాతృభాషకు సంబంధిన కోర్సులను అందుబాటులో ఉంచుతున్నారు.

ఏఈసీసీ కూడా తప్పనిసరి
డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌.. సీబీసీఎస్‌ విధానంలో అభ్యర్థులు తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన మరో అంశం.. ఎబిలిటీ ఎన్‌హ్యాన్స్‌మెంట్‌ కంపల్సరీ కోర్సులు (ఏఈసీసీ). ఈ క్రమంలో మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీలో జండర్‌ సెన్సిటైజేషన్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మూడో ఏడాది డీఎస్‌ఈ కోర్సులు
సీబీసీఎస్‌ విధానంలో డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విద్యార్థులకు ప్రధానంగా ప్రయోజనం చేకూర్చే సమయం మూడో సంవత్సరం. ఈ సమయంలో అభ్యర్థులు డిసిప్లిన్‌ స్పెసిఫిక్‌ ఎలక్టివ్‌ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి యూనివర్సిటీల విధానంపై ఆధారపడి ఉంటాయి.

నిర్దేశ వెయిటేజీ
మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీలో సీబీసీఎస్‌ విధానంలో తప్పనిసరిగా చదవాల్సిన కోర్సులకు 75 శాతం వెయిటేజీ; అభ్యర్థులు నచ్చినవిధంగా ఎంపిక చేసుకున్న ఆప్షనల్స్‌కు 25 శాతం వెయిటేజీ ఇచ్చే విధంగా యూనివర్సిటీలు అడుగులు వేస్తున్నాయి. ఇక.. పొందాల్సిన క్రెడిట్స్‌ పరంగా మొత్తం 160 క్రెడిట్స్‌లో తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టులకు 118 క్రెడిట్స్, ఆప్షనల్‌ సబ్జెక్టులకు 42 క్రెడిట్స్‌ కేటాయిస్తున్నాయి.

ఉత్తీర్ణతలో గ్రేడింగ్‌ విధానం
సీబీసీఎస్‌ ప్రకారం.. డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అత్యంత ప్రధానమైన మరో మార్పు.. డిగ్రీ ప్రోగ్రామ్‌ పూర్తయ్యాక.. గ్రేడింగ్‌ విధానం ద్వారా అభ్యర్థుల ప్రతిభను గుర్తించడం. ఇప్పటి వరకు నిర్దిష్టంగా పొందిన మార్కులనే పేర్కొనడం జరిగేది. అయితే ఇకపై గ్రేడింగ్‌లు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు పొందిన మార్కుల శ్రేణి ఆధారంగా గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వనున్నారు.

అమలుపై అనుమానాలు
దూరవిద్యా విధానంలో సీబీసీఎస్‌ విధానాన్ని యూనివర్సిటీలు సమర్థంగా అమలు చేసే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. యూనివర్సిటీల్లో రెగ్యులర్‌ కోర్సుల్లో 2015 నుంచే సీబీసీఎస్‌ను అమలు చేయాలని యూజీసీ స్పష్టం చేసింది. కానీ, ఇప్పటికీ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో ఇది సమర్థంగా అమలు కావడం లేదు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే టీచర్, స్టూడెంట్‌ డైరెక్ట్‌ ఇంటరాక్షన్‌ తక్కువగా ఉండే డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో సీబీసీఎస్‌ అమలు కొంచెం క్లిష్టమైన వ్యవహారమే అని ఏపీలోని ప్రముఖ యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం డైరెక్టర్‌ అభిప్రాయపడ్డారు.

బోధనలోనూ వినూత్నం
సీబీసీఎస్‌ విధానాన్ని అమలు చేసే క్రమంలో బోధనలోనూ వినూత్న విధానాలను అమలు చేస్తారు. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను విస్తృతంగా అందుబాటులో ఉంచాలని యూజీసీ పేర్కొంది. వీడియో లెక్చర్స్, స్వయంప్రభ ద్వారా టెలివిజన్‌ లెక్చర్స్, ఆడియో–వీడియో మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం తదితర చర్యలు చేపట్టాలని సూచించింది.

దూరవిద్యా విధానంలో సీబీసీఎస్‌ అమలు చేస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా తమకు నచ్చిన కోర్సులను చదివే విధానంతోపాటు.. skill enhancement, ability enhancement, personality development  కోర్సులను కూడా చదివే అవకాశం ఉండటంతో దూరవిద్యా విధానంలో చదివిన విద్యార్థులకు సైతం ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌కు      అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి.
– విద్యారంగ నిపుణుల అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement