సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ వైద్య కళాశాలల్లోని సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ ఫీజులు పెంచుతూ జారీ అయిన జీవో 78 అమలును 2 వారాలు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫార్సుల్లేకుండా ఫీజులు పెంచడం చెల్లదంటూ వైద్య విద్యార్థి అనిల్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 14న వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన జీవో 78 ప్రకారం ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మెడికల్ కాలేజీల్లో ఫీజును రూ.25 లక్షలకు పెంచడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రామసుబ్రమణియన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. జీవో జారీ విషయం గోప్యంగా ఉంచారని, చెప్పాపెట్టకుండా ఫీజును భారీగా పెంచేశారని, ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిటీకి సంబంధం లేకుండా చట్ట వ్యతిరేకంగా ఫీజు పెంచారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఆరోపణలపై వివరణలతో కౌంటర్ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment