సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో పీజీ వైద్యవిద్య ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 41 అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. నాలుగు వారాల పాటు దాని అమలు నిలిపేయాలని ఆదేశిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివ రాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్‌ఆర్సీ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం, ఎంసీఐలను ఆదేశిస్తూ.. నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
ఫీజుల పెంపు ఏకపక్షం..: రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల సీట్ల భర్తీలో నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం ఈ నెల 9న జీవో 40 జారీ చేసింది. అలాగే పీజీ కోర్సులకు ఫీజులను పెంచుతూ జీవో 41 జారీ చేసింది. ఈ జీవోలను సవాలు చేస్తూ ‘ది హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్’, ఉస్మాని యా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్‌లు గురువారం హైకోర్టులో పిల్ వేశాయి. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ నక్కా బాలయోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫీజుల పెంపు విషయంలో టీఎఫ్‌ఆర్‌సీని సంప్రదించకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, కాలేజీల యాజమాన్యాలు కోరిన విధంగా ఫీజులు పెంచిందని కోర్టుకు విన్నవించారు. ఏకంగా 115 శాతం ఫీజులు పెంచిందని, నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కాలేజీ యాజమాన్యాల ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఈ జీవోలను జారీ చేసిందన్నారు.
ఫీజుల పెంపు జీవో నిలిపివేత
Published Fri, May 12 2017 4:46 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM