minority medical colleges
-
మైనారిటీ విద్యా సంస్థలకూ ‘నీట్’
న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా∙గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని పేర్కొంది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు గుర్తు చేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంలోని నిబంధనల వల్ల ఎయిడెడ్, అన్ఎయిడెడ్ మైనారిటీ విద్యా సంస్థల హక్కులకు ఎలాంటి భంగం కలగబోదని కోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టంలోని నిబంధనలు స్థూలంగా ప్రజారోగ్య పరిరక్షణకు ఉద్దేశించినవని పేర్కొంది. అవి విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో నడిపేందుకు ఉద్దేశించినవే కానీ.. ప్రత్యేక హక్కుల మాటున తప్పుడు పరిపాలన విధానాలు అవలంబించేందుకు కాదంది. ‘సేవా ధర్మ భావన నుంచి విద్యను అమ్మకం వస్తువుగా మార్చారు. సంపన్నులకే లభించే వస్తువుగా విద్య మారింది. పేదలు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని చదువుకుని, ఆ అప్పులు, వడ్డీలు తీరుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మొగ్గలుగా ఉండగానే వారిని చిదిమేస్తున్నారు’అని వ్యాఖ్యానించింది. ‘ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) తెచ్చిన చెడ్డపేరు కారణంగా మొత్తం వైద్య విద్య వ్యవస్థను మార్చాల్సి వచ్చింది. ఇప్పటికీ పరిస్థితి మెరుగవలేదు. ఇంకా కఠినంగా వ్యవహరించాల్సి ఉంది’అని పేర్కొంది. కొన్ని విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయి వైద్యులను తయారు చేసిన విషయాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్యానించింది. నీట్’పేర్కొన్న అత్యున్నత నాణ్యత నిబంధనలు పాటిస్తూ సొంతంగా ప్రవేశ పరీక్షలు జరుపుకుంటామని పలు మైనారిటీ విద్యా సంస్థలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
మైనార్టీ వైద్య కళాశాలల కన్వీనర్ కోటా తగ్గింపు సరికాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ మైనార్టీ వైద్య విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా సీట్లను 60% నుంచి 50 శాతానికి తగ్గించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. కన్వీనర్ కోటా సీట్లలో తగ్గించిన 10 శాతాన్ని యాజమాన్య కోటాలో చేర్చడం వల్ల ప్రతిభగల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కన్వీనర్ కోటా సీట్ల తగ్గింపు, ఫీజులను పెంచుతూ జారీ అయిన జీవోలు 115, 117, 119లను సవాలు చేస్తూ బషీరుద్దీన్ సిద్దిఖీ, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం ఇటీవల తుది తీర్పు నిచ్చింది. కన్వీనర్ కోటా సీట్ల శాతాన్ని 60 నుంచి 50 శాతానికి తగ్గింపు, యాజమాన్య కోటా (బీ కేటగిరి) సీట్లను 25% నుంచి 35 శాతానికి పెంపు జీవోను తప్పు బట్టింది. గతేడాది జారీ చేసిన జీవో 130 ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు 60% (ఏ కేటగిరీ), యాజ మాన్య కోటా కింద 25% సీట్లు (బీ కేటగిరీ), ప్రవాస భారతీయుల కోటా 15% (సీ కేటగిరీ) ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీట్ల భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఫీజుల పెంపు జీవో నిలిపివేత
-
ఫీజుల పెంపు జీవో నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో పీజీ వైద్యవిద్య ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 41 అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. నాలుగు వారాల పాటు దాని అమలు నిలిపేయాలని ఆదేశిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివ రాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్ఆర్సీ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల సంఘం, ఎంసీఐలను ఆదేశిస్తూ.. నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఫీజుల పెంపు ఏకపక్షం..: రాష్ట్రంలోని ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల సీట్ల భర్తీలో నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం ఈ నెల 9న జీవో 40 జారీ చేసింది. అలాగే పీజీ కోర్సులకు ఫీజులను పెంచుతూ జీవో 41 జారీ చేసింది. ఈ జీవోలను సవాలు చేస్తూ ‘ది హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్’, ఉస్మాని యా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్లు గురువారం హైకోర్టులో పిల్ వేశాయి. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ నక్కా బాలయోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫీజుల పెంపు విషయంలో టీఎఫ్‌ఆర్‌సీని సంప్రదించకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, కాలేజీల యాజమాన్యాలు కోరిన విధంగా ఫీజులు పెంచిందని కోర్టుకు విన్నవించారు. ఏకంగా 115 శాతం ఫీజులు పెంచిందని, నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కాలేజీ యాజమాన్యాల ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఈ జీవోలను జారీ చేసిందన్నారు. -
మైనారిటీ వైద్య సీట్ల ఫీజులు భారీగా పెంపు
♦ యాజమాన్య సీట్లకు నెల దాటకుండానే రెండోసారి సవరణ ♦ బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ. 9 లక్షల నుంచి రూ. 11 లక్షలు.. సీ కేటగిరీ ఫీజు రూ. 11 లక్షల నుంచి రూ. 13.25 లక్షలకు పెంపు ♦ ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మైనారిటీ యాజమాన్య వైద్య సీట్ల ఫీజును భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా గత నెల 20 న ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కారు నెల రోజులు గడవకుండానే మళ్లీ పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. గత నెల మైనారిటీ వైద్య యాజమాన్య కోటాలోని బీ కేటగిరీ సీట్లకు రూ. 9 లక్షలు ఫీజులు పెంచింది. ఆ ఫీజును ఇప్పుడు రూ. 11 లక్షలకు పెంచింది. అలాగే సీ కేటగిరీ సీట్ల ఫీజును గత నెల రూ. 11 లక్షలకు సవరించి ఇప్పుడు ఏకంగా రూ. 13.25 లక్షలకు పెంచింది. అలాగే, సీట్ల కేటగిరీల్లో తాజాగా మార్పులు చేసింది. మైనారిటీ వైద్య కళాశాలల్లో గతంలో 60 శాతం సీట్లు ఏ కేటగిరీలో ఉండేవి. వాటిని ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ద్వారానే కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవారు. అయితే గత నెల విడుదల చేసిన ఉత్తర్వుల్లో అందులోని 10 శాతం సీట్లను యాజమాన్య కోటాలోకి చేర్చారు. దీంతో కన్వీనర్ కోటా సీట్లు 50 శాతానికి తగ్గాయి. తాజా ఉత్తర్వుల్లో మళ్లీ పాత పద్ధతి ప్రవేశపెట్టారు. ఆ 10 శాతం సీట్లను తిరిగి కన్వీనర్ కోటాలోకి మార్పు చేశారు. దీంతో తిరిగి కన్వీనర్ కోటా సీట్లు 60 శాతానికి చేరినట్లయింది. ఇది పేద విద్యార్థులకు కాస్తంత ఊరటనిచ్చే అంశమే. కానీ, ఈ కళాశాలల్లో సీట్లన్నింటినీ మైనారిటీ విద్యార్థులతోనే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. వారి ద్వారా భర్తీ కాకుంటే ఇతరులతో భర్తీ చేసుకోవచ్చు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఫీజు అంశాలకు సంబంధించి కొన్ని సవరణలు కోరారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇక నుంచి మూడు ప్రత్యేక ప్రవేశ పరీక్షలు... యాజమాన్య కోటా సీట్లకు ఇక నుంచి మూడు ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ ఒకటి కాగా... నాన్ మైనారిటీ కళాశాలల్లోని యాజమాన్య సీట్లకు మరో పరీక్షకు సర్కారు ఈ ఏడాది అనుమతించింది. ఆ ప్రకారం వాటికి ఈ ఏడాది ప్రత్యేక పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది నుంచి మైనారిటీ వైద్య కళాశాలలు కూడా సొంతంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి సర్కారు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మైనారిటీలోని 25 శాతం సీట్లకు మాత్రమే ప్రత్యేక పరీక్ష నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం సాధారణ ఎంసెట్ పరీక్ష ద్వారానే సీట్లను భర్తీ చేస్తారు.