సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ మైనార్టీ వైద్య విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా సీట్లను 60% నుంచి 50 శాతానికి తగ్గించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. కన్వీనర్ కోటా సీట్లలో తగ్గించిన 10 శాతాన్ని యాజమాన్య కోటాలో చేర్చడం వల్ల ప్రతిభగల విద్యార్థులకు నష్టం జరుగుతోందని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
కన్వీనర్ కోటా సీట్ల తగ్గింపు, ఫీజులను పెంచుతూ జారీ అయిన జీవోలు 115, 117, 119లను సవాలు చేస్తూ బషీరుద్దీన్ సిద్దిఖీ, ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం ఇటీవల తుది తీర్పు నిచ్చింది. కన్వీనర్ కోటా సీట్ల శాతాన్ని 60 నుంచి 50 శాతానికి తగ్గింపు, యాజమాన్య కోటా (బీ కేటగిరి) సీట్లను 25% నుంచి 35 శాతానికి పెంపు జీవోను తప్పు బట్టింది. గతేడాది జారీ చేసిన జీవో 130 ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు 60% (ఏ కేటగిరీ), యాజ మాన్య కోటా కింద 25% సీట్లు (బీ కేటగిరీ), ప్రవాస భారతీయుల కోటా 15% (సీ కేటగిరీ) ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీట్ల భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment