సాక్షి, హైదరాబాద్: వాసవి, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. వ్యయాల ఆధారంగా వాసవి కాలేజీలో ఫీజును ఏడాదికి రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును ఏడాదికి రూ.1.37 లక్షలుగా ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్‌ఆర్‌సీ సభ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. ఫీజుల ఖరారు విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం సమర్ధించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు కు రూ.91వేలను ఫీజుగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ శ్రీనిధి కాలే జీ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఫీజును రూ.97వేలుగా ఖరారు చేయడం పై వాసవి కాలేజీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు టీఎఫ్‌ఆర్‌సీ ఖరారు చేసిన ఫీజుల ను తప్పుపట్టింది.
ఆ కళాశాలల వ్యయాలను ఆధారంగా చేసుకుని ఫీజులను ఖరారు చేయాల్సిన అవసరం ఉందంది. వాసవి కాలేజీ ఫీజును రూ.1.60 లక్షలుగా, శ్రీనిధి ఫీజును రూ. 1.37 లక్షలుగా ఖరారు చేయాలని టీఎఫ్‌ఆర్‌సీని ఆదేశించారు. ఈ ఆదేశాలపై ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎఫ్‌ఆర్‌సీ సభ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల సుదీర్ఘ విచారణ జరిపింది. నిర్దిష్ట కాల వ్యవధి లోపు ఫీజులను ఖరారు చేయకపోవడంపై విచారణ సందర్భంగా ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. అనంతరం తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తన తీర్పును వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment