దెయ్యం పట్టింది | Funday crime story | Sakshi
Sakshi News home page

దెయ్యం పట్టింది

Published Sun, Jun 3 2018 12:25 AM | Last Updated on Sun, Jun 3 2018 12:25 AM

Funday crime story - Sakshi

కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! 

పద్దెనిమిదేళ్ల వయసున్న భార్య, ఇరవై ఏళ్ల వయసున్న భర్త మధ్య మొదలయ్యే గొడవ.. మధ్య యుగాల్లో ఫ్రాన్సు, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన నూరేళ్ల యుద్ధంలా.. అలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందేమో అన్నంత అర్థరహితంగా కనిపిస్తుంది. ఆ వయసులో అమ్మాయి రోషంగా ఉంటుంది.  అబ్బాయి మూర్ఖంగా ఉంటాడు. కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! అమ్మాయి, అబ్బాయి బిలో ట్వంటీ ట్వీంటీవన్‌. అబ్బాయికైతే పెళ్లయినట్లే లేదు. బ్యాచిలర్‌గా ఎలా ఉన్నాడో మ్యారీడ్‌గా కూడా అలానే ఉన్నాడు. భార్యని ఫీల్‌ అవడం, భార్య అని ఫీల్‌ అవడం ఇంకా మొదలవలేదు. అమ్మాయి హ్యాపీగా ఉంది. పెళ్లితో కొత్తగా వచ్చిన హ్యాపీనెస్‌ కాదది.అమ్మాయిల్లో సహజంగానే తొణికిసలాడే సంతోషం. పెళ్లికి ముందెలా ఉందో, పెళ్లి తర్వాతా ఆమె అలానే ఉంది. తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకొకరి పని చేస్తోంది. ఆ ఇంకొకరు తన భర్త అని, భర్త కాబట్టి భర్త పని కూడా తనదే అనుకునీ ఆమేం చెయ్యడం లేదు. ఇంట్లో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నప్పుడు అలవాటైన పనులు, అలవాటుగా చేసే పనులు ఉంటాయి కదా.. అలా చేస్తోంది.పెద్దవాళ్ల బాధ్యతను తీర్చడానికా అన్నట్లు వీళ్లు భార్యాభర్తలయ్యారే కానీ, భార్యాభర్తలుగా మాత్రం లేరు. ఆమె ఇంకా చదువుతోంది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌. అతడు ఇంకా ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇంటికెవరైనా గెస్టులు వచ్చి చూస్తే.. పూర్తిగా ఇది పెద్దవాళ్ల తొందరపాటు వల్ల జరిగిన పెళ్లి అని వాళ్లకు ఏ మూలో అర్థమైపోతుంది. ఈ వయసులో జరిగే పెళ్లిళ్లు సాధారణంగా.. జరిగిన పెళ్లిళ్లు అయి ఉండవు. చేసుకున్న పెళ్లిళ్లు అయి ఉంటాయి. చేసుకున్న పెళ్లిలో దంపతుల మధ్య పెద్దలు ఉండరు. ప్రేమ ఉంటుంది. ఈ జంట మధ్య ప్రేమ లేదు. పెద్దలు ఉన్నారు.

వీళ్లున్న ఇంట్లో ప్రస్తుతం పెద్దలెవరూ లేరు. ప్రేమా లేదు. వీళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే వీళ్లకు తెలీకుండా మరో ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉన్నారు! ఆ ఇద్దరూ ఇంకో జంట. ఇంచుమించు అదే వయసున్న జంట. కొన్ని నెలల క్రితమే ఆ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన జంట. పెళ్లి చేసుకున్నా వదిలిపెట్టకుండా ఇద్దర్నీ వేరు చేద్దామని ఆ ఇద్దరి తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేశారు. కలిసి చనిపోతే ఇక తమనెవరూ వేరు చేయలేరని ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. శరీరాలు వేర్వేరుగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాయి. ఆత్మలు మాత్రం ఒకటిగా ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. అది ఆ ఇంటాయనకూ తెలీదు. ఈ కొత్త జంటకు తెలిసే అవకాశం లేదు. 

ఎప్పట్లా ఇద్దరి మధ్యా యుద్ధం మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో మర్చిపోయారు. యుద్ధమే జీవిత పరమార్థంగా కత్తులు, కటార్లు విసురుకుంటున్నారు. అమ్మాయి వంటింట్లో గిన్నెలు ఎత్తి పడేసింది. అబ్బాయి గోడను కాలితో ఒక్క తన్ను తన్నాడు.‘‘నువ్విలాంటి మనిషివని అనుకోలేదు. మీ తాత నీ పెళ్లి చూసి చచ్చిపోవాలని అశపడుతున్నాడని, మీవాళ్లు మావాళ్లను ఒప్పించి నన్ను నీకిచ్చిపెళ్లి చేశారు. ఖర్మ. ఆయన చావు నా పెళ్లికొచ్చింది’’ అని నుదురు కొట్టుకుంది అమ్మాయి.‘‘మాటలు జాగ్రత్తగా రానియ్‌’’ అని కళ్లెర్ర చేశాడు. ‘‘జాగ్రత్తా!! ఏదీ మళ్లీ అనూ’’ అని ముందుకొచ్చింది అమ్మాయి. అబ్బాయి ఉగ్రుడయ్యాడు. ‘‘నీది కాదు, నాదీ ఖర్మ. నీలాంటి దాన్ని చేసుకున్నందుకు! అబ్బాయి నచ్చాడని మీవాళ్లొచ్చి అడిగితే ‘అమ్మాయి బాగుందిరా.. చేసుకో’ అని మావాళ్లు నన్నుబలవంత పెట్టారు. నాకేం తెలుసు బుద్ధి కూడా ముఖంలాగే ఉంటుందనుకున్నాను’’ అన్నాడు. అమ్మాయికి కాస్త జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చేత అతడు తననేం అన్నదీ గ్రహించింది. ‘‘ఇప్పుడే ఫోన్‌ చేసి చెప్పేస్తాను. నువ్వు  అన్‌ఫిట్‌ అని మావాళ్లకు చెప్పేస్తాను’’ అని ఫోన్‌ తీసుకుంది. ‘అన్‌ఫిట్‌’ అనే మాటకు అబ్బాయి ఒణికిపోయాడు.‘‘దెయ్యంలా దాపురించావు నా బతుక్కి’’ అని పెద్దగా అరిచేశాడు. ఆ అరుపుకి.. అమ్మాయేం బెదరలేదు కానీ, అప్పటివరకు వాళ్లిద్దర్నీ గెడ్డం కింది చెయ్యి ఆన్చుకుని చూస్తూ ఉన్న ఆ రెండు ఆత్మలు ఉలిక్కిపడి.. ‘దెయ్యంలా’ అనే మాటకు నొచ్చుకున్నాయి.   ఆ నొచ్చుకోవడం అక్కడితో ఆగలేదు. 

‘‘ఏంటలా ఊగిపోతున్నారు! దెయ్యం పట్టినట్లుగా..’’ అన్నారు.. సడెన్‌గా ఊరినుంచి దిగిన మామగారు.. కూతుర్నీ, అల్లుణ్ణీ ఆ వార్‌ సీన్‌లో చూసి! ఆ మాటకు ఇంకా నొచ్చుకున్నాయి ఆ రెండు ఆత్మలు. మామగారి పక్కనే అత్తగారూ ఉన్నారు. వాళ్లు తలుపుకొట్టి రానవసరం లేకుండానే తలుపు తెరిచి కొట్లాడుకుంటున్నారు అమ్మాయీ.. అబ్బాయీ.‘‘దెయ్యం నాకు కాదు. మీ కూతురికి పట్టింది’’అన్నాడు అబ్బాయి ఉక్రోషంగా. ‘‘నాకు కాదు.. నీకే దెయ్యం పట్టింది’ అంది అమ్మాయి. ‘‘ఇద్దరీకి పట్టింది. ఇక ఊర్కోండి’’ అన్నారు అమ్మాయి తల్లిదండ్రులు.ఆ క్షణమే అనుకున్నాయి ఆ రెండు ఆత్మలూ.. నిజంగా దెయ్యం పడితే ఎలా ఉంటుందో చూపించాలని. చూపించాయి కూడా. ఆ రాత్రికే!

‘‘అబ్బాయికి సున్నుండలు ఇష్టమని తెచ్చామమ్మా. నీకిష్టమైన నువ్వుండలు కూడా. అసలు అందుకోసమే వచ్చాం’’.. తెల్లారే తిరిగి ఊరెళుతూ చెప్పారు పెద్దవాళ్లిద్దరూ. వాళ్లలా వెళ్లిపోగానే భార్యను మీదకు లాక్కుని బలంగా హత్తుకున్నాడు అబ్బాయి. ‘‘నిజంగానే రాత్రి నీకేదో దెయ్యం పట్టింది’’ అన్నాడు నవ్వుతూ.  ‘‘ముందు నీకు పట్టాకే నాకు పట్టింది’’ అంది అమ్మాయి అతడి ముక్కు మీద తన చూపుడు వేలితో మృదువుగా రాస్తూ. ఆత్మలు రెండూ ఈ దృశ్యాన్ని చూసి రెండు కన్నీటి బొట్లు రాల్చాయి. ఆ బొట్లు ఈ ఇద్దరి చెంపల మీదుగా జారాయి.  ప్రేమ కరిగిందా? కాదు. ప్రేమకు దెయ్యం పట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement