Lime
-
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్‌లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
ఏనుగుల నుంచి రక్షించే నిమ్మ చెట్ల కంచె!
అడవుల్లో పచ్చదనం తగ్గిపోతున్న కొద్దీ ఏనుగులు ఆహారం కోసం కొత్త ప్రాంతాల్లోకి చొరబడాల్సిన పరిస్థితుల్లో దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతులు, గ్రామీణుల ప్రాణాలతోపాటు పంటలకు, పశువులకు రక్షణ కొరవడుతున్నది. ఏనుగులు–మనుషుల సంఘర్ణణను నివారించేందుకు కంచె పంటగా మల్బరీ మొక్కలను సాగు చేయటం, తేనెటీగల పెట్టెలతో కంచెను ఏర్పాటు చేయటం సత్ఫలితాలనిస్తున్న విషయమై గత వారం చర్చించుకున్నాం. ఈ వారం మరో బయోఫెన్స్ గురించి పరిశీలిద్దాం. పంట పొలాలు, గ్రామాల చుట్టూ నిమ్మ చెట్లతో దట్టమైన కంచెను ఏర్పాటు చేసుకుంటే ఏనుగుల బెడద నుంచి బయటపడిన అస్సాం రైతుల అనుభవం గురించి తెలుసుకుందాం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలోని శివసాగర్ జిల్లాలో గతంలో ఏనుగులు–మనుషుల ఘర్షణ. ప్రాణనష్టంతో పాటు పంట నష్టం సంఘటనలు తరచూ వినిపిస్తూ ఉండేవి. ఏనుగుల గుంపులో 150–200 నుంచి నాలుగైదు వరకు ఏనుగులు ఉంటాయి. అయితే, గత నాలుగేళ్లుగా ఏనుగుల దాడుల బాధ తప్పిందని సౌరగూరి ప్రాంత రైతులు సంతోషిస్తున్నారు. నిమ్మ చెట్లతో బయోఫెన్స్లు నిర్మించుకోవటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గౌహతి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అరణ్యక్ వీరికి అండగా నిలిచింది. నిమ్మ కంచెలపై అవగాహన కల్పించటంతోపాటు మొక్కలను సైతం అందించింది. జిగ్‌జాగ్ పద్ధతిలో మూడు వరుసలుగా నిమ్మ మొక్కలను దగ్గర దగ్గరగా నాటుకోవాలి. రెండు మూడు ఏళ్లు పెరిగేటప్పటికి నిమ్మ మొక్కల కొమ్మలు కలిసిపోయి ఏనుగులు దూరి రావటానికి వీలుకాదు. నిమ్మ చెట్లకుండే ముళ్లు, నిమ్మకాయల వాసన.. ఈ రెండిటి వల్ల ఏనుగులు నిమ్మ కంచెలు దాటి రాలేకపోతున్నట్లు అరణ్యక్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి రక్షించడంతో పాటు రైతులకు నిమ్మకాయల విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తోంది. నాలుగేళ్ల క్రితం నిమ్మ మొక్కల కంచె నాటిన హజారికా అనే రైతు వారానికి వెయ్యి వరకు నిమ్మకాలను కోసి విక్రయిస్తున్నారు. ఆఫ్సీజన్లోలో నిమ్మకాయ రూ.5 కి అమ్ముతున్నారు. సీజన్లో అయితే రూ.2–3కు అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. స్థానిక వాతావరణం, పర్యావరణం, మట్టి స్వభావాన్ని బట్టి బయోఫెన్స్ రకాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ‘తేనెటీగ పెట్టెలతో కూడిన కంచెలు వర్షపాతం తక్కువగా ఉండే మెట్ట ప్రాంతాల్లో బాగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం కురిసే ప్రాంతాల్లో తేనెటీగలు మనుగడ సాగించలేవు. వెదురు మొక్కలతో కంచెలు స్వతహాగా వెదరు పెరిగే ప్రాంతాల్లో పర్వాలేదు. ఇతర ప్రాంతాల్లో వెదురు కంచెలు ఏర్పాటు చేస్తే.. ఇతర చెట్లను పెరగనీయకుండా ఇవే విస్తరించి జీవవైవిధ్యానికి ముప్పు తెస్తాయి. నిమ్మ చెట్లు, మొగలి ఆకారంలో ఉండే కిత్లలి (అగవె) జాతి తుప్పలతోనూ బయెఫెన్స్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ప్రాంతానికి ఏది అనువైనదో గ్రహించాలి. ఏనుగుల రాకపోకలకు ఇబ్బంది లేకుండానే ఘర్షణలు నివారించి సహజీవన సూత్రాన్ని పాటించడానికి ‘కంచె తోటలు’ ఉపకరిస్తుండటం విశేషం. -
ఈగ వాలింది
నాన్న నిస్సత్తువగా నులక మంచం మీద పడుకుని వున్నాడు. అతని చేతిమీద ఈగ వాలింది. అప్రయత్నంగా తోలేడు. నాన్న...నా చిన్నప్పుడు వూరు అతని మాట కోసం ఎదురుచూసేది. అతడు మా చుట్టుప్రక్కల గ్రామాలకు ఒకే ఒక్క చిత్రకారుడు. అతడు ‘వూ’ కొట్టేడంటే ఆ ఇంటిగోడమీద బొమ్మ తయారైపోయినట్టే. వూరు పండుగ జరుపుకోవాలంటే నాన్న గోడల మీద బొమ్మవేయాల్సిందే. బొమ్మ వెయ్యడానికి దీసరి ముహూర్తం చూసేవాడు. ఆ ముహూర్తానికే కొండమొదులుకెళ్ళి జేగురు మట్టి సేకరించి బొమ్మ మొదలుపెట్టేవాడు. ‘‘దేనికి నానా?’’ అని అడిగేవాడిని‘‘ఇంటిగోడ మీద ఈ జేగురెక్కాల’’ అనేవాడు. ‘‘అదే దేనికి?’’ తిరిగి ప్రశ్నించేవాడిని. ‘‘జేగురు రంగు దేవతల కోసం’’అనేవాడు. తవ్వుతున్న మట్టి వైపు చూసేవాడిని. నిజంగానే దాన్ని చూస్తుంటే ఎర్రబడిన దేవత కళ్ళులా కనిపించేది. ఇంటిగోడమీద వున్న జేగురు బొమ్మ నా కళ్ళముందు నిలబడేది. ‘‘ఈ రంగు దేవతలకిష్టమైన రంగు’’ అనేవాడు. జేగురు ఎరుపు దేవతల రౌద్రానికి గుర్తు. ఎర్రజేగురుకి గెడ్డలోని చెలమ నీళ్ళే కలిపి రంగుతేవాలి. ‘‘తేకపోతే?’’ అడిగేవాడిని‘‘ఆ రంగు రాదు... దేవతలు శాంతించరు... శలమనీళ్ళైతేనే చల్లగా వుంటాయి, దేవతలూ మనల్ని చల్లగా చూస్తార’నేవాడు. పెరటిలోని ఆనప పాదు కిందకెళ్ళి బాగా ఎండిపోయిన ఆనపతుంబని కిందికి దించేవాడు. అది కొన్నాళ్ళకి బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని కాల్చేవాడు. ‘‘ఎందుకు నానా?’’ అడిగేవాడిని ‘‘ఇది మసి సేసి నల్లరంగు సెయ్యాల’’ అనే వాడు. ఒక్కోసారి వరిగడ్డిని కూడా కాల్చి ఆ మసిని నల్లరంగు కోసం వాడేవాడు. ‘‘ఇదే ఎందుకు?’’ అని అడిగేవాడిని. ‘‘నలుపంటే పంటలు పండకపోవడం. చేనుమీద దయ్యాలు తిరిగాయని అర్ధం’’ అనేవాడు. ‘ఇంటిగోడ మీద నల్లరంగు లేకపోతే పంటలు పండవు. పండినా పీడ వదలదు’కలిపిన పెతీ రంగూ జాగర్తగ కలపాల. నేకపోతే ఆ రంగు పండదు. పండకపోతే ఆ ఇంటికి నష్టం జరగొచ్చు.గోడమీదవేసిన బొమ్మల్లో మరొక రంగు తెలుపు. వరిబియ్యం గానీ కొర్రబియ్యం గానీ స్వయంగా రోకలిలో దంచి పిండి చేసేవాడు. పిండిలో వేడి నీళ్ళు కలిపి తెలుపుని కలుపుకునేవాడు. చలిరోజులు ముదిరే నాటికి బొమ్మలు గీయడం మొదలయ్యేది వూర్లో. చుక్కల పండుగ, కందికొత్తలూ,ఆగం పండుగ సమయాల్లో కొత్త బొమ్మలు మొలుచుకొచ్చేవి కొందరిళ్ళలో. నాన్న చేతిలో తయారయిన ఆ రంగులు నాకు అత్యంత ఆకర్షణీయంగా వుండేవి. గోడమీద జంతువులు ఒక దిక్కున... మొక్కలు మరోదిక్కున...దేవతలు మరోదిక్కున. శ్రమిస్తున్న మనుషులు మధ్యలో. ఎవరు ఏ దిక్కున వుండాలో నిర్ణయించేదిదీసరి. ఆవిధంగానే నాన్న చేతిలోంచి బొమ్మ రూపుదిద్దుకునేది. నాన్న కొండ పనులు చేసుకుంటూనే వూర్లో అన్ని ఇళ్ళకూ బొమ్మలు గీసేవాడు. బొమ్మ గీసినందుకు సంతోషంగా ఎంతో కొంత నగదు ముట్టజెప్పేవాళ్ళు. తొలి రోజుల్లో తీసుకునేవాడు కాదు గానీ, అందరూ ఇస్తూ వుండడంతో ఆ డబ్బుని తీసుకునేవాడు. చేతినిండా పనితో మనిషీ నిండుగా వుండేవాడు. అతని బొమ్మ ఇంటిలో వుండాల్సిందేనని పొరుగూరు వాళ్ళూ నాన్నని తీసుకువెళ్ళి వేయించుకునే వాళ్ళు. ఆ బొమ్మ...శాంతినిస్తుంది ఇంటికి. కాపాడుతుందని నమ్మకం.కానీ...ఈ రోజు?ఆ బొమ్మ లేదు గోడమీద. ఆ గోడ మట్టినొదిలి సిమెంటు ధరించింది. మిద్దిల్లు రేకిళ్ళుగా మారి స్లాబిల్లుగా రూపాంతరం చెందింది. తెల్ల సున్నం గోడగా వున్నన్నాళ్ళూ జేగురు మాత్రమే బొమ్మగా నిలిచి వుండింది. మరికొన్నాళ్ళకు అదీమాయమైపోయింది. ఈ రోజు నాన్న నిస్సత్తువగా పడుకునివున్నాడు నులక మంచమ్మీద. ఈగ వాలితే తోలుకున్నాడు. నాన్న పులిమిన రంగులు నాచేతికంటాయి. స్కూల్లో టీచర్ చెప్పిన బొమ్మ చిటికెలో తయారైపోయేది కాగితమ్మీద. డ్రాయింగ్ పోటీల్లో స్కూలు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బహుమతులు గెలుచుకున్నా కడుపునిండడానికి అవి సరిపోవని కొద్ది రోజులకే తెలిసిపోయింది. ఓ రోజు నాన్న స్కూలుకి దిగబెడుతూ ‘బొమ్మలు బతుకు పెట్టవురా! సక్కగ సదువుకో’ అనడం నాకు గుర్తుంది. సర్టిఫికేట్లు చేత బట్టుకునిఐటీడీయే ముందు గ్రీవెన్స్ లైన్లో నిలబడ్డాను కాలేజీ చదువులు పూర్తయ్యాక. ఆ కొన్ని రోజులకి బొమ్మలే కాదు చదువు కూడా బతుకు పెట్టదని తెలిసిపోయింది. ఐటీడీయే చుట్టూ తిరిగితే యూత్ ట్రైనింగ్ సెంటర్లో చేరమని సలహా ఇచ్చేరు పీవో గారు. అక్కడ చేరాక తెలిసింది. వాళ్ళు ఇచ్చే శిక్షణ నాకు చాలా కష్టమైనదని. ఎలక్ట్రిక్ వైరింగ్, సెల్‌ఫోన్ రిపేరింగ్, హోటల్‌మేనేజ్‌మెంట్ లాంటి పనులు... ఏవీ నాకు సరిపడనివి... చేతకానివి. అవి నేర్చుకున్నా వాటిమీదే బతకాలంటే పెట్టుబడి కావాలి. మామూలు పెట్టుబడి కాదు. పోటీలో నిలబడగలిగే పెట్టుబడి కావాలి. అది లేకుండా నిలబడాలంటే నాకు సాధ్యం కాలేదు. అందుకే తిరిగి వూరు చేరాను. వూరు ఖాళీగా కనిపించింది. ఉపాధి పనులు చాలక ఇంకా డబ్బులు సంపాదించడం కోసం వూరొదిలి చెన్నై, బెంగుళూరు లాంటి మహా నగరాలకు వలసపోయిన వాళ్ళతో వూరు మరింత నిశ్శబ్దాన్ని సంతరించుకున్నది. అప్పుడే... వూరిలో పెళ్ళి కవుర్లకని నాగయ్య బావ ఎదురయ్యేడు. ‘‘బావా! ఇంటి కడ మీ చెల్లి పెల్లి గదా ఇంటి గోడ మీద బోర్డు రాయవా?’’ అని అడిగేడు కార్డు చేతిలొ పెడుతూ. ‘‘ఎందుకు రానూ? బోర్డుకి ఎంతిస్తావైతే?’’ అన్నాను ఇగటమాడుతున్నట్టే‘‘నీనెప్పుడేనా ఒట్టిన పని చేయించుకున్నానా సెప్మి? నువ్వింత అను. ఇచ్చెస్తను’’ అని ఆ ఇంటి అరుగు గోడమీద ఎగురుతున్న జంట పక్షులు... ఇరువైపులా చెట్లు... మధ్యలో పారుతున్న గెడ్డ బొమ్మ వేస్తూ ‘పార్వతి వెడ్స్ చిరు’ అని రాసేను. దానికి ‘మండంగి వారి పెళ్ళి పిలుపు’ అని కాప్షన్ ఇచ్చాను.ఆ బొమ్మకి వూర్లో వాళ్ళు అందరూ మెచ్చుకుని ‘మరేమైతే... దీని కోసం ఎవుడికో పిలిసి డబ్బులు తగలెయ్యడమేలా?’ అని వూర్లో ఎవరి పెళ్లైనా ఆ ఇంటి గోడ మీద బోర్డు నేనే రాసేవాడిని. దానికోసం మార్కెట్లో దొరికే వార్నీస్సే వాడే వాడిని. ఆ కొన్నాళ్ళకు ఎలిమెంటరీ బడి గోడల మీద చిన్న చిన్న బొమ్మలు అక్షరమాల, ఎక్కాల వరసలు రాయమంటే రాసేను. అప్పుడప్పుడూ గూడేల్లో కొత్తగా కట్టిన గుడి, చర్చీల్లో కూడ బొమ్మలు వెయ్యడానికి వెళ్ళేవాడిని. శివపార్వతులూ, సరస్వతీదేవి, యేసుక్రీస్తు... ఏదైనా. వాటర్ కలరో... వార్నీసో వాళ్ళేది కోరుకుంటే దానితో వేసేవాడిని. దానితో చుట్టు ప్రక్కల వూరోళ్ళందరూ ‘బొమ్మల గవరయ్యా!’ అని ప్రేమగా పిలిచేవాళ్ళు. ఆ పిలుపు నాకూ ఆనందాన్నిచ్చేది. సరదా అనిపించేది. ఆ సరదా నాకు ఎన్ని రోజులో నిలవలేదు.వూర్లో ఓ రజస్వల ఫంక్షనైతే బోర్డు రాయడానికి నన్ను పిలవలేదు. భోజనాలకి వెళ్ళినపుడు చూసేను. ఆ అమ్మాయి నిలువెత్తు ఫోటో... రకరకాల పోజుల్లో అందంగా నిలబడి వుంది ఫ్లెక్సీ రూపంలో. ‘‘ఎలగుందివోయ్ దద్దా?’’ అని అడిగేడు అది చేయించిన సుబ్బారావు దద్ద దాన్నే చూస్తూ నిలబడివున్న నా వెనక చేయి వేస్తూ.‘‘మరెందుకూ నీకు ఇబ్బంది పెట్టడం... తొందరగైపోద్ది గదాని నీకు పిల్లేదువోయ్.. ఏటనుకోకు’’ అన్నాడు. ఇంటికొచ్చి మంచమ్మీద కూర్చున్నాను. మంచం పక్కనే నా పెయింటింగ్ సామాన్లు పెట్టుకున్న పెట్టి. అప్రయత్నంగా దాని వైపు చూసేను.దానిమీద ఈగ వాలింది. తోలాలనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఎంత అదిలిస్తున్నా అది వాలుతూనే వుంది. ‘క్లిక్’ మని శబ్దం వినపడ్డంతో అటు చూసేను. పెళ్ళిఫొటోలు తీస్తున్నాడు కురపాం సుధ.కేమెరా మీద ఎండ పడకుండా పేపరు అడ్డు పట్టుకోమన్నాడు. పట్టుకున్నాను. ఆ సాయంత్రం అతనితోనే నడిచి వెళ్ళేను స్టుడియోకి. ఆ వెళ్ళడం రోజూ అలవాటైపోయింది. అక్కడికి రోజూ రమ్మన్నాడుసాయంగా వుండడానికి. అలా వెళ్ళిన నేను కంప్యూటర్ ముందు కూర్చుని చిప్‌లోని ఫోటోలను లోడ్ చేసి ప్రింట్ ఇవ్వడం నేర్చుకున్నాను. అక్కడితో ఆగిపోకుండా ఫోటోషాప్ కూడా నేర్చుకున్నాను. అది మొదలు, స్టుడియో సుధర్శనతో ప్రోగ్రాములకి వెళ్ళడం ఫోటోలు తీయడం లాంటి పనులకు కూడా అప్పగించేవాడు. ఆక్రమంలోనే ఫోటో షాప్ నేర్చుకున్నాను. స్టుడియోలో పనులన్నీ చేయగల సామర్ధ్యం సంపాదించేను. ఇంటర్నెట్ కూడా వుండడంతో ఆ పనులూ అప్పజెప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను వూరు మారిపోయేడు. అక్కడ ఇంతకన్నా పెద్ద షాపింగ్ మాల్ బిజినెస్ కోసంఓనరు వెళ్లిపోవడంతో అక్కడ కూడా తనలాంటి వాళ్ళు అవసరముంటుందని ‘నేనూ వచ్చేస్తాను సార్!’ అన్నాను. దానికతను ‘నువ్వాపని చెయ్యలేవ’ని సున్నితంగా తిరస్కరించేడు. ఏమి చెయ్యాలో తెలీలేదు. స్టుడియో షిఫ్టింగ్ సమయంలో నాకొక కొత్త ఐడియా వచ్చింది. పాత కెమేరాలని ఒక డొక్కులో దాచి పెడుతున్నాడు ఓనరు. ‘‘సార్! నాకో సాయం చెయ్యండి’’ అన్నాను. ఏమిటన్నట్టు చూసేడు ఓనరు. ‘‘నేనెలాగా మీ కొత్త షాపులో పనికి పనికి రాను. మీ పాత కెమేరా ఒకటి ఇప్పించండి’’ అన్నాను. ‘‘ఒరేయ్! ఇది చాలా కాస్ట్లీ కెమేరారా’’ అన్నాడు. ఇవ్వడం కుదరదన్నట్టు. బ్రతిమాలేను.‘‘సాయం చెయ్యండి. మీ రుణముంచుకోను’ ఆ రేటుని ఇన్స్టాల్మెంట్ల మీద తీర్చుకుంటాను’’ అన్నాను. మొదట్లో ఒప్పుకోకపోయినా... కాసేపటికి ఒప్పుకున్నాడు. అనుకున్నది సాధించాననే గర్వంతో తొలి రోజుల్లో చాలా వేగంగా పనులు చేయడం ఆరంభించాను. కొన్ని రోజులాగి ఒక కొత్త కేమెరా కొనుక్కోవచ్చని ఊహతో వున్నాను. కానీ... పెళ్ళి ఫోటోలు తీయడం... కరిజ్మా ఆల్బవ్ు చేయించి ఇవ్వడం... ఆధార్, రేషన్ కార్డులకి కూడా పాస్ఫోటోస్ తీయడం కూడా చేసేను. వూర్లో అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో ఆ పని కూడ కాస్త తగ్గింది. అందరూ వాట్సప్ ల్లో లైవ్ కవరేజీల్లో బిజీ అయిపోయేరు. ఇన్స్టాల్మెంట్లు తీరేసరికి... నా కెమేరా మీద కూడా ఈగ వాలింది. దాన్ని తోలుతూ అలిసిపోయాను గానీ, అది వాలడం మానలేదు. అలిసిన కళ్ళను మూసి నిదురలోకి జారిపోయేను. కళ్ళు తెరిచి చూస్తే... ఎదురుగా డిగ్రీ చదువుతున్న కొడుకు... సంతు.‘‘నానా! బయల్దేరుతున్నూ...’’ అని బేగ్ సర్దుకుంటున్నాడు. దిగులేసింది వాడిని చూసి, వాడి భవిష్యత్తుని తలచుకొని. నాలాగా పని చేయలేడు. సదువున్నోడని ఉజ్జోగం గేరంటీ లేదు. ఎందుకంటే ఆడి కన్నా ఎక్కువ సదివినోలు బోల్డుమంది వున్నారు వూర్లో. హాష్టల్లో వుండి కాలేజీ కెల్తున్నోడు. కరుసుల కేటి సేస్తున్నాడో! మొన్న సంతలో అమ్మిన పనసకాయల డబ్బులు తీసి వాడి చేతిలో పెట్టేను. నులక మంచమ్మీద కూర్చుని బూటు తాడు కట్టేసి నిలబడ్డాడు. అడ్డంగా తల వూపి ‘‘ఒద్దు నీదగ్గరే వుంచు’’ అని పేంట్ ఎనకజోబీ నుంచి పర్సు తీసి ఐదొందల కాగితం తీసి నా చేతిలెట్టేడు. ఆశ్చర్యపోయేను. నాకు తెలిసి ఈమద్దిన కూలికెల్లలేదు సంతు. ఉపాదిహామీ డబ్బులు రాలేదు. పెరట్లో పనస కాయలు తప్ప ఏదీ సంతలో అమ్మలేదు. అదే అడిగాను...‘‘ఎక్కడివిరా డబ్బులు?’’ నా గొంతులో కంగారునీ, అనుమానాల్నీ దూరం చేస్తూ చెప్పేడు. ‘‘నువ్వేమీ గాబర పడిపోకు నానా... నీనేమీ తప్పు చేయలేదు’’ అని మంచమ్మీదకూర్చున్నాడు.‘‘పగలు కాలేజీ కెల్లినా... రాత్రి పనికెల్తున్నాను’’ అన్నాడు బేగు వీపుకి దోపుకుంటూ. ‘‘ఏం పనిరా?’’ నా అనుమానాలు తీరలేదు. ‘‘పుట్టీ పని. రాత్రంతా రంగులేయడమే’’ అని బయల్దేరేడు పచ్చకాగితం నా చేతిలో పెడుతూ. వూరు దాటి కొండ మలుపు తిరుగుతున్న వాడు రాత్రికి రంగులు వేస్తున్న వాడిలా కనిపించేడు. కానీ... మరుక్షణమే భయమేసింది. ఆ రాత్రి మీద ఈగ వాలితే?!?అలా మొదలైన నా పనితనం మొదట్లో బాగానే సాగింది. ఇష్టమైన పని. లాభం కాకపోయినా పెళ్ళిళ్ళకి బోర్డులు మాత్రమే రాసే నేను కొన్నాళ్ళకి ఆ పని కూడా లేకుండా అయిపోయాను. దానికి కారణం ఫ్లెక్సి. గీసిన బొమ్మ కన్నా కంప్యూటర్ బొమ్మ ఆకర్షణీయంగా కనిపించడంతో ఆ పనీ నా చేతి నుండి జారిపోయింది. - మల్లిపురం జగదీశ్ -
దెయ్యం పట్టింది
కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! పద్దెనిమిదేళ్ల వయసున్న భార్య, ఇరవై ఏళ్ల వయసున్న భర్త మధ్య మొదలయ్యే గొడవ.. మధ్య యుగాల్లో ఫ్రాన్సు, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన నూరేళ్ల యుద్ధంలా.. అలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందేమో అన్నంత అర్థరహితంగా కనిపిస్తుంది. ఆ వయసులో అమ్మాయి రోషంగా ఉంటుంది. అబ్బాయి మూర్ఖంగా ఉంటాడు. కొత్తగా సున్నం వేసిన ఆ ఇల్లింకా పచ్చి వాసన కొడుతూ ఉండగానే వాళ్లిద్దరూ వచ్చి చేరారు. వచ్చి నెలైంది. కొత్తింటికి కొత్తగా సున్నం వేయడం ఏంటన్న ఆలోచన వాళ్లకు గానీ, వాళ్ల పెద్దవాళ్లకు గానీ రాలేదు! అమ్మాయి, అబ్బాయి బిలో ట్వంటీ ట్వీంటీవన్. అబ్బాయికైతే పెళ్లయినట్లే లేదు. బ్యాచిలర్‌గా ఎలా ఉన్నాడో మ్యారీడ్గా కూడా అలానే ఉన్నాడు. భార్యని ఫీల్ అవడం, భార్య అని ఫీల్ అవడం ఇంకా మొదలవలేదు. అమ్మాయి హ్యాపీగా ఉంది. పెళ్లితో కొత్తగా వచ్చిన హ్యాపీనెస్ కాదది.అమ్మాయిల్లో సహజంగానే తొణికిసలాడే సంతోషం. పెళ్లికి ముందెలా ఉందో, పెళ్లి తర్వాతా ఆమె అలానే ఉంది. తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు ఇంకొకరి పని చేస్తోంది. ఆ ఇంకొకరు తన భర్త అని, భర్త కాబట్టి భర్త పని కూడా తనదే అనుకునీ ఆమేం చెయ్యడం లేదు. ఇంట్లో ఇద్దరో ముగ్గురో నలుగురో ఉన్నప్పుడు అలవాటైన పనులు, అలవాటుగా చేసే పనులు ఉంటాయి కదా.. అలా చేస్తోంది.పెద్దవాళ్ల బాధ్యతను తీర్చడానికా అన్నట్లు వీళ్లు భార్యాభర్తలయ్యారే కానీ, భార్యాభర్తలుగా మాత్రం లేరు. ఆమె ఇంకా చదువుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్. అతడు ఇంకా ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఇంటికెవరైనా గెస్టులు వచ్చి చూస్తే.. పూర్తిగా ఇది పెద్దవాళ్ల తొందరపాటు వల్ల జరిగిన పెళ్లి అని వాళ్లకు ఏ మూలో అర్థమైపోతుంది. ఈ వయసులో జరిగే పెళ్లిళ్లు సాధారణంగా.. జరిగిన పెళ్లిళ్లు అయి ఉండవు. చేసుకున్న పెళ్లిళ్లు అయి ఉంటాయి. చేసుకున్న పెళ్లిలో దంపతుల మధ్య పెద్దలు ఉండరు. ప్రేమ ఉంటుంది. ఈ జంట మధ్య ప్రేమ లేదు. పెద్దలు ఉన్నారు. వీళ్లున్న ఇంట్లో ప్రస్తుతం పెద్దలెవరూ లేరు. ప్రేమా లేదు. వీళ్లిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే వీళ్లకు తెలీకుండా మరో ఇద్దరు కూడా ఆ ఇంట్లో ఉన్నారు! ఆ ఇద్దరూ ఇంకో జంట. ఇంచుమించు అదే వయసున్న జంట. కొన్ని నెలల క్రితమే ఆ ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిన జంట. పెళ్లి చేసుకున్నా వదిలిపెట్టకుండా ఇద్దర్నీ వేరు చేద్దామని ఆ ఇద్దరి తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేశారు. కలిసి చనిపోతే ఇక తమనెవరూ వేరు చేయలేరని ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. శరీరాలు వేర్వేరుగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాయి. ఆత్మలు మాత్రం ఒకటిగా ఆ ఇంట్లోనే ఉండిపోయాయి. అది ఆ ఇంటాయనకూ తెలీదు. ఈ కొత్త జంటకు తెలిసే అవకాశం లేదు. ఎప్పట్లా ఇద్దరి మధ్యా యుద్ధం మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో మర్చిపోయారు. యుద్ధమే జీవిత పరమార్థంగా కత్తులు, కటార్లు విసురుకుంటున్నారు. అమ్మాయి వంటింట్లో గిన్నెలు ఎత్తి పడేసింది. అబ్బాయి గోడను కాలితో ఒక్క తన్ను తన్నాడు.‘‘నువ్విలాంటి మనిషివని అనుకోలేదు. మీ తాత నీ పెళ్లి చూసి చచ్చిపోవాలని అశపడుతున్నాడని, మీవాళ్లు మావాళ్లను ఒప్పించి నన్ను నీకిచ్చిపెళ్లి చేశారు. ఖర్మ. ఆయన చావు నా పెళ్లికొచ్చింది’’ అని నుదురు కొట్టుకుంది అమ్మాయి.‘‘మాటలు జాగ్రత్తగా రానియ్’’ అని కళ్లెర్ర చేశాడు. ‘‘జాగ్రత్తా!! ఏదీ మళ్లీ అనూ’’ అని ముందుకొచ్చింది అమ్మాయి. అబ్బాయి ఉగ్రుడయ్యాడు. ‘‘నీది కాదు, నాదీ ఖర్మ. నీలాంటి దాన్ని చేసుకున్నందుకు! అబ్బాయి నచ్చాడని మీవాళ్లొచ్చి అడిగితే ‘అమ్మాయి బాగుందిరా.. చేసుకో’ అని మావాళ్లు నన్నుబలవంత పెట్టారు. నాకేం తెలుసు బుద్ధి కూడా ముఖంలాగే ఉంటుందనుకున్నాను’’ అన్నాడు. అమ్మాయికి కాస్త జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చేత అతడు తననేం అన్నదీ గ్రహించింది. ‘‘ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేస్తాను. నువ్వు అన్‌ఫిట్ అని మావాళ్లకు చెప్పేస్తాను’’ అని ఫోన్ తీసుకుంది. ‘అన్‌ఫిట్’ అనే మాటకు అబ్బాయి ఒణికిపోయాడు.‘‘దెయ్యంలా దాపురించావు నా బతుక్కి’’ అని పెద్దగా అరిచేశాడు. ఆ అరుపుకి.. అమ్మాయేం బెదరలేదు కానీ, అప్పటివరకు వాళ్లిద్దర్నీ గెడ్డం కింది చెయ్యి ఆన్చుకుని చూస్తూ ఉన్న ఆ రెండు ఆత్మలు ఉలిక్కిపడి.. ‘దెయ్యంలా’ అనే మాటకు నొచ్చుకున్నాయి. ఆ నొచ్చుకోవడం అక్కడితో ఆగలేదు. ‘‘ఏంటలా ఊగిపోతున్నారు! దెయ్యం పట్టినట్లుగా..’’ అన్నారు.. సడెన్‌గా ఊరినుంచి దిగిన మామగారు.. కూతుర్నీ, అల్లుణ్ణీ ఆ వార్ సీన్లో చూసి! ఆ మాటకు ఇంకా నొచ్చుకున్నాయి ఆ రెండు ఆత్మలు. మామగారి పక్కనే అత్తగారూ ఉన్నారు. వాళ్లు తలుపుకొట్టి రానవసరం లేకుండానే తలుపు తెరిచి కొట్లాడుకుంటున్నారు అమ్మాయీ.. అబ్బాయీ.‘‘దెయ్యం నాకు కాదు. మీ కూతురికి పట్టింది’’అన్నాడు అబ్బాయి ఉక్రోషంగా. ‘‘నాకు కాదు.. నీకే దెయ్యం పట్టింది’ అంది అమ్మాయి. ‘‘ఇద్దరీకి పట్టింది. ఇక ఊర్కోండి’’ అన్నారు అమ్మాయి తల్లిదండ్రులు.ఆ క్షణమే అనుకున్నాయి ఆ రెండు ఆత్మలూ.. నిజంగా దెయ్యం పడితే ఎలా ఉంటుందో చూపించాలని. చూపించాయి కూడా. ఆ రాత్రికే! ‘‘అబ్బాయికి సున్నుండలు ఇష్టమని తెచ్చామమ్మా. నీకిష్టమైన నువ్వుండలు కూడా. అసలు అందుకోసమే వచ్చాం’’.. తెల్లారే తిరిగి ఊరెళుతూ చెప్పారు పెద్దవాళ్లిద్దరూ. వాళ్లలా వెళ్లిపోగానే భార్యను మీదకు లాక్కుని బలంగా హత్తుకున్నాడు అబ్బాయి. ‘‘నిజంగానే రాత్రి నీకేదో దెయ్యం పట్టింది’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ముందు నీకు పట్టాకే నాకు పట్టింది’’ అంది అమ్మాయి అతడి ముక్కు మీద తన చూపుడు వేలితో మృదువుగా రాస్తూ. ఆత్మలు రెండూ ఈ దృశ్యాన్ని చూసి రెండు కన్నీటి బొట్లు రాల్చాయి. ఆ బొట్లు ఈ ఇద్దరి చెంపల మీదుగా జారాయి. ప్రేమ కరిగిందా? కాదు. ప్రేమకు దెయ్యం పట్టింది. -
యాక్సిస్ నుంచి ‘లైమ్’ మొబైల్ యాప్
చెన్నై: బ్యాంకింగ్, చెల్లింపులు, వాలెట్, షాపింగ్ లావాదేవీలకు ఉపయోగపడేలా యాక్సిస్ బ్యాంక్ శుక్రవారం లైమ్ పేరిట మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. యూజర్లు ఉత్పత్తులు, సర్వీసుల ధరలు, చార్జీలను పోల్చి చూసుకుని, కొనుగోలు చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ తెలిపింది. నో యువర్ కస్టమర్ ప్రక్రియకు అవసరమైన వివరాలు పొందుపర్చి మొబైల్ ద్వారానే డిజిటల్ మాధ్యమంతో పూర్తి స్థాయి పొదుపు ఖాతా తెరిచేందుకు ఇది తోడ్పడగలదని బ్యాంక్ ఎండీ శిఖా శర్మ తెలిపారు. -
బోడో మిశ్రమంతో క్రిమికీటకాలు దూరం
కొండాపూర్: క్రిమికీటకాలు, పురుగులు మామిడి చెట్లపైకి వెళ్లకుండా ఉండాలంటే మొదళ్లకు బోడో పేస్ట్ మిశ్రమాన్ని పూయాలని రావేఫ్ విద్యార్థులు రైతులకు సూచించారు. మండల పరిధిలోని మల్కాపూర్‌లో కౌలు రైతు శ్రీనివాస్ పొలంలో మంగళవారం అన్నదాతలకు పలు సలహాలు అందజేశారు. బోడో మిక్చర్ తయారీ విధానం.. కిలో కాపర్ సల్ఫేట్లో 10 లీటర్ల నీళ్లు పోసి కేసీ సున్నం వేసి కలిపితే బోడో మిక్చర్ తయారవుతుంది. దీన్ని చెట్ల మొదళ్లకు, కొమ్మలకు పూయడం వల్ల చీమలు, కీటకాలు, పురుగుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. పిండి నల్లులు, పండు ఈగలు చెట్లపై వాలకుండా ఉండాలనుకుంటే కొమ్మలకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అఖిలాండేశ్వరి, శ్రీవర్ధ, లిఖిత, దివ్య, శైలజ, అల్ఫియా, సుస్మితారెడ్డి, అసా సుష్మ, పూర్ణిమ, జఫీలా, సింధు, మేఘన, నిస్సీ, ఫెమి, వర్షారెడ్డితో పాటు గ్రామ రైతులు నారాయణ, పాపయ్య, చంద్రకళ, చెంద్రయ్య, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.