నిమ్మచెట్ల కంచె నిర్మించి, ఏనుగుల నుంచి రక్షించుకుంటున్న అస్సాం రైతు
అడవుల్లో పచ్చదనం తగ్గిపోతున్న కొద్దీ ఏనుగులు ఆహారం కోసం కొత్త ప్రాంతాల్లోకి చొరబడాల్సిన పరిస్థితుల్లో దేశంలో అనేక రాష్ట్రాల్లో రైతులు, గ్రామీణుల ప్రాణాలతోపాటు పంటలకు, పశువులకు రక్షణ కొరవడుతున్నది. ఏనుగులు–మనుషుల సంఘర్ణణను నివారించేందుకు కంచె పంటగా మల్బరీ మొక్కలను సాగు చేయటం, తేనెటీగల పెట్టెలతో కంచెను ఏర్పాటు చేయటం సత్ఫలితాలనిస్తున్న విషయమై గత వారం చర్చించుకున్నాం. ఈ వారం మరో బయోఫెన్స్ గురించి పరిశీలిద్దాం. పంట పొలాలు, గ్రామాల చుట్టూ నిమ్మ చెట్లతో దట్టమైన కంచెను ఏర్పాటు చేసుకుంటే ఏనుగుల బెడద నుంచి బయటపడిన అస్సాం రైతుల అనుభవం గురించి తెలుసుకుందాం.
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలోని శివసాగర్ జిల్లాలో గతంలో ఏనుగులు–మనుషుల ఘర్షణ. ప్రాణనష్టంతో పాటు పంట నష్టం సంఘటనలు తరచూ వినిపిస్తూ ఉండేవి. ఏనుగుల గుంపులో 150–200 నుంచి నాలుగైదు వరకు ఏనుగులు ఉంటాయి. అయితే, గత నాలుగేళ్లుగా ఏనుగుల దాడుల బాధ తప్పిందని సౌరగూరి ప్రాంత రైతులు సంతోషిస్తున్నారు. నిమ్మ చెట్లతో బయోఫెన్స్‌లు నిర్మించుకోవటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. గౌహతి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ అరణ్యక్ వీరికి అండగా నిలిచింది. నిమ్మ కంచెలపై అవగాహన కల్పించటంతోపాటు మొక్కలను సైతం అందించింది.
జిగ్‌జాగ్ పద్ధతిలో మూడు వరుసలుగా నిమ్మ మొక్కలను దగ్గర దగ్గరగా నాటుకోవాలి. రెండు మూడు ఏళ్లు పెరిగేటప్పటికి నిమ్మ మొక్కల కొమ్మలు కలిసిపోయి ఏనుగులు దూరి రావటానికి వీలుకాదు. నిమ్మ చెట్లకుండే ముళ్లు, నిమ్మకాయల వాసన.. ఈ రెండిటి వల్ల ఏనుగులు నిమ్మ కంచెలు దాటి రాలేకపోతున్నట్లు అరణ్యక్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి రక్షించడంతో పాటు రైతులకు నిమ్మకాయల విక్రయం ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తోంది. నాలుగేళ్ల క్రితం నిమ్మ మొక్కల కంచె నాటిన హజారికా అనే రైతు వారానికి వెయ్యి వరకు నిమ్మకాలను కోసి విక్రయిస్తున్నారు. ఆఫ్‌సీజన్‌లోలో నిమ్మకాయ రూ.5 కి అమ్ముతున్నారు. సీజన్‌లో అయితే రూ.2–3కు అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు.
స్థానిక వాతావరణం, పర్యావరణం, మట్టి స్వభావాన్ని బట్టి బయోఫెన్స్ రకాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ‘తేనెటీగ పెట్టెలతో కూడిన కంచెలు వర్షపాతం తక్కువగా ఉండే మెట్ట ప్రాంతాల్లో బాగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం కురిసే ప్రాంతాల్లో తేనెటీగలు మనుగడ సాగించలేవు. వెదురు మొక్కలతో కంచెలు స్వతహాగా వెదరు పెరిగే ప్రాంతాల్లో పర్వాలేదు. ఇతర ప్రాంతాల్లో వెదురు కంచెలు ఏర్పాటు చేస్తే.. ఇతర చెట్లను పెరగనీయకుండా ఇవే విస్తరించి జీవవైవిధ్యానికి ముప్పు తెస్తాయి. నిమ్మ చెట్లు, మొగలి ఆకారంలో ఉండే కిత్లలి (అగవె) జాతి తుప్పలతోనూ బయెఫెన్స్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ప్రాంతానికి ఏది అనువైనదో గ్రహించాలి. ఏనుగుల రాకపోకలకు ఇబ్బంది లేకుండానే ఘర్షణలు నివారించి సహజీవన సూత్రాన్ని పాటించడానికి ‘కంచె తోటలు’ ఉపకరిస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment