సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను ఆకర్షించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే నూతన విద్యా విధానాన్ని రూపొందించిన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలు ఉండే ఉన్నత విద్యా సంస్థలకు అత్యధిక నిధులు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు వాటి సీట్లలో 25 శాతం సమానమైన సంఖ్యలో సూపర్ న్యూమరరీ విధానంలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది.
అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల్లో ఈ సీట్లను విదేశీ విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. దీనివల్ల విదేశీ విద్యార్థులకు ప్రవేశాలను సులభతరం చేయొచ్చని, దేశ సంస్కృతి, ఉన్నత సంప్రదాయాలను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లవచ్చని యూజీసీ పేర్కొంది. విదేశీ మారకద్రవ్యం కూడా సమకూరి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.
అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశాలు ఇలా
ఉన్నత విద్యా సంస్థల్లో యూజీ, పీజీలో విదేశీ విద్యార్థులకు సీట్ల కేటాయింపు, ప్రవేశాలకు యూజీసీ విధివిధానాలను ప్రకటించింది
అంతర్జాతీయ విద్యార్థులకు దేశీయ విద్యార్థులకు నిర్దేశించిన అర్హతలతో సమానమైన అర్హతలు తప్పనిసరి. ప్రవేశాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి.
విద్యా సంస్థల్లోని సీట్లలో 25 శాతానికి సమాన సంఖ్యలో విదేశీ విద్యార్థులకు సూపర్ న్యూమరరీ సీట్లు. ఈ సీట్లకు యూజీసీ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం పొందాలి. వాటి మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి
ప్రొఫెషనల్, సాంకేతిక విద్యా కోర్సుల సీట్లకు కూడా సంబంధిత నియంత్రణ సంస్థల నిబంధనలు పాటించాలి. పీహెచ్‌డీ ప్రోగ్రాముల సీట్లు యూజీసీ, నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి.
విదేశీ విద్యార్థులకు ప్రవేశాల్లో వీసా, విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భారత విదేశాంగ శాఖ నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ విద్యాసంస్థలు తమ ఇన్‌టేక్ సీట్లకన్నా ఎక్కువ శాతంలో సీట్లను వారికి కేటాయించవచ్చు. ఈ సూపర్ న్యూమరరీ సీట్లలో ప్రవేశాలు నేరుగా నిర్వహించాలి. ఈ సూపర్ న్యూమరరీ సీట్లలో విదేశీ విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించాలి. సీట్లు మిగిలిపోయినా ఇతరులకు ఇవ్వకూడదు.
Comments
Please login to add a commentAdd a comment