లేజీ వద్దు పీజీ ముద్దు | This is story of Post Graduation | Sakshi
Sakshi News home page

లేజీ వద్దు పీజీ ముద్దు

Published Tue, Apr 12 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

లేజీ వద్దు పీజీ ముద్దు

లేజీ వద్దు పీజీ ముద్దు

డిగ్రీ వరకు ఆటపాటలతో గడిపేసే విద్యార్థి పీజీలో మాత్రం ఏదో ఒక స్థాయిని, అర్హతను అందుకుంటాడు. గ్రాడ్యుయేషన్ వరకు లక్ష్యం అంటే ఏమిటో తెలియని కుర్రాడికి పీజీ ఓ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. దేశంలో ఎంతో మంది నాయకులకు, వ్యాపారవేత్తలకు వర్సిటీలే జీవితాన్ని బోధించాయి. యూనివర్సిటీలే బతుకు నేర్పించాయి. అందుకే డిగ్రీతో సరిపెట్టాలనుకునే విద్యార్థులకు అధ్యాపకులు, ఆచార్యులు పీజీ దారి చూపిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ అంటే కేవలం చదువు మాత్రమే కాదని, ఇది మనల్ని మనం మార్చుకునే వేదికని సూచిస్తున్నారు.

జిల్లా విద్యార్థులకు మంచి మంచి యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. అందులో చేరేందుకు అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆలస్యం మాత్రం వద్దని అంటున్నారు.
 - ఎచ్చెర్ల

 
* పీజీ చేయడం మేలంటున్న నిపుణులు
* అందుబాటులో ఉత్తమ వర్సిటీలు
* చదువుకునేందుకు బోలెడు అవకాశాలు

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిగ్రీనే పెద్ద చదువైపోయింది. కొద్దిమంది వర్సిటీల్లో  చేరి ఉన్నత స్థానాలకు వెళ్తున్నా ... ఇంకా చాలా మంది విద్యార్థులు డిగ్రీ అయిపోగానే డిఫెన్స్ వైపు, ఉద్యోగాల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే మరో రెండేళ్లు యూనివర్సిటీలో గడిపితే ఆ విద్యార్థి స్థాయి మారిపోతుందని, ఉన్నత ఉద్యోగాలూ వెతుక్కుంటూ వస్తాయని అధ్యాపకులు సూచిస్తున్నారు. ‘నాకు ఇంగ్లిష్ రాదు, నేను పెరిగింది పల్లెటూరిలో. నా యాస కూడా బాగోదు’ అనుకున్న విద్యార్థులే వర్సిటీలో చేరాక బంగారు పతకాలు సాధించిన సందర్భాలు బోలెడు. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్లే కాదు... కాలేజీలో గడిపిన రోజులు కూడా ఎన్నో విషయాలు వివరిస్తాయి.  
 
ఎన్నో సదుపాయాలు...
వర్సిటీలో ఉండే విద్యార్థులకు గ్రంథాలయం రాత్రి 12 వరకు వరకు అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల పుస్తకాలు కళ్ల ముందరే ఉంటాయి. ఇంటర్నెట్ సమాచారానికీ లోటు ఉండదు. తాను చదువుతున్న పీజీ సబ్జెక్టులో నైపుణ్యం సాధిస్తే నెట్, స్లెట్ వంటి పరీక్షలు రాయవచ్చు. జూనియర్, సీనియర్ అధ్యాపకులుగా ఎంపిక కావచ్చు. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి ఎంపికలకు కూడా అర్హత లభిస్తుంది. ఎంఫిల్, డాక్టరేట్ వంటివి చేయవచ్చు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలకు అనువుగా చదవవచ్చు, ఉద్యోగాలు సాధించవచ్చు, వ్యక్తిగత క్రమశిక్షణ, ఉన్న వసతులు సద్వినియోగం చేసుకునే విద్యార్థులు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.  
 
విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత నివ్వాలి
విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. డిగ్రీ తర్వాత ఉన్నత విద్య అందుబాటులో ఉన్నా వర్సిటీల్లో చేరేందుకు ప్రాధాన్యమివ్వడం లేదు. విద్యార్థులు నిష్ణాతులుగా మారేందుకు ఉన్నత విద్య అవసరం. మెరుగైన భవిష్యత్ సైతం సాధ్యమవుతుంది. మరో పక్క పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను సైతం ప్రస్తుతం వర్సిటీల్లో ప్రోత్సహిస్తున్నాం.
 - ప్రొఫెసర్ గుంట తులసీరావు, రిజిస్ట్రార్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ.
 
మంచి తరుణం మించిన రాదు...
వర్సిటీలో అడుగు పెట్టేందుకు ఇదే మంచి సమయం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆంధ్రాయానివర్సిఈల ప్రవేశాలకు సంయుక్తంగా ఆసెట్- 2016 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు అన్‌లైన్‌లో ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలి. మే ఐదు నుంచి పరీక్షలు ఉంటాయి. వెబ్ కౌన్సిలింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది.
 
డిగ్రీతో విద్య ఆపేయటం మంచిది కాదు
ప్రస్తుతం డిగ్రీతో విద్యార్థులు చదవు ఆపేస్తున్నా రు. డిగ్రీనే అన్ని ఉద్యోగాలకు గరిష్ట అర్హత అన్న కోణం నుంచి బయటకు రావాలి. ఉన్నత విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉన్నత విద్యలో పరిశోధనలు, సదస్సులు, వర్క్ షాపులు నుంచి ఎంతో నేర్చు కోవచ్చు, ఉన్నత విద్య యువత ప్రతిష్టను సైతం సమాజంలో పెంచుతుంది.
- పి.జయరాం, ప్రిన్సిపాల్ సన్ డిగ్రీ కాళాశాల, బీఆర్‌ఏయా పాలక మండలి సభ్యులు.
 
కోర్సులే కోర్సులు
ఏపీలో నంబర్ వన్ యూనివర్సిటీ ఆంధ్రా యూనివర్సిటీ, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 150 వరకు పీజీ కోర్సులు ఉన్నాయి. బీఆర్‌ఏయూలో పరిమితి కోర్సులు ఉన్నా స్థానికంగా ఉంటూ విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది.

వసతులు మాత్రం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. వర్సిటీలో పీజీ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎడ్, లైబ్రరీ సైన్స్, గణితం, రూరల్ డెవలప్‌మెంట్, ఎకనామిక్స్ ఎంకాం, బయోటెక్నాలజీ, సోషల్ వర్క్, జియోటెక్, తెలుగు కోర్సులు ఉన్నాయి. అయితే రెండు యూనివర్సిటీల్లో న్యాయ విద్య చదవాలంటే విద్యార్థులు లాసెట్ రాయాల్సి ఉంటుంది. బీఎడ్ చదవాలంటే ఎడ్ సెట్ రాయాలి, ఎంబీఏ, ఎంసీఏ చదవాలంటే ఐసెట్ రాయాలి. విద్యార్థులు తమకు అనువైన కోర్సులు చదివేందుకు ఎంచు కోవాలి. వర్సిటీల్లో సీనియర్లను సంప్రదిస్తే గత కొన్నేళ్లగా అడ్మిషన్లు తక్కువగా ఉండే కోర్సులు సూచిస్తారు.
 
దరఖాస్తు చేసుకున్నా
ఇప్పటికే ఆసెట్‌కు దరఖాస్తు చేసుకున్నా, సెట్ పరీక్ష విధానంపై నిపుణుల సూచనలు తీసుకుంటున్నా. డిగ్రీలో నేను రాసుకున్న నోట్సు సైతం నాకు ఉపయోగ పడుతుంది. ఆసెట్‌లో మంచి ర్యాంకు లక్ష్యం.
- లోలుగు విజయ లక్ష్మి, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థి.
 
విషయ పరిజ్ఞానం పెంచుకుంటా
విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కృషిచేస్తాను. ఉన్నత విద్యతోనే సంపూర్ణ విషయ పరిజ్ఞానం సాధ్యం. సబ్జెక్టులో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాప్టు స్కిల్స్, బాషాపైపుణ్యం వంటి అంశాలపై ఉన్నత విద్యలో చేరాక ప్రత్యేక దృష్టి పెడతా.
- ఎంవీఆర్‌జీ పల్లవి, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని.
 
మానవ వనరులకు వేదిక..
ఉన్నత విద్య అనేది సమాజంలో ఉత్తమ మానవ వనరులును తీర్చిదిద్దుతుంది. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత నివ్వాలి. ఆంధ్రాయూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ యూనివర్సిటీలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సైతం గ్రంథాలయాలు, వసతి గృహాల్లో శ్రమించి చదివేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సాధారణ విద్యార్థులు సైతం నిష్ణాతులుగా మారే అవకాశం లభిస్తుంది.
- డాక్టర్ కె.బూబూరావు, శ్రీకాకుళం పురుషుల కళాశాల ప్రిన్సిపాల్, పాలకమండలి సభ్యులు, బీఆర్‌ఏయూ.
 
పీజీ లక్ష్యం
పీజీలో చేరటం నాలక్ష్యం. ఇప్పటికే దరఖాస్తు సైతం చేసుకు న్నా. ప్రిపరేషన్ ప్రారంభించా. పాత ఆసెట్ ప్రశ్న పత్రాలు, వచ్చే ప్రశ్నలు సిబలస్, డిగ్రీలో ప్రధాన పాఠ్యాంశాలు చదువుతున్నా. పీజీలో చేరాక జీవితంలో సాధించాల్సినవి నిర్దేశిస్తా.
- పొట్నూరు సాయిసుధ, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని
 
పరిశోధనలకు ప్రాధాన్యం
నాకు పరిశోధనాత్మక విద్య అంటే ఇష్టం. అందుకే పీజీలో చేరుతా. ఇంక్యుబేషన్ విద్యకు ప్రాధాన్యత ఇస్తాను. మా అధ్యాపకులు నుంచి సైతం చాలా విషయాలు గ్రహించాను. కొత్త ఆవిష్కరణలతోనే మంచి భవిష్యత్తు సాధ్యం.
- నల్లనగూళ్ల లక్ష్మీ సాయి ప్రసన్న, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని.
 
ఉన్నత విద్యతో విషయ పరిజ్ఞానం

డిగ్రీతో చదువు నిలిపి వేస్తే సంపూర్ణ విషయ పరిజ్ఙానం సాధ్యం కాదు. ఉన్నత విద్యలో చేరేక, సబ్జెక్టుపై పట్టు వస్తుంది. మరో పక్క పోటీ  పరీక్షల సాధనకు అనువైన వసతులు ఉంటాయి.
- వావిలపల్లి జ్యోత్స్న, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement