Rural students
-
రూరల్ స్టూడెంట్స్.. సీఎస్సీ.. ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’
న్యూఢిల్లీ: సీఎస్సీ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహకార ఒప్పందానికి వచ్చాయి. 10–22 ఏళ్ల వయసు విద్యార్థులకు ‘ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్’ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు వొకేషషణల్ శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పరిధిలోని సంస్థే సీఎస్సీ ఈ గవర్నెన్స్. ప్రధానమంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరత అభియాన్ పథకం కింద 6 కోట్ల గ్రామీణులకు డిజిటల్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని సీఎస్సీ ఈ గవర్నెన్స్ ఇండియా ఎండీ దినేష్ కే త్యాగి తెలిపారు. -
లేజీ వద్దు పీజీ ముద్దు
డిగ్రీ వరకు ఆటపాటలతో గడిపేసే విద్యార్థి పీజీలో మాత్రం ఏదో ఒక స్థాయిని, అర్హతను అందుకుంటాడు. గ్రాడ్యుయేషన్ వరకు లక్ష్యం అంటే ఏమిటో తెలియని కుర్రాడికి పీజీ ఓ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది. దేశంలో ఎంతో మంది నాయకులకు, వ్యాపారవేత్తలకు వర్సిటీలే జీవితాన్ని బోధించాయి. యూనివర్సిటీలే బతుకు నేర్పించాయి. అందుకే డిగ్రీతో సరిపెట్టాలనుకునే విద్యార్థులకు అధ్యాపకులు, ఆచార్యులు పీజీ దారి చూపిస్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ అంటే కేవలం చదువు మాత్రమే కాదని, ఇది మనల్ని మనం మార్చుకునే వేదికని సూచిస్తున్నారు. జిల్లా విద్యార్థులకు మంచి మంచి యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. అందులో చేరేందుకు అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆలస్యం మాత్రం వద్దని అంటున్నారు. - ఎచ్చెర్ల * పీజీ చేయడం మేలంటున్న నిపుణులు * అందుబాటులో ఉత్తమ వర్సిటీలు * చదువుకునేందుకు బోలెడు అవకాశాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిగ్రీనే పెద్ద చదువైపోయింది. కొద్దిమంది వర్సిటీల్లో చేరి ఉన్నత స్థానాలకు వెళ్తున్నా ... ఇంకా చాలా మంది విద్యార్థులు డిగ్రీ అయిపోగానే డిఫెన్స్ వైపు, ఉద్యోగాల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే మరో రెండేళ్లు యూనివర్సిటీలో గడిపితే ఆ విద్యార్థి స్థాయి మారిపోతుందని, ఉన్నత ఉద్యోగాలూ వెతుక్కుంటూ వస్తాయని అధ్యాపకులు సూచిస్తున్నారు. ‘నాకు ఇంగ్లిష్ రాదు, నేను పెరిగింది పల్లెటూరిలో. నా యాస కూడా బాగోదు’ అనుకున్న విద్యార్థులే వర్సిటీలో చేరాక బంగారు పతకాలు సాధించిన సందర్భాలు బోలెడు. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్లే కాదు... కాలేజీలో గడిపిన రోజులు కూడా ఎన్నో విషయాలు వివరిస్తాయి. ఎన్నో సదుపాయాలు... వర్సిటీలో ఉండే విద్యార్థులకు గ్రంథాలయం రాత్రి 12 వరకు వరకు అందుబాటులో ఉంటుంది. అన్ని రకాల పుస్తకాలు కళ్ల ముందరే ఉంటాయి. ఇంటర్నెట్ సమాచారానికీ లోటు ఉండదు. తాను చదువుతున్న పీజీ సబ్జెక్టులో నైపుణ్యం సాధిస్తే నెట్, స్లెట్ వంటి పరీక్షలు రాయవచ్చు. జూనియర్, సీనియర్ అధ్యాపకులుగా ఎంపిక కావచ్చు. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి ఎంపికలకు కూడా అర్హత లభిస్తుంది. ఎంఫిల్, డాక్టరేట్ వంటివి చేయవచ్చు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలకు అనువుగా చదవవచ్చు, ఉద్యోగాలు సాధించవచ్చు, వ్యక్తిగత క్రమశిక్షణ, ఉన్న వసతులు సద్వినియోగం చేసుకునే విద్యార్థులు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత నివ్వాలి విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. డిగ్రీ తర్వాత ఉన్నత విద్య అందుబాటులో ఉన్నా వర్సిటీల్లో చేరేందుకు ప్రాధాన్యమివ్వడం లేదు. విద్యార్థులు నిష్ణాతులుగా మారేందుకు ఉన్నత విద్య అవసరం. మెరుగైన భవిష్యత్ సైతం సాధ్యమవుతుంది. మరో పక్క పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులను సైతం ప్రస్తుతం వర్సిటీల్లో ప్రోత్సహిస్తున్నాం. - ప్రొఫెసర్ గుంట తులసీరావు, రిజిస్ట్రార్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ. మంచి తరుణం మించిన రాదు... వర్సిటీలో అడుగు పెట్టేందుకు ఇదే మంచి సమయం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఆంధ్రాయానివర్సిఈల ప్రవేశాలకు సంయుక్తంగా ఆసెట్- 2016 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు అన్లైన్లో ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలి. మే ఐదు నుంచి పరీక్షలు ఉంటాయి. వెబ్ కౌన్సిలింగ్ జూన్‌లో ప్రారంభమవుతుంది. డిగ్రీతో విద్య ఆపేయటం మంచిది కాదు ప్రస్తుతం డిగ్రీతో విద్యార్థులు చదవు ఆపేస్తున్నా రు. డిగ్రీనే అన్ని ఉద్యోగాలకు గరిష్ట అర్హత అన్న కోణం నుంచి బయటకు రావాలి. ఉన్నత విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉన్నత విద్యలో పరిశోధనలు, సదస్సులు, వర్క్ షాపులు నుంచి ఎంతో నేర్చు కోవచ్చు, ఉన్నత విద్య యువత ప్రతిష్టను సైతం సమాజంలో పెంచుతుంది. - పి.జయరాం, ప్రిన్సిపాల్ సన్ డిగ్రీ కాళాశాల, బీఆర్‌ఏయా పాలక మండలి సభ్యులు. కోర్సులే కోర్సులు ఏపీలో నంబర్ వన్ యూనివర్సిటీ ఆంధ్రా యూనివర్సిటీ, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 150 వరకు పీజీ కోర్సులు ఉన్నాయి. బీఆర్ఏయూలో పరిమితి కోర్సులు ఉన్నా స్థానికంగా ఉంటూ విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంది. వసతులు మాత్రం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. వర్సిటీలో పీజీ కోర్సులకు సంబంధించి ఇంగ్లిష్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎడ్, లైబ్రరీ సైన్స్, గణితం, రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్ ఎంకాం, బయోటెక్నాలజీ, సోషల్ వర్క్, జియోటెక్, తెలుగు కోర్సులు ఉన్నాయి. అయితే రెండు యూనివర్సిటీల్లో న్యాయ విద్య చదవాలంటే విద్యార్థులు లాసెట్ రాయాల్సి ఉంటుంది. బీఎడ్ చదవాలంటే ఎడ్ సెట్ రాయాలి, ఎంబీఏ, ఎంసీఏ చదవాలంటే ఐసెట్ రాయాలి. విద్యార్థులు తమకు అనువైన కోర్సులు చదివేందుకు ఎంచు కోవాలి. వర్సిటీల్లో సీనియర్లను సంప్రదిస్తే గత కొన్నేళ్లగా అడ్మిషన్లు తక్కువగా ఉండే కోర్సులు సూచిస్తారు. దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికే ఆసెట్‌కు దరఖాస్తు చేసుకున్నా, సెట్ పరీక్ష విధానంపై నిపుణుల సూచనలు తీసుకుంటున్నా. డిగ్రీలో నేను రాసుకున్న నోట్సు సైతం నాకు ఉపయోగ పడుతుంది. ఆసెట్లో మంచి ర్యాంకు లక్ష్యం. - లోలుగు విజయ లక్ష్మి, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థి. విషయ పరిజ్ఞానం పెంచుకుంటా విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కృషిచేస్తాను. ఉన్నత విద్యతోనే సంపూర్ణ విషయ పరిజ్ఞానం సాధ్యం. సబ్జెక్టులో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాప్టు స్కిల్స్, బాషాపైపుణ్యం వంటి అంశాలపై ఉన్నత విద్యలో చేరాక ప్రత్యేక దృష్టి పెడతా. - ఎంవీఆర్జీ పల్లవి, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని. మానవ వనరులకు వేదిక.. ఉన్నత విద్య అనేది సమాజంలో ఉత్తమ మానవ వనరులును తీర్చిదిద్దుతుంది. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్యకు ప్రాధాన్యత నివ్వాలి. ఆంధ్రాయూనివర్సిటీ, డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ యూనివర్సిటీలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సైతం గ్రంథాలయాలు, వసతి గృహాల్లో శ్రమించి చదివేందుకు అనుకూల వాతావరణం ఉంటుంది. సాధారణ విద్యార్థులు సైతం నిష్ణాతులుగా మారే అవకాశం లభిస్తుంది. - డాక్టర్ కె.బూబూరావు, శ్రీకాకుళం పురుషుల కళాశాల ప్రిన్సిపాల్, పాలకమండలి సభ్యులు, బీఆర్‌ఏయూ. పీజీ లక్ష్యం పీజీలో చేరటం నాలక్ష్యం. ఇప్పటికే దరఖాస్తు సైతం చేసుకు న్నా. ప్రిపరేషన్ ప్రారంభించా. పాత ఆసెట్ ప్రశ్న పత్రాలు, వచ్చే ప్రశ్నలు సిబలస్, డిగ్రీలో ప్రధాన పాఠ్యాంశాలు చదువుతున్నా. పీజీలో చేరాక జీవితంలో సాధించాల్సినవి నిర్దేశిస్తా. - పొట్నూరు సాయిసుధ, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని పరిశోధనలకు ప్రాధాన్యం నాకు పరిశోధనాత్మక విద్య అంటే ఇష్టం. అందుకే పీజీలో చేరుతా. ఇంక్యుబేషన్ విద్యకు ప్రాధాన్యత ఇస్తాను. మా అధ్యాపకులు నుంచి సైతం చాలా విషయాలు గ్రహించాను. కొత్త ఆవిష్కరణలతోనే మంచి భవిష్యత్తు సాధ్యం. - నల్లనగూళ్ల లక్ష్మీ సాయి ప్రసన్న, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని. ఉన్నత విద్యతో విషయ పరిజ్ఞానం డిగ్రీతో చదువు నిలిపి వేస్తే సంపూర్ణ విషయ పరిజ్ఙానం సాధ్యం కాదు. ఉన్నత విద్యలో చేరేక, సబ్జెక్టుపై పట్టు వస్తుంది. మరో పక్క పోటీ పరీక్షల సాధనకు అనువైన వసతులు ఉంటాయి. - వావిలపల్లి జ్యోత్స్న, డిగ్రీ చివరి ఏడాది పరీక్ష రాసిన విద్యార్థిని. -
గ్రామీణ విద్యార్థులకు డి‘టెన్షన్’
సాక్షి, హైదరాబాద్: డిటెన్షన్ విధానాన్ని విద్యాశాఖ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు శాపంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్రం.. నూతన విద్యావిధానంపై చర్చించింది. కేంద్రం సూచించిన 13 అంశాలపై మంగళవారం విద్యాశాఖ అభిప్రాయసేకరణను ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు డీఈవోలు, ఉపాధ్యాయ విద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, సర్వ శిక్షాఅభియాన్ అకడమిక్ మానిటరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 13 అంశాల్లో ఒకటైన డిటెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక అసమానతల కారణంగా పేద విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారని డీఈవోలు, ప్రిన్సిపాళ్లు పేర్కొన్నారు. అలాగే, ఈ సమావేశంలో ప్రాథమిక విద్యాబోధనలో టీచర్ల అంకితభావం, కంప్యూటర్, వృత్తి విద్య వంటి అంశాలపై చర్చించారు. విస్తృత అభిప్రాయసేకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయిలో అదనపు డెరైక్టర్, జిల్లాలో డీఈవో, మండలంలో ఎంఈవో, గ్రామస్థాయిలో హెడ్మాస్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చిన అభిప్రాయాలను www.mygov.in లో అప్లోడ్ చేస్తారు. జిల్లాస్థాయిలో: 31న డిప్యూటీ ఈవో, ఎంఈవో, ఉపాధ్యాయ విద్యా కాలేజీల నుంచి అభిప్రాయ సేకరణ. మండల స్థాయిలో: సెప్టెంబరు 7న ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలతో. గ్రామస్థాయిలో: సెప్టెంబరు 11న గ్రామ విద్యా కమిటీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బలహీనవర్గాల అభిప్రాయాల సేకరణ. మండల, మున్సిపాలిటీ స్థాయిలో: వచ్చే నెల 18న పట్టణ స్థానిక సంస్థల ప్రతి నిధులు, కౌన్సిలర్ల అభిప్రాయ సేకరణ. మళ్లీ జిల్లా స్థాయిలో: వచ్చే నెల 25న జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్తు, జిల్లా విద్యా కమిటీలు, డీఈవోలు, ఎంఈవోలు, వయోజన విద్యా విభాగం వారితో. మరోసారి రాష్ట్రస్థాయిలో: సెప్టెంబరు 30న విద్యాశాఖ డెరైక్టరు, అదనపు డెరైక్టర్లు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధుల తదితరుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఇదీ డిటెన్షన్ నేపథ్యం.. ఏడో తరగతిలో ఉన్న డిటెన్షన్ విధానం వల్ల అనేకమంది గ్రామీణ విద్యార్థులు ఫెయిలై చదువు ఆపేస్తున్నారని, బాల కార్మికులుగా మారిపోతున్నారని గతంలో కేంద్రమే ఆ విధానాన్ని ఎత్తేసింది. పదోతరగతి వరకు నాన్ డిటెన్షన్ ఉండాలని, విద్యార్థి పదో తరగతికి వచ్చే వరకు మధ్యలో చదువు ఆగిపోవద్దని పేర్కొంది. ప్రస్తుతం పదో తరగతికి కామన్ పరీక్ష విధానం అమలు చేస్తూ, అందులో ఫెయిలైనవారిని పైతరగతికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డిటెన్షన్ విధానంపై చర్చ ప్రారంభించడం గమనార్హం. -
ఇది సిగ్గుచేటు కాదా?
⇒ 500 మంది విద్యార్థులకు ఒక్క టీచరా? ⇒ రాష్ట్రంలో సర్కారీ స్కూళ్లలో పరిస్థితిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య ⇒ రాష్ట్రంలో ఎన్ని స్కూళ్లు ఉన్నాయి.. ఒక్కో తరగతిలో విద్యార్థులెందరు? ⇒ ఉపాధ్యాయులు ఎంత మంది.. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? ⇒ ఈ వివరాలన్నీ మా ముందుంచండి ⇒ ఆ ఏడు పాఠశాలల టీచర్ల హాజరు పట్టీలను కూడా.. ⇒ మీ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారా..? ⇒ మీరేమో అన్ని సౌకర్యాలుండే కాన్వెంట్లలో చేరుస్తారు ⇒ గ్రామీణ విద్యార్థులను మాత్రం పట్టించుకోరా? ⇒ పాఠశాల విద్య కమిషనర్‌ను నిలదీసిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలున్నాయి.. వాటిలో ఒక్కో తరగతిలో ఎంత మంది విద్యార్థులున్నారు.. ఒక్కో స్కూల్లో ఎందరు ఉపాధ్యాయులున్నారు.. టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ మా ముందు ఉంచండి’’ అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టుకు లేఖలు రాసిన ఏడు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు పట్టీలను (అటెండెన్స్ రిజిస్టర్) కూడా తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 526 మంది విద్యార్థులకు కేవలం ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారంటే.. ఇది సిగ్గుపడాల్సిన విషయమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వందల మంది విద్యార్థులకు టీచర్ లేకపోవడం, ఉన్నా ఒక్కరే ఉండటం చూస్తుంటే ఈ విషయంలో ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది. తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్య పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లా, బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరిగిగడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి దాదాపు 1,700కు పైగా లేఖలు రాశారు. ఈ లేఖలను పరిశీలించిన ఆయన వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. గతవారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది. లేఖలోని అంశాలు వాస్తవమే.. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్జీ) ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... విద్యార్థులు హైకోర్టుకు రాసిన లేఖల్లో పేర్కొన్న అంశాలు ఇంచుమించూ వాస్తవమేనని తెలిపారు. అయితే టీచర్ గణాంకాల విషయంలో కొద్దిగా తేడాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా 300 మంది విద్యార్థులకు కేవలం ఒక్క టీచరే ఉండటాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇలాంటి విషయంలోనే అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా..? రాష్ట్రంలోని ప్రభుత్వాధికారుల పిల్లలందరూ తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని. ఇప్పుడు మా నుంచి కూడా అలాంటి ఉత్తర్వులు పొందేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు బాధ్యులైన అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆదేశిస్తాం. మాకు లేఖలు రాసిన ఏడు పాఠశాలల విద్యార్థుల వ్యవహారం సముద్రంలో నీటి చుక్క వంటిది. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల మధ్య గ్రామీణ విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని మాకు అర్థమైంది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆ ఏడు పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడానికి కారణమైన వారిని గుర్తించారా..? వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ పాఠశాలలకు మరోచోట నుంచి ఉపాధ్యాయులను పంపామని స్పెషల్ జీపీ చెప్పగా.. ‘‘మళ్లీ మీరు సమస్యను జఠిలం చేస్తున్నారు. ఉపాధ్యాయులను ఒకచోట నుంచి మరో చోటకు పంపితే.. వారు ఎక్కడ్నుంచి వచ్చారో అక్కడి విద్యార్థులకు నష్టమే కదా? ఇది సమస్యకు ఎంతమాత్రం పరిష్కారం కాదు. మేం అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన్ను రమ్మని చెప్పండి’’ అని ధర్మాసనం పేర్కొంది. మీ బిడ్డలను ప్రభుత్వ స్కూల్లో చదివిస్తారా..? మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభం కాగానే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదలను వినిపిస్తూ.. హైకోర్టుకు లేఖ రాసిన పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల గణాంకాలను ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం, విద్యార్థులు రాసిన వివరాలకూ, ప్రభుత్వం సమర్పిస్తున్న వివరాలకూ తేడాలున్నాయని, ప్రభుత్వ గణాంకాలపై తమకు అనుమానం ఉందని పేర్కొంది. ఈ ఏడు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు పట్టీలను చూడాలని భావిస్తున్నామని, వాటిని తమ ముందుంచాలని, అందుకు ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. ఈ సమయంలో కోర్టులోనే ఉన్న పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను పిలిచిన ఏజీ.. కోర్టు కోరిన వివరాలను అందించేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారు. ఆయన కమిషనర్ అని తెలుసుకున్న ధర్మాసనం.. ఆయన తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారా..? తెలుసుకుని చెప్పాలంది. ‘‘మీరు మాత్రం మీ పిలల్లను అన్ని సౌకర్యాలుండే కాన్వెంట్లలో చేరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల గురించి, వారి పాఠశాలల గురించి ఏ మాత్రం పట్టదు. అక్కడ టీచర్లు ఉన్నారా..? లేరా.? అన్నది కూడా ఆలోచించరు. ఒక సీనియర్ అధికారిని సస్పెండ్ చేస్తే తప్ప.. వ్యవహారాలు చక్కబడేలా కనిపించడం లేదు. ఇది మా కోసం చెప్పడం లేదు. కష్టాలు పడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం చెబుతున్నాం. 500 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఎలా సరిపోతారని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఎన్ని? వాటిలో విద్యార్థులెందరు? ఎందరు ఉపాధ్యాయులున్నారు? ఖాళీలు ఎన్ని ఉన్నాయి.. తదితర వివరాలను మా ముందుంచండి’’ అని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఇదెక్కడి దౌర్భాగ్యం!
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది తమిళనాడు ప్రభుత్వ పాలన. గ్రామీణ ప్రాంతాలకు సరైన బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో పలువురు గ్రామీణ విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. తళి నియోజకవర్గంలోని దాసరపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దాదాపు ఏడు గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి పాఠశాలల వేళకు బస్సు సౌకర్యం లేదు. దీంతో గంటల తరబడి రోడ్డుపక్కనే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో బడిలో చదువులు వల్లె వేయాల్సిన విద్యార్థులు రోడ్డుపక్కనే బారులుదీరి కూర్చొని పాఠాలు చదువుకోవడం ప్రారంభించారు. పాఠశాల వేళకు ఓ బస్సు ఏర్పాటు చేస్తే ఈ విద్యార్థుల వెతలు తీరుతాయని పలువురు అంటున్నారు.