సాక్షి, హైదరాబాద్: డిటెన్షన్ విధానాన్ని విద్యాశాఖ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు శాపంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్రం.. నూతన విద్యావిధానంపై చర్చించింది. కేంద్రం సూచించిన 13 అంశాలపై మంగళవారం విద్యాశాఖ అభిప్రాయసేకరణను ప్రారంభించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు డీఈవోలు, ఉపాధ్యాయ విద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, సర్వ శిక్షాఅభియాన్ అకడమిక్ మానిటరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 13 అంశాల్లో ఒకటైన డిటెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక అసమానతల కారణంగా పేద విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారని డీఈవోలు, ప్రిన్సిపాళ్లు పేర్కొన్నారు.
అలాగే, ఈ సమావేశంలో ప్రాథమిక విద్యాబోధనలో టీచర్ల అంకితభావం, కంప్యూటర్, వృత్తి విద్య వంటి అంశాలపై చర్చించారు. విస్తృత అభిప్రాయసేకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయిలో అదనపు డెరైక్టర్, జిల్లాలో డీఈవో, మండలంలో ఎంఈవో, గ్రామస్థాయిలో హెడ్‌మాస్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చిన అభిప్రాయాలను www.mygov.in లో అప్‌లోడ్ చేస్తారు.
జిల్లాస్థాయిలో: 31న డిప్యూటీ ఈవో, ఎంఈవో, ఉపాధ్యాయ విద్యా కాలేజీల నుంచి అభిప్రాయ సేకరణ.
మండల స్థాయిలో: సెప్టెంబరు 7న ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలతో.
గ్రామస్థాయిలో: సెప్టెంబరు 11న గ్రామ విద్యా కమిటీలు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బలహీనవర్గాల అభిప్రాయాల సేకరణ.
మండల, మున్సిపాలిటీ స్థాయిలో: వచ్చే నెల 18న పట్టణ స్థానిక సంస్థల ప్రతి నిధులు, కౌన్సిలర్ల అభిప్రాయ సేకరణ.
మళ్లీ జిల్లా స్థాయిలో: వచ్చే నెల 25న జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్తు, జిల్లా విద్యా కమిటీలు, డీఈవోలు, ఎంఈవోలు, వయోజన విద్యా విభాగం వారితో.
మరోసారి రాష్ట్రస్థాయిలో: సెప్టెంబరు 30న విద్యాశాఖ డెరైక్టరు, అదనపు డెరైక్టర్లు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధుల తదితరుల అభిప్రాయాలు తీసుకుంటారు.
ఇదీ డిటెన్షన్ నేపథ్యం..
ఏడో తరగతిలో ఉన్న డిటెన్షన్ విధానం వల్ల అనేకమంది గ్రామీణ విద్యార్థులు ఫెయిలై చదువు ఆపేస్తున్నారని, బాల కార్మికులుగా మారిపోతున్నారని గతంలో కేంద్రమే ఆ విధానాన్ని ఎత్తేసింది. పదోతరగతి వరకు నాన్ డిటెన్షన్ ఉండాలని, విద్యార్థి పదో తరగతికి వచ్చే వరకు మధ్యలో చదువు ఆగిపోవద్దని పేర్కొంది. ప్రస్తుతం పదో తరగతికి కామన్ పరీక్ష విధానం అమలు చేస్తూ, అందులో ఫెయిలైనవారిని పైతరగతికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డిటెన్షన్ విధానంపై చర్చ ప్రారంభించడం గమనార్హం.
గ్రామీణ విద్యార్థులకు డి‘టెన్షన్’
Published Wed, Aug 26 2015 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement
Advertisement