Primary education teaching
-
బీఎడ్.. గో ఎహెడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కూడా బీఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్ నిబంధనలను ఇటీవలే సవరించింది. బీఎడ్ అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్‌గా ఎంపికైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌పై 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలన్న షరతు విధించింది. దీంతో 2011లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను అమల్లోకి తెచ్చినప్పుడు విధించిన నిబంధన కారణంగా ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలు ఏర్పడింది. సీ–టెట్ నుంచే అమలు.. డిగ్రీతోపాటు బీఎడ్ చేసిన అభ్యర్థులను ప్రైమరీ టీచర్ పోస్టులకు అర్హులను చేస్తూ మార్పు చేసిన విధానాన్ని జూలై 7న నిర్వహించనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నుంచే అమలుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా మార్పులతో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఇటీవల సీ–టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్సీటీఈ షరతుకు లోబడి డిగ్రీతోపాటు బీఎడ్ చేసిన వారు ప్రైమరీ టీచర్ పోస్టులకు, 6, 7, 8 తరగతులకు బోధించే ఎలిమెంటరీ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులకు అర్హులుగా పరిగణనలోకి తీసుకునేలా సీ–టెట్ నిబంధనలను పొందుపరిచింది. దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ప్రైమరీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియెట్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) చేసిన వారు, డీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) చివరి సంవత్సరం, డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చివరి సంవత్సరం చదువుతున్న వారంతా అర్హులే. వారితోపాటు తాజాగా డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి బీఎడ్ పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని నోటిఫికేషన్లో ఎన్సీటీఈ వెల్లడించింది. దీంతో బీఎడ్ అభ్యర్థులు కూడా టెట్ పేపర్–1 పరీక్ష రాసేందుకు అర్హులయ్యారు. మరోవైపు 6వ తరగతి నుంచి 8వ తరగతికి బోధించే టీచర్ పోస్టులకు డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీతో డీఎడ్ పూర్తయిన వారు, ఇంటర్మీడియెట్‌తో నాలుగేళ్ల బీఈఎల్ఈడీ పూర్తి చేసిన వారు లేదా ఫైనల్ ఇయర్ వారు, ఇంటర్మీడియెట్‌తో ఇంటిగ్రీటెడ్ బీఎడ్ (బీఏబీఈడీ, బీఎస్సీ బీఈడీ) పూర్తి చేసిన వారంతా అర్హులేనని పేర్కొంది. అలాగే డీఎడ్ చేసిన వారికి డిగ్రీ ఉంటే వారు కూడా 6, 7, 8 తరగతుల బోధనకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంది. దీంతో వారు కూడా టెట్ పేపర్–2 పరీక్ష రాయవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిగ్రీతో డీఎడ్ చేసిన వారిని టెట్ పేపర్–2కు పరిగణనలోకి తీసుకోవట్లేదు. అయితే తమను పేపర్–2కు పరిగణనలోకి తీసుకోవాలని డిగ్రీతో డీఎడ్ చేసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సీ–టెట్ దరఖాస్తుల స్వీకరణను సీబీఎస్ఈ ప్రారంభించింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సబ్మిషన్కు, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. 2010కి ముందు అర్హత ఉన్నా.. ఎన్సీటీఈ 2010లో టెట్ నిబంధనలను జారీ చేయకముందు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను కూడా అర్హులుగానే పరిగణన లోకి తీసుకునేవారు. అయితే బీఎడ్ అభ్యర్థులకు చైల్డ్ సైకాలజీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సబ్జెక్టు లేనందున వారిని పరిగణనలోకి తీసుకోవద్దని డీఎడ్ అభ్యర్థులు అంతకు ముందే కోర్టులో కేసు వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు డీఎడ్ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో బీఎడ్ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనర్హులుగా ఎన్సీటీఈ ప్రకటించింది. ఆ తరువాత టెట్ రావడంతో అందులో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదన్న నిబంధన విధించింది. కేవలం 6, 7, 8 తరగతులకు బోధించేందుకే బీఎడ్ వారు అర్హులని పేర్కొంది. దీంతో బీఎడ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పైగా రాష్ట్రంలో ప్రస్తుతం బీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు 5 లక్షల మందికిపైగా ఉంటే డీఎడ్ పూర్తి చేసిన వారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారు అనేకసార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో కేంద్రం వారికి అర్హత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. -
గ్రామీణ విద్యార్థులకు డి‘టెన్షన్’
సాక్షి, హైదరాబాద్: డిటెన్షన్ విధానాన్ని విద్యాశాఖ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు శాపంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్రం.. నూతన విద్యావిధానంపై చర్చించింది. కేంద్రం సూచించిన 13 అంశాలపై మంగళవారం విద్యాశాఖ అభిప్రాయసేకరణను ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు డీఈవోలు, ఉపాధ్యాయ విద్య కాలేజీల ప్రిన్సిపాళ్లు, సర్వ శిక్షాఅభియాన్ అకడమిక్ మానిటరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 13 అంశాల్లో ఒకటైన డిటెన్షన్ విధానంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆర్థిక అసమానతల కారణంగా పేద విద్యార్థులు బాలకార్మికులుగా మారుతున్నారని డీఈవోలు, ప్రిన్సిపాళ్లు పేర్కొన్నారు. అలాగే, ఈ సమావేశంలో ప్రాథమిక విద్యాబోధనలో టీచర్ల అంకితభావం, కంప్యూటర్, వృత్తి విద్య వంటి అంశాలపై చర్చించారు. విస్తృత అభిప్రాయసేకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రస్థాయిలో అదనపు డెరైక్టర్, జిల్లాలో డీఈవో, మండలంలో ఎంఈవో, గ్రామస్థాయిలో హెడ్మాస్టర్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వచ్చిన అభిప్రాయాలను www.mygov.in లో అప్లోడ్ చేస్తారు. జిల్లాస్థాయిలో: 31న డిప్యూటీ ఈవో, ఎంఈవో, ఉపాధ్యాయ విద్యా కాలేజీల నుంచి అభిప్రాయ సేకరణ. మండల స్థాయిలో: సెప్టెంబరు 7న ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలతో. గ్రామస్థాయిలో: సెప్టెంబరు 11న గ్రామ విద్యా కమిటీలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బలహీనవర్గాల అభిప్రాయాల సేకరణ. మండల, మున్సిపాలిటీ స్థాయిలో: వచ్చే నెల 18న పట్టణ స్థానిక సంస్థల ప్రతి నిధులు, కౌన్సిలర్ల అభిప్రాయ సేకరణ. మళ్లీ జిల్లా స్థాయిలో: వచ్చే నెల 25న జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్తు, జిల్లా విద్యా కమిటీలు, డీఈవోలు, ఎంఈవోలు, వయోజన విద్యా విభాగం వారితో. మరోసారి రాష్ట్రస్థాయిలో: సెప్టెంబరు 30న విద్యాశాఖ డెరైక్టరు, అదనపు డెరైక్టర్లు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధుల తదితరుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఇదీ డిటెన్షన్ నేపథ్యం.. ఏడో తరగతిలో ఉన్న డిటెన్షన్ విధానం వల్ల అనేకమంది గ్రామీణ విద్యార్థులు ఫెయిలై చదువు ఆపేస్తున్నారని, బాల కార్మికులుగా మారిపోతున్నారని గతంలో కేంద్రమే ఆ విధానాన్ని ఎత్తేసింది. పదోతరగతి వరకు నాన్ డిటెన్షన్ ఉండాలని, విద్యార్థి పదో తరగతికి వచ్చే వరకు మధ్యలో చదువు ఆగిపోవద్దని పేర్కొంది. ప్రస్తుతం పదో తరగతికి కామన్ పరీక్ష విధానం అమలు చేస్తూ, అందులో ఫెయిలైనవారిని పైతరగతికి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డిటెన్షన్ విధానంపై చర్చ ప్రారంభించడం గమనార్హం.