ఇది సిగ్గుచేటు కాదా? | high court comments on Govt Schools | Sakshi
Sakshi News home page

ఇది సిగ్గుచేటు కాదా?

Published Fri, Aug 21 2015 1:18 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఇది సిగ్గుచేటు కాదా? - Sakshi

ఇది సిగ్గుచేటు కాదా?

500 మంది విద్యార్థులకు ఒక్క టీచరా?
రాష్ట్రంలో సర్కారీ స్కూళ్లలో పరిస్థితిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య
రాష్ట్రంలో ఎన్ని స్కూళ్లు ఉన్నాయి.. ఒక్కో తరగతిలో విద్యార్థులెందరు?
ఉపాధ్యాయులు ఎంత మంది.. ఖాళీలు ఎన్ని ఉన్నాయి?
ఈ వివరాలన్నీ మా ముందుంచండి
ఆ ఏడు పాఠశాలల టీచర్ల హాజరు పట్టీలను కూడా..
మీ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారా..?
మీరేమో అన్ని సౌకర్యాలుండే కాన్వెంట్లలో చేరుస్తారు

గ్రామీణ విద్యార్థులను మాత్రం పట్టించుకోరా?
పాఠశాల విద్య కమిషనర్‌ను నిలదీసిన ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలున్నాయి.. వాటిలో ఒక్కో తరగతిలో ఎంత మంది విద్యార్థులున్నారు.. ఒక్కో స్కూల్లో ఎందరు ఉపాధ్యాయులున్నారు.. టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ మా ముందు ఉంచండి’’ అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టుకు లేఖలు రాసిన ఏడు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు పట్టీలను (అటెండెన్స్ రిజిస్టర్) కూడా తమ ముందుంచాలని స్పష్టం చేసింది.

తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 526 మంది విద్యార్థులకు కేవలం ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారంటే.. ఇది సిగ్గుపడాల్సిన విషయమని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వందల మంది విద్యార్థులకు టీచర్ లేకపోవడం, ఉన్నా ఒక్కరే ఉండటం చూస్తుంటే ఈ విషయంలో ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని పేర్కొంది.

తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్య పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లా, బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరిగిగడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి దాదాపు 1,700కు పైగా లేఖలు రాశారు. ఈ లేఖలను పరిశీలించిన ఆయన వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది.

గతవారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది.
 
లేఖలోని అంశాలు వాస్తవమే..
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్‌జీ) ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ... విద్యార్థులు హైకోర్టుకు రాసిన లేఖల్లో పేర్కొన్న అంశాలు ఇంచుమించూ వాస్తవమేనని తెలిపారు. అయితే టీచర్ గణాంకాల విషయంలో కొద్దిగా తేడాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా 300 మంది విద్యార్థులకు కేవలం ఒక్క టీచరే ఉండటాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘ఇలాంటి విషయంలోనే అలహాబాద్ హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా..? రాష్ట్రంలోని ప్రభుత్వాధికారుల పిల్లలందరూ తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని.

ఇప్పుడు మా నుంచి కూడా అలాంటి ఉత్తర్వులు పొందేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు బాధ్యులైన అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆదేశిస్తాం. మాకు లేఖలు రాసిన ఏడు పాఠశాలల విద్యార్థుల వ్యవహారం సముద్రంలో నీటి చుక్క వంటిది. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల మధ్య గ్రామీణ విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారని మాకు అర్థమైంది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆ ఏడు పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడానికి కారణమైన వారిని గుర్తించారా..? వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది.

ఈ పాఠశాలలకు మరోచోట నుంచి ఉపాధ్యాయులను పంపామని స్పెషల్ జీపీ చెప్పగా.. ‘‘మళ్లీ మీరు సమస్యను జఠిలం చేస్తున్నారు. ఉపాధ్యాయులను ఒకచోట నుంచి మరో చోటకు పంపితే.. వారు ఎక్కడ్నుంచి వచ్చారో అక్కడి విద్యార్థులకు నష్టమే కదా? ఇది సమస్యకు ఎంతమాత్రం పరిష్కారం కాదు. మేం అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన్ను రమ్మని చెప్పండి’’ అని ధర్మాసనం పేర్కొంది.
 
మీ బిడ్డలను ప్రభుత్వ స్కూల్లో చదివిస్తారా..?
మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభం కాగానే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదలను వినిపిస్తూ.. హైకోర్టుకు లేఖ రాసిన పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల గణాంకాలను ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం, విద్యార్థులు రాసిన వివరాలకూ, ప్రభుత్వం సమర్పిస్తున్న వివరాలకూ తేడాలున్నాయని, ప్రభుత్వ గణాంకాలపై తమకు అనుమానం ఉందని పేర్కొంది.

ఈ ఏడు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు పట్టీలను చూడాలని భావిస్తున్నామని, వాటిని తమ ముందుంచాలని, అందుకు ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. ఈ సమయంలో కోర్టులోనే ఉన్న పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను పిలిచిన ఏజీ.. కోర్టు కోరిన వివరాలను అందించేందుకు ఎంత సమయం పడుతుందని అడిగారు. ఆయన కమిషనర్ అని తెలుసుకున్న ధర్మాసనం.. ఆయన తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చేందుకు సిద్ధంగా ఉన్నారా..? తెలుసుకుని చెప్పాలంది.

‘‘మీరు మాత్రం మీ పిలల్లను అన్ని సౌకర్యాలుండే కాన్వెంట్లలో చేరుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల గురించి, వారి పాఠశాలల గురించి ఏ మాత్రం పట్టదు. అక్కడ టీచర్లు ఉన్నారా..? లేరా.? అన్నది కూడా ఆలోచించరు. ఒక సీనియర్ అధికారిని సస్పెండ్ చేస్తే తప్ప.. వ్యవహారాలు చక్కబడేలా కనిపించడం లేదు. ఇది మా కోసం చెప్పడం లేదు. కష్టాలు పడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం చెబుతున్నాం.

500 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఎలా సరిపోతారని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఎన్ని? వాటిలో విద్యార్థులెందరు? ఎందరు ఉపాధ్యాయులున్నారు? ఖాళీలు ఎన్ని ఉన్నాయి.. తదితర వివరాలను మా ముందుంచండి’’ అని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement