సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన రూల్స్‌ను.. అలాగే 8,700లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన పలు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు గురువారం కొట్టేసింది. అధికరణ 371డీ, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామక రూల్స్‌ను జారీ చేసిందన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఉపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్ పోస్టులని, వాటికి రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించడం లేదంటూ వారి పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గత నెలలో జారీ చేసిన రూల్స్, నోటిఫికేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి వాటిని రద్దు చేయాలని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన కె.బాలకృష్ణ, కె.భాను, ఆర్.రాంమోహన్‌రెడ్డిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా.. పిటిషనర్ల తరఫున న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో జిల్లాను ఓ యూనిట్‌గా నియామకాలు చేపట్టాల్సి ఉండగా, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వాదించారు. 31 జిల్లాలను యూనిట్‌గా తీసుకోనున్నట్లు ఆ రూల్స్‌లో పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. 31 జిల్లాల ఏర్పాటునకు రాష్ట్రపతి ఆమోదం లేదని.. కేవలం 10 జిల్లాలకే గుర్తింపు ఉందని వివరించారు. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా రూల్స్‌ను తయారు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొత్త జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తుండటం వల్ల కొన్ని జిల్లాలకు అసలు పోస్టుల భర్తీయే లేదన్నారు. రంగారెడ్డి, నిర్మల్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ తదితర జిల్లాల్లో పోస్టుల భర్తీ లేకుండా పోయిందని, దీంతో పలువురు అభ్యర్థులకు తీరని నష్టం కలుగుతోందని సరసాని వాదించారు.
అభ్యర్థులు ఏ విధంగా నష్టపోతారు?
ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేస్తుంటే అభ్యర్థులు ఏ విధంగా నష్టపోతారని ప్రశ్నించారు. 31 జిల్లాల ఆధారంగా ఒక్కో జిల్లాను యూనిట్‌గా పేర్కొంటూ నియామకాలు చేయకూడదని ఏ చట్టంలో ఉందో చూపాలన్నారు. అనంతరం ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఉపాధ్యాయ పోస్టులు కేవలం జిల్లా క్యాడర్ పోస్టులని.. వాటికి రాష్ట్రపతి ఉత్తర్వులు ఏ మాత్రం వర్తించవన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఆ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం కాదు!
Published Fri, Nov 3 2017 12:54 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment