►కొత్త జిల్లాలు, పాత డీఎస్సీల వివాదాలతో జాప్యం
►అందుకే విద్యా వలంటీర్ల నియామకం
►పెరగనున్న విద్యా వలంటీర్ పోస్టులు
►9,335కి బదులు 11,428 పోస్టుల భర్తీ!
►మార్గదర్శకాలపై దృష్టిపెట్టిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,428 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఇప్పట్లో చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు, పాత డీఎస్సీల వివాదాలే ఇందుకు కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. వాటికి సంబంధించిన సమస్యలు, వివాదాలను పరిష్కరించకుండా ముందుకు సాగడం కష్టమని చెబుతున్నారు. కొత్త జిల్లాల అంశాన్ని పక్కనబెట్టినా 1998 డీఎస్సీ నుంచి 2012 డీఎస్సీ వరకు ఆయా డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసే వ్యవహారం తేల్చకుండా కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేదంటున్నారు.
ఒకవేళ బాధిత అభ్యర్థులను కాదని ముందుకు సాగితే వారంతా ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న భావన అధికారుల్లో నెలకొంది. పైగా ఒక్కో డీఎస్సీలో ఒక్కో రకమైన సమస్యలతో అభ్యర్థులు నష్టపోయిన వారూ ఉన్నందున, వారందరికీ ఇప్పటికిప్పుడు న్యాయం చేయడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందట స్వయంగా వరంగల్‌లో అభ్యర్థులకు హామీ ఇవ్వడం, ఆ తరువాత అన్ని డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసే అంశాన్ని తేల్చాలని అధికారులను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అంశాన్ని తేల్చకుండా టీచర్ల నియామకాల్లో ముందుకు సాగడం సాధ్యం కాదన్న భావనకు అధికారులు వచ్చినట్లు సమాచారం.
వలంటీర్లతోనే సరి...: పాత డీఎస్సీల వ్యవహారం, జిల్లాల పునర్విభజన అంశాలతోపాటు పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణను ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే 1,604 పాఠశాలల్లో ఒక్క టీచర్ కూడా లేరని విద్యాశాఖ ఇటీవల బడిబాట సందర్భంగా తేల్చింది. అయితే కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విలీనం, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వంటి అంశాలను తేల్చాల్సి ఉంది. ఇందుకోసం హేతుబద్ధీకరణ చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది.
ఈ నెల 30 వరకు వచ్చే విద్యార్థుల వివరాలను తీసుకొని జూలై మొదటి వారంలో హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో హేతుబ ద్ధీకరణ తరువాత స్పష్టంగా ఎంత మంది ఉపాధ్యాయులు అవసరమన్నది తేలుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే నెలల తరబడి సమయం పడుతుందని, అందుకే ముందుగా విద్యా వలంటీర్లను నియమించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం సోమవారం నిర్ణయించిన 9,335 వలంటీర్ల నియామకాలకు బదులుగా 11,428 క్లియర్ వెకెన్సీలలో వలంటీర్ల నియామకాలు చేపట్టేందుకు మార్గదర్శకాల రూపకల్పనపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ఇవీ జిల్లాల వారీగా నియమించే విద్యా వలంటీర్లు
జిల్లా వలంటీర్లు
ఆదిలాబాద్ 1,582
నిజామాబాద్ 790
కరీంనగర్ 915
వరంగల్ 690
ఖమ్మం 895
నల్లగొండ 817
మహబూబ్‌నగర్ 2,023
రంగారెడ్డి 1,670
హైదరాబాద్ 539
మెదక్ 1,507
మొత్తం 11,428
టీచర్ల భర్తీ ఇప్పట్లో లేనట్లే
Published Wed, Jun 29 2016 3:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement