పీజీ చేరికల్లో ఆమెదే హవా | 110 Special Women's Colleges In Osmania University | Sakshi
Sakshi News home page

పీజీ చేరికల్లో ఆమెదే హవా

Published Mon, Nov 18 2019 4:52 AM | Last Updated on Mon, Nov 18 2019 5:20 AM

110 Special Women's Colleges In Osmania University - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ: ఫలానా ఫలితాల్లో అమ్మాయిలే టాప్‌ అనేది అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చదువుకునేవారిలోనూ వారిదే పైచేయి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదువులోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువట. పీజీలో 65 శాతం మంది అమ్మాయిలే అడ్మిషన్లు తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని అధికారులే వెల్లడిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పురుషుల సంఖ్యను దాటిపోయింది. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్‌డీలో కూడా దూసుకుపోతున్నారు. డిగ్రీ, పీజీలతో పాటు ఇంజనీరింగ్, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, దూరవిద్య కేంద్రం కోర్సుల్లో పురుషులకు సమానంగా అమ్మాయిలు చదువుతున్నారని సీపీజీఈటీ కన్వీనర్‌ ప్రొ.కిషన్‌ తెలిపారు. ఓయూ పరిధిలో మొత్తం 728 కాలేజీల్లో మహిళలకు ప్రత్యేకంగా 110 కాలేజీలున్నాయి. మిగతా కాలేజీలన్ని కో–ఎడ్యుకేషన్‌లే. ఒక్క కోఠి మహిళా కాలేజీలోనే 4,500 మంది అమ్మాయిలు చదువుతున్నట్లు అధికారులు వివరించారు. క్యాంపస్‌లో పీహెచ్‌డీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్‌తో పాటు మరో ఐదు హాస్టళ్లు, మహిళా కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు రెండు హాస్టల్స్‌ను ఏర్పాటు చేశారు.

మహిళా వర్సిటీ అవసరం
►ప్రతి ఏటా ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరుగుతోంది. కానీ వారికి ప్రత్యేకమైన వర్సిటీ ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం పద్మావతి మహిళా వర్సిటీ ఏపీకి వెళ్లగా కోఠి మహిళా కాలేజీలో వర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఇంత వరకు దాని ఊసే లేదు. పెరుగుతున్న మహిళల సంఖ్యకు అనుగుణంగా వివిధ కోర్సుల్లో సీట్లు పెరగనందున వందలాది మంది విద్యార్థినులు ఇంటికి పరిమితమవుతున్నారు.
►ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరగడానికి కారణాలు..
►నేటి తరం తల్లిదండ్రుల ఆలోచనలో మార్పుతో పాటు భద్రత పెరగడం, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదల, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడం. 
►ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా ఉపకార వేతనాలు, హాస్టల్‌ వసతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాల పెరుగుదల. చదువుతో ఉద్యోగంతో పాటు జీవన విధానంలో మార్పు వస్తుందని మహిళలు భావించడం. 
►తల్లిదండ్రులు అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా సమానంగా చదివిస్తున్నారు. వీరిలో ఆర్థిక స్తోమత బాగా ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్, ఇంజనీరు తదితర వృత్తి విద్యా కోర్సులను చదివిస్తుండగా.. మధ్య తరగతి, సామాన్య కుటుంబాల వారు పిల్లలను డిగ్రీ, పీజీ కోర్సులను చదివిస్తున్నారు.
►గతంలో పురుషులు మాత్రమే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు పొందేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఆస్థాయి ఉద్యోగాలు అందుకుని రాణిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement