
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌సెట్–2022)లను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రటరీ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ గడువు ముగిసేనాటికి వివిధ సబ్జెక్టులకు 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
రూ.1,500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలను టీఎస్‌సెట్–2022 వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు. (క్లిక్ చేయండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని)