Exam dates
-
AP: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలకు కొత్త తేదీలు ఇవే..
సాక్షి, అమరావతి: ఏపీలో టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఏపీ పాఠశాల విద్యాశాఖ టెట్ దరఖాస్తు తేదీలను పొడగించింది. టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇక, సవరించిన షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు ఆగస్టు మూడో తేదీ వరకు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, జూలై రెండో తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ తాజాగా పరీక్ష తేదీల్లో కూడా మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5వ తేదీ నుంచి 20వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది.కాగా, టెట్ పరీక్షల కోసం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాట్ టికెట్స్ డౌన్ లోడ్‌కి అవకాశం ఇచ్చింది. అలాగే, అక్టోబర్ 27వ తేదీన తుది పరీక్షల తుది ‘కీ’ విడుదల కానుంది. నవంబర్ రెండో తేదీన పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. -
మే 13న పోలింగ్.. ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష తేదీల్లో మార్పు
సాక్షి, విజయవాడ: మే 13న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. మే 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మే 16కి వాయిదా పడ్డాయి. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీ సెట్ జూన్ 10కి వాయిదా వేశారు. జూన్ 10 నుంచి 14 ఏపీ పీజీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఏపీ ఆర్ సెట్ జరగనుంది. -
మే 9 నుంచి టీఎస్ఈఏపీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీసెట్)ను మే 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ దీన్‌కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నామన్నారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సిలబస్‌ను వందశాతం అమలు చేస్తామని చెప్పారు. పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (టీఎస్‌పీజీ సెట్)ను జూన్ 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు పీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి నేతృత్వంలో మంగళవారం సెట్స్ తేదీలు వెల్లడించారు. మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహ్మమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్స్ తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీ ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ కాలంలో 4 దఫాలుగా నిర్వహించిన ఈ పరీక్షను 2024– 25లో మాత్రం రెండు విడతలుగానే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. తొలి విడతను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య చేపట్టాలని నిర్ణయించింది. రెండో దఫా జేఈఈ మెయిన్స్ ను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించబోతున్నట్టు వెల్లడించింది. దీంతో పాటే మే 5న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ), మే 15–31 తేదీల మధ్య కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ), మార్చి 11–28 మధ్య సీయూఈటీ–పీజీ, జూన్ 10–21 మధ్య యూజీసీ–నెట్ పరీక్షలను నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసింది. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, సమగ్ర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. 2021 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్ష కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. గత ఏడాది మాత్రం జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. అయితే, తేదీల ఖరారులో మాత్రం ఆలస్యమైంది. ఈ సంవత్సరం కోవిడ్ కన్నా ముందు మాదిరిగానే మూడు నెలల ముందే తేదీలను వెల్లడించారు. మెయిన్స్ దరఖాస్తులు పెరిగేనా? కోవిడ్ తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల వైపు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో జేఈఈ మెయిన్స్ రాసే వారి సంఖ్య ప్రతీ సంవత్సరం తగ్గుతోంది. ఈ స్థానంలో రాష్ట్ర ఎంసెట్‌కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2014లో జేఈఈ మెయిన్స్ రాసినవారి సంఖ్య 12.90 లక్షలుంటే, 2022లో ఈ సంఖ్య 9.05 లక్షలకు తగ్గింది. 2023లో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలకు పెరిగింది. కోవిడ్ సమయంలో టెన్త్ పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి 2014లో జేఈఈ రాసిన వారి సంఖ్య 2 లక్షల వరకూ ఉంటే, ఇప్పుడు 1.30 లక్షలకు పడిపోయింది. రాష్ట్రంలో ఎంసెట్ రాసేవారి సంఖ్య 2018లో 1.47 లక్షలుంటే, 2022లో ఇది 1.61 లక్షలకు పెరిగింది. కాగా, గత రెండేళ్లుగా రాష్ట్రంలో హాస్టళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, జేఈఈపై దృష్టి పెడుతున్న వారి సంఖ్య పెరగడంతో ఈ సంవత్సరం కూడా జేఈఈ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
AP: ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: ఏపీలో ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, ఏపీలో సివిల్, ఏపీఎస్పీ ఎస్ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇది కూడా చదవండి: తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఏడుగంటల సమయం -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షకు డీఈడీ, బీఈడీ అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశం కల్పించారు. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు. కాగా, ఇటీవల జరిగిన సమావేశంలో టెట్ నిర్వహణకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 15 వ తేదీన రెండు సెషన్స్ లో పరీక్ష ఉంటుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు., రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష.., సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 2 దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 16 రాతపరీక్ష: సెప్టెంబర్ 15 పేపర్-1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఫీజు: రూ.400 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో వెబ్సైట్: https://tstet.cgg.gov.in 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు? తాజా అంచనాల ప్రకారం రాష్టంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్‌కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. -
AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ గురువారంఅధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మద్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఏపీ ఇంటర్ స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పరీక్షా తేదీల వివరాలు.. ►మే 24న సెకండ్ లాంగ్వేజ్ ►25 న ఇంగ్లీష్ ►26 న మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్ ►27న మ్యాథ్స్-బీ, జువాలజీ, హిస్టరీ ►29న ఫిజిక్స్, ఎకనామిక్స్ ►30న కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలిజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ ►31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, బైపీసీ విద్యార్ధులకు మ్యాథ్స్,లాజిక్ పేపర్ ►జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. చదవండి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే? -
TS SET: టీఎస్ సెట్ పరీక్ష రీషెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెట్ కార్యాలయం అలర్ట్ జారీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకృష్ణ స్పష్టం చేశారు. అదే విధంగా వాయిదా వేసిన పరీక్షకు మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారాయన. సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఓయూ పౌర సంబంధాల అధికారి పేరిట ఒక ప్రకటన వెలువడింది. వివిధ సబ్జెక్టులకుగానూ టీఎస్ సెట్ కోసం 50 వేల మందికిపైగా దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల కోసం తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేయనున్నారు. -
TS: జూలై 1న గ్రూప్–4 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వరుసగా ఉద్యోగ భర్తీ ప్రకటనలతో రెండు నెలలపాటు హడావుడి చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇక పరీక్షల నిర్వహణకు ఉపక్రమించింది. ఇటీవలే గ్రూప్–1 మెయిన్ పరీక్ష తేదీలను ఖరారు చేయగా.. అత్యధిక పోస్టులున్న గ్రూప్–4 పరీక్షల తేదీలను గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో గ్రూప్–4 పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని.. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్–తెలుగు, ఇంగ్లిష్–ఉర్దూలలో ఉంటాయని పేర్కొంది. ఎక్కువ పోస్టులు చూపి.. కొన్ని తగ్గించి.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేస్తామని గత ఏడాది డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి డిసెంబర్ 30న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసినా.. 8,039 ఖాళీ పోస్టులను మాత్రమే చూపింది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. తర్వాత ఈ ఏడాది జనవరి 28న విడుదల చేసిన అనుబంధ నోటిఫికేషన్‌తో మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జత చేసింది. వీటితో కలిపి మొత్తంగా భర్తీ చేసే గ్రూప్–4 పోస్టుల సంఖ్య 8,180కి చేరింది. నేటితో గడువు పూర్తి గ్రూప్–4 పోస్టులకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియనుంది. గురువారం సాయంత్రం వరకు 9 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారు. అంటే దాదాపు ఒక్కో పోస్టుకు 110 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లు.. 300 మార్కులు.. గ్రూప్–4 పోస్టుల భర్తీకి రెండు పరీక్షలు ఉంటాయి. ఇందులో జూలై 1న ఉదయం జనరల్ స్టడీస్ పరీక్ష, మధ్యాహ్నం సెక్రటేరియల్ ఎబిలిటీ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటలు సమయం ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ప్రతి పేపర్‌కు 150 మార్కులు.. రెండు పరీక్షలు కలిపి మొత్తం 300 మార్కులు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలను టీఎస్పీఎస్సీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం.. ఈడీ చార్జ్‌షీట్ దాఖలు -
TS SET 2022: మార్చి 13 నుంచి టీఎస్‌సెట్ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌సెట్–2022)లను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రటరీ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ గడువు ముగిసేనాటికి వివిధ సబ్జెక్టులకు 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.1,500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలను టీఎస్‌సెట్–2022 వెబ్సైట్లో చూడవచ్చన్నారు. (క్లిక్ చేయండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని) -
JEE Main 2023: వచ్చే నెలలో జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2023) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసింది. రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి విడత వచ్చే ఏడాది జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో ఉంటుంది. రెండో విడత జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయి. పరీక్ష ఎప్పటిలాగే ఆన్లైన్ విధానంలో ఉంటుందని, ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని ఎన్టీఏ వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ షురూ.. జేఈఈ మెయిన్ మొదటి విడతకు దరఖాస్తులు గురువారం రాత్రి నుంచే మొదలయ్యాయి. జనవరి 12వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్‌లో జరిగే రెండో విడత పరీక్షలకు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు పూర్తి వివరాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ చూడాలని, లేదా 011 40759000/ 011 69227700 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఎన్టీఏ తెలిపింది. రెండు నెలల్లోనే.. 2019 వరకు జేఈఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ నెలల్లోనే నిర్వహించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు నాలుగు విడతలుగా మే, జూలై నెలల్లోనూ నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. అయితే 2 నెలల్లోనే మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వడం విశేషం. 2022 జేఈఈ మెయిన్స్‌కు 10.26 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 9,05,590 మంది పరీక్ష రాశారు. తొలి విడత షెడ్యూల్ ఇదీ.. దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 16 (గురువారం) నుంచి జనవరి 12 వరకు.. అడ్మిట్ కార్డుల విడుదల: 2023 జనవరి మూడో వారంలో. పరీక్షలు: 2023 జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 -
అభ్యర్థులకు అలర్ట్: టీఎస్‌లో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ పరీక్షలను రెండు దఫాల్లో నిర్వహించనున్నట్టు బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్ఐ రాత పరీక్షను ఆగస్టు 7వ తేదీన, కానిస్టేబుల్ పరీక్షను 27 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ రాత పరీక్ష హాల్‌టికెట్లను www.tslprb.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 30వ తేదీ నుంచి ఎస్ఐ, ఆగస్టు 10వ తేదీ నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు హాట్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. కాగా, ఈ పరీక్షలకు సుమారు 8.95 లక్షల మంది హాజరుకానున్నారు. -
ఏపీ పాలీసెట్ 2022: విద్యార్థులూ ఇవి తెలుసుకోండి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం (మే 29) నిర్వహించనున్న పాలీసెట్–2022కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కమిషనర్ పోల భాస్కర్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్ జరుగుతుందన్నారు. పది గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా లేని విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతోపాటు బాల్ పెన్ను, పెన్సిల్, రబ్బరును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,37,371 మంది విద్యార్థులు పాలీసెట్‌కు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష పూర్తి అయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. -
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్...రాత పరీక్షపై కీలక అప్డేట్..!
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అలాగే కానిస్టేబుల్, ఇతర సమాన పోస్టులకు ఆగస్టు 21న రాతపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ, రవాణా, అబ్కారీ విభాగాల్లో 17,516 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. వివిధ విభాగాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో దరఖాస్తుల గడువు గురువారం ముగిసింది. 52 శాతం (3,55,679) మంది ఒకే ఒక్క ఉద్యోగానికి దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. 29 శాతం మంది రెండు ఉద్యోగాలకు, 15 శాతం మంది మూడింటికి, 3 శాతం మంది నాలుగు ఉద్యోగాలకు, ఒక శాతం మంది ఐదు పోస్టులకు దరఖాస్తు చేయగా, 6 పోస్టులకు ఎలాంటి దరఖాస్తులు రాలేదన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 21 శాతం (2,76,311) మహిళా అభ్యర్థుల నుంచి వచ్చాయని వెల్లడించారు. కాగా, ప్రభుత్వం నోటిఫికేషన్ సమయంలో ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరో రెండేళ్ల వయోసడలింపుతో 1.4లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ పోటీలో అవకాశం దక్కింది. అలాగే ప్రిలిమినరీ రాతపరీక్షకు 67 శాతం మంది తెలుగు మీడియం, 32.8శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూ మీడియం ఎంచుకున్నారు. ఆ ఐదు జిల్లాలు టాప్... భారీగా దరఖాస్తులు దాఖలు చేసిన జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట నిలిచాయి. ఈ జిల్లాల నుంచే 33 శాతం దరఖాస్తులు వచ్చాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల నుంచి అతి తక్కువగా 7 శాతం దరఖాస్తులు దాఖలయ్యాయి. పోస్టులవారీగా దరఖాస్తులిలా... ఎస్ఐ సివిల్, తదితర సమాన పోస్టులు: 2,47,630 సివిల్ కానిస్టేబుల్, తదితర సమాన పోస్టులు: 9,54,064 ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులు: 14,500 ఐటీ అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులు: 22,033 కానిస్టేబుల్ డ్రైవర్ (పోలీస్), ఫైర్ పోస్టులు: 38,060 మెకానిక్ కేటగిరీ పోస్టులు: 5,228 పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ ఎస్ఐ: 3,533 ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ: 6,010 -
జూన్ 6న టీఎస్ఆర్జేసీ సెట్–22
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి జూన్ 6న అర్హత పరీక్ష టీఎస్ఆర్జేసీ సెట్–22 నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,281 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి హాల్‌టికెట్లు వైబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని, మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. 24 నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్షలు (10 ప్లస్ టు) ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 10 వరకూ జరగనున్నాయి. -
మార్చి 4 నుంచి ‘అనురాగ్’ సెట్
సాక్షి, హైదరాబాద్: అనురాగ్ యూనివర్సిటీ మార్చి 4 నుంచి 6 వరకు ‘అనురాగ్ సెట్–2022’ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించారు ఈ సెట్ ద్వారా తమ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించే సెట్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. ఈ పరీక్ష ఫలితాలను మార్చి 26న వెల్లడిస్తామని, మే 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో నీలిమ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సెట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో వర్సిటీ చాన్స్‌లర్ దేశాయ్, వైఎస్ చాన్స్‌లర్ రామచంద్ర, రిజిస్టార్ సైదా సమీన్ ఫాతిమా, యూనివర్సిటీ నిర్వాహకులు అనురాగ్ పాల్గొన్నారు. -
చదువుతారా.. ఇంటర్నేషనల్ బిజినెస్!
మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు క్యాట్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ప్రవేశ పరీక్ష.. ఐఐఎఫ్‌టీ ఎంబీఏ. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)లో.. ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇటీవల 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. ఐఐఎఫ్‌టీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐఐఎఫ్‌టీ ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం... అంతర్జాతీయ వాణిజ్యంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేసేందుకు 1963లో స్థాపించిన సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్‌టీ). ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఐఐఎఫ్‌టీ ప్రస్తుతం ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఫుల్‌టైమ్), ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్(వీకెండ్), ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, ఎంఏ ఎకనామిక్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. (బీమా రంగంలో జాబ్ కావాలా.. ఇలా ట్రై చేయండి!) 2002లో ఐఐఎఫ్‌టీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా సైతం లభించింది. అంతేకాకుండా న్యాక్.. దీన్ని గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా గుర్తించింది. ఐఐఎఫ్‌టీకి ఢిల్లీ, కోల్‌కతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. కాకినాడ క్యాంపస్‌లో యూజీసీ /కేంద్ర ప్రభుత్వ అనుమతికి అను గుణంగా ప్రవేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ ఎంబీఏ(ఇంటర్నేషనల్ బిజినెస్)లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ► గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ కనీసం మూడేళ్ల వ్యవధిగల డిగ్రీ/ తత్సమాన విద్యను 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందినవారు కనీసం 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది చదవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ► ఈ ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఎంపిక ప్రక్రియ ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్ పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ), గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. (ఈ గురువుల్ని మించిన శిష్యుల కథ తెలుసా?) ఆన్లైన్ పరీక్ష ► ఐఐఎఫ్‌టీ ఎంబీఏ ఎంట్రెన్స్ టెస్ట్‌ను ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)) విధానంలో నిర్వస్తారు. ► మొత్తం నాలుగు విభాగాల నుంచి 110 ప్రశ్నలు–300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ► ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఉంటాయి. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ► నాలుగు విభాగాలు: క్వాంటిటేటివ్ ఎబిలిటీ–25 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్–35 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్–30ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్–20 ప్రశ్నలు. ► నెగిటివ్ మార్కులు: మొదటి మూడు సెక్షన్లలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. 4వ సెక్షన్‌కు సంబంధించి ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి మొత్తం 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో పెరా ఫార్ములేషన్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్–ఆంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, అనాలజీ, గ్రామర్,స్పెల్లింగ్, మ్యాచింగ్ వర్డ్ మీనింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ► ఈ విభాగం నుంచి నుంచి 14–16 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు ప్యాసెజ్లలో అడిగిన ప్రశ్నలకు ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. దీనిలో కరెంట్ అఫైర్స్, బిజినెస్ ఎకానమీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాలు, అంతర్జాతీయ పరిణామాలు–దేశంపై వాటి ప్రభావం తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ ► ఈ విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అర్థమెటిక్, సింపుల్ ఇంట్రెస్ట్, మ్యాన్ డే అండ్ వర్క్, రేషియో–ప్రపోర్షన్, పర్సంటేజెస్, ఫిలింగ్ ఆఫ్ ఓవర్‌హెడ్ ట్యాంక్ వంటి అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇవే కాకుండా.. జామెట్రీ, అల్జీబ్రా, లాగ్, ట్రయాంగిల్, రెక్టాంగ్లర్స్, ప్రాబబిలిటీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. డేటా ఇంటర్‌ప్రిటిషన్ అండ్ లాజికల్ రీజనింగ్ ► ఈ విభాగం నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇందులో అనాలసిస్ అండ్ కాంపరేటివ్ స్టడీ ఆఫ్ డేటాటేబుల్స్, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ విత్ టేబుల్స్, పై చార్ట్ అండ్ టేబుల్, బార్ డయాగ్రమ్ అండ్ కాంపరేటివ్ టేబుల్ వంటి అంశాలను అడుగుతారు. అలాగే లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి టీమ్ బేస్డ్ కొశ్చన్స్, స్టేట్మెంట్–కంక్లూజన్, కోడింగ్–డీకోడింగ్, ఆర్గు్గమెంట్స్, కంక్లూజన్స్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్, కేలండర్, డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరెంజ్మెంట్స్ వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. జనరల్ నాలెడ్జ్ ► ఈ విభాగం నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1.5 మార్కులు కేటాయిస్తారు. ఇందులో మ్యాచింగ్ ది లోగోస్, మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మ్యాచింగ్ స్టాక్ మార్కెట్ ఆఫ్ కంట్రీస్, కరెన్సీ ఆఫ్ ది కంట్రీస్, కరెంట్ అఫైర్స్, వివిధ రంగాలకు బ్రాండ్ అంబాసీడర్లుగా వ్యవహరిస్తున్నవారు, బుక్స్ అండ్ ఆథర్స్, బిజినెస్ అండ్ ఎకానమీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. దరఖాస్తు ఫీజు ► జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. విదేశీ అభ్యర్థులు రూ.15000/200 యూఎస్ డాలర్స్ దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.10.2021 ► పరీక్ష తేదీ: 05.12.2021 ► పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు; ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ► వెబ్సైట్: https://iift.nta.nic.in -
జేఈఈ అడ్వాన్స్డ్: విజయానికి యాభై రోజులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్‌లో చేరడం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కల! తమ స్వప్నం సాకారం దిశగా కసరత్తును ముమ్మరం చేయాల్సిన కీలక సమయం ఆసన్నమైంది! ఎందుకంటే.. జేఈఈ అడ్వాన్స్డ్–2021 తేదీ ఖరారైంది. అక్టోబర్ 3వ తేదీన పరీక్ష జరుగనుంది. అంటే.. పరీక్షకు ఇంకా యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయంలో తమ ప్రిపరేషన్‌కు పదును పెడుతూ.. ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి. అప్పుడే అడ్వాన్స్‌డ్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో సక్సెస్ సాధించేందుకు నిపుణుల ప్రిపరేషన్ గైడెన్స్... విద్యార్థులు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ కోసం కృషి చేస్తుంటారు. వాస్తవానికి పరీక్షకు నెల రోజులు ముందు సాగించే ప్రిపరేషన్ అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. రెండేళ్ల నుంచీ చదువుతున్నాం కదా.. అనే ధీమా ఎంతమాత్రం సరికాదని సూచిస్తున్నారు. ప్రస్తుతం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పరీక్ష రోజు వ్యవహరించాల్సిన తీరు వరకూ.. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అత్యంత శ్రద్ధతో, ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ యాభై రోజుల్లో సాగించే ప్రిపరేషన్ ఐఐటీలకు దారి చూపుతుందని గుర్తించాలి. రివిజన్‌కు ప్రాధాన్యం ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులు వీలైనంత ఎక్కువ సమయం పునశ్చరణకు కేటాయించాలి. 2019తో పోల్చుకుంటే గత ఏడాది, ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే.. అడ్వాన్స్డ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయమే లభించింది. కాబట్టి ఇప్పటికే సీరియస్ అభ్యర్థులంతా సిలబస్ అంశాల ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్‌కు అధిక సమయం కేటాయించడం మేలు. ప్రతి సబ్జెక్ట్–ప్రతి రోజూ ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్ పరంగా.. విద్యార్థులు ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేసేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజూ తమ ప్రిపరేషన్ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని.. పరీక్షలో అడిగే మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)కు కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం నాలుగు గంటల సమయం కేటాయించుకోవాలి. ► ఆయా సబ్జెక్ట్‌కు కేటాయించిన నాలుగు గంటల్లో.. మూడు లేదా మూడున్నర గంటలు రివిజన్, ప్రాక్టీస్ చేయాలి. మిగతా సమయాన్ని ఆ రోజు అప్పటివరకు చదివిన సదరు సబ్జెక్ట్ అంశాల స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తద్వారా సదరు టాపిక్‌లో తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కు పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉందని భావిస్తే.. వాటిలోని ముఖ్యాంశాల(కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు)పై దృష్టి పెట్టాలి. వీలైతే పూర్తి అభ్యసనం.. లేదంటే.. ముఖ్య ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు, సినాప్సిస్కు సమయం కేటాయించాలి. కచ్చితత్వం ఆయా సిలబస్ టాపిక్స్‌పై విద్యార్థులు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. సదరు అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. పూర్తి కచ్చితత్వంతో సమాధానాలు సాధించేలా పట్టు బిగించాలి. అందుకోసం సంబంధిత టాపిక్ నుంచి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి. పలు ప్రశ్నలకు పొరపాటు సమాధానాలు ఇచ్చామని భావిస్తే.. సదరు టాపిక్ కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలి. పాత ప్రశ్న పత్రాలు ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను ఎక్కువగా సాధన చేయాలి. ఫలితంగా సబ్జెక్ట్ నైపుణ్యాలు మెరుగవుతాయి. పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రతి ఏటా ప్రశ్నల శైలిలో మార్పు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. 25 నుంచి 30 వరకూ.. ప్రీవియస్, మోడల్ కొశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేస్తే.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు విజయానికి చేరువయ్యేందుకు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావడం. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షకు ముందు పది రోజుల సమయాన్ని వీలైనంత మేరకు మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. వీటి ఫలితాల ఆధారంగా తమ సామర్థ్యాల విషయంలో అవగాహన పొందాలి. ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు అడ్వాన్స్డ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, సిద్ధాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. అడ్వాన్స్‌డ్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా కాకుండా.. కాన్సెప్ట్ ఆధారితంగా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కాన్సెప్ట్‌లను అవపోసన పడితే.. పరీక్షలో ప్రశ్నలు పరోక్షంగా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రశ్నల సరళి, మార్కింగ్ పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, మార్కింగ్ విధానాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ వారీగా.. ఇలా ► మ్యాథమెటిక్స్: కోఆర్డినేట్ జామెట్రీ, త్రికోణమితి, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, కాంప్లెక్స్ నెంబర్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► కెమిస్ట్రీ: కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫిజిక్స్: ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రిసిటీపై ఎక్కువ దృష్టిపెట్టాలి. మెయిన్‌కు హాజరవుతుంటే జేఈఈ–మెయిన్ మూడు సెషన్లలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు జేఈఈ–మెయిన్ 4వ సెషన్‌కు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు ఈ నెల(ఆగస్టు) 26, 27, 31 తేదీల్లో, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనున్నాయి. ► వీటికి హాజరయ్యే విద్యార్థులకు మెయిన్ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. కాబట్టి ప్రస్తుత సమయంలో వీలైనంత మేరకు అడ్వాన్స్‌డ్‌ను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పరీక్షకు ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇక పూర్తి సమయాన్ని అడ్వాన్స్డ్ రివిజన్‌కు కేటాయించాలి. వారం రోజుల ముందు అడ్వాన్స్డ్ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రాక్టీస్ టెస్టులు, మోడల్టెస్టులు, గ్రాండ్ టెస్ట్‌ల సాధనకు కేటాయించాలి. ఈ సమయంలో కొత్త అంశాలు చదువుదాం.. వాటికి వెయిటేజీ ఎక్కువ ఉంది అనే భావన ఏ మాత్రం సరికాదు. పరీక్ష రోజు కీలకం ► ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. ఎన్ని సంవత్సరాలు కృషి చేసినా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ విజయంలో అత్యంత కీలకంగా మారుతుంది. ► పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం ఆసాంతం చదివేందుకు కనీసం 10 నుంచి పదిహేను నిమిషాలు కేటాయించాలి. ► దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి. ► పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలపాటు గుర్తించిన సమాధానాలు రివ్యూ చేసుకోవాలి. ► సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే.. మార్క్ ఫర్ రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి.. చివరలో సమీక్షించుకోవాలి. అడ్వాన్స్డ్.. ముఖ్యాంశాలు ► ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్ ఓరియెంటెడ్ కొశ్చన్స్ సాధన చేయాలి. ► ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. ► వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ► అన్ని సబ్జెక్ట్‌లలో అన్ని టాపిక్స్‌లో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ► పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లకు సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు.. కేంద్రంలోకి అనుమతించే సమయానికంటే గంట ముందుగా చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ► పరీక్షకు ముందు ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి. ► పరీక్ష హాల్లో.. పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై అందుబాటులో ఉండే కౌంట్‌డౌన్ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి. ► మొదటి పేపర్ పూర్తయిన తర్వాత దాని గురించి మర్చిపోయి రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి. విజయ సాధనాలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే.. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా టాపిక్స్‌ను అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రిపరేషన్ సమయంలోనే సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా.. పరీక్షలో ఏమైనా మార్పులు జరిగినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. – ఆర్.కేదారేశ్వర్, జేఈఈ పోటీ పరీక్షల నిపుణులు -
Telangana: ఆగస్టు 23,24న లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23, 24 తేదీల్లో తెలంగాణ లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్స్‌కి 28,904 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోగా.. ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్స్‌కి 7,676 మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌ఎంకి 3,286 మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. వీటిలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి. -
నీట్(యూజీ) 2021: ఇలా ప్రిపేరయితే విజయం ఖాయం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) –యూజీ–2021.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! గత కొన్ని నెలలుగా.. నీట్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఎట్టకేలకు ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ–2021లో మార్పులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. నీట్–యూజీ–2021 నిర్వహణ తేదీపై సందేహాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్) తాజాగా పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది.దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్షను పెన్–పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు నీట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాయిస్ విధానం నీట్ పరీక్షలో ఈ ఏడాది ఛాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్బీలోని 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. నీట్లో గతేడాది వరకు బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్‌లను కలిపి బయాలజీ విభాగం పేరుతో 90 ప్రశ్నలు అడిగేవారు. కాని ఈ ఏడాది బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సబ్జెక్టులుగా పేర్కొన్నారు. ఒక్కోదాన్ని నుంచి 45 ప్రశ్నలు అడగనున్నారు. రెండు సెక్షన్లు ► మొత్తం నాలుగు సబ్జెక్ట్‌ల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరుగుతుంది. ► ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ పేరుతో రెండు విభాగాలు ఉంటాయి. ► ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్–ఏ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్–బీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. ► సెక్షన్–బీలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ► ప్రతి సబ్జెక్ట్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు అడిగినా.. సెక్షన్–బీలో కల్పించిన ఛాయిస్ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ► అంటే.. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు చొప్పున.. నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన ప్రకారం– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పదమూడు భాషలు నీట్‌ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కోరుకుంటే.. కేవలం ఇంగ్లిష్ ప్రశ్న పత్రం అందిస్తారు. హిందీ కోరుకుంటే.. ఇంగ్లిష్/హిందీ ఇలా రెండు భాషల్లో.. అంటే బైలింగ్వల్ టెస్ట్ బుక్‌లెట్‌ను ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాంతీయ భాషను ఎంచుకుంటే.. సదరు ప్రాంతీయ భాష/ఇంగ్లిష్ బుక్లెట్ అందిస్తారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్.. ఇలా రెండు భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఛాయిస్ కల్పించినా.. పెరగని సమయం ఈ ఏడాది నీట్లో ప్రశ్నల సంఖ్య పెంచి ఛాయిస్ విధానాన్ని కల్పించినా.. పరీక్ష సమయాన్ని పెంచలేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది విద్యార్థులు అదనంగా 20 ప్రశ్నలు చదివి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరీక్షలో సమయాభావానికి దారితీసే ఆస్కారముందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉన్నా.. మొత్తం 15 ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఛాయిస్‌గా వదిలేయాల్సిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకునేందుకు సమయం పడుతుంది. బోటనీ, జువాలజీ వేర్వేరుగా ► బయాలజీ విషయానికొస్తే.. ఈ ఏడాది కొత్తగా బోటనీ, జువాలజీ పేరుతో రెండు ప్రత్యేక సబ్జెక్టులుగా పరీక్ష నిర్వహించనున్నారు. ► బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ► జువాలజీకి సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ► ఫిజిక్స్‌లో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. రివిజన్‌కు ప్రాధాన్యం ► నీట్లో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు సిలబస్‌పై గట్టి పట్టు బిగించాలి. ► ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆయా సబ్జెక్ట్‌ల అభ్యసనం చేయాలి. ► ప్రస్తుత సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► నిర్దిష్ట సమయంలో అవగాహన పొందేలా ముందుకు కదలాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► మోడల్ కొశ్చన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్‌డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు ర్యాపిడ్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది. నీట్–యూజీ(2021) సమాచారం ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2021 (మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు) ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: డిసెంబర్ 31 నాటికి కనిష్ట వయోపరిమితి 17ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25ఏళ్లు ఉండాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 13 నుంచి ఆగస్ట్ 6 వరకు. ► ఆన్లైన్లో దరఖాస్తులో సవరణ అవకాశం: ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 12 వరకు. ► పరీక్ష కేంద్రం కేటాయింపు ప్రకటన: ఆగస్ట్ 20, 2021. ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in ఈజీ టు డిఫికల్ట్ పరీక్ష రోజున అభ్యర్థులు తొలుత ప్రశ్న పత్రం చదివేందుకు పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. ఛాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలను అర్థం చేసుకొని.. తమకు కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా సులభమైన ప్రశ్నలతో సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి. ప్రిపరేషన్ పరంగా.. ఎక్కువ సమయం రివిజన్‌కు కేటాయించాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరై తమ సామర్థ్యం స్థాయి తెలుసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. – బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు -
JEE Mains: మూడవ, నాలుగో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ, నిట్ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్ మూడు, నాలగవ విడతల పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మూడో విడత పరీక్ష జులై 20 నుంచి 25వరకు.. నాలుగో విడత పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు కూడా తాజాగా దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు రాత్రి నుంచి జులై 8 రాత్రి వరకు ఎన్టీఏ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్, మేలో నిర్వహించాల్సిన సెషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశంలో జేఈఈ మెయిన్స్‌ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. అయితే, తొలి విడత ఫిబ్రవరిలో, రెండో విడత మార్చిలో నిర్వహించగా.. మూడు, నాలుగవ విడత పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సి ఉండింది. అయితే కరోనా కారణంగా ఈ రెండు సెషన్ల పరీక్షలు వాయిదా పడ్డాయి. -
TS EDCET 2021: ఎడ్‌సెట్ విజయం ఇలా
ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాల గురించి తెలుసుకుందాం... తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్ ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు. అర్హతలు ► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు. ► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. పరీక్ష ఇలా ► ఎడ్‌సెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్–60మార్కులకు(మ్యాథమెటిక్స్–20మార్కులు, సైన్స్–20మార్కులు, సోషల్ స్టడీస్–20 మార్కులు), టీచింగ్ అప్టిట్యూడ్–20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్–30మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఎడ్‌సెట్ పరీక్ష సమయం రెండు గంటలు. ► ఎడ్‌సెట్‌లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ► గతంలో ఎడ్‌సెట్‌కు సంబంధించిన సిలబస్ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది. సిలబస్ అంశాలు ఇవే ► తెలంగాణ స్టేట్ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి. ► మ్యాథమెటిక్స్:సంఖ్యావ్యవస్థ(నంబర్ సిస్టమ్), వాణిజ్య గణితం(కమర్షియల్ మ్యాథమెటిక్స్), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్). ► ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్: ఆహారం(ఫుడ్), జీవులు(లివింగ్ ఆర్గానిజమ్స్), జీవన ప్రక్రియలు(లైఫ్ ప్రాసెస్ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్), పదార్థం(మెటీరియల్), కాంతి(లైట్), విద్యుత్ అండ్ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజమ్), వేడి(హీట్), ధ్వని(సౌండ్), కదలిక(మోషన్), మార్పులు(చేంజెస్),వాతావరణం(వెదర్ అండ్ క్లయిమెట్), బొగ్గు అండ్ పెట్రోల్(కోల్ అండ్ పెట్రోల్), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్ నేచురల్ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్ రియాక్షన్స్). ► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్), అర్థశాస్త్రం(ఎకనామిక్స్). ► టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ఉంటాయి. ► జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూ: కరెంట్ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన విద్యాసమస్యలు, జనరల్ పాలసీలు, సైంటిఫిక్ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. ► కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రిపరేషన్ ఇలా ► ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే ఎంట్రన్‌లో మంచి మార్కులు(ర్యాంక్) సాధించేందుకు అవకాశం ఉంటుంది. ► ఎడ్‌సెట్ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్ టెబుల్ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్‌సెట్‌కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ► కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవడం, న్యూస్ బుల్‌టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్ కట్స్‌ను నోట్ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్‌బుక్ ఉపయోగించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకోసం ఎడ్‌సెట్ అధికారిక వెబ్సైట్ https://edcet.tsche.ac.in/లాగిన్ అవ్వాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650. ► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా) ► హాల్‌టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 10.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021 ► వెబ్సైట్: https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx -
ACET 2021: నిత్యనూతనం.. యాక్చూరియల్ సైన్స్!
ఇంటర్మీడియెట్ పూర్తి చేయబోతున్నారా.. ఆర్థిక గణాంకాలంటే మక్కువ ఉందా.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవాలని భావిస్తున్నారా..! అయితే మీకు సరైన మార్గం.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) నిర్వహించే.. యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)! ఈ పరీక్షలో.. విజయం సాధిస్తే.. భవిష్యత్తులో బీమా రంగంలో చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. బీమా సంస్థల్లో ఎంతో కీలకంగా నిలిచే.. యాక్చూరియల్ విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. తాజాగా ఐఏఐ.. ఏసెట్–2021 జూన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఏసెట్ పరీక్ష విధానం, యాక్చూరియల్ సైన్స్ కోర్సులు, కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం... బీమా రంగంలో యాక్చుయరీ అత్యంత కీలకమైన విభాగం. ఏదైనా ఒక పాలసీని ప్రవేశ పెట్టే క్రమంలో ప్రీమియాన్ని నిర్ణయించడం, వయో వర్గాల వారీగా పాలసీ గడువు, మెచ్యూరిటీ సమయంలో చెల్లించాల్సిన మొత్తాలు వంటి అంశాలను నిర్ణయించే విభాగమే..యాక్చుయరీ. ఈ విభాగం లో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో యాక్చూరియల్ సైన్స్ స్పెషలైజేషన్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ)లో రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఇందుకు మార్గం వేసుకునే అవకాశం ఉంది. ఐఏఐ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ).. యాక్చుయరీ విభాగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఐఏఐ స్వయం ప్రతిపత్తి సంస్థ. ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది. ఐఏఐ యాక్చుయరీ నిపుణలను తీర్చిదిద్దే క్రమంలో మొత్తం మూడు దశల్లో కోర్సును అందిస్తుంది. అవి.. స్టూడెంట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, అసోసియేట్ మెంబర్షిప్ ప్రోగ్రామ్, ఫెలో మెంబర్షిప్ ప్రోగ్రా మ్. ఈ మూడు దశల ప్రోగ్రామ్‌లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో బీమా రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తాయని చెప్పొచ్చు. తొలి దశ.. స్టూడెంట్ మెంబర్షిప్ యాక్చుయరీస్ ఆఫ్ ఇండియా అందించే మూ డు మెంబర్షిప్ హోదాల్లో.. ముందుగా స్టూడెంట్ మెంబర్‌గా గుర్తింపు పొందాలి. ఇందుకోసం ఈ సంస్థ ఏటా రెండుసార్లు నిర్వహించే యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏసెట్)లో ఉత్తీర్ణత సాధించాలి. 70 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు–వంద మార్కులకు రెండు విభాగాలుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్; రెండో విభాగంలో ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కనీసం 50 శాతం మార్కులు వస్తే ఏసెట్‌లో అర్హత సాధించినట్టు భావిస్తారు. ఏసెట్ తర్వాత దశలు ► ఏసీఈటీ(ఏసెట్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు.. ఐఏఐ నాలుగు దశల్లో ఆయా సబ్జెక్ట్‌లలో నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. ► స్టేజ్–1: కోర్ టెక్నికల్: ఇందులో యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చురియల్ మ్యాథమెటిక్స్, యాక్చురియల్ బిజినెస్ విభాగాల నుంచి తొమ్మిది పేపర్లు ఉంటాయి. ► స్టేజ్–2: కోర్ అప్లికేషన్: ఈ దశలో యాక్చురియల్ రిస్క్ మేనేజ్మెంట్; మోడల్ డాక్యుమెంటేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్; కమ్యూనికేషన్ ప్రాక్టీస్ పేపర్లలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ► స్టేజ్–3: స్పెషలిస్ట్ టెక్నిషియన్: ఈ దశలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఎనిమిది పేపర్లలో ఏవైనా రెండు పేపర్లను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ► స్టేజ్–4: స్పెషలిస్ట్ అప్లికేషన్: యాక్చురియల్ సైన్స్‌కు సంబంధించి నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో ఆరు పేపర్లు ఉంటాయి. వీటిల్లో ఉత్తీర్ణత సా«ధిస్తే.. ఐఏఐ యాక్చురియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే. స్టేజ్–1, 2లు పూర్తి చేసుకుంటే.. అసోసియేట్ మెంబర్ ► ఏసెట్‌లో అర్హత సాధించి.. స్టూడెంట్ మెంబర్ హోదా సొంతం చేసుకొని.. ఆ తర్వాత నిర్వహించే స్టేజ్–1, స్టేజ్–2 పరీక్షలు ఉత్తీర్ణులైతే అసోసియేట్ మెంబర్‌గా గుర్తింపు లభిస్తుంది. ► స్టేజ్–3, స్టేజ్–4లకు సంబంధించిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించి.. మొత్తం నాలుగు దశలూ పూర్తి చేసుకొని.. మూడేళ్ల పని అనుభవం గడిస్తే ఫెలో మెంబర్ హోదా దక్కుతుంది. కామర్స్, మ్యాథ్స్–అనుకూలం యాక్చూరియల్ సైన్స్ కోర్సులోని పేపర్లు, టాపిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కామర్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌లు చదివిన వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విభాగంలో నిర్వహించాల్సిన విధులన్నీ గణాంకాలు, నిధుల విశ్లేషణకు సంబంధించి ఉండటమే ఇందుకు కారణం. డిగ్రీ స్థాయిలో బీకాం, బీఎస్సీ, బీటెక్ చదివిన అభ్యర్థులు; పీజీ స్థాయిలో ఎంబీఏ, ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ప్రవేశించే అవకాశం ఉంది. విస్తృత అవకాశాలు ప్రస్తుతం యాక్చూరియల్ విభాగంలో దేశంలో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. దాంతో అసోసియేట్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌తోనే చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అసోసియేట్ మెంబర్ హోదా పొందిన వారికి బీమా రంగ సంస్థలు ప్రారంభంలోనే సగటున రూ.8లక్షల వార్షిక వేతనంతో కొలువులు అందిస్తున్నాయి. అన్ని దశలు పూర్తి చేసుకున్న వారికి బీమా రంగంలో యాక్చుయరీ విభాగంలో విస్తృత కొలువులు అందుబాటులో ఉన్నాయి. యాక్చూరియల్ సైన్స్‌లో సర్టిఫికెట్తో బీమారంగ సంస్థల్లో యాక్చుయరీ స్పెషలిస్ట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్, అండర్ రైటర్స్, అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరికి ప్రారంభంలోనే దాదాపు రూ.పది లక్షల వరకూ వార్షిక వేతనం అందుతోంది. యాక్చుయరీస్ విధులు బీమా సంస్థల్లో యాక్చురియల్ విభాగంలో చేరిన వారు.. నూతన పాలసీలను రూపొందించడం, వినియోగదారులకు ఇవ్వాల్సిన వడ్డీ, రిస్క్ మేనేజ్మెంట్, బీమా కంపెనీల ఆర్థిక ప్రణాళికకు సంబంధించి రిస్క్‌ను ముందుగానే అంచనా వేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఒక పాలసీని ప్రవేశ పెట్టే ముందు సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. సదరు పాలసీ సరైందా.. దాన్ని ప్రవేశ పెట్టొచ్చా.. అనే అంశాలను కూడా గుర్తించి.. సంస్థ యాజమాన్యానికి తగిన సలహాలు, సూచనలు అందించాలి. ప్రధాన ఉపాధి వేదికలు యాక్చుయరీ విభాగంలో ఐఏఐ సర్టిఫికేషన్ సొంతం చేసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ, రీ–ఇన్సూరెన్స్ కంపెనీలు, కన్సల్టింగ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. అదే విధంగా అకౌంటింగ్ సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీలు, స్టాక్ మార్కెట్లు, సోషల్ సెక్యూరిటీ స్కీంల్లోనూ వీరు కన్సల్టెంట్లుగా పనిచేయొచ్చు. ప్రొడక్ట్ అనలిస్ట్, యాక్చూరియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ హోదాలతో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు, బిజినెస్ కన్సల్టెన్సీలు, ప్రభుత్వ విభాగాల్లోనూ ఉద్యోగా లుంటాయి. నాన్–ఏసీఈటీ విధానం ఐఏఐ ఇంటర్మీడియెట్ అర్హతగా నిర్వహించే ఏసెట్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ఈ కోర్సులోని దశలకు నమోదు చేసుకునే అవకాశంతోపాటు.. నాన్–ఏసీఈటీ విధానం కూడా అమలవుతోంది. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ కోర్సుల ఉత్తీర్ణులు, ఎంబీఏ (ఫైనాన్స్ స్పెషలైజేషన్) ఉత్తీర్ణులు, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ల నుంచి బీఏ/ ఎమ్మెస్సీలో యాక్చురియల్ సైన్స్ ఉత్తీర్ణులు, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్; అదే విధంగా పీజీ స్థాయిలోని ఎంస్టాట్, మ్యాథమెటిక్స్ స్పెషలైజేషన్ ఉత్తీర్ణులు కూడా నేరుగా స్టూడెంట్ మెంబర్షిప్ హోదాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. జూన్ 2021కు నోటిఫికేషన్ ► యాక్చూరియల్ సైన్స్ విభాగంలో అడుగు పెట్టడానికి తొలి దశగా పేర్కొంటున్న ఏసెట్ పరీక్ష– 2021 జూన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షను జూన్ 26న నిర్వహించనున్నారు. ఈ ఏడాది అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో ఏసెట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. ► అర్హత: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఏసెట్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 2, 2021 ► పరీక్ష తేదీ: జూన్ 26, 2021 ► ఫలితాల వెల్లడి: జూలై 3, 2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.actuariesindia.org/index.aspx -
టీఎస్ ఈసెట్ 2021: ముఖ్యసమాచారం
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీఎస్ ఈసెట్)–2021 నోటిఫికేషన్ వెలువడింది. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/బీఎస్సీ(మ్యాథ్స్) ఉత్తీర్ణులు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ విద్యార్థులకు బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం... అర్హతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండళ్లు గుర్తించిన డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/ఫార్మసీ ఉత్తీర్ణులు; మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌కు హాజరవ్వొచ్చు. బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులకు బీఫార్మసీలో ప్రవేశానికి అర్హత లేదు. ఆయా కోర్సులు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కోర్సులో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత 40 శాతం. పరీక్ష స్వరూపం ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు ఈ స్ట్రీమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ► మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్(విభాగం) మాత్రం అభ్యర్థి బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది. బీఎస్సీ(మ్యాథ్స్) బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు పరీక్ష స్వరూపం కింది విధంగా ఉంటుంది. ఫార్మసీ స్ట్రీమ్ అర్హత మార్కులు అభ్యర్థులు నాలుగు సబ్జెక్టుల్లో(బీఎస్సీ అభ్యర్థులకు మూడు సబ్జెక్టులు) కలిపి సగటున కనీసం 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు వర్తించవు. అర్హత– బ్రాంచ్‌లు ► టీఎస్ ఈసెట్ సబ్జెక్టు పేపర్లు వారీగా అర్హత డిప్లొమా స్పెషలైజేషన్స్.... ► కెమికల్ ఇంజనీరింగ్ పేపర్: సిరామిక్, లెదర్, టెక్స్టైల్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్–పెట్రోకెమికల్,కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్–షుగర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► సివిల్ ఇంజనీరింగ్ పేపర్: సివిల్, సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పేపర్: కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పేపర్: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ► మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ,డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్: మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్. ► మైనింగ్ ఇంజనీరింగ్ పేపర్: మైనింగ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ముఖ్యసమాచారం ► ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 17,2021 ► దరఖాస్తు ఫీజు: జనరల్ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400. ► పరీక్ష తేదీ: జూలై 1, 2021 ► ఉదయం సెషన్ (ఉ.9 గం–మ.12 గం)–ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ పేపర్లు ► మధ్యాహ్నం సెషన్ (మ.3 గం–సా.3 గం)–సీఐవీ, సీహెచ్ఈ, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం పేపర్లు. ► వెబ్సైట్: https://ecet.tsche.ac.in -
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. (చదవండి: సిలబస్ సర్దుబాట) ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ మే 1న ఇంటర్ ఫస్టియర్ పేపర్-2 మే 3న ఇంగ్లిష్ పేపర్-1 మే 5న మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ-1, సివిక్స్-1 మే 7న మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1 మే 10న ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్-1 మే 12న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్ మే 2న ఇంటర్ సెకండయర్ పేపర్-2 మే 4న ఇంగ్లిష్ పేపర్-2 మే 6న మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ-2, సివిక్స్-2 మే 8న మ్యాథ్స్ పేపర్-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2 మే 11న ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్-2 మే 13న కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్-2, సోషియాలజీ పేపర్-2