నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) –యూజీ–2021.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! గత కొన్ని నెలలుగా.. నీట్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఎట్టకేలకు ఎన్‌టీఏ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ–2021లో మార్పులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
నీట్–యూజీ–2021 నిర్వహణ తేదీపై సందేహాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. ఎన్‌టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్) తాజాగా పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది.దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్షను పెన్–పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు నీట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఛాయిస్ విధానం
నీట్ పరీక్షలో ఈ ఏడాది ఛాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్‌బీలోని 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. నీట్‌లో గతేడాది వరకు బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్‌లను కలిపి బయాలజీ విభాగం పేరుతో 90 ప్రశ్నలు అడిగేవారు. కాని ఈ ఏడాది బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సబ్జెక్టులుగా పేర్కొన్నారు. ఒక్కోదాన్ని నుంచి 45 ప్రశ్నలు అడగనున్నారు.
రెండు సెక్షన్‌లు
► మొత్తం నాలుగు సబ్జెక్ట్‌ల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరుగుతుంది.
► ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ పేరుతో రెండు విభాగాలు ఉంటాయి.
► ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్–ఏ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్–బీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు.
► సెక్షన్–బీలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
► ప్రతి సబ్జెక్ట్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు అడిగినా.. సెక్షన్–బీలో కల్పించిన ఛాయిస్ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది.
► అంటే.. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు చొప్పున.. నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
► నెగెటివ్ మార్కింగ్ నిబంధన ప్రకారం– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.
పదమూడు భాషలు
నీట్‌ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కోరుకుంటే.. కేవలం ఇంగ్లిష్ ప్రశ్న పత్రం అందిస్తారు. హిందీ కోరుకుంటే.. ఇంగ్లిష్/హిందీ ఇలా రెండు భాషల్లో.. అంటే బైలింగ్వల్ టెస్ట్ బుక్‌లెట్‌ను ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాంతీయ భాషను ఎంచుకుంటే.. సదరు ప్రాంతీయ భాష/ఇంగ్లిష్ బుక్‌లెట్ అందిస్తారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్.. ఇలా రెండు భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది.
ఛాయిస్ కల్పించినా.. పెరగని సమయం
ఈ ఏడాది నీట్‌లో ప్రశ్నల సంఖ్య పెంచి ఛాయిస్ విధానాన్ని కల్పించినా.. పరీక్ష సమయాన్ని పెంచలేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది విద్యార్థులు అదనంగా 20 ప్రశ్నలు చదివి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరీక్షలో సమయాభావానికి దారితీసే ఆస్కారముందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉన్నా.. మొత్తం 15 ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఛాయిస్‌గా వదిలేయాల్సిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకునేందుకు సమయం పడుతుంది.
బోటనీ, జువాలజీ వేర్వేరుగా
► బయాలజీ విషయానికొస్తే.. ఈ ఏడాది కొత్తగా బోటనీ, జువాలజీ పేరుతో రెండు ప్రత్యేక సబ్జెక్టులుగా పరీక్ష నిర్వహించనున్నారు.
► బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్‌పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్‌లేషన్, రెగ్యులేషన్‌లపై దృష్టిపెట్టాలి. నీట్‌లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి.
► జువాలజీకి సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్‌లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి.
► ఫిజిక్స్‌లో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
► కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్‌లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి.
ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
రివిజన్‌కు ప్రాధాన్యం
► నీట్‌లో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు సిలబస్‌పై గట్టి పట్టు బిగించాలి.
► ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆయా సబ్జెక్ట్‌ల అభ్యసనం చేయాలి.
► ప్రస్తుత సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి.
► నిర్దిష్ట సమయంలో అవగాహన పొందేలా ముందుకు కదలాలి.
► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి.
► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి.
► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి.
► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
► మోడల్ కొశ్చన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్‌డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి.
► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు ర్యాపిడ్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
నీట్–యూజీ(2021) సమాచారం
► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2021 (మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు)
► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో)
► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
► వయో పరిమితి: డిసెంబర్ 31 నాటికి కనిష్ట వయోపరిమితి 17ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25ఏళ్లు ఉండాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 13 నుంచి ఆగస్ట్ 6 వరకు.
► ఆన్‌లైన్‌లో దరఖాస్తులో సవరణ అవకాశం: ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 12 వరకు.
► పరీక్ష కేంద్రం కేటాయింపు ప్రకటన: ఆగస్ట్ 20, 2021.
► అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు.
► పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తుకు
వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in
ఈజీ టు డిఫికల్ట్
పరీక్ష రోజున అభ్యర్థులు తొలుత ప్రశ్న పత్రం చదివేందుకు పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. ఛాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలను అర్థం చేసుకొని.. తమకు కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా సులభమైన ప్రశ్నలతో సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి. ప్రిపరేషన్ పరంగా.. ఎక్కువ సమయం రివిజన్‌కు కేటాయించాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరై తమ సామర్థ్యం స్థాయి తెలుసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి.
– బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment