Preparation guidance
-
గేట్–2022: ఈ మార్పులు గమనించారా?
గేట్.. గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్! ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, పీహెచ్డీ తదితర కోర్సుల్లో.. ప్రవేశానికి తొలి మెట్టు! అంతేకాదు గేట్ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో.. కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. అందుకే.. ప్రతి ఏటా గేట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. తాజాగా గేట్–2022 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల(ఆగస్టు) 30న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. గేట్–2022లో మార్పులు.. పరీక్ష విధానం.. ప్రిపరేషన్‌పై ప్రత్యేక కథనం.. గేట్–2022లో పలు మార్పులు జరిగాయి. ముఖ్యంగా కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. అవి..నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్; జియోమాటిక్స్ ఇంజనీరింగ్. దీంతో గేట్లో మొత్తం సబ్జెక్ట్ పేపర్ల సంఖ్య 29కి చేరింది. వీటిలో ఒకటి లేదా రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. రెండు పేపర్లకు హాజరు విధానాన్ని గేట్–2021 నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చారు. అనుమతించిన(రెండు పేపర్ల కాంబినేషన్) జాబి తా నుంచి అభ్యర్థులు తాము రాయాల్సిన పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు.. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. అర్హత ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/కామర్స్ /సైన్స్/ఆర్ట్స్ విభాగాల్లో.. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులే. దరఖాస్తుకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ఆన్లైన్ పరీక్ష ► గేట్ పరీక్ష ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో 3 గంటల వ్యవధిలో జరుగుతుంది. ► మొత్తం 65 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► రెండు విభాగాలుగా జరిగే గేట్లో.. పార్ట్–ఏ జనరల్ అప్టిట్యూడ్. ఈ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. ► పార్ట్–బీ అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటుంది. ఈ విభాగంలో మొత్తం 55 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ప్రశ్నలు ఒక మార్కు, 30 ప్రశ్నలు రెండు మార్కులకు ఉంటాయి. ► పార్ట్–బీలోనే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 10–15 మార్కులకు ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు.. మూడు రకాలు ► గేట్ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలను అడుగుతారు. అవి.. మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూలు)గా పేర్కొనే ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు. రెండో రకం ప్రశ్నలు.. మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ). మూడో విధానంలో న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్ఏటీ) ప్రశ్నలు. ► ఎంసీక్యూ ప్రశ్నల విధానంలో.. నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ► మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్‌లో.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే.. అభ్యర్థులకు సంబంధిత అంశంపై సమగ్ర అవగాహన ఉండాలి. ► న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి. వీటికి వర్చువల్ కీ ప్యాడ్ ద్వారా సమాధానం టైప్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ విశ్లేషణ ముందుగా అభ్యర్థులు గేట్ పరీక్ష విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అందుకోసం తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి సిలబస్‌ను పరిశీలించాలి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. గత ప్రశ్న పత్రాల్లో ఆయా టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజీని గుర్తించాలి. ఆ తర్వాత గేట్ సిలబస్‌ను అకడమిక్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దానికి అనుగుణంగా తమ ప్రిపరేషన్ వ్యూహాలు రూపొందించుకోవాలి. ముఖ్యంగా బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలు అంటున్నారు నిపుణలు. వెయిటేజీని అనుసరిస్తూ గేట్–2022 పరీక్ష తేదీలను పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులకు ఆరు నెలలకు పైగా సమయం అందుబాటులో ఉంది. సీరియస్ అభ్యర్థులకు విజయ సాధన దిశగా ఈ సమయం సరిపోతుందనే చెప్పొచ్చు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన వ్యూహాలను అనుసరించాలి. ప్రధానంగా ఆయా సబ్జెక్ట్‌లలో తమ బలాలు, బలహీనతలపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. గత అయిదారేళ్లుగా గేట్లో లభిస్తున్న వెయిటేజీ, అకడమిక్ వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. బేసిక్స్, అప్లికేషన్ అప్రోచ్ గేట్లో మంచి స్కోర్ సాధించి ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే.. అభ్యర్థులు తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌పై గట్టి పట్టు సాధించాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులో ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించాలి. వాటికి సంబం«ధించి ప్రాథమిక భావనలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అంచనావేయాలి. ఆ మేరకు సాధన చేయాలి. దీంతో పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. దాంతోపాటు వీక్లీ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. సమయ పాలన గేట్ విజయంలో సమయ పాలన ఎంతో ముఖ్యం. ప్రస్తుత సమయంలో విద్యార్థులు రోజుకు కనీసం ఐదారు గంటలు గేట్ ప్రిపరేషన్‌కు కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి.వాస్తవానికి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు.. ఇది కొంత కష్టమైన విషయమే. అయినా సమయం కేటాయించే ప్రయత్నం చేయాలి. గేట్ పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే ఆన్లైన్ పరీక్ష తీరుపై అవగాహన పెంచుకోవాలి. వర్చువల్ కాలిక్యులేటర్ వినియోగం, ఆన్‌స్క్రీన్ ఆన్సర్స్ రికగ్నిషన్ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇందుకోసం వీలైతే ఆన్లైన్ మోడల్ టెస్ట్‌లకు హాజరవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష పాత ప్రశ్న పత్రాల సాధన కూడా గేట్లో విజయానికి దోహదపడుతుంది. అకడమిక్స్ ఆలంబనగా గేట్ విద్యార్థులు అకడమిక్ పుస్తకాలను ఆలంబనగా చేసుకుని ముందడుగేయాలి. ఎందుకంటే.. గేట్ గత ప్రశ్నలు, పరీక్ష తీరుతెన్నులను పరిశీలిస్తే.. అకడమిక్ పుస్తకాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక టాపిక్‌ను చదివేటప్పుడు.. దానికి సంబంధించి పూర్వాపరాలు ఉన్న పుస్తకాలను అధ్యయనం చేయాలి. అంతేకాకుండా ప్రతి అంశానికి సంబంధించి.. మూల భావనలు, కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్‌ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. మలి దశలో ఇలా గేట్ స్కోర్ అనేది.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి తొలి మెట్టు మాత్రమే. తర్వాత దశలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఐఐటీలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశ ప్రక్రియలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆయా ఐఐటీలు పర్సనల్ టాస్క్, గ్రూప్ డిస్కషన్స్ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు.. ఎస్సే రైటింగ్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే అడ్మిషన్ ఖరారవుతోంది. పీఎస్‌యూలు.. మలిదశ గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్ నియామకాలను చేపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు).. మలి దశలో రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్ వంటివి నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గేట్ స్కోర్‌కు 70 శాతం, మలి దశ ఎంపిక ప్రక్రియకు 30 శాతం వెయిటేజీ లభిస్తోంది. స్కోర్ సాధిస్తేనే గేట్లో విజయం ద్వారా ఐఐటీల్లో సీట్లు, పీఎస్‌యూ కాల్స్ ఆశించే అభ్యర్థులు... గేట్లో కనీసం 650కు పైగా స్కోర్ సాధించేందుకు కృషి చేయాలి. పలు ఇన్స్టిట్యూట్లు కనీస కటాఫ్‌ను 600గా నిర్దేశిస్తున్నాయి. తుది ఎంపికలో కోర్ బ్రాంచ్‌లలో ఫైనల్ కటాఫ్ 800 వరకు ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచ్‌ల విద్యార్థులు.. ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి. గేట్–2022 సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2021 ► గేట్ పేపర్ మార్పు, కేటగిరీ, పరీక్ష కేంద్రం మార్పునకు చివరి తేది: నవంబర్ 12, 2021 ► గేట్–2022 ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో రోజుకు రెండు స్లాట్లలో పరీక్ష ఉంటుంది. ► గేట్ పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 17, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, మచిలీపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://gate.iitkgp.ac.in/index.html -
జేఈఈ అడ్వాన్స్డ్: విజయానికి యాభై రోజులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్‌లో చేరడం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కల! తమ స్వప్నం సాకారం దిశగా కసరత్తును ముమ్మరం చేయాల్సిన కీలక సమయం ఆసన్నమైంది! ఎందుకంటే.. జేఈఈ అడ్వాన్స్డ్–2021 తేదీ ఖరారైంది. అక్టోబర్ 3వ తేదీన పరీక్ష జరుగనుంది. అంటే.. పరీక్షకు ఇంకా యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయంలో తమ ప్రిపరేషన్‌కు పదును పెడుతూ.. ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి. అప్పుడే అడ్వాన్స్‌డ్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో సక్సెస్ సాధించేందుకు నిపుణుల ప్రిపరేషన్ గైడెన్స్... విద్యార్థులు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ కోసం కృషి చేస్తుంటారు. వాస్తవానికి పరీక్షకు నెల రోజులు ముందు సాగించే ప్రిపరేషన్ అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. రెండేళ్ల నుంచీ చదువుతున్నాం కదా.. అనే ధీమా ఎంతమాత్రం సరికాదని సూచిస్తున్నారు. ప్రస్తుతం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పరీక్ష రోజు వ్యవహరించాల్సిన తీరు వరకూ.. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అత్యంత శ్రద్ధతో, ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ యాభై రోజుల్లో సాగించే ప్రిపరేషన్ ఐఐటీలకు దారి చూపుతుందని గుర్తించాలి. రివిజన్‌కు ప్రాధాన్యం ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులు వీలైనంత ఎక్కువ సమయం పునశ్చరణకు కేటాయించాలి. 2019తో పోల్చుకుంటే గత ఏడాది, ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే.. అడ్వాన్స్డ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయమే లభించింది. కాబట్టి ఇప్పటికే సీరియస్ అభ్యర్థులంతా సిలబస్ అంశాల ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్‌కు అధిక సమయం కేటాయించడం మేలు. ప్రతి సబ్జెక్ట్–ప్రతి రోజూ ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్ పరంగా.. విద్యార్థులు ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేసేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజూ తమ ప్రిపరేషన్ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని.. పరీక్షలో అడిగే మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)కు కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం నాలుగు గంటల సమయం కేటాయించుకోవాలి. ► ఆయా సబ్జెక్ట్‌కు కేటాయించిన నాలుగు గంటల్లో.. మూడు లేదా మూడున్నర గంటలు రివిజన్, ప్రాక్టీస్ చేయాలి. మిగతా సమయాన్ని ఆ రోజు అప్పటివరకు చదివిన సదరు సబ్జెక్ట్ అంశాల స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తద్వారా సదరు టాపిక్‌లో తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కు పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉందని భావిస్తే.. వాటిలోని ముఖ్యాంశాల(కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు)పై దృష్టి పెట్టాలి. వీలైతే పూర్తి అభ్యసనం.. లేదంటే.. ముఖ్య ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు, సినాప్సిస్కు సమయం కేటాయించాలి. కచ్చితత్వం ఆయా సిలబస్ టాపిక్స్‌పై విద్యార్థులు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. సదరు అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. పూర్తి కచ్చితత్వంతో సమాధానాలు సాధించేలా పట్టు బిగించాలి. అందుకోసం సంబంధిత టాపిక్ నుంచి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి. పలు ప్రశ్నలకు పొరపాటు సమాధానాలు ఇచ్చామని భావిస్తే.. సదరు టాపిక్ కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలి. పాత ప్రశ్న పత్రాలు ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను ఎక్కువగా సాధన చేయాలి. ఫలితంగా సబ్జెక్ట్ నైపుణ్యాలు మెరుగవుతాయి. పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రతి ఏటా ప్రశ్నల శైలిలో మార్పు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. 25 నుంచి 30 వరకూ.. ప్రీవియస్, మోడల్ కొశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేస్తే.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు విజయానికి చేరువయ్యేందుకు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావడం. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షకు ముందు పది రోజుల సమయాన్ని వీలైనంత మేరకు మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. వీటి ఫలితాల ఆధారంగా తమ సామర్థ్యాల విషయంలో అవగాహన పొందాలి. ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు అడ్వాన్స్డ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, సిద్ధాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. అడ్వాన్స్‌డ్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా కాకుండా.. కాన్సెప్ట్ ఆధారితంగా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కాన్సెప్ట్‌లను అవపోసన పడితే.. పరీక్షలో ప్రశ్నలు పరోక్షంగా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రశ్నల సరళి, మార్కింగ్ పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, మార్కింగ్ విధానాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ వారీగా.. ఇలా ► మ్యాథమెటిక్స్: కోఆర్డినేట్ జామెట్రీ, త్రికోణమితి, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, కాంప్లెక్స్ నెంబర్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► కెమిస్ట్రీ: కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫిజిక్స్: ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రిసిటీపై ఎక్కువ దృష్టిపెట్టాలి. మెయిన్‌కు హాజరవుతుంటే జేఈఈ–మెయిన్ మూడు సెషన్లలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు జేఈఈ–మెయిన్ 4వ సెషన్‌కు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు ఈ నెల(ఆగస్టు) 26, 27, 31 తేదీల్లో, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనున్నాయి. ► వీటికి హాజరయ్యే విద్యార్థులకు మెయిన్ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. కాబట్టి ప్రస్తుత సమయంలో వీలైనంత మేరకు అడ్వాన్స్‌డ్‌ను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పరీక్షకు ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇక పూర్తి సమయాన్ని అడ్వాన్స్డ్ రివిజన్‌కు కేటాయించాలి. వారం రోజుల ముందు అడ్వాన్స్డ్ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రాక్టీస్ టెస్టులు, మోడల్టెస్టులు, గ్రాండ్ టెస్ట్‌ల సాధనకు కేటాయించాలి. ఈ సమయంలో కొత్త అంశాలు చదువుదాం.. వాటికి వెయిటేజీ ఎక్కువ ఉంది అనే భావన ఏ మాత్రం సరికాదు. పరీక్ష రోజు కీలకం ► ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. ఎన్ని సంవత్సరాలు కృషి చేసినా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ విజయంలో అత్యంత కీలకంగా మారుతుంది. ► పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం ఆసాంతం చదివేందుకు కనీసం 10 నుంచి పదిహేను నిమిషాలు కేటాయించాలి. ► దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి. ► పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలపాటు గుర్తించిన సమాధానాలు రివ్యూ చేసుకోవాలి. ► సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే.. మార్క్ ఫర్ రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి.. చివరలో సమీక్షించుకోవాలి. అడ్వాన్స్డ్.. ముఖ్యాంశాలు ► ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్ ఓరియెంటెడ్ కొశ్చన్స్ సాధన చేయాలి. ► ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. ► వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ► అన్ని సబ్జెక్ట్‌లలో అన్ని టాపిక్స్‌లో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ► పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లకు సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు.. కేంద్రంలోకి అనుమతించే సమయానికంటే గంట ముందుగా చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ► పరీక్షకు ముందు ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి. ► పరీక్ష హాల్లో.. పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై అందుబాటులో ఉండే కౌంట్‌డౌన్ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి. ► మొదటి పేపర్ పూర్తయిన తర్వాత దాని గురించి మర్చిపోయి రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి. విజయ సాధనాలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే.. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా టాపిక్స్‌ను అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రిపరేషన్ సమయంలోనే సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా.. పరీక్షలో ఏమైనా మార్పులు జరిగినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. – ఆర్.కేదారేశ్వర్, జేఈఈ పోటీ పరీక్షల నిపుణులు -
నీట్(యూజీ) 2021: ఇలా ప్రిపేరయితే విజయం ఖాయం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) –యూజీ–2021.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! గత కొన్ని నెలలుగా.. నీట్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఎట్టకేలకు ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ–2021లో మార్పులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. నీట్–యూజీ–2021 నిర్వహణ తేదీపై సందేహాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్) తాజాగా పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది.దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్షను పెన్–పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు నీట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాయిస్ విధానం నీట్ పరీక్షలో ఈ ఏడాది ఛాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్బీలోని 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. నీట్లో గతేడాది వరకు బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్‌లను కలిపి బయాలజీ విభాగం పేరుతో 90 ప్రశ్నలు అడిగేవారు. కాని ఈ ఏడాది బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సబ్జెక్టులుగా పేర్కొన్నారు. ఒక్కోదాన్ని నుంచి 45 ప్రశ్నలు అడగనున్నారు. రెండు సెక్షన్లు ► మొత్తం నాలుగు సబ్జెక్ట్‌ల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరుగుతుంది. ► ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ పేరుతో రెండు విభాగాలు ఉంటాయి. ► ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్–ఏ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్–బీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. ► సెక్షన్–బీలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ► ప్రతి సబ్జెక్ట్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు అడిగినా.. సెక్షన్–బీలో కల్పించిన ఛాయిస్ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ► అంటే.. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు చొప్పున.. నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన ప్రకారం– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పదమూడు భాషలు నీట్‌ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కోరుకుంటే.. కేవలం ఇంగ్లిష్ ప్రశ్న పత్రం అందిస్తారు. హిందీ కోరుకుంటే.. ఇంగ్లిష్/హిందీ ఇలా రెండు భాషల్లో.. అంటే బైలింగ్వల్ టెస్ట్ బుక్‌లెట్‌ను ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాంతీయ భాషను ఎంచుకుంటే.. సదరు ప్రాంతీయ భాష/ఇంగ్లిష్ బుక్లెట్ అందిస్తారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్.. ఇలా రెండు భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఛాయిస్ కల్పించినా.. పెరగని సమయం ఈ ఏడాది నీట్లో ప్రశ్నల సంఖ్య పెంచి ఛాయిస్ విధానాన్ని కల్పించినా.. పరీక్ష సమయాన్ని పెంచలేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది విద్యార్థులు అదనంగా 20 ప్రశ్నలు చదివి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరీక్షలో సమయాభావానికి దారితీసే ఆస్కారముందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉన్నా.. మొత్తం 15 ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఛాయిస్‌గా వదిలేయాల్సిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకునేందుకు సమయం పడుతుంది. బోటనీ, జువాలజీ వేర్వేరుగా ► బయాలజీ విషయానికొస్తే.. ఈ ఏడాది కొత్తగా బోటనీ, జువాలజీ పేరుతో రెండు ప్రత్యేక సబ్జెక్టులుగా పరీక్ష నిర్వహించనున్నారు. ► బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ► జువాలజీకి సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ► ఫిజిక్స్‌లో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. రివిజన్‌కు ప్రాధాన్యం ► నీట్లో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు సిలబస్‌పై గట్టి పట్టు బిగించాలి. ► ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆయా సబ్జెక్ట్‌ల అభ్యసనం చేయాలి. ► ప్రస్తుత సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► నిర్దిష్ట సమయంలో అవగాహన పొందేలా ముందుకు కదలాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► మోడల్ కొశ్చన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్‌డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు ర్యాపిడ్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది. నీట్–యూజీ(2021) సమాచారం ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2021 (మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు) ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: డిసెంబర్ 31 నాటికి కనిష్ట వయోపరిమితి 17ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25ఏళ్లు ఉండాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 13 నుంచి ఆగస్ట్ 6 వరకు. ► ఆన్లైన్లో దరఖాస్తులో సవరణ అవకాశం: ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 12 వరకు. ► పరీక్ష కేంద్రం కేటాయింపు ప్రకటన: ఆగస్ట్ 20, 2021. ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in ఈజీ టు డిఫికల్ట్ పరీక్ష రోజున అభ్యర్థులు తొలుత ప్రశ్న పత్రం చదివేందుకు పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. ఛాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలను అర్థం చేసుకొని.. తమకు కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా సులభమైన ప్రశ్నలతో సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి. ప్రిపరేషన్ పరంగా.. ఎక్కువ సమయం రివిజన్‌కు కేటాయించాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరై తమ సామర్థ్యం స్థాయి తెలుసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. – బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు -
ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్
దేశ రక్షణ దళాల్లో చేరడం చాలా మంది యువత కల. సైనిక దళాల్లో సవాళ్లతో కూడిన ఉజ్వల కెరీర్‌కు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (ఎన్డీఏ). ఇందులో అర్హత సాధిస్తే.. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి హోదాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. దేశ రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి హోదాను పొందొచ్చు. సరైన ప్రణాళిక..పట్టుదలతో ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమయితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. 2021 ఏడాదికి గాను ఎన్డీఏ పరీక్షను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమ్యే అభ్యర్థులకు కోసం ఎగ్జామ్ టిప్స్... ఏటా రెండుసార్లు ► త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు, శిక్షణ ప్రక్రియను చేపట్టడానికి ఎన్డీఏను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఎన్డీఏ సువర్ణావకాశం. ► ఇంటర్/10+2 పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్డీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ 2021 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 900 మార్కులకు రాత పరీక్ష ఎన్డీఏ పరీక్ష ఏప్రిల్ 18న ఆఫ్‌లైన్‌లో జరుగనుంది. పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్– 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ–600 మార్కులు (ఇంగ్లిష్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్) పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 2.30 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. వ్యూహాత్మక ప్రిపరేషన్ ► పరీక్షకు నెల రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. ముఖ్యమైన టాపిక్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ► గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం.. మాక్ టెస్టులను రాయడం వంటివి చేయాలి. ► మ్యాథమెటిక్స్‌కు సంబంధించి షార్ట్ ట్రిక్స్‌ను ఉపయో గించి ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయాలి. ఇచ్చిన టైమ్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా మ్యాథమెటిక్స్ విభాగంపై దృష్టి పెట్టాలి. ► పేపర్–2కు సంబంధించి ఇంగ్లిష్‌లో 40శాతం వెయిటేజీని కవర్ చేసేవిధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఇందుకోసం న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్, వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు. ► పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్లపై పట్టు పెంచుకోవాలి. ► జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ► కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అవార్డులు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ► ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన రోజుల (ప్రముఖుల పుట్టిన తేదీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన రోజులు)గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ►ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ 900 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా స్టేజ్–1,2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్–2కు అనుమతిస్తారు. ►స్టేజ్–1: ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), వెర్బల్–నాన్ వెర్బల్ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు. ►స్టేజ్–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్‌లో జీడీ, జీపీఈ,పీజీటీ, హెచ్జీటీ, ఐఓటీ, కమాండ్ టాస్క్, షేక్ రేస్, ఇండివిడ్యువల్ లెక్చర్, ఎఫ్జీటీ వంటివి ఉంటాయి. ►సైకాలజీ టెస్ట్ : థిమాటిక్ అప్రెషన్ టెస్ట్(టీఏటీ), వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిచ్యూవేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్ఆర్టీ), సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్డీ) వంటి వాటితోపాటు కాన్ఫరెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ►పైన పేర్కొన్న రెండు స్టేజ్ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు జరిపి.. మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ►ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్ష. కాబట్టి అభ్యర్థులు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ► అభ్యర్థుల వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని పరీక్షించే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి. హైదరాబాద్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్ -
మార్కెట్లోకి ‘సాక్షి’ టెన్త్‌క్లాస్ బుక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థుల కోసం ‘సాక్షి’ రూపొందించిన టెన్త్‌క్లాస్ బుక్లెట్లు విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్షలాది విద్యార్థుల ప్రయోజనార్థం ‘సాక్షి’.. ఆంగ్లం, గణితశాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో మొత్తం పది బుక్లెట్లను ప్రచురించింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్ మీడియంలోనూ అందుబాటులోకి తెచ్చింది. ఈ పుస్తకాల్లో ప్రారంభంలో ఇచ్చిన ప్రిపరేషన్ గెడైన్స్ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంపొందిస్తుంది. దీంతోపాటు ప్రతి అధ్యాయం పరిచయం, ముఖ్య నిర్వచనాలు, సూత్రాలు, 1, 2, 4, 5 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు, జతపర్చడం, క్విక్ రివ్యూ, బ్లూప్రింట్, ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఒక్కో బుక్లెట్ ధర రూ.30 మాత్రమే. ఏ గ్రేడ్ సాధించాలనుకునే ప్రతి విద్యార్థీ కచ్చితంగా చదవాలనే రీతిలో, నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో తీర్చిదిద్దిన ఈ పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గతేడాది తెలుగు మీడియంలో రూపొందించిన పుస్తకాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి విశేష ఆదరణ లభించింది.