ప్రతీకాత్మక చిత్రం
దేశ రక్షణ దళాల్లో చేరడం చాలా మంది యువత కల. సైనిక దళాల్లో సవాళ్లతో కూడిన ఉజ్వల కెరీర్‌కు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (ఎన్‌డీఏ). ఇందులో అర్హత సాధిస్తే.. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి హోదాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. దేశ రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి హోదాను పొందొచ్చు. సరైన ప్రణాళిక..పట్టుదలతో ఎన్‌డీఏ పరీక్షకు సన్నద్ధమయితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. 2021 ఏడాదికి గాను ఎన్‌డీఏ పరీక్షను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమ్యే అభ్యర్థులకు కోసం ఎగ్జామ్ టిప్స్...
ఏటా రెండుసార్లు
► త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు, శిక్షణ ప్రక్రియను చేపట్టడానికి ఎన్‌డీఏను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఎన్‌డీఏ సువర్ణావకాశం.
► ఇంటర్/10+2 పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్‌డీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్‌డీఏ 2021 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
900 మార్కులకు రాత పరీక్ష
ఎన్‌డీఏ పరీక్ష ఏప్రిల్ 18న ఆఫ్‌లైన్‌లో జరుగనుంది. పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్– 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ–600 మార్కులు (ఇంగ్లిష్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్) పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 2.30 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది.
వ్యూహాత్మక ప్రిపరేషన్
► పరీక్షకు నెల రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. ముఖ్యమైన టాపిక్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి.
► గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం.. మాక్ టెస్టులను రాయడం వంటివి చేయాలి.
► మ్యాథమెటిక్స్‌కు సంబంధించి షార్ట్ ట్రిక్స్‌ను ఉపయో గించి ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయాలి. ఇచ్చిన టైమ్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా మ్యాథమెటిక్స్ విభాగంపై దృష్టి పెట్టాలి.
► పేపర్–2కు సంబంధించి ఇంగ్లిష్‌లో 40శాతం వెయిటేజీని కవర్ చేసేవిధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఇందుకోసం న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్, వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు.
► పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్‌లపై పట్టు పెంచుకోవాలి.
► జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి.
► కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అవార్డులు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి.
► ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన రోజుల (ప్రముఖుల పుట్టిన తేదీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన రోజులు)గురించి తెలుసుకోవాలి.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ
►ఎన్‌డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ 900 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా స్టేజ్–1,2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్–2కు అనుమతిస్తారు.
►స్టేజ్–1: ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), వెర్బల్–నాన్ వెర్బల్ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు.
►స్టేజ్–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్‌లో జీడీ, జీపీఈ,పీజీటీ, హెచ్‌జీటీ, ఐఓటీ, కమాండ్ టాస్క్, షేక్ రేస్, ఇండివిడ్యువల్ లెక్చర్, ఎఫ్‌జీటీ వంటివి ఉంటాయి.
►సైకాలజీ టెస్ట్ : థిమాటిక్ అప్రెషన్ టెస్ట్(టీఏటీ), వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిచ్యూవేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్‌ఆర్‌టీ), సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్‌డీ) వంటి వాటితోపాటు కాన్ఫరెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
►పైన పేర్కొన్న రెండు స్టేజ్‌ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు జరిపి.. మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
►ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్ష. కాబట్టి అభ్యర్థులు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది.
► అభ్యర్థుల వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని పరీక్షించే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment