National Defence Academy
-
సిక్కోలు కుర్రాడు.. కలల కొలువు సాధించాడు ఇలా..
చిన్నతనంలోనే ఉన్నత లక్ష్యం పెట్టుకున్నాడు. అకుంఠిత దీక్షతో ప్రణాళికాబద్ధంగా చదివాడు. చివరికి అనుకున్నది సాధించాడు.. సిక్కోలు కుర్రాడు కమల్ సుహాస్. దీక్ష, పట్టుదల ఉంటే ఎంత కష్టమైనా సాధించవచ్చని నిరూపిస్తూ అత్యంత కఠినమైన ఎన్డీయేలో మూడేళ్ల కఠోర శిక్షణను పూర్తి చేసి భారత సైన్యంలో నేరుగా లెఫ్టినెంట్ అధికారి హోదాలో సేవలకు సిద్ధమై జిల్లా కీర్తిని ఇనుమడింప జేశాడు. సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడీ కుర్రాడు. ఆర్మీపై బాల్యం నుంచే ప్రేమను పెంచుకున్న సిక్కోలు యువకుడు మునుకోటి కమల్ సుహాస్ తన కలల కొలువును కష్టపడి సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి తోడు అకుంఠితమైన దీక్ష, పట్టుదలకు నిరంతర సాధన తోడుగా లక్ష్యాన్ని ఛేదించాడు. సైనిక్ స్కూల్లో చేరి అటు చదువుతోపాటు ఇటు ఆర్మీ సన్నద్ధతపై ప్రత్యేకంగా దృష్టిసారించాడు. యూపీఎస్సీ ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో ఆలిండియా 202 ర్యాంకు సాధించి శభాష్ అనిపించాడు. ఎయిర్‌ఫోర్స్ అవకాశాన్ని వదులకుని ఆర్మీని తన ఛాయిస్‌గా ఎంచుకున్న సిక్కోలు తేజం మూడేళ్లపాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకుని పోస్టింగ్‌కు సిద్ధమయ్యాడు. కమల్ సుహాస్ తన 20 ఏళ్ల ప్రాయంలోనే.. 2023 జనవరి 5వ తేదీన డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలటరీ అకాడమీలో ఆర్మీ లెఫ్టినెంట్ హాదాలో విధుల్లో చేరనున్నాడు. ఇల్లిసిపురం నుంచి డెహ్రాడూన్ వరకు.. శ్రీకాకుళం నగరంలోని ఇల్లిసుపురంలోని భద్రమ్మగుడి సమీపంలోని నివాసం ఉంటున్న మునుకోటి ఉమాశంకర్, మాధవి దంపతుల కుమారుడు కమల్ సుహాస్. తండ్రి ఉమాశంకర్ పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్ హోదాలో శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్‌గా పనిచేస్తుండగా, తల్లి మాధవి వ్యాపారం చేస్తున్నారు. కమల్ అక్క హర్షిత అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు. చిరుప్రాయంలోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కమల్ అందుకు సైనిక్ స్కూల్ దోహదపడుతుందని భావించి ప్రవేశ పరీక్ష రాశాడు. టాప్ మార్కులు సాధించి విజయనగరంలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 6వ తరగతిలో చేరాడు. అక్కడ సీబీఎస్సీ సిలబస్‌తో 6వ తరగతి నుంచి +12(ఇంటర్) వరకు చదువుకున్నాడు. అదే సమయంలో ఆర్మీపై ప్రత్యేకంగా దృష్టిసారించిన కమల్ పోటీపరీక్షలకు సైతం సన్నద్ధమయ్యాడు. చదువులోను టాపర్‌గా నిలుస్తూ వచ్చాడు. 10వ తరగతిలో 98 శాతం ఉత్తీర్ణతను సాధించిన కమల్ +12లోను 98 శాతం ఉత్తీర్ణత, మ్యాథ్స్‌లో 100 మార్కులు సాధించి శభాష్ అనిపించాడు. ఎన్డీఏ పరీక్షలో బెస్ట్ ర్యాంకు సాధించి.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష 2019లో జరిగింది. ఆలిండియా స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షలో మునుకోటి కమల్ సుహాస్ 202వ ర్యాంకు సాధించి జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచాడు. అయితే త్రివిధ దళాలను ఎంచుకునే క్రమంలో కమల్‌కు ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా అవకాశం లభించినప్పటికీ.. తన చిరకాల కోరికైన ఆర్మీనే తన బెస్ట్ ఛాయిస్‌గా ఎంచుకున్నాడు. అనంతరం పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్లపాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కమల్ సుహాస్ పోస్టింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు. 2023 జనవరి 5వ తేదీన డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరనున్నాడు. చిన్ననాటి కల నెరవేర్చుకున్నాడు.. ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరనున్న కుమారుడి తల్లిదండ్రులుగా మా సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. చాలా గర్వంగా ఉంది. మా కుమారుడు చిన్నప్పుడే దేశానికి సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇండియన్ ఆర్మీ వాడి కల. అందుకోసం సైనిక్ స్కూల్లో చదువుతున్న సమయంలోనే యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమై అని విభాగాల్లో మెరిట్ సాధించాడు. వచ్చేనెల 5వ తేదీన విధుల్లో చేరబోతున్నాడు. దేశ రక్షణలో మమేకం అవ్వబోతున్నాడు. – మునుకోటి కమల్ సుహాస్ తల్లిదండ్రులు ఉమాశంకర్, మాధవి అభినందించిన కలెక్టర్.. సోమవారం మునుకోటి కమల్ సుహాస్‌ను కలె క్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ ఆర్మీలో సిపాయిలతోపాటు ఉన్నతస్థాయి హోదాలో ఉద్యోగం చేసే అవకాశం సిక్కోలు సొంతం చేసుకోవడం జిల్లాకు గర్వకారణంగా ఉందని కలెక్టర్ అభినందించారు. అలాగే నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ కె.వెంకట్ ఉజ్వల్, సెట్‌శ్రీ సీఈఓ బీవీ ప్రసాదరావు, ఎన్సీసీ అధికారులు, స్థానిక డిఫెన్స్ అకాడమీ సంస్థల ప్రతినిధులు అభినందించారు. -
భారత తొలి ముస్లిం ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ చెందిన ఓ టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచింది. దీంతో ఆమె భారత్‌లోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా కానున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పేర్కొంది. ఆమె ఫైటర్ పైలట్‌గా ఎంపికవ్వడానికి ముందుగా నాలుగేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉందని ఐఏఎఫ్ తెలిపింది. ఈ మేరకు ఆమె ఎన్డీఏలో చేరి అకాడమీ కోర్సుగా ఫైటర్ పైలట్ స్ట్రీమ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో వైమానిక దళం ఆమె కల నిజమవ్వాలంటూ.. సానియాకు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఎన్డీఏ ఎగ్జామ్‌లో 149వ ర్యాంకును సాధించింది. హిందీ మీడియంలో చదివినా విజయం సాధించవచ్చని నిరూపించింది సానియా. తాను తొలి మహిళా పైలట్ అవనీ చతుర్వేదిని చూసి ప్రేరణ పొంది రెండో ప్రయత్నంలో ఎన్డీఏలో విజయం సాధించినట్లు సానియా పేర్కొంది. (చదవండి: సోనియా వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్ఖర్) -
అ అంటే.. అమ్మ.. ఆ అంటే... ఆర్మీ.. ‘ఎన్డీయే’ ఎగ్జామ్ టాపర్ ఈమె!
‘డిఫెన్స్ అకాడమీలో అమ్మాయిలా?’ అనే అజ్ఞాత ఆశ్చర్యం మొన్న. ‘అమ్మాయిలు అద్భుతమైన విజయాలు సాధించగలరు’ అనే ఆత్మవిశ్వాసం నిన్న. ‘అవును. అది నిజమే’ అని చెప్పే వాస్తవం ఇవ్వాళ... ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అనేది ఎంత వాస్తవమో తెలియదుగానీ, భవిష్యత్ లక్ష్యాలను ఏర్పర్చుకోవడంలో ఇంటి వాతావరణం బలమైన ప్రభావం చూపుతుందని బలంగా చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా షానన్ ధాకను సగర్వంగా చూపవచ్చు. షానన్ది హరియాణాలోని రోహ్తక్ ప్రాంతంలోని సుందన గ్రామం. ఆ కుటుంబానికి చెందిన మూడు తరాల వారు ఆర్మీలో ఉండడం విశేషం. తాత చంద్రభాను ధాక ఆర్మీలో సుబేదార్. తాతయ్య తనకు ‘ఆర్మీ కథలు’ చెప్పేవాడు. అవి కల్పిత కథలు కాదు. నిజజీవిత కథలు. సాహసజ్వాలను తట్టిలేపే కథలు. నాన్న విజయ్‌కుమార్ ఆర్మీలో నాయక్ సుబేదార్. చిన్నప్పుడు తాను ఏదైనా సందర్భంలో భయపడితే... ‘మనది ఆర్మీ ఫ్యామిలీ. అలా భయపడవచ్చా!’ అని ధైర్యం చెప్పేవాడు....ఇలా తనకు తెలియకుండానే ‘ఆర్మీ’ అంటే ఇష్టం ఏర్పడింది. అదొక బలమైన ఆశయం అయింది. PC: The Indian Express ‘భవిష్యత్‌లో నువ్వు ఏంకావాలనుకుంటున్నావు?’ అని టీచర్ అడిగితే తనతో పాటు చాలామంది ‘సోల్జర్’ అని చెప్పేవారు. అయితే తాను తప్ప అలా చెప్పిన వారెవరూ ఆ తరువాత కాలంలో ఆర్మీ గురించి ఆలోచించలేదు. వేరే చదువుల్లోకి వెళ్లిపోయారు. తల్లి గీతాదేవి గృహిణి. ‘నేను ఆర్మీలో పనిచేస్తాను’ అని ఆమెతో అన్నప్పుడు– ‘శభాష్’ అని భుజం తట్టడం తప్ప– ‘ఆడపిల్లలు సైన్యంలో ఎందుకు తల్లీ’ అని ఏరోజూ చిన్నబుచ్చలేదు. అక్క ఆర్మీలో నర్స్‌గా పనిచేస్తోంది. రూర్కి, జైపుర్, చండీమందిర్(పంచ్‌కుల) ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో చదువుకుంది షానన్. తాను నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష గురించి ప్రిపేరవుతున్న సమయంలో ‘సీటు రావడం అంతా ఈజీ కాదు’ అనే ఒకేఒక్క మాట తప్ప మరేది వినిపించలేదు. కానీ ఆ మాటలను మనసులోకి తీసుకోకుండా ఎన్డీఏ పరీక్షలో మెరిట్ జాబితాలో ఆల్ ఇండియా ర్యాంక్(ఏఐఆర్) దక్కించుకొని అమ్మాయిల విభాగంలో టాప్‌లో నిలిచింది. ఎప్పుడు సమయం దొరికినా కుటుంబంతో కలిసి సొంత గ్రామం సుందనకు వెళుతుంటుంది షానన్. ఆ ఊరివాళ్లు చిన్నప్పుడు ఆమెను ‘ఆర్మీ ఆఫీసర్’ అని పిలిచేవారు. వారి ఆత్మీయ పిలుపు నిజం కాబోతుంది. ‘సైన్యంలో ఉన్నత స్థాయిలోకి చేరాలనేది నా కల’ అంటుంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ గర్ల్ కెడెట్స్ ఫస్ట్ బ్యాచ్‌లో భాగం అవుతున్న షానన్. షానన్‌తో పాటు మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన దివ్యాన్షి సింగ్, కనిష్క గుప్తాలకు కూడా అలాంటి కలలే ఉన్నాయి. బిహార్‌లోని చిన్న పట్టణానికి చెందిన దివ్యాన్షిసింగ్ ‘మెరిట్ జాబితాలో చోట సంపాదించడం నాలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ఇది భవిష్యత్ విజయాలకు పునాది అవుతుందని ఆశిస్తున్నాను’ అంటుంది. ‘కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు...అనే మాటను చాలాసార్లు విన్నాను. ఇప్పుడు మాత్రం కష్టపడడం ద్వారా వచ్చే ఫలితాన్ని స్వయంగా చూశాను’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన కనిష్క గుప్తా. నిజానికి వారి కుటుంబంలో, బంధువులలో ఆర్మీలో పనిచేసిన వారు ఎవరూ లేరు. చిన్న వ్యాపార కుటుంబం వారిది. ‘గతంతో పోల్చితే ఎన్డీఏపై అమ్మాయిలు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంట్లో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇది శుభపరిణామం’ అంటున్నారు ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేసిన అశోక్ శర్మ. చదవండి: Monica Khanna: ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక.. 185 మందిని కాపాడి -
వాయుసేనాధిపతిగా వీఆర్ చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: భారత వైమానిక దళం నూతన చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వైస్ చీఫ్‌గా ఉన్న ఆయన గురువారం మధ్యాహ్నం ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా నుంచి బాధ్యతలు చేపట్టారు. దీంతో వీఆర్ చౌదరి దేశ 27 వ ఎయిర్ స్టాఫ్ చీఫ్ అయ్యారు. వీఆర్ చౌదరి పూర్తి పేరు వివేక్ రామ్ చౌదరి. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పూర్వ విద్యార్థి. అంతేగాక డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. కాగా ఈ ఏడాది జూలై 1న, వైమానిక దళంలో రెండవ అతి ముఖ్యమైన స్థానం అయిన వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా స్థానంలో చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన విధులను బాధ్యతతో నిర్వహిస్తానని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ భద్రతను, సార్వభౌ మత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆయుధాలకు కొత్త ఆయుధాలను జత చేయడం, కొత్త వేదికలను ఉపయోగించుకోవడం తన ప్రాధామ్యమని తెలిపారు. అయితే గురువారం వాయుసేన అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన చౌదరి మూడేళ్ల పాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ పదవిలో ఉండనున్నారు. (చదవండి: లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..) వాయుసేనలో బాధ్యతలు 1982 డిసెంబర్లో వివేక్ రామ్ చౌదరి ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్ట్రీమ్‌లో ఫైటర్ పైలట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత మిగ్ –21, మిగ్ –23 ఎమ్ఎఫ్, మిగ్–29, సు–30 ఎమ్కేఐ వంటి యుద్ధ విమానాలను నడిపారు. 3,800 గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది. ప్రస్తుతం వాయుసేన చీఫ్ అయ్యేముందు ఎయిర్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా, తూర్పు కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేశారు. జూలైలో ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ కావడానికి ముందు, పాకిస్తాన్, చైనాతో సరిహద్దులలోని కొన్ని ప్రాంతాల భద్రతకు బాధ్యత వహించే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు కమాండర్–ఇన్–చీఫ్‌గా పనిచేశారు. తూర్పులద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సమయంలోనే వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ వివేక్ చౌదరిని నియమించారు. అంతేగాక గతంలో ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ సఫేద్ సాగర్ వంటి ఎయిర్ ఫోర్స్ చేపట్టిన కొన్ని ముఖ్యమైన మిషన్లలో చౌదరి భాగస్వాములయ్యారు. గతంలో ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ డిప్యూటీ కమాండెంట్‌గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహించారు. (చదవండి: వరుస సంక్షోభాలు.. చైనాకు భారీ దెబ్బే: గోల్డ్‌మన్ సాక్స్) -
నేషనల్ డిఫెన్స్ పరీక్షలో అవివాహిత మహిళలకు చాన్స్
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నావల్ అకాడమీ పరీక్షకు అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం యూపీఎస్సీ ఒక ప్రకటనలో వివరించింది. జాతీయత, వయస్సు, విద్య తదితర అంశాల్లో అర్హులైన అవివాహిత మహిళలు ఈనెల 24 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే upsconline.nic.inలో పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. మహిళా అభ్యర్థులకు పరీక్ష దరఖాస్తు రుసుము ఉండదని తెలిపింది. శారీరక దారుఢ్య ప్రమాణాలు, ఖాళీల సంఖ్యపై రక్షణ శాఖ నుంచి వివరాలు అందాక నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది. పరీక్ష నవంబర్ 14వ తేదీన ఉంటుందని వివరించింది. -
NDA Exam: మహిళల ఆశలను అడ్డుకోలేం.. పరీక్ష నిర్వహించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష ఈ ఏడాది నిర్వహించలేమని ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నవంబర్ 14న మహిళా అభ్యుర్థులకు ఎన్డీఏ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. బుధవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కిషన్ విచారణ చేపట్టారు. వచ్చే ఏడాది నుంచి పరీక్ష నిర్వహిస్తామనటం సరికాదని, అలా చెప్పడం వారి ఆశలను అడ్డుకోవడం అవుతుందని అన్నారు. ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఎన్డీఏ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మహిళా అభ్యర్థుల నమ్మకం, ఆశలను అడ్డుకోలేమని సుప్రీం కోర్డు పేర్కొంది. త్రివిధ దళాల్లో మహిళలను ఎంపిక చేస్తామని రక్షణా శాఖ ఇటీవల అఫిడవిట్ విడుదల చేసింది. అయితే మహిళా అభ్యర్థుల త్రివిధ దళాలకు సంబంధించి ఎన్డీఏ క్యాడెట్ శిక్షణ, మౌలిక సదుపాయాలు అందించే విషయంపై ప్రవేశపరీక్షను వచ్చే ఏడాది నుంచి నిర్వహిస్తామని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
డిఫెన్స్ అకాడెమీలోకి మహిళలు..
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు మంగ ళవారం తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణను సజావుగా జరిపేందుకు అవసరమైన చర్యలను చేపడుతు న్నట్లు చెప్పింది. మూడు రకాల రక్షణ బలగాల్లో మహిళలను ప్రవేశపెట్టనున్న ట్లు పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రక్షణ శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. పురుష అభ్యర్థులకు ఉన్నట్లే మహిళా అభ్యర్థులకు కూడా ఎత్తు, బరువు వంటి భౌతిక పరామితులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఆ పరామితులను నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. -
ఎన్డీఏలో ఇక మహిళా శక్తి
సాక్షి, న్యూఢిల్లీ: త్రివిధ బలగాల్లో ఇక మహిళా శక్తి తమ సత్తా చాటనుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లోకి మహిళల్ని చేర్చుకోవడానికి త్రివిధ బలగాల అధిపతులు తమంతట తాముగా నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ ప్రవేశ పరీక్ష రాయడానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి మరికాస్త సమయం పడుతుందని బుధవారం సుప్రీం దృష్టికి తీసుకువెళ్లింది. ‘‘త్రివిధ బలగాల అధిపతులు మహిళల్ని ఎన్డీఏలో చేర్చాలని నిర్ణయించాయి. ఏ రంగంలోనైనా సంస్కరణలు ఒక్క రోజులు జరగవు. మహిళల్ని చేర్చుకోవడానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేంద్రానికి మరింత సమయం పడుతుంది’’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సుప్రీంకు చెప్పారు. ఒకసారి ఎన్డీఏలో చేరిన వారు అక్కడ నుంచి శాశ్వత కమిషన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది ఎన్డీఏలోకి మహిళలను తీసుకోకపోవడం వివక్షనేనంటూ కుశా కుర్లా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం గతంలో విచారణ జరిపి ఈ ఏడాది నవంబర్ 14న జరగనున్న ఎన్డీఏ ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్రం త్రివిధ బలగాలతో చర్చించిన మీదట మహిళల్ని చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది నవంబర్ 14న జరగనున్న ఎన్డీఏ ప్రవేశ పరీక్ష నుంచి మహిళలకు మినహాయింపునివ్వాలని దీనిపై ఇంకా విధివిధానాలు రూపొందించాలని కేంద్రం కోరింది. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు సాయుధ బలగాల్లో సమానత్వంపై త్రివిధ బలగాలే ముందడుగు వేసి నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు ఆదేశించే పరిస్థితులు తెచ్చుకోకూడదని వ్యాఖ్యానించింది. ఈ నెల 20లోగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 22కి వాయిదా వేసింది. -
కేంద్రం కీలక నిర్ణయం: ఎన్డీఏలో మహిళల ప్రవేశాలకు అనుమతి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళలకు ప్రవేశం కల్పించడానికి త్రివిధ దళాల అధిపతులు అంగీకరించినట్లు కేంద్రం ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళలు ఎన్డీఏ కోర్సులు అభ్యసించేలా మార్గదర్శకాలను రూపొందించడానికి తగిన సమయం అవసరమని కేంద్రం పేర్కొంది. ఎన్డీఏ పరీక్షలకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీం కోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు మహిళలను ఎన్డీఏ పరీక్షకు అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుసరిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, బుధవారం కోర్టుకు వివరణ ఇస్తూ...."నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఇవ్వాలని కేంద్రం, త్రివిద దళాలు అంగీకరించాయి. ఇది చాలా గొప్ప వార్త. దీనికి సంబంధించిన పూర్తి అఫిడవిట్ని అందజేస్తాం. జూన్ 24న జరగాల్సిన ఎగ్జామ్ నవంబర్ 14కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రవేశాలు యథాతథంగా జరిగేలా చేయండి" అని ధర్మాసనాన్ని కోరారు.(చదవండి: ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం) ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సాయుధ దళాలలు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో తమకెంతో ఆనందం కలిగించిందని పేర్కొంది. మహిళలు ఎన్డీఏ కోర్సలు చేసేలా మార్గం సుగమం చేయడానికి ప్రభుత్వానికి తగిన సమయం పడుతుందని..అలాగే ఒక్కరోజులో సంస్కరణలు తీసుకురాలేమని ధర్మాసనం వెల్లడించింది. దేశ సంరక్షణలో సాయుధ దళాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి అత్యున్నత శాఖ లింగ వివక్షతకు తావివ్వకుండా...లింగ సమానత్వం కోసం కృషి చేయాలంటూ ..జస్టీస్ ఎస్కే కౌల్, జస్టీస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం కోరింది. చదవండి: ‘ఆలస్యానికి మా బాధ్యత లేదు’ రైల్వేశాఖపై సుప్రీంకోర్టు ఫైర్ -
ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం
న్యూఢిల్లీ: లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 5న జరుగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను బుధవారం ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది. ఎన్డీఏతోపాటు నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలను రాసే అవకాశాన్ని మహిళలకు సైతం కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కుశ్ కాల్రా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషనర్ వినతి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. మహిళలకు ఎన్డీఏ అడ్మిషన్ టెస్టు రాసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, దీని గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. సైన్యం, నావికా దళంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని తాము గతంలో తీర్పులిచ్చామని, అయినా ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలు సైన్యంలోకి అడుగు పెట్టేందుకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీ వంటి మార్గాలు ఉన్నాయని ఐశ్వర్య భాటీ చెప్పారు. మరి ఎన్డీఏ ద్వారా మహిళలు సైన్యంలోకి ఎందుకు ప్రవేశించవద్దు, కో–ఎడ్యుకేషన్ ఏమైనా సమస్యా? అని ధర్మాసనం నిలదీసింది. ఎన్డీఏలోకి మహిళలను అనుమతించకూడదు అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని భాటీ బదులిచ్చారు. -
మహిళలకు అవకాశం కల్పించిన సుప్రీం కోర్టు
-
ఇంటర్‌తోనే.. కొలువు + చదువు
ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. ఉన్నత కొలువుతోపాటు చదువు కూడా కొనసాగించాలనుకునే వారికి చక్కటి అవకాశం.. యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎగ్జామినేషన్! ఈ పరీక్షలో ప్రతిభ చూపితే త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో ఉన్నత ఉద్యోగం లభిస్తుంది! 21 లేదా 22ఏళ్ల వయసులోనే.. త్రివిధ దళాల్లో అడుగుపెట్టి.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు!! శిక్షణ సమయంలోనే నెలకు రూ.56వేలకుపైగా అందుకోవచ్చు. తాజాగా ఎన్డీఏ,ఎన్ఏ(2)–2021కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. ఎన్డీఏ, ఎన్ఏ వివరాలు, పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్, శిక్షణ, కెరీర్ స్కోప్‌పై ప్రత్యేక కథనం.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీలను సంక్షిప్తంగా ఎన్డీఏ, ఎన్ఏగా పేర్కొంటారు. ఉత్సాహవంతులైన, సాహసవంతులైన యువతను త్రివిధ దళాలకు ఎంపిక చేసే ఉద్దేశంతో యూపీఎస్సీ ఏటా రెండుసార్లు ఎన్డీఏ, ఎన్ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ఎన్డీఏ, ఎన్ఏ అకాడమీల్లో శిక్షణ పూర్తయ్యాక ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్ అకాడమీలలో పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు.. ఒకే సమయంలో కొలువుతోపాటు బీఏ/బీఎస్సీ/బీటెక్ పట్టాను సొంతం చేసుకునేందుకు మార్గం ఎన్డీఏ, ఎన్ఏ పరీక్ష. ► మొత్తం ఖాళీల సంఖ్య: 400 ► నేషనల్ డిఫెన్స్ అకాడెమీ: 370 (ఆర్మీ–208; నేవీ–42; ఎయిర్ ఫోర్స్–120) ► నేవల్ అకాడమీ:10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్:30 ► ఎయిర్ ఫోర్స్ అకాడమీకి కేటాయించిన ఖాళీ ల్లో 28 ఖాళీలను గ్రౌండ్ డ్యూటీ విభాగంలో భర్తీ చేస్తారు. అర్హతలు ► ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులవ్వాలి. ► ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్లతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► వయోపరిమితి: జనవరి 2,2003–జనవరి 1, 2006 మధ్యలో జన్మించి ఉండాలి. రెండంచెల ఎంపిక ప్రక్రియ ► ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. ముందుగా యూపీఎస్సీ.. ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకొని.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి తదుపరి దశలో ఎస్ఎస్బీ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్–పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి. పేపర్ 1–మ్యాథమెటిక్స్–300 మార్కులకు; పేపర్ 2–జనరల్ ఎబిలిటీ టెస్ట్–600 మార్కులకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. ► జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో.. పార్ట్–ఎలో ఇంగ్లిష్ 200 మార్కులకు; పార్ట్–బీలో 400 మార్కులకు జనరల్ నాలెడ్జ్ పరీక్ష ఉంటుంది. ► పేపర్–2 పార్ట్–బిలో మొత్తం ఆరు విభాగాలు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ; కరెంట్ ఈవెంట్స్) నుంచి ప్రశ్నలడుగుతారు. ఫిజిక్స్‌కు 25 శాతం; కెమిస్ట్రీకి 15శాతం, జనరల్ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ,స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం, కరెంట్ ఈవెంట్స్‌కు పది శాతం వెయిటేజీ ఉంది. పేపర్–1, పేపర్–2లలో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు. మలి దశ.. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో విజయం సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలిదశలో 900 మార్కులకు ఎస్ఎస్బీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ► అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలు, రాత పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా.. ఎస్ఎస్బీ(సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్ విభాగాన్ని ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాలి. ► ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్ట్, వెర్బల్ టెస్ట్, నాన్ వెర్బల్ లెస్ట్, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధగా పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం అయిదు రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్డీఏ, ఎన్ఏలో శిక్షణ ఎన్డీఏ, ఎన్ఏ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు వారు ఎంచుకున్న విభాగం ఆధారంగా శిక్షణ ఉంటుంది. తొలుత నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మూడేళ్లపాటు శిక్షణ ఇస్తారు. మొదటి రెండున్నర సంవత్సరాలు అన్ని విభాగాల అభ్యర్థులకు ఉమ్మడి శిక్షణ ఉంటుంది. చివరి ఆరు నెలలు అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ–ఢిల్లీ.. బీఏ, బీఎస్సీ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) డిగ్రీలను అందిస్తుంది. ఎయిర్‌ఫోర్స్, నేవల్ విభాగాలను ఎంచుకున్న వారికి బీటెక్ పట్టా లభిస్తుంది. నేవల్ అకాడెమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ ఎన్ఏ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్ సర్టిఫికెట్ అందిస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ ఎన్డీఏలో మూడేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎంపికైన విభాగంలో మళ్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆర్మీ క్యాడెట్లకు ఐఎంఏ(డెహ్రాడూన్), నేవీ క్యాడెట్స్‌కు నేవల్ అకాడమీ(ఎజిమల), ఎయిర్‌ఫోర్స్ క్యాడెట్లకు ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(హైదరాబాద్)లలో ఫీల్డ్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో రూ.56,100 స్టయిఫండ్‌గా లభిస్తుంది. ఫీల్డ్ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి రూ.56,100–1,77,500 వేతన శ్రేణితో కెరీర్ ప్రారంభం అవుతుంది. ప్రాథమికంగా ఆర్మీ విభాగంలో లెఫ్ట్‌నెంట్, నేవీ విభాగంలో సబ్ లెఫ్ట్‌నెంట్, ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ఫ్లయింగ్ ఆఫీసర్ కేడర్‌తో కెరీర్ ప్రారంభమవుతుంది. రాత పరీక్షలో విజయం ఇలా ► ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు సిలబస్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. ► పూర్తిగా కాన్సెప్ట్ ఆధారితంగా ఉండే పేపర్–1 (మ్యాథమెటిక్స్)లో మంచి మార్కుల కోసం అల్జీబ్రా, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, అనలిటికల్ జామెట్రీ, ఇంటిగ్రల్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయడం మేలు చేస్తుంది. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి. కాబట్టి బేసిక్స్‌పై స్పష్టత, ఫార్ములాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► పేపర్–2 జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు బేసిక్ ఇంగ్లిష్, గ్రామర్, వొకాబ్యులరీ రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. ► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి..ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, చరిత్ర–భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్‌లపై అవగాహన చేసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలు, ఆయా విభాగాలకు ఇచ్చిన వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి. ► ఫిజిక్స్‌లో ఎలక్ట్రోమాగ్నటిజం, మెకానిక్స్, డైనమిక్స్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో కెమికల్ అనాలసిస్,ఇనార్గానిక్ కాంపౌండ్స్, పిరియాడిక్ టేబుల్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఈక్విలిబ్రియమ్, థర్మోడైనమిక్స్, క్వాంటమ్ మెకానిక్స్‌పై ప్రధానంగా దృష్టిసారించాలి. ► జనరల్ సైన్స్‌లో వ్యాధులు–కారకాలు, ప్లాంట్ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్ కింగ్ డమ్లను చదవాలి. ► కరెంట్ అఫైర్స్ కోసం పరీక్ష తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన పరిణామాలపై దృష్టి సారించాలి. ► హిస్టరీ విభాగాలకు సంబంధించి.. స్వాతంత్రోద్యమ సంఘటనలు, రాజులు–రాజ్య వంశాలు, చారిత్రక కట్టడాలు, యుద్ధాల సంబంధిత అంశాలను అధ్యయనం చేయాలి. ► జాగ్రఫీ విషయంలో ప్రకృతి వనరులు, విపత్తులు, నదులు, పర్వతాలు, పర్యావరణం వంటి అంశాల్లో పట్టు సాధించడం మేలు చేస్తుంది. ► ఎన్డీఏ రాత పరీక్షలో అడుగుతున్న ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ఉంటున్నాయి. కాబట్టి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ:జూన్ 29, 2021 ► ఆన్లైన్ దరఖాస్తు ఉపసంహరణ: జులై 6 నుంచి జులై 12 వరకు ► ఎన్డీఏ అండ్ ఎన్ఏ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 5, 2021 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ► వెబ్సైట్: www.upsc.gov.in -
ఆర్మీ జాబ్స్.. ఏప్రిల్ 18న ఎన్డీఏ; ఎగ్జామ్ టిప్స్
దేశ రక్షణ దళాల్లో చేరడం చాలా మంది యువత కల. సైనిక దళాల్లో సవాళ్లతో కూడిన ఉజ్వల కెరీర్‌కు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ పరీక్ష (ఎన్డీఏ). ఇందులో అర్హత సాధిస్తే.. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి హోదాలో పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. దేశ రక్షణ దళాల్లో కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి హోదాను పొందొచ్చు. సరైన ప్రణాళిక..పట్టుదలతో ఎన్డీఏ పరీక్షకు సన్నద్ధమయితే.. విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. 2021 ఏడాదికి గాను ఎన్డీఏ పరీక్షను ఏప్రిల్ 18న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సన్నద్ధమ్యే అభ్యర్థులకు కోసం ఎగ్జామ్ టిప్స్... ఏటా రెండుసార్లు ► త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు, శిక్షణ ప్రక్రియను చేపట్టడానికి ఎన్డీఏను ఏర్పాటు చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు ఎన్డీఏ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక.. ఆయా విభాగాల్లో ఉద్యోగాల్లో నియమిస్తారు. రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఎన్డీఏ సువర్ణావకాశం. ► ఇంటర్/10+2 పూర్తిచేసిన అభ్యర్థులు ఎన్డీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ ఏటా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎన్డీఏ 2021 ప్రకటన వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 900 మార్కులకు రాత పరీక్ష ఎన్డీఏ పరీక్ష ఏప్రిల్ 18న ఆఫ్‌లైన్‌లో జరుగనుంది. పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఈ ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మ్యాథమెటిక్స్– 300 మార్కులు, జనరల్ ఎబిలిటీ–600 మార్కులు (ఇంగ్లిష్, సైన్స్, హ్యుమానిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్) పేపర్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 2.30 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తారు. రెండు పేపర్లు ఒకే రోజు నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. కాబట్టి అభ్యర్థులు సమాధానాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కులో నుంచి 33శాతం కోతగా విధిస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. వ్యూహాత్మక ప్రిపరేషన్ ► పరీక్షకు నెల రోజుల సమయమే ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త విషయాల జోలికి వెళ్లకుండా.. ముఖ్యమైన టాపిక్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. ► గతంలో నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం.. మాక్ టెస్టులను రాయడం వంటివి చేయాలి. ► మ్యాథమెటిక్స్‌కు సంబంధించి షార్ట్ ట్రిక్స్‌ను ఉపయో గించి ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయాలి. ఇచ్చిన టైమ్‌ను సద్వినియోగం చేసుకునే విధంగా మ్యాథమెటిక్స్ విభాగంపై దృష్టి పెట్టాలి. ► పేపర్–2కు సంబంధించి ఇంగ్లిష్‌లో 40శాతం వెయిటేజీని కవర్ చేసేవిధంగా ప్రిపరేషన్ ఉండాలి. ఇందుకోసం న్యూస్ పేపర్లను చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంగ్లిష్, వొకాబ్యులరీ మెరుగుపరచుకోవచ్చు. ► పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో కాన్సెప్ట్లపై పట్టు పెంచుకోవాలి. ► జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగాలకు సంబంధించి ముఖ్యమైన టాపిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. ► కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, భారత్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అవార్డులు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. ► ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన రోజుల (ప్రముఖుల పుట్టిన తేదీలు, ఇతర ప్రాధాన్యత కలిగిన రోజులు)గురించి తెలుసుకోవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ►ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఇంటర్వ్యూ 900 మార్కులకు ఉంటుంది. ఇందులో కూడా స్టేజ్–1,2 అనే రెండు దశలు ఉంటాయి. స్టేజ్–1కు అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే స్టేజ్–2కు అనుమతిస్తారు. ►స్టేజ్–1: ఈ ఇంటర్వ్యూలో ఆఫీసర్ ఇంటలిజెన్స్ రేటింగ్(ఓఐఆర్), వెర్బల్–నాన్ వెర్బల్ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్(పీపీ అండ్ డీటీ) పరీక్షలు నిర్వహిస్తారు. ►స్టేజ్–2 : ఈ ఇంటర్వ్యూలో గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్, సైకాలజీ టెస్టులు నిర్వహిస్తారు. గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టెస్ట్‌లో జీడీ, జీపీఈ,పీజీటీ, హెచ్జీటీ, ఐఓటీ, కమాండ్ టాస్క్, షేక్ రేస్, ఇండివిడ్యువల్ లెక్చర్, ఎఫ్జీటీ వంటివి ఉంటాయి. ►సైకాలజీ టెస్ట్ : థిమాటిక్ అప్రెషన్ టెస్ట్(టీఏటీ), వర్డ్ అసోసియేషన్ టెస్ట్ (డబ్ల్యూఏటీ), సిచ్యూవేషన్ రియాక్షన్ టెస్ట్(ఎస్ఆర్టీ), సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్(ఎస్డీ) వంటి వాటితోపాటు కాన్ఫరెన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ►పైన పేర్కొన్న రెండు స్టేజ్ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు జరిపి.. మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ ఆధారంగా ఆయా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ►ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసే పరీక్ష. కాబట్టి అభ్యర్థులు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ► అభ్యర్థుల వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని పరీక్షించే విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు పూర్తి సమాచారంతో ప్రత్యేకంగా సిద్ధం అవ్వాలి. హైదరాబాద్: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో జాబ్స్ -
ఏపీ విద్యార్థికి రెండో ర్యాంకు
విజయనగరం అర్బన్: ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ) ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలో విజయనగరం జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన బడే మెహర్ సాత్విక్ నాయుడు జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించాడు. బాడంగి మండలం రామచంద్రపురంకు చెందిన సాత్విక్ జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు. సాత్విక్ గతంలోనూ 6వ తరగతి ప్రవేశ పరీక్షల్లో జాతీయ స్థాయి మొదటి ర్యాంక్ సాధించాడు. సాత్విక్ తల్లిదండ్రులు లక్ష్మి, సుగుణాకరనాయుడు, తాత సంజీవనాయుడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఈ సందర్భంగా సాత్విక్ మాట్లాడుతూ నావికాదళంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసి దేశానికి సేవలందించాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. (చదవండి: హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి) -
పరోక్ష యుద్ధంలోనూ పాక్‌కు ఓటమే
పుణే: ప్రత్యక్ష యుద్ధంలో ఎలాగూ గెలవలేమనే పాకిస్తాన్ పరోక్ష యుద్ధానికి ప్రయత్నిస్తోందని అయితే ఇందులోనూ ఆ దేశానికి ఓటమి తప్పదని దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ శనివారం జరిగిన 137వ పాసింగ్ ఔట్ పెరేడ్లో ఆయన మాట్లాడారు.‘ సంప్రదాయ యుద్ధమైనా, పరిమిత యుద్ధమైనాసరే తాను భారత్‌పై గెలవలేనని పాకిస్తాన్‌కు 1848 నుంచే తెలుసు. 1965, 1971, 1999ల్లోనూ ఇదే విషయం రూఢి అయ్యింది’ అని అన్నారు. ‘పాకిస్థాన్ ఉగ్రవాదం రూపంలో పరోక్ష యుద్ధ మార్గాన్ని ఎన్నుకుంది. కానీ ఇందులోనూ ఆ దేశానికి దక్కేది ఓటమే’ అని చెప్పారు. భారత్ ఎల్లప్పుడు ఇతర దేశాలతో సౌహార్దపూర్వక, స్నేహపూరిత సంబంధాలను కోరుకుందని, పరాయి భూభాగాన్ని ఆక్రమించాలన్న ఆలోచన భారత్‌కు లేదని, కానీ రెచ్చగొడితే ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. సైబర్ యుద్ధాన్నీ కాచుకోవాలి.. ఉగ్రవాదంతోపాటు ప్రపంచం ఇప్పుడు తమ సిద్ధాంతాల ప్రచారానికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే సైబర్ యుద్ధ రీతులను ఎదుర్కోవాల్సి ఉందని రాజ్‌నాథ్ చెప్పారు. శాంతి పరిరక్షణ, మానవతా కార్యక్రమాల్లో భారత సైన్యం ఎంత నైపుణ్యంతో పనిచేస్తుందో ఇప్పుడు అందరికీ తెలుసునని మంత్రి పేర్కొన్నారు. ‘మీరు దేశ రక్షణ వ్యవస్థలో భాగమైనప్పుడు భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని తీర్మానం చేసుకోండి. రాజ్యాంగ పరిరక్షణ అనేది అటు మిలటరీ, ఇటు పౌర సమాజాన్ని కలిపి ఉంచే బంధం’’అని మంత్రి నేషనల్ డిఫెన్స్ అకాడమీ కేడెట్స్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సైనిక దౌత్యానికీ ప్రాధాన్యమిస్తోందన్నారు. -
‘ఏ పద్ధతిలోనైనా సరే.. పాక్ ఎన్నటికీ గెలవదు’
సాక్షి, ముంబై : భారత్‌తో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని భావించిన పాకిస్తాన్, ఉగ్రవాదుల ద్వారా పరోక్ష యుద్ధం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శనివారం పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సైనికాధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదం ద్వారా భారత్‌పై పరోక్ష యుద్దం చేస్తోంది. కానీ ఏ పద్ధతిలోనైనా సరే. పొరుగు దేశం ఎన్నటికీ మనపై గెలవజాలదని వెల్లడించారు. -
తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు!!
సాక్షి, వనపర్తి(మహబూబ్ నగర్) : దేశం కోసం పని చేయాలనే లక్ష్యంతో నూనుగు మీసాల వయస్సులో ఓ యువకుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అర్హత సాధించి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విభాగంలో యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌కు శిక్షణ తీసుకోనున్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎయిర్ ఫోర్స్‌కు ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణ, ఆలోచన, దేశభక్తి తోడైతే విజయం సాధించవచ్చని పట్టుదలతో నిరూపించాడు. ఉరిమే ఉత్సాహంతో ఉన్న ఆ యువకుడు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్థానం సంపాదించాడు. సైనిక అధికారుల పర్యవేక్షణలో మూడేళ్లపాటు సైనిక శిక్షణ పొందనున్నాడు. నేవీ, ఆర్మీ కంటే అతికష్టంగా ఉండే ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన అన్ని టెస్టుల్లోనూ ప్రతిభ సాధించడంతో అర్హత సాధించాడు. దేశానికి సేవ చేసే భాగ్యం కోసం చిన్నప్ప టి నుంచి కలలు గన్న ఆ యువకుడి తల్లిదండ్రుల ఆశయాలు ఫలించాయి. వనపర్తి లోని గాంధీనగర్‌కాలనీకి చెందిన ఎల్ఐసీ కృష్ణ, చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్‌సాయి యాదవ్ 2018 సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా 208 ఆర్మీ, 42 నేవీ, 92 ఎయిర్ ఫోర్స్‌కు గాను యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్ఏ ఎంట్రెన్స్ ఎగ్జాం నిర్వహించింది. ఇందులో దేశవ్యాప్తంగా 3.12 లక్షల మంది విద్యార్థు లు ఎంట్రెన్స్ టెస్టు రాయగా అందులో 6,800 మంది అర్హత సాధించారు. నవంబ ర్ 30న ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల కావ డంతో అర్హత సాధించిన వారికి డెహ్రడూన్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఈ ఏడాది జనవరి 14 నుంచి 19 వరకు డ్యాకుమెంట్ వెరిఫికేషన్, ఫిజిక ల్ ఫిట్నెస్ టెస్టు, సైకాలజీ టెస్టులో నిర్దేశిత టైం ప్రకారం నిర్వహించే టెస్టులు ఒక పిక్చర్ చూయిం చి దానిపై స్టోరీ రాయించడం, స్విచ్వేషన్ రియాక్ట్ టెస్టులో 60 స్విచ్ వేషన్లను 30 నిమిషాల్లో స్టూడెంట్ 30 రియాక్షన్స్ పేర్కొన్నాలి. సెల్ఫ్ డిక్రిప్షన్, వర్డ్ అసోసియేషన్ టెస్టులో 15 సెకన్లకు వచ్చే ఒక వర్డ్‌పై సెంటన్స్ రాయడం, పర్సనల్ ఇంటర్వ్యూ ఒక గంట మౌఖికంగా నిర్వహించడం, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రూప్ చర్చలు, గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్, ప్రోగ్రెసివ్ గ్రూప్ చాట్, ఆఫ్ గ్రూప్ చాట్, సెల్స్ ఆప్టికల్స్, గ్రూప్ ఆప్స్ కిల్ రేస్, కమాండ్ టాస్క్ లెక్చరేట్, ఫైనాల్ గ్రూప్ టాస్క్ మెడికల్ ఎగ్జామ్ ఇలా అన్నింటిలో అర్హత సాధించాడు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 21 నుంచి 25 వరకు ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబిలీష్మెంట్ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో అన్నింటిలో మెరుగ్గా తేలడంతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశానికి చోటు దక్కింది. ఇంటర్లో ఎంపీసీ పూర్తి చేసిన వారు, చదువుతున్న వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు, ప్రతి ఆరు నెలలకోసారి యూపీఎస్సీ భారత రక్షణ శాఖ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంపికైన వారు ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ అధికారి హోదాతో ఉద్యోగ జీవితం ప్రారంభం కానుంది. మూడేళ్ల శిక్షణతోపాటు బీటెక్ అని పరీక్షల్లోనూ అర్హత సాధించడంతో యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో మూడేళ్ల ప్రవేశానికి చోటు కల్పిస్తూ యూపీఎస్సీ ధ్రువీకరించింది. జూలై 2న పుణెలోని కడక్వాస్లో గల ఎన్డీఏలో చేరనున్నారు. అక్కడ మూడేళ్లపాటు ఎయిర్ ఫోర్స్‌తోపాటు బీటెక్ చేయిస్తారు. ఇందుకు సంబంధించి ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ట్రైనీ ఫ్లయింగ్ ఆఫీసర్‌గా శిక్షణ ఇస్తారు. అనంతరం అధికారికంగా నియమాక పత్రం అందజేస్తారు. దీంతో యుద్ధ విమానాలు నడిపే పైలెట్‌గా దేశానికి సేవ చేయాల్సి ఉంటుంది. సంతోషంగా ఉంది నేను దేశానికి సేవ చేయబోతున్నాననే మాట ఎంతో సంతృస్తిని ఇస్తుంది. తల్లిదండ్రుల ఆశయాన్నీ నిలబెట్టేందుకు పట్టుదలతో చదువుకున్నా. అదే పట్టుదలతో దేశానికి సేవ చేస్తాను. ప్రణాళికబద్ధంగా చదువుకొని ముందుకు సాగాను. ఇకపై కూడా అన్ని పరీక్షల్లోనూ పూర్తిగా అర్హత సాధిస్తానన్న నమ్మకం ఉంది. – నిఖిల్‌సాయి, వనపర్తి -
ఫస్ట్ బ్యాచ్ వచ్చేస్తోంది!
రెడీ టు ఫైట్ కాలం మారింది. కాలం మారింది అంటే మగాళ్లు మారారని! మొదట్లో ఆడవాళ్లు ఉద్యోగాలకు పనికిరారు అనేవారు. ఇప్పుడు ఈ ఉద్యోగానికనో, ఆ ఉద్యోగానికనో మాత్రమే పనికిరారని అంటారు. అంటే మేల్ థింకింగ్ కొంత మెరుగైనట్టే! కానీ ఈ ‘కొంత’... ‘పూర్తిగా’ ఎప్పుడవుతుంది? ఆడవాళ్ల శక్తిసామర్థ్యాల విషయంలో మగవాళ్ల ఆలోచనా ధోరణి పూర్తిగా ఎప్పటికి పాజిటివ్ రూట్లోకి వస్తుంది? ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. అప్పటి వరకు జెండర్ వాదనలు, చర్చలు జరుగుతూ ఉండడం ఆరోగ్యమే తప్ప ఎవరికీ హానికరం కాదు. ‘ఆడవాళ్లు, వాళ్లకు అనువైన ఉద్యోగాలు’ అంటూ ఓ పెద్దాయన చేసిన కామెంట్ మీద ఆ మధ్య ఇండియాలో పెద్ద డిబేట్ జరిగింది. ఈ డిబేట్ కారణం అయిన వ్యక్తి సరదాగా ఆ కామెంట్ చేయలేదు. వ్యంగ్యంగా చేయలేదు. కోపంగానో, పురుషాధిక్యంతోనో చేయలేదు. సిన్సియర్‌గా తను నమ్మి, నమ్మినదాన్ని బయటికి చెప్పారు. ఆయన పేరు మనోహర్ పారిక్కర్. మన రక్షణ శాఖ మంత్రి. ఖదక్వాస్లా (మహారాష్ట్ర)లోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో గత మే 30న పాసింగ్ అవుట్ పరేడ్‌లో మాట్లాడుతున్నప్పుడు ఆడవాళ్లను యుద్ధరంగంలోకి తీసుకునే విషయం ప్రస్తావనకు వచ్చింది. అప్పుడాయన స్పష్టంగా ఒక మాట చెప్పారు. ‘‘యుద్ధంలోకి, ఆయుధాలు పట్టుకుని పోరాడే బాధ్యతల్లోకి మహిళల్ని తీసుకునే ప్రసక్తే లేదు’’ అని! అందుకు ఆయన చెప్పిన కారణం.. మహిళలు బందీగా దొరికితే వారిని శత్రుదేశ సైనికులు చిత్రహింసలకు గురిచేయడం తేలిక. అందుకే యుద్ధభూమిలోకి వారికి నో ఎంట్రీ అని. పారిక్కర్ భయం అర్థవంతమైనదే. అర్థం చేసుకోదగినదే. మరి యుద్ధరంగంలోకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్న మగువల మాటేమిటి? వాళ్లు తమ ఆసక్తిని చంపుకోవలసిందేనా? శక్తి సామర్థ్యాలను, దేశభక్తిని నిరూపించుకునే గొప్ప అవకాశాన్ని ఈ దేశం యువకులకు మాత్రమే ఇస్తుందా? స్త్రీలు ఉద్యోగాలు చేయడం గురించి, ఆఫీసులలో స్త్రీ ఉద్యోగుల వల్ల తలెత్తే సమస్యల గురించి ఎవరు ఏం మాట్లాడినా దానికంత ప్రాముఖ్యం ఇవ్వనక్కర్లేదు. స్త్రీ వల్ల ఒక సమస్య వచ్చిందంటే దాని వెనుక కచ్చితంగా పురుషుడొకడు ఉండి ఉంటాడు. స్త్రీ చేయలేదని సమాజం అంటున్న, అనుకుంటున్న ఉద్యోగాలేవేనా ఉన్నాయి అంటే, వాటిని పురుషులు సమర్థంగా నిర్వహిస్తున్నారనీ అర్థం చేసుకోనక్కర్లేదు. అర్హతలు, ఆసక్తి ఉండీ స్త్రీ అయినంత మాత్రాన అవకాశాన్ని పొందలేకపోవడం నాగరిక సమాజపు లక్షణం కాదు. బలాలు, బలహీనతలు, పరిమితులు స్త్రీ పురుషులిద్దరికీ ఉండేవే. వాటిని అనుసరించే సమాజం తనకు కావలసిన దాన్ని తను స్వీకరిస్తుంది. ఇప్పుడలాగే వైమానిక దళంలోకి ఆడవాళ్లను ‘ఫైటర్ పెలైట్‌గా’ స్వీకరిస్తోంది! గుడ్ న్యూస్ ఏంటంటే... ఫస్ట్ బ్యాచ్ ఉమన్ ఫైటర్స్ 2016 జూన్‌లో బయటికి వస్తున్నారు. పారిక్కరే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు ‘నో’ అన్న మంత్రిగారు ఆర్నెల్ల తర్వాత నిన్ననే ‘ఎస్’ అన్నారు. కాలం మారుతోంది. అంటే మగాళ్లు మారుతున్నారని మాత్రమే కాదు. మార్పు కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారని కూడా. - భావిక -
సైన్యాన్ని ముందుకు నడిపించే.. ఆర్మీ ఆఫీసర్
అప్‌కమింగ్ కెరీర్ దేశమాత సేవలో తరించేందుకు అవకాశం ఉన్న రంగం.. సైన్యం. దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడే సైనికులు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి వీర జవాన్లను ముందుండి నడిపించే నాయకుడే... ఆర్మీ ఆఫీసర్. బాధ్యతలు, సవాళ్లంటే ఇష్టపడే నేటి యువతకు సరిగ్గా సరిపోయే కెరీర్.. ఆర్మీ ఆఫీసర్. పురస్కారాలు, గౌరవ మర్యాదలు సరిహద్దుల రక్షణ, యుద్ధాల తోపాటు ప్రకృతి విపత్తుల్లోనూ సైన్యం సేవలందిస్తూ ఉంటుంది. ఆర్మీ ఆఫీసర్లు తమ ర్యాంకును బట్టి ప్లాటూన్, కంపెనీ, డివిజన్, బ్రిగేడ్, కమాండ్, బెటాలియన్.. ఇలా వివిధ విభాగాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా తమ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ ముందుకు నడిపించాలి. జన్మభూమికి సేవ చేయాలన్న ఆశయం, ఉన్నతమైన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలన్న తపన ఉన్నవారు సైన్యంలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం ఆర్మీ ఆఫీసర్లకు భారీ వేతనాలు అందుతున్నాయి. పదవీ విరమణ అనంతరం కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందొచ్చు. విధుల్లో భాగంగా ధైర్యసాహసాలు ప్రదర్శించే సైనికాధికారులకు అత్యున్నత పురస్కారాలు అందుతాయి. ప్రజల్లో విశేషమైన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దీంతోపాటు వృత్తిపరమైన ఆత్మసంతృప్తి దక్కుతుంది. సైనికాధికారి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. ఆత్మవిశ్వాసం, అంకితభావం, పట్టుదల అవసరం. అర్హతలు: మిలిటరీ అకాడమీల్లో ప్రవేశానికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్ష, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్; బ్యాచిలర్‌స డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షలు రాయొచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెక్నికల్ ఎంట్రీ ద్వారా సైన్యంలో ప్రవేశించొచ్చు. వేతనాలు: కమిషన్డ్ లెఫ్టినెంట్కు ప్రారంభంలో నెలకు రూ.25 వేల వేతనం అందుతుంది. లెఫ్టినెంట్ కల్నల్/కల్నల్‌కు దాదాపు రూ.70 వేల వేతనం ఉంటుంది. లెఫ్టినెంట్ జనరల్ నెలకు రూ.లక్షకు పైగానే పొందొచ్చు. దీంతోపాటు ఎన్నో రాయితీలు, భత్యాలు, వైద్య, బీమా సౌకర్యాలు ఉంటాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు * నేషనల్ డిఫెన్స్ అకాడమీ; వెబ్సైట్: www.nda.nic.in * ఇండియన్ మిలిటరీ అకాడమీ వెబ్సైట్: www.joinindianarmy.nic.in * ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వెబ్సైట్: www.joinindianarmy.nic.in సవాళ్లతో కూడిన కెరీర్! శ్రీఉజ్వల భవిష్యత్తుతోపాటు దేశ భద్రతలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించే కెరీర్ ఆర్మీ ఆఫీసర్. ఆర్మీలో కమిషన్డ్, నాన్‌కమిషన్డ్ అధికారులుంటారు. వారిలో సెకండ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ తదితర హోదాల్లో ఆర్మీ ఆఫీసర్లు పనిచేస్తారు. ఆర్మీ ఉద్యోగాలు సవాళ్లతో కూడినవే అయినప్పటికీ క్రమశిక్షణాయుతమైన జీవనం అలవడుతుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి కంటే మూడింతల మెరుగైన జీవితం ఆర్మీ ఆఫీసర్ సొంత్ంణ - మేజర్ జి. లక్ష్మణరావు, కెరీర్ కౌన్సెలింగ్ నిపుణులు,డెరైక్టర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్స్, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. -
ఉద్యోగాలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఖాళీల సంఖ్య: 375 అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు.ఎయిర్ ఫోర్స్, నావల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు:161/2-191/2ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: www.upsconline.nic.in ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ)ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ - ఏప్రిల్ 2015 బ్యాచ్‌కు దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 54 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ సీనియర్ డివిజన్/వింగ్‌లో కనీసం రెండేళ్ల సర్వీస్‌తో పాటు ‘సి’ సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 19 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 31 వెబ్సైట్: www.joinindianarmy.nic.in సిండికేట్ బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ లేటరల్ వేకెన్సీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (రిస్క్ మేనేజ్మెంట్) 2. డిప్యూటీ జనరల్ మేనేజర్ (చీఫ్ ఎకనామిస్ట్) 3. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ట్రైనింగ్) 4. చీఫ్ జనరల్ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 5 వెబ్సైట్: www.syndicatebank.in/ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ న్యూఢిల్లీలోని లైజన్ కార్యాలయంలో కింది పోస్టుల భర్తీకి(తాత్కాలిక పద్ధతిన) భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) దరఖాస్తులు కోరుతోంది. పోస్టు: జూనియర్ అసిస్టెంట్-గ్రేడ్ 2 ఖాళీలు: 3 అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులు. ఆఫీస్ అప్లికేషన్స్‌లో కనీసం ఆరు నెలల కోర్సు ఉండాలి. హిందీ, ఇంగ్లిష్‌లో మంచి పరిజ్ఞానం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 4 వెబ్సైట్: http://bdl.ap.nic.in జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూ నివర్సిటీ హైదరాబాద్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (మంథని), మంథని, జగిత్యాల, సుల్తాన్పూర్ క్యాంపస్‌లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: లెక్చరర్(అడ్‌హక్)/అకడమిక్ అసిస్టెంట్స్ విభాగాలు: సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 27 వెబ్సైట్: http://jntuhcem.org పవేశాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), హైదరాబాద్ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: ఎమ్మెస్సీ (అప్లయిడ్ న్యూట్రిషన్) సీట్ల సంఖ్య: 16 వ్యవధి: రెండేళ్లు అర్హతలు: ఎంబీబీఎస్ లేదా న్యూట్రిషన్/హోమ్‌సైన్స్/నర్సింగ్‌లో బీఎస్సీ/బీఎస్సీ(బయో కెమిస్ట్రీ/న్యూట్రిషన్) ఉండాలి. దరఖాస్తులు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 13 వెబ్సైట్: http://ninindia.org అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హో టల్ మేనేజ్మెంట్, చండీగఢ్ కింది కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అర్హతలు: ఇంగ్లిష్ సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణత. వయసు: 25 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 30, 2014 వెబ్సైట్: www.ihmchandigarh.org నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: బీఈ ప్రోగ్రామ్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మ్యా నుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,బయోటెక్నాలజీ. అర్హతలు: ఇంటర్(ఎంపీసీ) ఉత్తీర్ణులై జేఈఈ(మెయిన్)-2014లో అర్హత సాధించాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూన్ 23 నుంచి వెబ్సైట్: www.nsit.nic.in నేషనల్ బుక్ ట్రస్ట్ నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ కింది కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బుక్ పబ్లిషింగ్ వ్యవధి: నాలుగు వారాలు దరఖాస్తులు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:జూలై 10 వెబ్సైట్: www.nbtindia.gov.in