ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం | Supreme Court lets women sit for NDA exam | Sakshi
Sakshi News home page

ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం

Published Thu, Aug 19 2021 6:05 AM | Last Updated on Thu, Aug 19 2021 7:32 AM

Supreme Court lets women sit for NDA exam - Sakshi

న్యూఢిల్లీ:  లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్‌ 5న జరుగబోయే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీఎస్సీ)ను బుధవారం ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది. ఎన్‌డీఏతోపాటు నావల్‌ అకాడమీ ప్రవేశ పరీక్షలను రాసే అవకాశాన్ని మహిళలకు సైతం కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కుశ్‌ కాల్రా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్‌డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషనర్‌ వినతి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.  మహిళలకు ఎన్‌డీఏ అడ్మిషన్‌ టెస్టు రాసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని, దీని గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది.

సైన్యం, నావికా దళంలో మహిళల కోసం శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలని తాము గతంలో తీర్పులిచ్చామని, అయినా ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలు సైన్యంలోకి అడుగు పెట్టేందుకు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ, ఇండియన్‌ మిలటరీ అకాడమీ వంటి మార్గాలు ఉన్నాయని ఐశ్వర్య భాటీ చెప్పారు. మరి ఎన్‌డీఏ ద్వారా మహిళలు సైన్యంలోకి ఎందుకు ప్రవేశించవద్దు, కో–ఎడ్యుకేషన్‌ ఏమైనా సమస్యా? అని ధర్మాసనం నిలదీసింది. ఎన్‌డీఏలోకి మహిళలను అనుమతించకూడదు అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని భాటీ బదులిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement