Union Public Service Commission (UPSC)
-
యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి. మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రహస్యం ఎందుకు?: ఖర్గే మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్‌గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్ మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
పూజపై డిబార్ వేటు!
సాక్షి, న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రయత్నించి వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రొబెషనరీ మహిళా ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ విషయంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సీరియస్‌గా స్పందించింది. ç2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు పంపించింది. ‘‘పరీక్ష రాసే ‘అవకాశాలు’ ఆమె గతంలోనే దాటేశారు. అయినాసరే అర్హత లేకపోయినా గుర్తింపును దాచి తప్పుడు పత్రాలు సమర్పించి సివిల్స్ రాసి అర్హత సాధించారు’’ అని యూపీఎస్సీ శుక్రవారం తెలిపింది. ‘‘పాత వివరాలతో అదనంగా ఇంకోసారి పరీక్ష రాయలేనని తెల్సుకుని ఉద్దేశపూర్వకంగా తన పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఇ–మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా మార్చేసి గుర్తింపు దాచారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు మా దర్యాప్తులో తేలింది’’ అని యూపీఎస్సీ ప్రకటించింది. తర్వాత ఆమెపై క్రిమినల్ కేసు మోపి సమగ్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫోర్జరీ, చీటింగ్, వైకల్య కోటా దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడ్డారంటూ ఐపీసీ, ఐటీ, డిజబిలిటీ చట్టాల కింద ఢిల్లీ నేరవిభాగ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును మొదలెట్టారు. 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అయిన పూజ మహారాష్ట్రలోని పుణె జిల్లా కలెక్టరేట్లో శిక్షణలో ఉన్నపుడు అదనపు సౌకర్యాలు కావాలని, సొంత కారుకు ఎర్రబుగ్గ తగిలించుకుని తిరిగారు. దీంతో ఆమె సివిల్స్‌లో అర్హత సాధించేందుకు చేసిన నేరాలను మీడియా బహిర్గతంచేసింది. దీంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లా కలెక్టరేట్లో అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీచేసింది. యూపీఎస్సీ షోకాజ్ నోటీసు నేపథ్యంలో శుక్రవారం ఆమె వాసిమ్ కలెక్టరేట్లో పదవిని వదిలి వెళ్లిపోయారు. యూపీఎస్సీకి వచ్చే దరఖాస్తుల పరిశీలన సమగ్రస్థాయిలో, మరింత సునిశింతంగా ఉండాలని పూజా ఉదంతం చాటుతోంది. పూజ తండ్రికి తాత్కాలిక ఉపశమనంభూ వివాదంలో తుపాకీతో బెదిరించిన కేసులో జూలై 25వ తేదీదాకా అరెస్ట్ నుంచి పూజ తండ్రి దిలీప్‌కు రక్షణ కల్పిస్తూ పుణె సెషన్స్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇదే కేసులో దిలీప్ భార్య మనోరమను మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌చేసి 20వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు మనోరమ భార్యకు చెందిన నిర్వహణలోలేని థర్మోవెరిటా ఇండియా అనే ఇంజనీరింగ్ సంస్థను పింప్రి–ఛించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్చేశారు. రూ.2.77 లక్షల ఆస్తి పన్ను బాకీ కట్టనందుకు అధికారులు ఇలా చర్యలకు ఉపక్రమించారు. వైకల్య సర్టిఫికెట్ తీసుకునేటపుడు ఈ సంస్థ చిరునామానే పూజ తన ఇంటి అడ్రస్‌గా పేర్కొన్నారు. -
సివిల్స్ టాపర్ ఆదిత్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్ ప్రధాన్ సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం. నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్ రామ్‌కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్–2023 ఫలితాల పూర్తి వివరాలను http:// www.upsc. gov. in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి, కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి అంకితభావం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని పేర్కొన్నారు. విజేత కృషి, ప్రతిభ దేశ భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్ ►సివిల్స్ తొలి ర్యాంకర్ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్ లో తన ఆప్షనల్‌గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్) పూర్తిచేశారు. ►రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్ ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ అభ్యసించారు. సివిల్స్ మెయిన్స్ లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు. ►తెలుగు యువతి, సివిల్స్ మూడో ర్యాంకర్ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఆనర్స్) జాగ్రఫీ చదివారు. సివిల్స్ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ. -
నవభారత నారీశక్తి
పెరుగుతున్న మహిళాశక్తికి ఇది మరో నిదర్శనం. 2022కి గాను ఇటీవల ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షా ఫలితాల్లో కృతార్థులైన అభ్యర్థుల్లో మూడోవంతు మంది, మరో మాటలో 34 శాతం ఆడవారే! తొలి 4 ర్యాంకులూ మహిళలవే! ఇంకా చెప్పాలంటే, అగ్రశ్రేణిలో నిలిచిన పాతిక మంది అభ్యర్థుల్లో 14 మంది స్త్రీలే! ఈ లెక్కలన్నీ మారుతున్న ధోరణికి అద్దం పడుతున్నాయి. ప్రపంచంలోనే అతి క్లిష్టమైన ఈ మూడు దశల పరీక్షలో యువతులు ఇలా అగ్రపీఠిన నిలవడం ఇదే తొలిసారి కాకున్నా, వరుసగా కొన్నేళ్ళుగా వారు ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న తీరు అసాధారణం. అంతేకాక, ఒకే ఏడాది ఇంతమంది యువతులు సివిల్స్‌కు ఎంపికవడం ఇదే ప్రప్రథమం. సివిల్ సర్వీసుల్లో ఏయేటి కాయేడు స్త్రీల వాటా పెరుగుతుండడం సానుకూల ధోరణి. అంతకు మించి ఆనందదాయకం. గణాంకాలు గమనిస్తే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేస్తున్నవారిలో మహిళల వాటా 2018లో 24 శాతమైంది. 2021లో అది 26 శాతానికి ఎగబాకింది. తాజాగా 2022 పరీక్షల్లో అది గణనీయంగా 34 శాతానికి హెచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే, ఈసారి మొత్తం 933 మంది అభ్యర్థులకు సివిల్స్‌లో చోటు దక్కగా, వారిలో 320 మంది స్త్రీలే. ఇది ఒక్కరోజులో, రాత్రికి రాత్రి జరిగిన పరిణామం కాదు. దశాబ్దాల పరిణామక్రమంలో చోటుచేసుకున్న మార్పు. అనేక ఇతర రంగాల లాగే సివిల్స్ సైతం ఒకప్పుడు పూర్తిగా పురుషాధిక్యమైనదే. 2006 వరకు యూపీఎస్సీ ఎంపిక చేసే మొత్తం అభ్యర్థుల సంఖ్యలో దాదాపు 20 శాతమే మహిళలు. ఇక, ఇంకాస్త వెనక్కి వెళితే, 1980ల్లో, 1990ల తొలినాళ్ళలో వారి సంఖ్య 20 శాతం కన్నా తక్కువే. ఆ గత చరిత్ర మారి, ఈసారి 34 శాతం మహిళలు సివిల్స్ ఉద్యోగానికి లేఖలు అందుకోవడం గణనీయమైన మార్పు. భారతదేశంలో విస్తృత సివిల్ సర్వీస్ వ్యవస్థలోకి ప్రతిభావంతులైన యువతీ యువకులను ఏటా ప్రవేశపెట్టే యూపీఎస్సీ పరీక్ష అత్యంత కష్టమైనది. చైనాలో జాతీయ కాలేజ్ ప్రవేశపరీక్ష గావో కవో లాంటి ఒకటి, రెండే ప్రపంచంలో ఈ స్థాయి క్లిష్టమైనవంటారు. ఏటా మూడు దశల్లో సాగే ఈ కఠిన పరీక్షకు ఏటా దాదాపు 10 లక్షల మంది లోపు దరఖాస్తు చేసుకుంటే, అందులో 1 శాతం కన్నా తక్కువ మందే రెండో దశ అయిన లిఖిత పరీక్ష (మెయిన్స్)కు చేరుకుంటారని లెక్క. అలాంటి పోటీ పరీక్షలో గత ఏడాది కూడా సివిల్స్‌లో తొలి 4 ర్యాంకులూ మహిళలకే దక్కాయి. వరుసగా రెండోసారి ఈ ఏడాదీ అదే ఫలితం పునరావృతమవడం విశేషం. గమనించాల్సింది ఏమిటంటే – వైద్యప్రవేశ పరీక్షలు ‘నీట్’లోనూ ఈ ఏడాది యువతులదే అగ్రస్థానం. జాతీయస్థాయిలో 12వ తరగతి బోర్డ్ పరీక్షా ఫలితాల్లోనూ గత అయిదేళ్ళుగా అబ్బాయిల కన్నా అమ్మాయిలదే పైచేయి. సివిల్స్‌లో ప్రథమ స్థానంలో నిల్చిన ఇషితా కిశోర్ మొదలు మూడో స్థానం దక్కిన తెలుగ మ్మాయి ఉమా హారతి సహా సివిల్స్‌లో నెగ్గిన అనేకమంది అభ్యర్థుల ఆశలు, ఆకాంక్షలు, జీవితంలోని కష్టనష్టాలను ఎదిరించి నిలిచిన వారి పట్టుదల, సహనం స్ఫూర్తిదాయకం. కృతనిశ్చయులైతే... కులం, మతం, ప్రాంతం, లింగ దుర్విచక్షణ లాంటి అనేక అవరోధాలను అధిగమించి సమాజంలోని అన్ని వర్గాల నుంచి వనితలు విజేతలుగా అవతరించడం సాధ్యమని ఈ విజయగాథలు ఋజువు చేస్తున్నాయి. నిష్పాక్షికంగా, అత్యంత సంక్లిష్ట ప్రక్రియగా సాగే సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు ఈ తరహా విజయాలు సాధిస్తూ, ఉన్నతోద్యోగాలకు ఎంపికవడం విశేషం. ఒకపక్కన కార్పొరేట్ ప్రపంచం సైతం సీనియర్ హోదాల్లో లింగ వైవిధ్యం సాధించడానికి కష్టపడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ అధికార యంత్రాంగ సర్వీసులో ఈ స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం దక్కడం చరిత్రాత్మకమే! అయితే ఇది చాలదు. నిజానికి, ప్రభుత్వ పాలనలో లింగ సమానత్వంపై యూఎన్డీపీ 2021 నివేదిక ప్రకారం అనేక ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనకబడే ఉన్నాం. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల్లో స్త్రీల వాటా స్వీడన్లో 53 శాతం, ఆస్ట్రేలియాలో 40 శాతం, సింగపూర్ 29 శాతం కాగా, భారత్ వాటా కేవలం 12 శాతమేనట. ప్రస్తుత మహిళా విజయగాథ మరింత కాలం కొనసాగినప్పుడే ఈ లోటు భర్తీ అవుతుంది. ఇప్పటికీ జమ్ము– కశ్మీర్, జార్ఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో అవసరానికి తగ్గ సంఖ్యలో అసలు ఐఏఎస్‌లే లేరన్న పార్లమెంటరీ సంఘం నివేదికను చెవికెక్కించుకోవాలి. అయితే, కేవలం సివిల్స్‌లోనో, మధ్యశ్రేణి ఉద్యోగాల్లోనో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగితే సరిపోదు. నేటికీ పితృస్వామిక భావజాలం, ఆడవారు ఇంటికే పరిమితమనే మనస్తత్వం మన సమాజంలో పోలేదన్నది చేదు నిజం. అందుకు తగ్గట్లే... మన జాతీయ శ్రామికశక్తిలో పనిచేసే వయసులోని మహిళల వాటా కూడా తక్కువే. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 2005లో 35 శాతమున్న వనితల వాటా, 2021లో 25 శాతానికి పడిపోయింది. వెలుగు వెనుకే ఉన్న ఈ చీకటి ఓ విషాదం. కాకపోతే, మునుపటితో పోలిస్తే లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యల సంఖ్య తగ్గింది. ఆధు నిక మహిళ ఒకప్పటితో పోలిస్తే విద్య, ఉద్యోగాల్లో బంధనాలను తెంచుకుంది. ఆటల నుంచి ఆర్మ్›్డ సర్వీసుల దాకా అన్నింటా తాను పురుషుడితో సమానంగా ముందడుగు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఒత్తిళ్ళు, పనిప్రదేశాల్లో అభద్రత, నగరాల్లోనూ నాసిరకపు ప్రజారవాణా దుఃస్థితిని మార్చాలి. లింగ దుర్విచక్ష లేని పనిసంస్కృతిని ప్రోత్సహించాలి. సమాజంలో దుర్లక్షణాలున్నా వాటిని దాటుకొని పడతులు పైకి రావడం సాధ్యమేనని తాజా సివిల్స్ ఫలితాలు ఆశావాదాన్ని ప్రోది చేస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ ధోరణి గ్రామాలకూ విస్తరించడం శుభవార్త. ఇలాంటి మహిళా విజేతలు మరింత పెరిగితేనే, మన యువభారతం... నవభారతం అవుతుంది. -
సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం వెల్లడించింది. తొలి ర్యాంకును చరిత్ర విద్యార్థిని శ్రుతీ శర్మ సొంతం చేసుకుంది. ఈసారి టాప్–3 ర్యాంకులూ మహిళలే దక్కించుకున్నారు! రెండో స్థానంలో అంకితా అగర్వాల్, మూడో స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. ఐశ్వర్య వర్మకు నాలుగు, ఉత్కర్ష్ ద్వివేదికి ఐదో ర్యాంకులు లభించాయి. టాప్ 25లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలున్నారు. 685 మంది ఎంపిక కాగా, వీరిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు. విజేతల్లో 25 మంది దివ్యాంగులున్నారు. 2015లో తొలి నాలుగు ర్యాంకులూ మహిళలే సాధించారు. 2021 అక్టోబర్ 10న జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 5,08,619 మంది హాజరయ్యారు. 9,214 మంది మెయిన్ రాతపరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్ష జరిగింది. 1,824 మంది ఇంటర్వ్యూకు అర్హత పొందగా 685 మంది ఎంపికయ్యారు. ఫలితాలను www. upsc. gov. in. వెబ్సైట్లో పొందుపర్చారు. చదవండి: సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ హిస్టరీ ఆప్షనల్‌గా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి హిస్టరీ(ఆనర్స్)లో పట్టభద్రురాలైన శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో హిస్టరీ సబ్జెక్టును అప్షనల్గా ఎంచుకొని టాప్ ర్యాంకుతో జయకేతనం ఎగురవేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకితా అగర్వాల్ సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన గామినీ సింగ్లా సోషియాలజీ ఆప్షనల్‌గా సివిల్స్ రాశారు. మూడో ర్యాంకు సాధించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ టాప్–25 ర్యాంకర్లలో చాలామంది ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, కామర్స్, మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. వీరంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వీరు సివిల్స్(మెయిన్) రాత పరీక్షలో ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిందీ లిటరేచర్, హిస్టరీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ప్రధాని మోదీ అభినందనలు సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలక దశ. ఈ సమయంలో పరిపాలనాపరమైన ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. సివిల్స్‌లో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎంచుకున్న రంగంలో వారు అద్భుతాలు సృష్టించగలరని, దేశాన్ని గర్వపడేలా చేయగలరని తెలిపారు. వారికి సైతం అభినందనలు తెలిపారు. మొదటి ర్యాంకు ఊహించలేదు: శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో తనకు మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని శ్రుతీ శర్మ చెప్పారు. ఇది ఊహించని ఫలితం అని ఆనందం వ్యక్తం చేశారు. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రుతి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ శిక్షణ పొందారు. మహిళల సాధికారతకు కృషి: అంకితా అగర్వాల్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని, ప్రాథమిక ఆరోగ్యం, పాఠశాల విద్యా రంగాలను బలోపేతం చేయడం తన లక్ష్యమని సెకండ్ ర్యాంకర్ అంకిత చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఆమె 2020 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం హరియాణాలో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఈసారి రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి సివిల్స్‌లో మొదటి మూడు ర్యాంకులు మహిళలకే దక్కడం దేశానికి గర్వకారణమని అంకిత అన్నారు. కల నెరవేరింది: గామినీ సింగ్లా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న మహిళలు ఏదైనా సాధించగలరని మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా వ్యాఖ్యానించారు. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ను ఎంచుకుంటానని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. గామినీ సింగ్లా రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. -
కష్టంగానే సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్–2021 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 77 పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 10 లక్షలమంది వరకు దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది హాజరైనట్లు అంచనా. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో 68 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 40 వేలమంది వరకు హాజరయ్యారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతి కేంద్రంలో ప్రొటోకాల్‌ను అనుసరించి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి పేపర్–2 పరీక్ష నిర్వహించారు. జూన్ 29న జరగాల్సిన ఈ పరీక్షను కోవిడ్ కారణంగా అక్టోబర్ 10న నిర్వహించారు. పరీక్షలో ప్రశ్నల తీరు ఎలా ఉందంటే... ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి కరెంటు అఫైర్స్ ప్రశ్నలు విభిన్నమైన రీతిలో అడిగారు. కరోనా నేపథ్యంలో పాండమిక్, ఇండో చైనా సంబంధాలు తదితర అంశాల్లో ప్రశ్నలున్నాయి. ఆధునిక చరిత్ర, కళలు, సంస్కృతికి సంబంధించిన అంశాల నుంచి 20 వరకు ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ, ఎకానమీల నుంచి 15 చొప్పున ప్రశ్నలున్నాయి. ఈసారి కొత్తగా స్పోర్ట్స్ ప్రశ్నలు క్రికెట్ టెస్టు సిరీస్ వంటివి అడిగారు. పేపర్–2కు సంబంధించి సీశాట్‌లో వచ్చిన ప్రశ్నలు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్సర్ చేయగలిగేలా ఉన్నాయి. మేథ్స్, రీజనింగ్, పాసేజ్ రీడింగ్ వంటి అంశాలు కష్టంగా ఉన్నాయి. ప్రశ్నలు దీర్ఘంగా ఉన్నాయి. లాజికల్, రీజనింగ్, అనలటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, ఇంటర్ పర్సనల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. గత ఏడాదికన్నా ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయన్నారు. మొత్తంగా మూడొంతుల ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. ఆధునిక చరిత్ర, ఎకనామీ సబ్జెక్టుల్లోని ప్రశ్నలు ఎక్కువగా ఉన్నా పర్యావరణ శాస్త్రం, ప్రాచీన, మధ్యయుగ చరిత్రలకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ప్రశ్నలున్నాయి. కటాఫ్‌పై అంచనాలు ప్రిలిమ్స్ కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది 796 పోస్టులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 712కు తగ్గింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్య తగ్గనుంది. పోస్టుల సంఖ్య తగ్గడంతోపాటు, గత ఏడాదికన్నా ఈసారి ప్రశ్నలు కూడా కష్టంగా ఉన్నందున ఈ ప్రిలిమ్స్ కటాఫ్ 93 నుంచి 95గా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు చెబుతున్నారు. పేపర్–1లోని మార్కుల ఆధారంగానే కటాఫ్ నిర్ణయిస్తారు. పేపర్–2 (సీశాట్)కు కటాఫ్ ఉండదు. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్లో వెలువడవచ్చని భావిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. -
ఎన్డీఏ ప్రవేశ పరీక్షలో మహిళలకూ అవకాశం
న్యూఢిల్లీ: లింగ వివక్షను రూపుమాపడంతోపాటు మహిళా సాధికారత దిశగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 5న జరుగబోయే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రవేశ పరీక్ష రాసేందుకు మహిళకు సైతం అవకాశం కల్పించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను బుధవారం ఆదేశించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తుది తీర్పును బట్టి విడుదల చేయొచ్చని పేర్కొంది. ఎన్డీఏతోపాటు నావల్ అకాడమీ ప్రవేశ పరీక్షలను రాసే అవకాశాన్ని మహిళలకు సైతం కల్పించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ కుశ్ కాల్రా గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్‌కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలన్న పిటిషనర్ వినతి పట్ల ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. మహిళలకు ఎన్డీఏ అడ్మిషన్ టెస్టు రాసేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, దీని గురించి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. సైన్యం, నావికా దళంలో మహిళల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని తాము గతంలో తీర్పులిచ్చామని, అయినా ప్రభుత్వ ఎందుకు స్పందించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీని ధర్మాసనం ప్రశ్నించింది. మహిళలు సైన్యంలోకి అడుగు పెట్టేందుకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీ వంటి మార్గాలు ఉన్నాయని ఐశ్వర్య భాటీ చెప్పారు. మరి ఎన్డీఏ ద్వారా మహిళలు సైన్యంలోకి ఎందుకు ప్రవేశించవద్దు, కో–ఎడ్యుకేషన్ ఏమైనా సమస్యా? అని ధర్మాసనం నిలదీసింది. ఎన్డీఏలోకి మహిళలను అనుమతించకూడదు అనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని భాటీ బదులిచ్చారు. -
8.72 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. మొత్తం 40,04,941 పోస్టులకు గాను 2020 మార్చి ఒకటో తేదీనాటికి 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2016–17 నుంచి 2020–21 వరకు ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 25,267 మందిని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2,14,601, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు(ఆర్ఆర్బీలు) 2,04,945 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. విదేశాలకు 6.4 కోట్ల టీకా డోసులు ఈ ఏడాది జనవరి 12 నుంచి జూలై 22వ తేదీ వరకు సుమారు 6.4 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను విదేశాలకు పంపినట్లు లోక్‌సభలో పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ప్రకటించారు. మరో 35.8 కోట్ల డోసులను దేశీయంగా పంపిణీ చేశామన్నారు. -
‘గ్రేట్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్’
సాక్షి, కరీంనగర్: పట్టుదల, కృషి తోడుంటే ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించవచ్చని మరోసారి నిరూపితమైంది. ఏకాగ్రతతో చదివితే సివిల్స్ లాంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలకు కూడా ఎలాంటి కోచింగ్ అవసరం లేదని రుజువైంది. యూపీఎస్సీ నేడు విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 93 వ ర్యాంకు సాధించిన ఐశ్వర్య పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కూతురే ఐశ్వర్య. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 93వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె తండ్రి హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఐఏఎస్‌గా ఎన్నికైన ఐఆర్ఎస్ అధికారి) రాత పరీక్ష, ఇంటర్వ్యూ దేనికీ ఐశ్వర్య కోచింగ్ తీసుకోలేదని, దేశవ్యాప్తంగా ఆమె యువతకు ఆదర్శంగా నిలిచిందని అజయ్‌కుమార్ అన్నారు. చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారి జాబితాలో ఐశర్య ఒకరని పేర్కొన్నారు. ఆమె విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగిందని అజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఐశ్వర్య ముంబైలో ఉన్నట్టు వెల్లడించారు. కాగా, ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, 129 ఎస్సీ , 67 ఎస్టీ కేటగిరీకి చెందిన వారున్నారు. (2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల) -
అక్టోబర్ 4న సివిల్స్ ప్రిలిమినరీ
న్యూఢిల్లీ: అక్టోబర్ 4వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తెలిపింది. మేలోనే జరగాల్సిన ఈ పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఎంపికైన విద్యార్థులకు పర్సనాలిటీ టెస్టులు జూలై 20 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. లాక్‌డౌన్‌కు కేంద్రం సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సవరించిన క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 4(ఆదివారం), మెయిన్స్ 2021జనవరి 8(శుక్రవారం)న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మెయిన్స్ 5 రోజుల పాటు సాగనున్నట్లు తెలిపారు. ఈ తేదీలు మారే అవకాశం కూడా ఉంటుందన్నారు. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన మెయిన్స్ వచ్చే నెల 20న ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఎన్డీఏ, ఎన్ఏ (1) తో పాటు ఎన్డీఏ, ఎన్ఏ (2) 2020ను సెప్టెంబర్ 6న జరుగుతాయని యూపీఎస్సీ పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోసం అక్టోబర్ 4న జరగాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలు వాయిదా పడినట్లు తెలిపింది. -
‘రవి మోహన్ సైనీ’ గుర్తున్నాడా?
జైపూర్: 19 ఏళ్ల క్రితం రాజస్తాన్ అల్వార్‌కు చెందిన రవి మోహన్ సైనీ అనే 14 ఏళ్ల కుర్రాడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. హిందీలో బాగా ప్రసిద్ధి చెందిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) షోలో మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి.. ప్రైజ్ మనీ రూ. కోటి సొంతం చేసుకున్నాడు. ఆ కుర్రాడు ప్రస్తుతం పోర్బందర్లో పోలీసు సూపరింటెండెంట్(ఎసస్పీ)గా విధులు నిర్వహిస్తున్నాడు. రవి పదో తరగతి చదువుతుండగా ‘కేబీసీ జూనియర్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ఈ షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రైజ్ మనీ రూ.కోటి గెలుచుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రవి. ఓ ఆంగ్ల మీడియా సంస్థ 2017లో అతడిని ఇంటర్వ్యూ చేసింది.(అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం) ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ‘‘కేబీసీ’లో గెలిచిన నాలుగేళ్ల తర్వాత నాకు ప్రైజ్ మనీ అందింది. షో నియమం ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే డబ్బు ఇచ్చారు. ట్యాక్స్ పోను ప్రైజ్ మనీ రూ.కోటిలో 69 లక్షల రూపాయలు నాకు దక్కాయి’ అని తెలిపాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న రవి.. పోలీసు డిపార్ట్మెంట్లో చేరాలనుకున్నాడు. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షలకు హాజరయ్యాడు. అనేక ప్రయత్నాల తర్వాత 2014లో కోరుకున్న ఉద్యోగంలో చేరాడు. ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు సెలక్టయిన రవి గుజరాత్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజ్‌కోట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయనకు మూడు రోజుల క్రితం పోర్బందర్ బాధ్యతలు అప్పగించారు.(రాధిక శరత్‌కుమార్ సరికొత్త అవతారం..) -
తనను తాను గెలిపించుకుంది
తనకు తీపిని పంచిన వాళ్లెవ్వరినీ నేరుగా చూడలేదు ప్రాంజల్. మనోనేత్రంతో మాత్రమే ఆ అభిమానాన్ని ఆస్వాదించింది. అదే నేత్రంతో ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని చక్కటి పాలనను అందించగలుగుతుందనే నమ్మకాన్ని కూడా కలిగిస్తోంది. చూపు లేకపోవడం లక్ష్యాన్ని సాధించడానికి అడ్డంకి కాదని నిరూపించిన ముప్పై ఏళ్ల ప్రాంజల్ పాటిల్.. తొలి ‘విజువల్లీ చాలెంజ్డ్’ ఉమన్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కొత్త రికార్డును సృష్టించింది! ప్రాంజల్ పాటిల్.. 2016లో యూపీఎస్సీ రాసింది. 773వ ర్యాంకు తెచ్చుకుంది. ర్యాంకు ఆధారంగా ఆమెకు ఇండియన్ రైల్వేస్‌లో అకౌంట్స్ సర్వీస్‌లో ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగంలో చేరడానికి ఏ అడ్డంకీ వచ్చి ఉండకపోయి ఉంటే ఎలా ఉండేదో తెలియదు. ఆమె కూడా జీవితంతో రాజీ పడిపోయి ఉండేదేమో! కానీ ఆ ఉద్యోగానికి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ర్యాంకు ఒక్కటే సరిపోలేదు. చూపు కూడా కావలసి వచ్చింది. అప్పుడు ప్రాంజల్... ‘‘నా అసలు టార్గెట్ ఇది కాదు, కాబట్టి మీరు ఈ ఉద్యోగం ఇవ్వనక్కర్లేదు’’ అని మళ్లీ ఎగ్జామ్‌కి ప్రిపేరైంది. తర్వాతి ఏడాది 124వ ర్యాంకు తెచ్చుకుంది. అప్పుడు జాతీయ స్థాయిలో మీడియా సంస్థలన్నీ ఆమెను సంభ్రమంగా చూశాయి. ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్న యువతిగా దేశానికి పరిచయం చేశాయి. ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలోనూ అమ్మాయిలు విజయకేతనం ఎగుర వేస్తూనే ఉన్నారు. వాళ్లను జాతి సగర్వంగా గుర్తు చేసుకుంటూనే ఉంది. అమ్మాయిని ఇంకా ప్రత్యేకంగా, మరికొంత ప్రేమగా గుర్తు చేసుకున్నది. మొదట ప్రాంజల్‌కి కేరళ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎర్నాకుళంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు తాజాగా త్రివేండ్రంలో సబ్‌కలెక్టర్‌గా సోమవారం నాడు రాట్నం వడుకుతున్న గాంధీజీ చిత్రపటం సాక్షిగా పూర్తి స్థాయిలో విధుల్లో చేరారామె. తిరువనంతపురం కలెక్టరేట్లోని ఉద్యోగులు ప్రాంజల్‌ను భావోద్వేగాలతో స్వాగతించారు, అభినందనల్లో ముంచెత్తారు. తమ ఇంటి పాపాయికి పుట్టిన రోజు పండుగ చేసి కేక్ తినిపించినంత ప్రేమగా స్వీట్లు తినిపించారు. ఓటమి దరి చేరదు ‘‘ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. అప్పుడు జీవితంలో ఓడిపోవడం అనేది ఉండదు. మన లక్ష్యం మీద మనం పెట్టిన శ్రద్ధ, శ్రమతోనే మనం అనుకున్నది సాధించి తీరుతాం. ఓడిపోయాం... ఓడిపోతామేమో... అనే భావనలే మనల్ని ఓటమిలోకి నెట్టేస్తాయి. అలాంటి భావనలను మనసులోకి రానివ్వకూడదు’’ అని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వుతో చెప్పారు ప్రాంజల్. గత ఏడాది సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన క్షణాలను, తనను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న సహోద్యోగులను మర్చిపోలేనని చెబుతూ... ఈ కొత్త ఉద్యోగంలో ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని అన్నారు. జీవితంలో ప్రతి సందర్భాన్ని సానుకూలంగా స్వీకరించే ప్రాంజల్ రెండు సందర్భాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఎప్పుడూ చెబుతుంటారు. ఒకటి చిన్నప్పుడు ఆపరేషన్లతో కలిగిన బాధ, రెండవది రైల్వే ఉద్యోగానికి అంధత్వం కారణంగా తనను దూరం పెట్టడం. ‘‘ఒకటి శారీరకంగా బాధకలిగించిన సంఘటన అయితే మరొకటి మనసును మెలిపెట్టిన సంఘటన’’ అని చెప్తుంటారామె. మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారీ తొలి విజువల్లీ చాలెంజ్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవే. అయినప్పటికీ కంటిచూపు లేకపోవడం మాత్రం దేనికీ అవరోధం కాదని నిరూపించారాయన. ఆయన బాట ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు అదే బాటను మరింతగా విస్తరించిన మరో స్ఫూర్తిప్రదాయిని ప్రాంజల్. – మంజీర దృఢమైన వ్యక్తిత్వం ప్రాంజల్ పాటిల్‌ది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్. ఆరేళ్ల వయసులో కంటిచూపును కోల్పోయింది. కూతురికి తిరిగి చూపు తెప్పించడానికి ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేయించారు ఆమె తల్లిదండ్రులు. ఒక్కటీ విజయవంతం కాలేదు. అన్ని ఫెయిల్యూర్స్ నుంచి తనకు తానుగా ఎదిగింది ప్రాంజల్. కమలామెహతా దాదర్ బ్లైండ్ స్కూల్లో చదువుకుంది. తర్వాత ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ‘‘ప్రాంజల్ చాలా నిబద్ధత కలిగిన విద్యార్థి. కాలేజ్‌లో జరిగే స్పెషల్ లెక్చర్స్‌కు కూడా అందరికంటే ముందే వచ్చేది.డిబేట్లలో అనర్గళంగా మాట్లాడేది. ఒక విషయం మీద తన అభిప్రాయాన్ని సున్నితంగా, చాలా స్పష్టంగా, ఎదుటి వాళ్లు కన్విన్స్ అయ్యేలా చెప్పడం ప్రాంజల్ ప్రత్యేకత. సమస్య వచ్చినప్పుడు జారిపోకుండా నిలబడగలిగిన దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి’’ అని ప్రాంజల్ గురించి ఆమె స్నేహితురాలు సరస్వతి చెప్పింది. ప్రాంజల్, సరస్వతి ఇద్దరూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. -
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్స్ పరీక్ష 2018 ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. కమిషన్ విడుదల చేసిన ఫలితాలలో 1994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. -
కేంద్ర ప్రభుత్వ కొలువులుః ఎస్ఎస్సీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మాదిరిగానే.. క్రమం తప్పకుండా నియామక ప్రకటనలు విడుదల చేస్తూ ఉద్యోగార్థుల పాలిట కామధేనువుగా నిలుస్తోంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ). ఇది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు, వాటి పరిధిలోని విభాగాలు, కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా పరీక్షలు నిర్వహిస్తోంది. దాదాపు ఈ పోస్టులన్నీ గ్రూప్-బి, గ్రూప్-సి కేడర్‌కు చెందినవే. డిగ్రీ, ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, పదోతరగతి అర్హతతో ఎస్ఎస్సీ నిర్వహించే పరీక్షల ద్వారా ఏయే ఉద్యోగాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్ఎస్సీ నిర్వహించే పరీక్షల ద్వారా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ఇన్‌కంట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సీబీఐ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఐటీబీపీ వంటి ప్రతిష్టాత్మక విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్గా అడుగుపెట్టొచ్చు. అదేవిధంగా ఇంటర్ అర్హతతో డేటాఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్, స్టెనోగ్రాఫర్స్ పోస్టులకు పోటీపడొచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమాతో కేంద్ర ప్రభుత్వ ఇంజనీర్‌గా కొలువుదీరొచ్చు. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ సంస్థలైన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ వంటి వాటి లో కానిస్టేబుల్ ఉద్యోగాలను, వివిధ కేంద్ర పభుత్వ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ పోస్టులను దక్కించుకోవచ్చు. ఇలా పదో తరగతి మొదలుకొని ఇంటర్, పాలిటెక్నిక్, బ్యాచిలర్ డిగ్రీ వరకూ.. ఏ కోర్సులు పూర్తిచేసినవారైనా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలకు హాజరై కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో పాగా వేయొచ్చు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడ్డాయి.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్-బి, గ్రూప్-సి స్థాయి పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఉద్యోగాలివే... రాతపరీక్ష, ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా భర్తీ చేసే పోస్టులు: ఇన్స్పెక్టర్(ఇన్‌కంట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎగ్జామినర్, పోస్ట్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్) సబ్ ఇన్స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)) అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (డైరక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ) డివిజనల్ అకౌంటెంట్స్(కాగ్ పరిధిలోని వివిధ విభాగాల్లో) స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 అసిస్టెంట్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతోపాటు ఇతర మంత్రిత్వ శాఖలు, సంస్థలు, విభాగాలు) రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేసే పోస్టులు: ఆడిటర్(కాగ్, సీజీడీఏ, సీజీఏ పరిధిలోని కార్యాలయాలు) అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్(కాగ్, సీజీఏ పరిధిలోని కార్యాలయాలు) అప్పర్ డివిజన్ క్లర్క్(కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖలు) ట్యాక్స్ అసిస్టెంట్(సీబీడీటీ, సీబీఈసీ), కంపైలర్(రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా) సబ్ ఇన్స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్) అర్హత: కంపైలర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కంపైలర్ పోస్టులకు ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్‌లతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2 పోస్టులకు స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి: అన్ని పోస్టులకు ప్రకటనలో సూచించిన విధంగా నిర్దేశించిన తేదీనాటికి వయసును కలిగి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (నిర్దేశిత తేదీనాటికి 26 ఏళ్లు మించరాదు)మినహా మిగతా అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక: రెండు దశల్లో నిర్వహించే రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్ల పోస్టులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. రాత పరీక్ష: పోస్టులను బట్టి రాత పరీక్ష ఉంటుంది. టైర్-1 అందరికీ ఒకేలా ఉంటుంది. టైర్-2లో మాత్రం మార్పులు ఉంటాయి. వివరాలు.. మొదటి దశలో నిర్వహించే టైర్-ఐ పరీక్షలో.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగంలో మొత్తం 50 ప్రశ్నల చొప్పున 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం మార్కులు 200. పరీక్ష వ్యవధి రెండు గంటలు. మొదటి దశలో ఉత్తీర్ణులైనవారికి టైర్-2పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 కింద క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, పేపర్-2కింద ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, కంపైలర్ పోస్టులకు ఈ రెండు పేపర్లతోపాటు అదనంగా మూడో పేపర్(స్టాటిస్టిక్స్) ఉంటుంది. దీనికి కూడా 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. టైర్-1, టైర్-2 రెండు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. రెండు దశలు రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి పోస్టులను బట్టి ఇంటర్వ్యూ/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానాల్లో, ప్రకటన: ఫిబ్రవరిలో.. స్టెనోగ్రాఫర్స్(గ్రేడ్ సీ అండ్ డీ) ఎగ్జామినేషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్స్(గ్రేడ్ సీ అండ్ డీ) పోస్టుల భర్తీ కోసం ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 18-27ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా. రాతపరీక్ష విధానం: ఇందులో భాగంగా ఒకే పేపర్ ఉంటుంది. మూడు పార్ట్‌లుగా ఉండే పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 ప్రశ్నలు)-50 మార్కులు, జనరల్ అవేర్నెస్(50 ప్రశ్నలు)-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (100 ప్రశ్నలు) - 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. స్కిల్ టెస్ట్: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి స్టెనోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రకటన: సెప్టెంబర్‌లో.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) పరీక్ష కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లోని వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామ్‌ను ఎస్ఎస్సీ నిర్వహిస్తోంది. అర్హత: 10+2 ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశించిన తేదీ నాటికి 18-27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాతపరీక్ష, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా.. రాతపరీక్ష: ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు. స్కిల్ టెస్ట్: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటర్‌పై గంటకు 8,000 పదాలు(కీ డిప్రెషన్స్) టైప్ చేయాలి. టైపింగ్ టెస్ట్: లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల వారికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నిమిషానికి ఇంగ్లిష్ అయితే 35 పదాలు, హిందీ అయితే 30 పదాలు చొప్పున టైప్ చేయగలగాలి. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్టులు కేవలం అర్హత కోసమే. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ప్రకటన: జూలై, ఆగస్టులలో.. జూనియర్ ఇంజనీర్స్ పరీక్ష సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఫరక్కా బ్యారేజ్ వంటి వాటిల్లో జూనియర్ ఇంజనీర్ల భర్తీకి ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత: సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రాంచ్‌ల్లో డిగ్రీ(లేదా)మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. కొన్ని పోస్టులకు నిర్దేశించిన పని అనుభవం తప్పనిసరి. వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి కొన్ని పోస్టులకు 18-27 ఏళ్లు. మరికొన్ని పోస్టులకు 32 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా. రాత పరీక్ష 500 మార్కులకు, ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 వ్యాసరూప విధానంలో ఉంటాయి. పేపర్-1 పరీక్ష విధానం: ఇది ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌కు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్‌కు 50 మార్కులు; జనరల్ ఇంజనీరింగ్ పార్ట్-ఏలో సివిల్ లేదా స్ట్రక్చరల్, పార్ట్-బీలో ఎలక్ట్రికల్, పార్ట్- సీలో మెకానికల్ ఉంటాయి. ఏదో ఒక విభాగాన్ని ఎంచుకోవాలి. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్-2 పరీక్ష విధానం: ఇందులో జనరల్ ఇంజనీరింగ్‌లో భాగంగా.. పార్ట్-ఎలో సివిల్ అండ్ స్ట్రక్చరల్, పార్ట్-బిలో ఎలక్ట్రికల్, పార్ట్-సిలో మెకానికల్ ఉంటాయి. ఏదో ఒక విభాగాన్ని ఎంచుకొని వ్యాసరూప విధానంలో సమాధానాలు రాయాలి. మొత్తం మార్కులు 300. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇంటర్వ్యూ: రాతపరీక్ష ఉత్తీర్ణులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 100 మార్కులుంటాయి. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా, ప్రకటన: ఫిబ్రవరిలో, పరీక్ష తేదీ: మే 25, 2014 కానిస్టేబుళ్ల భర్తీ కేంద్ర రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి ప్రతి ఏటా ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమాబల్‌లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక: శారీరక ప్రమాణాలు, శారీరక సామర్థ్యం, రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా. రాత పరీక్ష విధానం: శారీరక సామర్థ్య, ప్రమాణాల పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారిని రాత పరీక్షకు పిలుస్తారు. రెండు గంటల వ్యవధిలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అవి.. పార్ట్-ఎ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, పార్ట్-బి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, పార్ట్-సి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, పార్ట్-డి ఇంగ్లిష్/హిందీ. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్/హిందీ మినహా మిగతా మూడు పార్టులను మన రాష్ట్ర అభ్యర్థులు తెలుగులో కూడా రాయొచ్చు. వైద్య పరీక్ష: రాత పరీక్ష ఉత్తీర్ణులకు వైద్య పరీక్షను నిర్వహిస్తారు. ప్రకటన: డిసెంబర్లో.. మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) సిబ్బంది వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/కార్యాలయాలు మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహిస్తోంది. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: నిర్దేశించిన తేదీ నాటికి 18-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా. పేపర్-1లో సాధించిన మార్కుల ఆధారంగా పేపర్-2కు ఎంపిక చేస్తారు. పేపర్-2 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అయితే నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో, పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. పరీక్ష వ్యవధి: రెండు గంటలు. పేపర్-1 పరీక్ష విధానం: విభాగం పశ్నల సంఖ్య మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 25 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 25 జనరల్ ఇంగ్లిష్ 50 50 జనరల్ అవేర్నెస్ 50 50 పేపర్-2: షార్ట్ ఎస్సే/లెటర్ ఇన్ ఇంగ్లిష్ లేదా ఏదైనా భాషలో రాయాలి. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. 30 నిమిషాల వ్యవధిలో జరిగే పరీక్షకు 50 మార్కులు కేటాయించారు. ప్రకటన: నవంబర్‌లో.. సబ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ఫోర్సెస్లలో సబ్ ఇన్స్పెక్టర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ పోస్టుల భర్తీకి ప్రతిఏటా పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య: సబ్ ఇన్స్పెక్టర్స్-2197, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్- 564. అర్హత: గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పోస్టులకు పోటీపడేవారు డ్రైవింగ్ లెసైన్స్‌ను కలిగి ఉండాలి. వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 20-25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా. రాత పరీక్ష విధానం: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్-1, పేపర్-2. రెండు పేపర్లు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి: రెండు గంటలు. పేపర్-1: సబ్జెక్ట్ ప్రశ్నల సంఖ్య మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 50 జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 50 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 50 పేపర్-2: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పై 200 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు 200. వ్యవధి రెండు గంటలు. శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు: పేపర్-1లో ఉత్తీర్ణత సాధించినవారిని శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలకు పిలుస్తారు. ఇందులో భాగంగా నిర్దేశించిన శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి. దీంతోపాటు పరుగుపందెం, లాంగ్ జంప్, హైజంప్, షాట్‌ఫుట్ వంటివి నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయినవారికి మాత్రమే పేపర్-2 నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2014 పేపర్ -1 పరీక్ష తేదీ: జూన్ 22, 2014 పేపర్-2 పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2014 --------------------------------------- పై పోస్టులే కాకుండా.. ప్రసార భారతి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటివాటిలోనూ వివిధ ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోంది. సంబంధిత సంస్థల్లో ఖాళీల ఆధారంగా వీటికి ప్రకటనలు వెలువడుతుంటాయి. ఉద్యోగ నియామక ప్రకటనల కోసం www.ssc.nic.in, ఎంప్లాయ్మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్, www.sakshieducation.com వంటి వాటిని చూడొచ్చు.