సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో ప్రిలిమ్స్–2021 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 77 పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 10 లక్షలమంది వరకు దరఖాస్తు చేసుకోగా 90 శాతం మంది హాజరైనట్లు అంచనా. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో 68 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 40 వేలమంది వరకు హాజరయ్యారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతి కేంద్రంలో ప్రొటోకాల్‌ను అనుసరించి ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి పేపర్–2 పరీక్ష నిర్వహించారు. జూన్ 29న జరగాల్సిన ఈ పరీక్షను కోవిడ్ కారణంగా అక్టోబర్ 10న నిర్వహించారు.
పరీక్షలో ప్రశ్నల తీరు ఎలా ఉందంటే...
ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి కరెంటు అఫైర్స్ ప్రశ్నలు విభిన్నమైన రీతిలో అడిగారు. కరోనా నేపథ్యంలో పాండమిక్, ఇండో చైనా సంబంధాలు తదితర అంశాల్లో ప్రశ్నలున్నాయి. ఆధునిక చరిత్ర, కళలు, సంస్కృతికి సంబంధించిన అంశాల నుంచి 20 వరకు ప్రశ్నలు వచ్చాయి. పాలిటీ, ఎకానమీల నుంచి 15 చొప్పున ప్రశ్నలున్నాయి. ఈసారి కొత్తగా స్పోర్ట్స్ ప్రశ్నలు క్రికెట్ టెస్టు సిరీస్ వంటివి అడిగారు. పేపర్–2కు సంబంధించి సీశాట్‌లో వచ్చిన ప్రశ్నలు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్సర్ చేయగలిగేలా ఉన్నాయి.
మేథ్స్, రీజనింగ్, పాసేజ్ రీడింగ్ వంటి అంశాలు కష్టంగా ఉన్నాయి. ప్రశ్నలు దీర్ఘంగా ఉన్నాయి. లాజికల్, రీజనింగ్, అనలటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, ఇంటర్ పర్సనల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. గత ఏడాదికన్నా ఈసారి ప్రిలిమ్స్ ప్రశ్నలు కష్టంగా ఉన్నాయన్నారు. మొత్తంగా మూడొంతుల ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. ఆధునిక చరిత్ర, ఎకనామీ సబ్జెక్టుల్లోని ప్రశ్నలు ఎక్కువగా ఉన్నా పర్యావరణ శాస్త్రం, ప్రాచీన, మధ్యయుగ చరిత్రలకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. ఎన్‌సీఈఆర్టీ 11, 12 తరగతుల పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ప్రశ్నలున్నాయి.
కటాఫ్‌పై అంచనాలు
ప్రిలిమ్స్ కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది 796 పోస్టులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 712కు తగ్గింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు వెళ్లే అభ్యర్థుల సంఖ్య తగ్గనుంది. పోస్టుల సంఖ్య తగ్గడంతోపాటు, గత ఏడాదికన్నా ఈసారి ప్రశ్నలు కూడా కష్టంగా ఉన్నందున ఈ ప్రిలిమ్స్ కటాఫ్ 93 నుంచి 95గా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు చెబుతున్నారు. పేపర్–1లోని మార్కుల ఆధారంగానే కటాఫ్ నిర్ణయిస్తారు. పేపర్–2 (సీశాట్)కు కటాఫ్ ఉండదు. ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్‌లో వెలువడవచ్చని భావిస్తున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీలను యూపీఎస్సీ త్వరలోనే ప్రకటించే అవకాశముంది.
కష్టంగానే సివిల్స్ ప్రిలిమ్స్
Published Mon, Oct 11 2021 4:38 AM | Last Updated on Mon, Oct 11 2021 5:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment