తల్లితో ఆనందం పంచుకుంటున్న శ్రుతీ శర్మ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం వెల్లడించింది. తొలి ర్యాంకును చరిత్ర విద్యార్థిని శ్రుతీ శర్మ సొంతం చేసుకుంది. ఈసారి టాప్–3 ర్యాంకులూ మహిళలే దక్కించుకున్నారు! రెండో స్థానంలో అంకితా అగర్వాల్, మూడో స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. ఐశ్వర్య వర్మకు నాలుగు, ఉత్కర్ష్ ద్వివేదికి ఐదో ర్యాంకులు లభించాయి. టాప్ 25లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలున్నారు. 685 మంది ఎంపిక కాగా, వీరిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు. విజేతల్లో 25 మంది దివ్యాంగులున్నారు. 2015లో తొలి నాలుగు ర్యాంకులూ మహిళలే సాధించారు.
2021 అక్టోబర్ 10న జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 5,08,619 మంది హాజరయ్యారు. 9,214 మంది మెయిన్ రాతపరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్ష జరిగింది. 1,824 మంది ఇంటర్వ్యూకు అర్హత పొందగా 685 మంది ఎంపికయ్యారు. ఫలితాలను www. upsc. gov. in. వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. చదవండి: సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
హిస్టరీ ఆప్షనల్‌గా టాప్ ర్యాంక్
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి హిస్టరీ(ఆనర్స్)లో పట్టభద్రురాలైన శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో హిస్టరీ సబ్జెక్టును అప్షనల్‌గా ఎంచుకొని టాప్ ర్యాంకుతో జయకేతనం ఎగురవేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకితా అగర్వాల్ సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన గామినీ సింగ్లా సోషియాలజీ ఆప్షనల్‌గా సివిల్స్ రాశారు. మూడో ర్యాంకు సాధించారు.
ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్
టాప్–25 ర్యాంకర్లలో చాలామంది ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, కామర్స్, మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. వీరంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వీరు సివిల్స్(మెయిన్) రాత పరీక్షలో ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిందీ లిటరేచర్, హిస్టరీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు.
ప్రధాని మోదీ అభినందనలు
సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలక దశ. ఈ సమయంలో పరిపాలనాపరమైన ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. సివిల్స్‌లో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎంచుకున్న రంగంలో వారు అద్భుతాలు సృష్టించగలరని, దేశాన్ని గర్వపడేలా చేయగలరని తెలిపారు. వారికి సైతం అభినందనలు తెలిపారు.
మొదటి ర్యాంకు ఊహించలేదు: శ్రుతీ శర్మ
సివిల్స్ పరీక్షలో తనకు మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని శ్రుతీ శర్మ చెప్పారు. ఇది ఊహించని ఫలితం అని ఆనందం వ్యక్తం చేశారు. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రుతి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ శిక్షణ పొందారు.
మహిళల సాధికారతకు కృషి: అంకితా అగర్వాల్
మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని, ప్రాథమిక ఆరోగ్యం, పాఠశాల విద్యా రంగాలను బలోపేతం చేయడం తన లక్ష్యమని సెకండ్ ర్యాంకర్ అంకిత చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఆమె 2020 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి. ప్రస్తుతం హరియాణాలో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఈసారి రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి సివిల్స్‌లో మొదటి మూడు ర్యాంకులు మహిళలకే దక్కడం దేశానికి గర్వకారణమని అంకిత అన్నారు.
కల నెరవేరింది: గామినీ సింగ్లా
కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న మహిళలు ఏదైనా సాధించగలరని మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా వ్యాఖ్యానించారు. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ను ఎంచుకుంటానని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. గామినీ సింగ్లా రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment