Civil Services Mains
-
కేలండర్ ప్రకారమే ఉద్యోగాలు!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్లుగా గ్రూప్–1 పరీక్ష నిర్వహించలేదని.. తాము అన్ని అడ్డంకులను, కుట్రలను అధిగమించి 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మార్చి 31లోగా ఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని చెప్పారు. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద ఆదివారం ప్రజాభవన్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని తెలిపారు. సివిల్స్‌లో సత్తా చాటండి సివిల్స్‌లో తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కావాలన్న లక్ష్యంతోనే రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం బిహార్ నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికవుతున్నారని తెలిపారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. రూ.లక్ష సాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకంగా భావించాలని కోరారు. ఇంటర్వ్యూలకు వెళ్లే ప్రతి అభ్యర్థి సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులకు ఉచిత బస: భట్టి విక్రమార్క సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సివిల్స్ వైపు రాష్ట్ర యువతను మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ పక్షాన ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది సివిల్స్ తుది పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి, వారి పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. సింగరేణిలో తవ్వి వదిలేసిన గనులు, ఇతర ఖాళీ స్థలాల్లో సోలార్, పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. సింగరేణి సంస్థ సుస్థిర మనుగడ కోసం దేశవ్యాప్తంగా లిథియం, గ్రాఫైట్ వంటి మైనింగ్ రంగాల్లో విస్తరించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సింగరేణి పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు. ఈ కార్రక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు. -
వంట మనిషి కొడుకు ‘సివిల్స్’ కొట్టాడు..
సాక్షి, ఆదిలాబాద్: కష్టాలు ఎన్ని ఎదురైనా ఆ యువకుడి అంకితభావం ముందు నిలువలేకపోయాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంట మనిషి కుమారుడు యూపీఎస్సీలో విజేతగా నిలిచాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన యువకుడు డోంగ్రి రేవయ్య సివిల్స్‌లో 410వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. రేవయ్య.. తల్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తోంది. తండ్రి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన కానీ తల్లి ఉన్నత చదువులు చదివించింది.. సివిల్స్ ర్యాంకు సాధించి తల్లి కలను నేరవేర్చారు.. కష్టే ఫలి.. పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని పలువురు విద్యార్థులు నిరూపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్నాటిపేటకు చెందిన యువకుడు అజ్మీరా సంకేత్ 35 ర్యాంకు సాధించాడు. తన కుమారుడు సివిల్స్ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు అజ్మీరా సంకేత్‌ను అభినందించారు. శాఖమూరి సాయిహర్షిత్ సివిల్స్‌లో ఓరుగల్లు బిడ్డ ప్రతిభ సివిల్స్‌లో ఓరుగల్లు బిడ్డ తన ప్రతిభ కనబర్చాడు. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీకి చెందిన శాఖమూరి సాయిహర్షిత్ 40వ ర్యాంక్ సాధించాడు. 22 సంవత్సరాల హర్షిత్.. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించాడు. వరంగల్ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదివాడు. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి -
‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌లో తెలుగు తేజాలు మరోసారి సత్తా చాటారు. ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిమ్లాలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ లో ట్రైనీ ఆఫీసర్‌గా తరుణ్ పనిచేస్తున్నారు. తరుణ్ తండ్రి ఎం ఆర్ కే పట్నాయక్ రాజమండ్రిలో జక్కంపూడి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌కు చెందిన సాయి అర్హిత్ 40వ ర్యాంకు సాధించారు. ఉమా హారతి జగిత్యాల జిల్లాకు కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. పవన్ దత్త (తిరుపతి) ఏనుగు శివ మారుతి రెడ్డి (జగిత్యాల) ర్యాంకర్ల వివరాలు: హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్‌కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 -
సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం వెల్లడించింది. తొలి ర్యాంకును చరిత్ర విద్యార్థిని శ్రుతీ శర్మ సొంతం చేసుకుంది. ఈసారి టాప్–3 ర్యాంకులూ మహిళలే దక్కించుకున్నారు! రెండో స్థానంలో అంకితా అగర్వాల్, మూడో స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. ఐశ్వర్య వర్మకు నాలుగు, ఉత్కర్ష్ ద్వివేదికి ఐదో ర్యాంకులు లభించాయి. టాప్ 25లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలున్నారు. 685 మంది ఎంపిక కాగా, వీరిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు. విజేతల్లో 25 మంది దివ్యాంగులున్నారు. 2015లో తొలి నాలుగు ర్యాంకులూ మహిళలే సాధించారు. 2021 అక్టోబర్ 10న జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 5,08,619 మంది హాజరయ్యారు. 9,214 మంది మెయిన్ రాతపరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్ష జరిగింది. 1,824 మంది ఇంటర్వ్యూకు అర్హత పొందగా 685 మంది ఎంపికయ్యారు. ఫలితాలను www. upsc. gov. in. వెబ్సైట్లో పొందుపర్చారు. చదవండి: సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ హిస్టరీ ఆప్షనల్‌గా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి హిస్టరీ(ఆనర్స్)లో పట్టభద్రురాలైన శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో హిస్టరీ సబ్జెక్టును అప్షనల్గా ఎంచుకొని టాప్ ర్యాంకుతో జయకేతనం ఎగురవేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకితా అగర్వాల్ సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన గామినీ సింగ్లా సోషియాలజీ ఆప్షనల్‌గా సివిల్స్ రాశారు. మూడో ర్యాంకు సాధించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ టాప్–25 ర్యాంకర్లలో చాలామంది ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, కామర్స్, మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. వీరంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వీరు సివిల్స్(మెయిన్) రాత పరీక్షలో ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిందీ లిటరేచర్, హిస్టరీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ప్రధాని మోదీ అభినందనలు సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలక దశ. ఈ సమయంలో పరిపాలనాపరమైన ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. సివిల్స్‌లో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎంచుకున్న రంగంలో వారు అద్భుతాలు సృష్టించగలరని, దేశాన్ని గర్వపడేలా చేయగలరని తెలిపారు. వారికి సైతం అభినందనలు తెలిపారు. మొదటి ర్యాంకు ఊహించలేదు: శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో తనకు మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని శ్రుతీ శర్మ చెప్పారు. ఇది ఊహించని ఫలితం అని ఆనందం వ్యక్తం చేశారు. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రుతి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ శిక్షణ పొందారు. మహిళల సాధికారతకు కృషి: అంకితా అగర్వాల్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని, ప్రాథమిక ఆరోగ్యం, పాఠశాల విద్యా రంగాలను బలోపేతం చేయడం తన లక్ష్యమని సెకండ్ ర్యాంకర్ అంకిత చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఆమె 2020 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం హరియాణాలో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఈసారి రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి సివిల్స్‌లో మొదటి మూడు ర్యాంకులు మహిళలకే దక్కడం దేశానికి గర్వకారణమని అంకిత అన్నారు. కల నెరవేరింది: గామినీ సింగ్లా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న మహిళలు ఏదైనా సాధించగలరని మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా వ్యాఖ్యానించారు. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ను ఎంచుకుంటానని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. గామినీ సింగ్లా రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. -
సివిల్స్-2020 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్స్-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్-2020 తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్(సివిల్ ఇంజనీరింగ్) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు రాగా, భోపాల్ నిట్ నుంచి బీటెక్(ఎలక్రికల్ ఇంజనీరింగ్) చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలవడం విశేషం. కాగా ఈ ఏడాది జనవరిలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఇక సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ► పి. శ్రీజకు 20వ ర్యాంకు ►మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు ►జగత్ సాయికి 32వ ర్యాంకు ►దేవగుడి మౌనికకు(కడప) 75వ ర్యాంకు ►రవి కుమార్‌కు 84వ ర్యాంకు ►యశ్వంత్ కుమార్ రెడ్డికి 93వ ర్యాంకు సివిల్స్-2020 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఐటీ వద్దు.. సివిల్సే ముద్దు
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసు కేడర్ పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల వైపు ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువత ఎక్కువ దృష్టి సారిస్తోంది. గతంలో హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్‌లలో డిగ్రీ చేసిన వారు సివిల్స్‌కు ఎక్కువగా హాజరయ్యేవారు. బీఈ, బీటెక్ చేసిన వారు ఐటీ, తదితర తమ కోర్ గ్రూపు పోస్టుల వైపు వెళ్లేవారు. కానీ గత కొంతకాలంగా ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ అభ్యర్థులతోపాటు బీఈ, బీటెక్ పూర్తిచేసిన వారు సివిల్స్‌వైపు మొగ్గుచూపుతుండడమే కాకుండా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే.. ► ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో పట్టు ఉండడంతో సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ► అభ్యర్థుల్లో లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, ఆంగ్ల నైపుణ్యం పరిశీలనకు సీశాట్ పెట్టారు. ఈ మూడింటిలోనూ ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ పరిజ్ఞానం ఉంటోంది. ► ఐటీ రంగంలో మంచి అవకాశాలు దక్కుతున్నా ప్రైవేటు రంగంలో అనిశ్చిత పరిస్థితులు, ప్రతికూల పరిణామాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతాల్లో కోత తదితర కారణాలతో సివిల్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. ► అంతేకాకుండా ఈ అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో తమ కోర్ గ్రూప్ సబ్జెక్టులను కాకుండా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ సబ్జెక్టు (ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, హిస్టరీ తదితర)లను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ► జేఈఈ మెయిన్స్, అడ్వాన్సులతోపాటు బిట్స్ పిలానీ వంటి వాటి ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించిన అనుభవం సివిల్స్ సన్నద్ధతకు బాగా ఉపయుక్తంగా ఉంటోంది. ► 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన సివిల్స్ పరీక్షల ఫలితాల్లో 70 శాతానికి పైగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారే ఉన్నారని.. తమ సంస్థ నుంచి 10 మంది ఎంపికయ్యారని సివిల్స్ శిక్షణ సంస్థ మెంటార్ ఒకరు వివరించారు. ► సివిల్స్–2019లో విజయం సాధించిన మొత్తం 829 మందిలో కూడా ఇంజనీరింగ్ అభ్యర్థులే అత్యధికమని విశ్లేషిస్తున్నారు. ► ఇక తెలుగు రాష్ట్రాల నుంచి విజయం సాధించిన అభ్యర్థులలో కూడా 90 శాతం మంది వీరేనని పేర్కొంటున్నారు. -
అక్టోబర్ 4న సివిల్స్ ప్రిలిమినరీ
న్యూఢిల్లీ: అక్టోబర్ 4వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుందని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం తెలిపింది. మేలోనే జరగాల్సిన ఈ పరీక్ష కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఎంపికైన విద్యార్థులకు పర్సనాలిటీ టెస్టులు జూలై 20 నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ చెప్పారు. లాక్‌డౌన్‌కు కేంద్రం సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సవరించిన క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 4(ఆదివారం), మెయిన్స్ 2021జనవరి 8(శుక్రవారం)న ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మెయిన్స్ 5 రోజుల పాటు సాగనున్నట్లు తెలిపారు. ఈ తేదీలు మారే అవకాశం కూడా ఉంటుందన్నారు. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించిన మెయిన్స్ వచ్చే నెల 20న ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఎన్డీఏ, ఎన్ఏ (1) తో పాటు ఎన్డీఏ, ఎన్ఏ (2) 2020ను సెప్టెంబర్ 6న జరుగుతాయని యూపీఎస్సీ పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కోసం అక్టోబర్ 4న జరగాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలు వాయిదా పడినట్లు తెలిపింది. -
ట్రైనీ ఐపీఎస్: కాపీయింగ్‌లో మరిన్ని నిజాలు
సాక్షి, హైదరాబాద్ : ట్రైనీ ఐపీఎస్ సఫీర్ కరీం హైటెక్ మాస్ కాపీయింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొచ్చి, తిరువనంతపురం, హైదరాబాద్‌లలోని కోచింగ్ కేంద్రాల్లో చాలా కాలం నుంచే ఇలాంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలుతున్నట్లు సమాచారం. విద్యార్థులతో మాస్‌కాపీయింగ్‌కు తన వద్దనున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, గూగుల్ క్లౌడ్ స్టోరేజీని వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం బ్లూటూత్, మీనియేచర్ కెమెరాలను ఉపయోగించినట్లు నిర్థారణకు వచ్చారు. మాస్ కాపీయింగ్‌కు 1.5 కిలోమీటర్ల పరిధిలోపు పనిచేసే వైర్లెస్ మోడమ్‌ను ఉపయోగించినట్లు గుర్తించారు. ప్రస్తుతం కరీం గూగుల్ డ్రైవ్ అకౌంట్‌ను చెన్నై పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, అతడు రాసిన గత ప్రవేశ పరీక్షల వివరాలూ సేకరిస్తున్నారు. మాస్ కాపీయింగ్ కోసం విద్యార్థుల నుంచి కరీం భారీ మొత్తాలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే కరీంతో పాటు అతడి భార్య జాయ్సీ జాయ్, హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్ ఇంచార్జి పి.రాంబాబును ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. వీరి నుంచి 11 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, నాలుగు హార్డ్ డిస్క్‌లు, ఒక పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మైలాపూర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. మరో రెండు వారాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వస్తుందని భావిస్తున్నారు. కాగా కుమార్తెను చూసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కరీం భార్య జాయ్సీ జాయ్ విజ్ఞప్తితో న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
‘ఐఏఎస్’ కోసం ‘ఐపీఎస్’ అడ్డదారి!
-
‘ఐఏఎస్’ కోసం ‘ఐపీఎస్’ అడ్డదారి!
సాక్షి, హైదరాబాద్: ఆయన ఐపీఎస్.. ఐఏఎస్ కావాలని కల. ఆ కలను ఎలాగైనా నిజం చేసుకోవాలని భావించాడు.. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. అడ్డంగా బుక్కయ్యాడు. సోమవారం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్స్‌లో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ చెన్నై పోలీసులకు దొరికాడు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారంలో అతడి భార్య జోయ్సీ జోయ్ సహకరించింది. చెన్నై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జోయ్సీ జోయ్‌తో పాటు లా ఎక్స్‌లెన్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు రాంబాబును సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు బయల్దేరింది. 2015లో ఐపీఎస్‌కు ఎంపిక.. కేరళకు చెందిన సఫీర్ కరీం బీటెక్, ఎంఏ చదివారు. 2015లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నారు. కొన్నాళ్ల కింద జోయ్సీ జోయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కరీంకు ఐఏఎస్ అధికారి కావాలనే కోరిక బలంగా ఉంది. అయితే మరోసారి సివిల్స్ రాసి ఉత్తీర్ణుడయ్యేందుకు అడ్డదారులు తొక్కారు. ఇందుకు తన భార్య జోయ్సీ జోయ్ సాయం తీసుకున్నారు. అశోక్‌నగర్‌లోని లా ఎక్స్‌లెన్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడైన రాంబాబు దేశ వ్యాప్తంగా అనేక ఇన్స్టిట్యూట్స్లో సివిల్స్ అభ్యర్థులకు పాఠాలు చెబుతుంటారు. గతంలో కేరళలోని ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినపుడు కరీంతో పరిచయమైంది. హైటెక్ కాపీయింగ్‌కు ప్లాన్ చేసిన కరీం తనకు సహకరించాల్సిందిగా రాంబాబును కోరడంతో ఆయన అంగీకరించారు. ప్లాన్‌లో భాగంగా తన భార్య జోయ్సీ జోయ్‌ను హైదరాబాద్‌కు పంపాడు. భారీ స్కెచ్.. హైటెక్ కాపీయింగ్‌కు ప్లాన్ చేసిన కరీం భారీ స్కెచ్ వేశారు. అత్యాధునికమైన బ్లూటూత్, చిన్న సైజులో ఉండే శక్తిమంతమైన కెమెరాను సమకూర్చుకున్నారు. కెమెరాను చొక్కా గుండీల మధ్య అమర్చుకున్నారు. దీన్ని క్లిక్ చేయడానికి రిమోట్ బటన్‌ను టేబుల్‌పై కీ–చెయిన్‌లో అమర్చారు. బ్లూటూత్ డివైజ్ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టుకున్నారు. చెన్నైలోని ఎగ్మోర్ గర్ల్స్ హైస్కూల్లో ఉన్న కేంద్రంలో కరీం ప్రస్తుతం సివిల్స్ మెయిన్స్ పరీక్షలు రాస్తున్నారు. శనివారం జనరల్ స్టడీస్ పేపర్–1 రాసిన ఆయన సోమవారం పేపర్–2కు సిద్ధమయ్యారు. వ్యవహారం సాగింది ఇలా.. పరీక్ష హాలులో పేపర్ ఇచ్చిన వెంటనే దాన్ని ఛాతి భాగంలో అమర్చిన కెమెరాతో క్లిక్ చేసేవారు. ఈ డివైజ్‌తో పాటు బ్లూటూత్ సైతం గది బయట ఉన్న తన సెల్‌ఫోన్‌తో అనుసంధానించి ఉంటుంది. ప్రత్యేక సెట్టింగ్స్ ద్వారా ఓ ఫొటోను క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా గూగుల్ డ్రైవ్‌లోకి అప్లోడ్ అయ్యేలా ఏర్పాటు చేశారు. లా ఎక్సలెన్స్ కోచింగ్ సెంటర్లో కూర్చున్న జోయ్సీ జోయ్, రాంబాబు తమ వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను వినియోగించి గూగుల్ డ్రైవ్‌లో కరీం అప్లోడ్ చేసిన పేపర్‌ను డౌన్లోడ్ చేసుకునే వారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను రాంబాబు ద్వారా తెలుసుకునే జోయ్సీ తన భర్త కరీం సెల్‌కు కాల్ చేసేది. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయ్యే ఈ కాల్ కరీం చెవిలో ఉన్న బ్లూటూత్ డివైజ్‌కు వెళ్లేది. ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాలను జోయ్సీ నుంచి వింటూ కరీం రాసేవాడు. ఎప్పుడైనా జోయ్సీ చెప్పింది అతడికి సరిగ్గా వినిపించకపోతే అదే విషయాన్ని పరీక్ష పేపర్ వెనుక వైపు ఉండే ‘రఫ్’ఏరియాలో రాసి మళ్లీ ఫొటో ద్వారా పంపంచే వాడు. దీన్ని చూసి జోయ్సీ మరోసారి ఆ సమాధానాన్ని చెప్పేది. ఈ పంథాలో ఎక్కడా కరీం మాట్లాడాల్సిన అవసరం లేకుండానే కాపీయింగ్ సాగిపోతోంది. దొరికింది ఇలా.. శనివారం ఈ విధానంలోనే పరీక్ష రాసిన కరీం సోమవారం సైతం సిద్ధమయ్యారు. ఇది గమనించిన పరీక్ష నిర్వాహకుల సమాచారంతో చెన్నై పోలీసులు కరీంను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఉన్న జోయ్సీ, రాంబాబు తనకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అక్కడి పోలీసులు హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సి.శశిధర్‌రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయి శ్రీనివాస్ రావు.. జోయ్సీతో పాటు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో కరీం ద్వారా వచ్చిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలోని ప్రశ్నలకు సంబంధించి అనేక ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. జోయ్సీ, రాంబాబును తీసుకెళ్లడానికి ఓ ప్రత్యేక బృందం చెన్నై నుంచి బయల్దేరింది. -
సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ మెరుున్స్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. విజేతలైన అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లతో పాటు గ్రూప్ ఏ, బీ కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసేందుకు గాను ఇంటర్వ్యూలకు (పర్సనాలిటీ టెస్ట్) పిలువనుంది. విజేతలైన అభ్యర్థుల రోల్ నంబర్లను కమిషన్ వెబ్సైట్ ఠీఠీఠీ.ఠఞటఛి.జౌఠి.జీలో చూడవచ్చు. ఏప్రిల్ 7 నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యే అవకాశం ఉందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఢి ల్లీలోని సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని, తేదీ, సమయం విజేతలైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తామని పేర్కొంది. అభ్యర్థులు తమ వయసు, విద్యార్హతలు, కులం, వైకల్యానికి (ఉంటే) సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను క్వశ్చనీర్, అటెస్టేషన్ ఫామ్, టీఏ వంటి ఇతర పత్రాలతో కలిపి సమర్పించాల్సి ఉంటుందని ప్రకటన వివరించింది. ఈ పత్రాలన్నిటికీ సంబంధించిన ఫార్మాట్లను యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఇంటర్వ్యూ తేదీ, సమయం మార్పుకు సంబంధించిన ఎలాంటి వినతులనూ పరిశీలించడం జరగదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల జాబితాలను ఇంటర్వ్యూలు ముగిసిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్సైట్ పెట్టనున్నట్టు వివరించింది. గత ఏడాది డిసెంబర్లో యూపీఎస్సీ మెరుున్స్ రాతపరీక్షను నిర్వహించింది.