15 రోజుల క్రితమే రాజీనామా చేసినా ఇంకా ఆమోదించని రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజా ఖేడ్కర్ వ్యవహారానికి, మనోజ్ సోనీ రాజీనామాకు సంబంధం లేదంటూ అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన పదవి నుంచి తప్పుకున్నారని తెలియజేశాయి.
మనోజ్ సోనీ పదిహేను రోజుల క్రితమే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి కార్యాలయానికి పంపినట్లు సమాచారం. అయితే శనివారం సాయంత్రం వరకు కూడా ఈ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించలేదు. 2029 మే 15 వరకు మనోజ్ సోనీ పదవీకాలం ఉంది. ఆయన గతంలో బరోడా మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. గుజరాత్‌లోని డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్‌్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు పర్యాయాలు వరుసగా వీసీగా సేవలందించారు. 2017 జూన్ 28న యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న యూపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
రహస్యం ఎందుకు?: ఖర్గే
మనోజ్ సోనీ 15 రోజుల క్రితమే రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యూపీఎస్సీలో జరిగిన కుంభకోణాలకు, ఈ రాజీనామాకు మధ్య సంబంధం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ నుంచి మనోజ్ సోనీని తీసుకొచ్చి యూపీఎస్సీ చైర్మన్‌గా నియమించారని చెప్పారు. ఈ మేరకు ఖర్గే శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన నియామకాల్లో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఏ చీఫ్ పరిస్థితి ఏంటి?: జైరాం రమేష్
మనోజ్ సోనీ రాజీనామాపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ స్పందించారు. పూజా ఖేడ్కర్ వివాదం నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వచి్చనట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. మరి నీట్–యూజీ పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏ ఛైర్మన్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment