ట్రైనీ ఐఏఎస్‌పై కఠిన చర్యలకు సిద్ధమైన యూపీఎస్‌సీ
నకిలీ పత్రాలు, అఫిడవిట్లపై క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, న్యూఢిల్లీ: అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రయత్నించి వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ప్రొబెషనరీ మహిళా ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ విషయంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) సీరియస్‌గా స్పందించింది. ç2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల నిబంధనల ప్రకారం భవిష్యత్ పరీక్షలు, నియామకాల నుంచి మిమ్మల్ని ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు పంపించింది. ‘
‘పరీక్ష రాసే ‘అవకాశాలు’ ఆమె గతంలోనే దాటేశారు. అయినాసరే అర్హత లేకపోయినా గుర్తింపును దాచి తప్పుడు పత్రాలు సమర్పించి సివిల్స్ రాసి అర్హత సాధించారు’’ అని యూపీఎస్‌సీ శుక్రవారం తెలిపింది. ‘‘పాత వివరాలతో అదనంగా ఇంకోసారి పరీక్ష రాయలేనని తెల్సుకుని ఉద్దేశపూర్వకంగా తన పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఇ–మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా మార్చేసి గుర్తింపు దాచారు.
ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు మా దర్యాప్తులో తేలింది’’ అని యూపీఎస్‌సీ ప్రకటించింది. తర్వాత ఆమెపై క్రిమినల్ కేసు మోపి సమగ్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఫోర్జరీ, చీటింగ్, వైకల్య కోటా దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడ్డారంటూ ఐపీసీ, ఐటీ, డిజబిలిటీ చట్టాల కింద ఢిల్లీ నేరవిభాగ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తును మొదలెట్టారు.
2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అయిన పూజ మహారాష్ట్రలోని పుణె జిల్లా కలెక్టరేట్‌లో శిక్షణలో ఉన్నపుడు అదనపు సౌకర్యాలు కావాలని, సొంత కారుకు ఎర్రబుగ్గ తగిలించుకుని తిరిగారు. దీంతో ఆమె సివిల్స్‌లో అర్హత సాధించేందుకు చేసిన నేరాలను మీడియా బహిర్గతంచేసింది. దీంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లా కలెక్టరేట్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా బదిలీచేసింది. యూపీఎస్‌సీ షోకాజ్ నోటీసు నేపథ్యంలో శుక్రవారం ఆమె వాసిమ్ కలెక్టరేట్‌లో పదవిని వదిలి వెళ్లిపోయారు. యూపీఎస్‌సీకి వచ్చే దరఖాస్తుల పరిశీలన సమగ్రస్థాయిలో, మరింత సునిశింతంగా ఉండాలని పూజా ఉదంతం చాటుతోంది.
పూజ తండ్రికి తాత్కాలిక ఉపశమనం
భూ వివాదంలో తుపాకీతో బెదిరించిన కేసులో జూలై 25వ తేదీదాకా అరెస్ట్ నుంచి పూజ తండ్రి దిలీప్‌కు రక్షణ కల్పిస్తూ పుణె సెషన్స్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఇదే కేసులో దిలీప్ భార్య మనోరమను మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌చేసి 20వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు మనోరమ భార్యకు చెందిన నిర్వహణలోలేని థర్మోవెరిటా ఇండియా అనే ఇంజనీరింగ్ సంస్థను పింప్రి–ఛించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్‌చేశారు. రూ.2.77 లక్షల ఆస్తి పన్ను బాకీ కట్టనందుకు అధికారులు ఇలా చర్యలకు ఉపక్రమించారు. వైకల్య సర్టిఫికెట్ తీసుకునేటపుడు ఈ సంస్థ చిరునామానే పూజ తన ఇంటి అడ్రస్‌గా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment