సాక్షి, కరీంనగర్: పట్టుదల, కృషి తోడుంటే ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించవచ్చని మరోసారి నిరూపితమైంది. ఏకాగ్రతతో చదివితే సివిల్స్ లాంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలకు కూడా ఎలాంటి కోచింగ్ అవసరం లేదని రుజువైంది. యూపీఎస్సీ నేడు విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 93 వ ర్యాంకు సాధించిన ఐశ్వర్య పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ ఎన్‌సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కూతురే ఐశ్వర్య. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 93వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె తండ్రి హర్షం వ్యక్తం చేశారు.
(చదవండి: ఐఏఎస్‌గా ఎన్నికైన ఐఆర్ఎస్ అధికారి)
రాత పరీక్ష, ఇంటర్వ్యూ దేనికీ ఐశ్వర్య కోచింగ్ తీసుకోలేదని, దేశవ్యాప్తంగా ఆమె యువతకు ఆదర్శంగా నిలిచిందని అజయ్‌కుమార్ అన్నారు. చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారి జాబితాలో ఐశర్య ఒకరని పేర్కొన్నారు. ఆమె విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగిందని అజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఐశ్వర్య ముంబైలో ఉన్నట్టు వెల్లడించారు. కాగా, ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, 129 ఎస్సీ , 67 ఎస్టీ కేటగిరీకి చెందిన వారున్నారు.
(2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల)
Comments
Please login to add a commentAdd a comment